అశోక్ వేములపల్లి.. ✍🏼
సినిమా పేరు …అంతరిక్షయోధుడు
సమర్పణ..లక్ష్మీగణపతి పిక్చర్స్
దర్శకుడు-తలకమాసినోడు
నిర్మాత-ముండమోసినోడు
రచయిత-పనీపాటా లేనోడు
IDMB rating: 19/10
ఇక కథలోకి వెళ్తే..
హీరో బుద్దేశ్ బాబు ..పాత హెలికాప్టర్ కొనుక్కుని గురు గ్రహంమీదకు వెళ్తాడు.. అక్కడ తన తుప్పెక్కిన తుపాకీ, సగం విరిగిపోయిన విల్లుతో ఏలియన్స్ తో యుద్ధానికి దిగుతాడు.. హీరో గ్రహంమీద ల్యాండ్ అవుతున్నప్పుడు వచ్చిన హెలికాప్టర్ రెక్కల శబ్దానికి, లేచిన దుమ్ముని చూసి ఏదో ప్రళయం వచ్చిందనుకుని సగం మంది ఏలియన్స్ అటుపక్కనే ఉన్న బృహస్పతి, అంగారక గ్రహాలమీదికి పారిపోతారు. గ్రహాన్ని ఆక్రమించుకోవడానికి భూమ్మీద నుంచి వచ్చిన చంఢప్రచండ, తల్పిత, కాల్పలిక,అకాల మృత్యు హీరో బుద్దేశ్ బాబు అని శాటిలైట్ రోబో ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న ఏలియన్స్ హీరోతో యుద్ధానికి దిగుతారు. ఆరేళ్ల పాటు జరిగిన యుద్ధంలో చాలామంది ఏలియన్స్ ని చంపేసిన హీరోబుద్దేశ్ అలసిపోయి నిద్రిస్తున్నప్పుుడు కుట్రతో ఒక ఏలియన్ గ్రహం మీది నుంచి అంతరక్షింలోకి తోసేస్తాడు.. (అప్పుడు బాధ, నీరసం, జాలి కలిగేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సాంగ్)

అలా పడిపోతున్న హీరో బుద్దేశ్ సరాసరి చంద్రుడి మీద పడతాడు..అప్పుడు మనోడికి మెలుకువ వచ్చి.. ఏలియన్స్ ను పిచ్చి బూతులు తిట్టి.. అప్పుడెప్పుడో నీీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అడుగుపెట్టినప్పుడు అక్కడ వదిలివచ్చిన రాకెట్ లో ఎక్కి భూమ్మీదకు తిరిగి వస్తుంటాడు.. సరిగ్గా అప్పుడే ఆ పాత రాకెట్ గాల్లో ఆయిల్ లేక నిలిచిపోతుంది.. ఏం చేయాలో తోచని బుద్దేశ్.. రాకెట్ ను వదిలికాసేపు అక్కడే తీవ్రంగా ఆలోచించి తనలోని శక్తి మొత్తాన్ని గుర్తు తెచ్చుకుని తెలివితేటలన్నీ ప్రయోగించి. అంతరిక్షంలో ఎగిరే గ్రహశకలంతో సాయంతో భూమ్మీదకు వస్తుంటాడు. అంతా బాగుందనుకునే సమయంలో అప్పుడే అసలైన ట్విస్ట్ మొదలవుతుంది.. ఇంతలో ఇంటర్ వెల్ బ్యాంగ్ పడుతుంది.. బతికుంటే మళ్లీ కలుద్దాం అనే క్యాప్షన్ తో…
ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ మాండ్రిన్ డకోటా ఎంట్రీ ఉంటుంది..ఆమె ఇంతకుముందు ఇలాంటివి పద్దెనిమిది సినిమాల్లో నటించి మెప్పించి అనేక అవార్డులు బెదిరించి లాక్కుంది.. గురు గ్రహం మీది నుంచి ఏలియన్స్ దగ్గర కొట్టేసిన ప్లాటినంగ్ నెక్సెల్ తెస్తానని చెప్పిన లవ్వర్ ఇంతవరకూ తిరిగిరాకోవడంతో అతని కోసం అనేక పూజలు చేస్తుంది.. ఏలియన్స్ వల్ల అతనికి ఏమీ కాకూడదని ఇక్కడ నిప్పులగుండంలో నడుస్తుంది.. తనకుతానే గొయ్యి తీసుకుని మెడవరకూ పూడ్చుకుని తపస్సు చేస్తుంది.. అంతలోనే ఆస్టరాయిడ్ ఒకటి భూమి వైపు దూసుకువస్తుందని నాసా వాళ్లు టీవీలో చెబుతుంటే విని అది ఎక్కడ పడుతుందో అక్కడికి వెళ్తుంది డకోటా.. ఇక్కడ సీన్ అద్భుతం..అజరామరం.. అన్నమాట..లవ్వర్ కోసం డకోటా చేసే ప్రయత్నాలు చూసి మనం కళ్లు చెమ్మగిల్లి కింద పడి కొట్టుకుని ఏడ్చేలా ఉంటాయి.. భూమ్మీదకు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్ ఉంగాడాలో పడుతుందని శాస్త్రవేత్తలు చెప్పడంతో అక్కడికి వెళ్లి తన ప్రియుడి కోసం.. వేచి చూస్తూ ఉంటుంది.. తీరా ఆస్టరాయిడ్ భూమ్మీదకు బీభత్సమైన వేగంతో వచ్చి అక్కడ కుప్పకూలుతుంది..కానీ అందులో ఆమె లవ్వర్ బుద్దేశ్ ఉండడు.. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న ఆమె మరో పాత హెలికాప్టర్ కొనుక్కుని గురు గ్రహం వైపు లవ్వర్ ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది..(ఇక్కడ హీరో, హీరోియన్ల మధ్య ఒక శాడ్ సాంగ్..నువ్వెక్కడుంటే నేనక్కడుంటా..)
