స్వామి వివేకానంద పేరు వినగానే భారతీయులకు ఓ పులకింత! మొట్టమొదట స్ఫురించేది ఆయన షికాగో పర్యటన. మతతత్వం, మతోన్మాదం, దాన్నుంచి పుట్టుకొచ్చిన భయంకరమైన వారసత్వమే లేకుంటే.. ఈ పుడమి ఇంకా మరెంతో అందంగా ఉండేది. హింసతో రక్తసిక్తమైన భూమిగా మార్చి.. నాగరికతను ధ్వంసం చేసిన వైనాన్ని.. అలా జరిగి ఉండకపోతే ఈ ప్రపంచం ఇంకా ఎలా అభివృద్ధి చెంది ఉండేదనే అంశాన్ని 1893 సెప్టెంబర్ 11న నరేంద్రుడు షికాగో లోని ఆర్ట్ ఇనిస్టిట్యూట్ లో చెప్పిన మాటలు ఇవాల్టికీ మారుమోగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అవి ప్రపంచ యవనికపై భారతదేశ ఔన్నత్యాన్ని చాటిన వ్యాఖ్యలు! అయితే వివేకానందుడి ఆ షికాగో యాత్రకు స్ఫూర్తెవరూ.. అసలా పర్యటనకు స్పాన్సరెవరు..?

ఈ ప్రపంచంలో అన్నింటికన్నా గొప్ప బంధం స్నేహబంధమేనంటారు. భార్య, భర్త, తల్లి, పిల్లలు, ఇతర బంధువులెవ్వరితో కూడా చెప్పుకోలేనివి స్నేహితులతో పంచుకున్నప్పుడు కాసింత ఆసరా, లేదంటే కనీసం ఊరటైనా లభిస్తుంటుంది. అదిగో అలాంటి ఓ స్నేహితుడే వివేకానందుడి వికాసం వెనుకున్నారు. అంతేనా.. షికాగో పర్యటన వెనుకా ఆయనే ఉన్నారు. ఆయనే రాజా అజిత్ సింగ్ బహదూర్.
అజిత్ సింగ్ బహదూర్ ఎవ్వరు..?
రాజస్థాన్ లో ఖేత్రీ సంస్థానం ఓ రాచరిక రాష్ట్రం. రాగి గనులకు ప్రసిద్ధి చెందిన జుంజుని జిల్లాలో ఉన్న సంస్థానంలో… 8వ రాజు రాజా అజిత్ సింగ్ బహదూర్. అల్సిసస్ ఠాకూర్ గా ఉన్న చత్తూసింగ్ కుమారుడైన అజిత్ సింగ్ ను ఫతేసింగ్ అనే రాజు దత్తత తీసుకున్నాడు. అలా ఖేత్రీ సంస్థానానికి 8వ రాజుగా 21 ఏళ్లకే పాలనా పగ్గాలు చేపట్టి 20 ఏళ్లపాటు పాలించిన అజిత్ సింగ్ కు.. నరేంద్రుడితో ఏర్పడిన పరిచయం.. వివేకానందుడి జీవితంలో ఓ మంచి స్నేహితుడినందించింది. అంతేకాదు.. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వివేకానందుడి షికాగో చారిత్రాత్మక ప్రసంగం వెనుక.. అజిత్ సింగ్ బహదూర్.. ఖేత్రీ రాజభవన సంస్థానం పోషించిన పాత్ర ఎనలేనిదనేది బహు కొద్దిమందికి మాత్రమే తెలిసిన విషయం.
నరేంద్రుడితో రాజా అజిత్ సింగ్ దోస్కికెక్కడ బీజం పడింది..?
నరేంద్రుడు.. ఖేత్రీ సంస్థాన రాజైన అజిత్ సింగ్ బహదూర్ జీవితంలో కలిసింది కేవలం మూడంటే మూడేసార్లు. కానీ, వారిది చిరకాల స్నేహబంధంగా చరిత్రకెక్కింది. జస్ట్ చేతిలో ఓ కమండలం.. భగవద్గీత, ది ఇమిటేషన్ ఆఫ్ క్రిస్ట్ అనే రెండు పుస్తకాలతో బేలూరు నుంచి ప్రారంభమై సంచరించే నరేంద్రుడు ఎందుకో అజిత్ సింగ్ బహదూర్ ను బాగా ఆకర్షించాడు. ఆ తర్వాత నరేంద్రుడికి శిష్యుడయ్యాడు. అదే దశలో నరేంద్రుడి పేరును వివేకానందుడిగా మార్చిన మెంటార్ అయ్యాడు. వివేకానందుడి ఫోటోను మనం చూస్తే మొట్టమొదట మనల్ని ఆకర్షించే తలపాగాను తన జీవితకాల శిరస్త్రాణంగా మార్చుకునేంతగా ప్రభావితం చేశాడు అజిత్ సింగ్.
1891, 1893, 1897 ఇలా ఈ మూడు సమయాల్లోనే వివేకానందుడు, అజిత్ సింగ్ బహదూర్ కలుసుకున్నారు. తన సంచారంలో భాగంగా రాజస్థాన్ లోని మౌంట్ అబూకు వచ్చినప్పుడు నరేంద్రుడితో, అజిత్ సింగ్ స్నేహం చిగురించింది. ఆ మొదటి కలయికలోనే తన సంస్థానానికి నరేంద్రుడిని తీసుకెళ్లిన అజిత్ సింగ్ బహదూర్ తో పలు ఆధ్యాత్మిక అంశాలు, యోగా, విశ్వశాంతికి అవసరయమ్యే సార్వత్రిక అంశాల సమాహారపు చర్చలకు తెరలేచింది. ఆ సమయంలో నాల్గు నెలల పాటు నరేంద్రుడు అక్కడ ఉండటంతో.. అజిత్ సింగ్ తో మైత్రి బలపడింది.
వివేకానందుడి తలపాగా వెనుకున్న కథేంటి..?
ఆ సమయంలోనే మనం ప్రతీ ఫోటోలో చూసే వివేకానందుడి తలపై కనిపించే పాగా ధారణకు బీజం పడింది. అవునూ.. రాజస్థాన్ లో వచ్చే వేడిగాలులకు చెవులను కప్పివేస్తూ.. అలాగే, కేశాలను రక్షించుకునేలా ధరించే తలపాగా ఎలా కట్టుకోవాలో రాజా బహదూర్ అజిత్ సింగ్ నరేంద్రుడికి నేర్పాడు. అదే ఆ తర్వాతి కాలంలో నరేంద్రుణ్ని.. ఆ శిరస్త్రాణం లేని వివేకానందుడిగా ఊహించుకోలేనంత స్థాయిలో ఓ ఐకానికి సింబల్ లా మారింది ఆ తల పాగా. ఈ విషయాలన్నీ చతుర్వేది బద్రీనాథ్ రాసిన లివింగ్ వేదాంత పుస్తకంలో పేర్కొనడంతో పాటు.. అసలు నరేంద్రుడిని వివేకానందుడిగా పేరు మార్చి షికాగోకు పంపిన స్నేహం పేరు కూడా రాజా బహదూర్ అజిత్ సింగే కావడం విశేషం
నరేంద్రుడు వివేకానందుడిగా రూపాంతరం చెందిన కథేంటి..? షికాగో పర్యటనకు ప్రేరణెవ్వరు..?
షికాగోలో జరుగుతున్న ప్రపంచ ఆధ్యాత్మిక సదస్సు పర్యటనకు ముందే నరేంద్రుడు కాస్తా.. అజిత్ సలహాతో వివేకానందుడిగా కొత్త పేరుతో ప్రపంచానికి పరిచయమయ్యాడు. షికాగో ప్రయాణానికి ముందు ముంబైలో ల్యాండ్ అయ్యే సమయానికే తన పేరును వివేకానందుడిగా మారిపోయింది. ముందుచూపు కల్గిన ఓ ఆనందహృదయుడన్న అర్థాన్ని స్ఫూరించే పేరుగా.. నరేంద్రుడికి వివేకానందుడైతే బాగుంటుందని ఏదైతే రాజా బహదూర్ అజిత్ సింగ్ నమ్మాడో అదెలా నిజమైందో.. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ది వివేకానంద హిస్టరీ ఇక అందరికీ తెలిసిందే!
మీరే నా జీవితంలో అత్యంత ప్రభావితం చేసిన ఏకైక స్నేహితుడు. నాకు అమెరికాలో స్నేహితులున్నప్పటికీ.. వారు సాయం చేయడానికీ సిద్ధంగా ఉంటారని తెలిసినా.. వారినడగడానికి నేను సిగ్గుపడతానంటూ.. తను అనారోగ్యంపాలైన రోజుల్లో వివేకానందుడు రాజా అజిత్ సింగ్ కు లేఖ రాశాడు. నేను సిగ్గు విడిచి అడిగేదేదైనా ఉందంటే అది మీతో మాత్రమే. మీతో స్నేహం నాకు అలాంటి విశ్వాసాన్ని కల్గించిందంటూ వివేకానందుడు రాజా బహదూర్ అజిత్ సింగ్ కు రాసిన లేఖలు ఇప్పటికీ పశ్చిమబెంగాల్ బేలూరులోని రామకృష్ణ మిషన్ తో పాటు.. ఖేత్రీ సంస్థాన ఆనవాళ్లను ప్రదర్శించే మ్యూజియంలో కూడా రాజస్థాన్ లో దర్శనమిస్తుంటాయి. వివేకానందుడికి అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆ రోజుల్లో 500 రూపాయల మొత్తాన్ని పంపించాడు రాజా అజిత్ సింగ్. వివేకానందుడి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న రాజా అజిత్ సింగ్.. వివేకానందుడు పర్యటనలకు వెళ్లిన సమయంలో కూడా ప్రతీ నెలా ఆ రోజుల్లో ఆయన తల్లికి వంద రూపాయల స్టైపండ్ పంపేవాడు. వివేకానందుడు ఆ స్టైపండ్ ను తన కుటుంబానికి ఓ ఆధారంగా తామున్నంత కాలం పంపాలని లేఖ రాస్తే.. ఆ స్టైపండ్ ను వివేకానందుడి తల్లి పేరిట ఆమె ఉన్నంత కాలం వరకూ పంపించాడు రాజా అజిత్ సింగ్.
A FRIEND IN NEED IS A FRIEND INDEED!
ముఖ్యంగా షికాగో పర్యటననంతరం భరతజాతి ఖ్యాతిని దిగంతాలకు చాటిన వివేకానందుడి ప్రసంగాన్ని కొనియాడుతూ.. అజిత్ సింగ్ బహదూర్ లేఖ రాయడం.. అందుకు కృతజ్ఞతగా తానక్కడికి వెళ్లేందుకు కారణమైన అజిత్ సింగ్ బహదూర్ సహకారాన్ని గుర్తు చేసుకుంటూ వివేకానందుడు ప్రతిగా రాసిన లేఖలు వారి మైత్రీబంధానికి ప్రతీకలు. అలా భారతజాతి గర్వించదగ్గ ఓ యోగి, ఓ రాజు మధ్య ఏర్పడ్డ దోస్తానా.. ఓ స్ఫూర్తిదాయక విశేషంగా చరిత్రలో నిల్చిన పేజీగా మారింది.