అక్కడ గ్రహ శకలాన్ని పట్టుకుని భూమివైపు దూసుకువస్తున్న హీరో…ఇటు హీరో కోసం అంతరిక్షంలోకి వెళ్లిన హీరోయిన వీరిద్దర్నీ రెండు ఫ్రేముల్లో చూపిస్తాం అన్నమాట..ఇది అసలు హైలెట్ అన్నమాట… చూస్తున్న జనం సీట్లకవర్లు చించి లోపల స్పాంజిలు పీక్కు తింటూ ఉంటారు దియేటర్లో..
మళ్లీ కట్ చేస్తే సీన్ హీరో దగ్గరకు వెళ్తుంది.. గ్రహశకలాన్ని నెట్టుకుంటూ భూమివైపు వస్తున్న హీరో అలసిపోయి మళ్లీ నిద్రపోతాడు..అయితే పట్టుతప్పి గ్రహశకలం శూన్యంలో కలిసిపోతుంది.. హీరో ఎటూ కదల్లేక శూన్యం వల్ల అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది.. అంతలో అటుగా వచ్చిన అమెరికా స్పేష్ షిప్ లో సిబ్బంది అక్కడ ఆగి హీరో ముఖాన నీళ్లు చల్లి తాగడానికి నీళ్లు ఇస్తారు.. కావాలంటే భూమ్మీద డ్రాప్ చేస్తామంటారు..కానీ ఏలియన్స్ ఓడిపోయానన్న బాధలో ఉన్న హీరో..ఆ ఆఫర్ ని తిరస్కరిస్తారు.. తర్వాత చాలారోజులకు అటుగా వెళ్తున్న చైనా స్పేష్ షిప్ అక్కడికి వచ్చి హీరోని చూసి జాలేసి లేపి భోజనం పెడతారు.. కరోనాని ప్రపంచం మొత్తాన్ని అంటించిన మీ దగ్గర భోజనం తింటే నాకు కరోనా వస్తుందని వద్దు పొమ్మంటాడు..
మరికొన్ని రోజులకు రష్యా స్పేస్ షిప్ అక్కడికి వచ్చి హీరోని నిద్రలేపుతుంది.. అందులో ఉన్న మరో అమ్మాయి హీరో చెవిలో ధైర్యాన్ని నూరిపోస్తుంది..నిన్ను మించినోడు లేడు..నీ శక్తి నీకు తెలీదు… నీరస పడిపోకు..లే..లే..లే.. లేచి ముందుకు సాగు అంటూ పాట పాడుతుంది..దీంతో టన్నుల కొద్దీ ..బలం తెచ్చుకున్న హీరో..తన హీరోయిన్ ని గుర్తుకు తెచ్చుకుంటాడు..ఆమె కోసమైనా సరే భూమ్మీదకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు.. అంతే అంతరిక్షంలో ఎప్పుడో వాడి వదిలేసిన ఉపగ్రహాన్ని పట్టుకుని దానికి అయస్కాంత శక్తి రగిలించి..భూమ్మీదకు పయనమవుతుంటాడు.. అప్పుడే హీరో కోసం గురు గ్రహంమీదికి బయలుదేరిన హీరోయిన్ హెలికాప్టర్ గాల్లో మంటలు అంటుకుంటాయి. దాంతో ఆమె హెలికాప్టర్ నుంచి కిందికి దూకేస్తుంది..తన హీరోయిన్ ప్రమాదంలో ఉందని శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా తెలుసుకున్న హీరో..బుద్దేశ్.. తన ఉపగ్రహాన్ని అటుగా తీసుకెళ్లి గాల్లో తేలుతున్న హీరోయిన్ కాపాడి ముద్దాడడంతో సినిమా ముగుస్తుంది… అశోక్ వేములపల్లి
( ప్రమాద హెచ్చరిక … దయచేసి ఈ సినిమాలో గ్రాఫిక్స్ లేకుండా అంతా రియలిస్టిక్ గా హీరో నటించాడు. సినిమా ఆడియో ఫంక్షన్ సూర్యుడి మీద చేద్దామనుకున్నారు గానీ మరీ ఖర్చు ఎక్కువ అవుతుందని విరమించుకుని….ఫ్లూటో గ్రహం మీద చేశారు.. ప్రపంచ వ్యాప్తంగా లక్ష దియేటర్లలో సినిమా విడుదలై రికార్డులు సృష్టించింది.. తమను కించపర్చేలా సినిమా ఉందంటూ ఏలియన్స్ చేసి అభ్యంతరంతో కొన్ని సీన్లు తొలగించారు… గుండెబలహీనంగా ఉన్నవాళ్లు, కరోనా సోకినవాళ్లు సినిమా చూడొద్దని విజ్ఞప్తి)



