ఇహలోకాన్ని విడిచి వెళ్లినవారి ఆత్మలకు ఎక్కడైతే మోక్షం లభిస్తుందో అదే గయ అన్నది హిందూ బంధువుల ప్రగాఢ విశ్వాసం. అలాంటి గయ పేరు ఇప్పుడు బీహార్ ప్రభుత్వం గయా జీగా మార్చిన నేపథ్యంలో అసలు గయ కథ గురించి కాస్త చెప్పుకుందాం
ఆత్మలుంటాయా, మోక్షం లభిస్తుందా.. అంతా ఉట్టి మూఢనమ్మకం.. దాని చుట్టూనే మనం తిరుగుతున్నాం.. సాంకేతికంగా వడివడిగా దూసుకెళ్లే రోజుల్లో శాస్త్రీయంగా ఆలోచించాల్సిన కాలంలో ఇంకా ఈ అశాస్త్రీయ పోకడలేంటనే వాదనలు, నిశ్చితాభిప్రాయాలూ అంతకంతకూ బలపడుతూ, గట్టిగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో నమ్మకాలను అంత సులభంగా మార్చలేని మరో భిన్నమైన పరిస్థితీ అదే సమాజంలో అంతకంటే మొండిగా కనిపిస్తోంది.

గయా జీ, గయా జీ ధామ్, గయ క్షేత్రం, మోక్షధామ్ ఇలా వివిధ పేర్లతో పిల్చుుకునే గయకు.. త్రిపురాసురుడు, ప్రభావతి కుమారుడైన గయాసురుడి వల్ల ఆ పేరు వచ్చింది. పేరుకే రాక్షసుడుగానీ.. అసురుడి పేరుతో ఉండి మంచివైపు అడుగులేసిన కథ గయాసురుడిది. అలాంటి గయ పిండ ప్రదానాలకు పెట్టింది పేరుగా ఇప్పటికీ ఎందరో సనాతన, సంప్రదాయవాదుల పర్యటనతో మోక్షానికి కేరాఫ్ లా నిలుస్తోంది.
2022లోనే గయ మున్సిపల్ కార్పోరేషన్ నగరాన్ని అధికారికంగా గయా జీ అని పేరు మార్చడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
పురాతన కాలం నుంచీ కూడా గయా జీ గా పిలువబడుతున్నట్టు గయ గురించి కొన్ని హిందూ గ్రంథాలు కూడా పేర్కొంటున్నాయి. విదేశీ దండయాత్రల తర్వాత ఇది గయగా స్థిరపడిపోయింది. ‘జీ’ అనే ప్రత్యయంతో సంబోధించే ఏకైక ప్రదేశం కూడా ప్రస్తుతం గయ ఒక్కటే కావడం విశేషం. “గదాధరం విష్ణు పదం అష్ఠాదశ పదాండ్వీం.. వందే అక్షయ వతం ఛాయాం ఫాల్గుం గౌరీం గయేశ్వరీం” అని వాయు పురాణంలో కనిపించే ఓ శ్లోకమిది.
వాయు పురాణం, భగవత్ మహా పురాణంతో పాటు.. ఇతర గ్రంథాల్లో కూడా గయా జీ వైభవం గురించి చాలా కథలున్నాయి. రాజా రామచంద్రుడు మాతా సీతతో ఇక్కడకు వచ్చాడనీ.. ఇక్కడే యుధిష్ఠిరుడైన ధర్మరాజు వారి దర్శనం చేసుకున్నట్టు చెబుతుంటాయి ఆ పురాణగాధలు. మాతా మంగళ గౌరి.. భస్మ కుట్ పర్వతంపై కూర్చుంటే.. గయలోని ఫాల్గు నది అంతర్వాహినిగా నిరంతరం ప్రవహించే చోట.. ఆ భగవంతుడైన సర్వేశ్వరుడు, శ్రీమన్నారాయణుడి పాదాలు ప్రతిష్ఠించబడ్డాయని ఆ కథలు చెప్పే సారాంశం.
శ్రాద్ధ ఆచారాలతో మరణించిన వారి ఆత్మలకు శాంతిని చేకూరుస్తుందని, మోక్షాన్ని ప్రసాదిస్తుందని గయకు పేరు. అందుకే గ్రంథాలు గయను గయా ప్రాణంగా కూడా పేర్కొంటాయి.
జ్ఞానం, మోక్షం రెండూ కలగలసిన చోటుగా కూడా హైందవ ధర్మాచారులు గయను భక్తితో కొలుస్తారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేసే చోటుగా.. అలాగే, బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధ గయకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఈ గయా జీ ఎప్పుడూ ఆధ్యాత్మికతకు చిరునామాగా నిలుస్తోంది.
1787లో రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించిన గయలోని విష్ణుపాద ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని గురించి.. శ్రీమద్ భాగవతం, రామచరితమానస్, వాయుపురాణం, అగ్నిపురాణం, విష్ణుపురాణం, పద్మపురాణం, గరుడపురాణం, దేవీ భాగవతం, ఉపనిషత్తుల వంటి అనేకచోట్ల ప్రస్తావించబడింది.
గయాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మయజ్ఞానికి తన శరీరాన్ని అర్పించడం.. అతను తిరిగి లేవాలనుకున్నప్పుడు విష్ణుమూర్తి తన కుడి పాదాన్ని గయాసురుడి తలపై ఉంచడంతో విష్ణుపాద ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఆ సమయంలో గయాసురుడి బాధ చూసిన విష్ణుమూర్తి వరం కోరుకోమ్మంటే పితృదేవతలు గయకు వస్తే మోక్షం పొందేలా వరమిమ్మని గయాసురుడు కోరినట్టు ఇప్పటికే పలు కథలు విన్నవే. అందుకే, ఇక్కడ పిండప్రదానం చేసే వ్యక్తుల ఏడు గోత్రాల కింద.. 121 వంశాలకు చెందినవారు మోక్షాన్ని పొందుతారని ప్రతీతి. తల్లీ, తండ్రి ఇలా ఇద్దరివైపు వారితో పాటు.. తాము పెంచుకున్న సాధుజంతువులకు కూడా పిండ ప్రదానం చేసే ఒక ఆచారం గయలో కనిపిస్తుంది.
అయితే గయ అని ఉన్న పేరును గయా జీ గా మార్చాలనే డిమండ్ ఇక్కడి స్థానికుల నుంచి చాలాకాలంగా వినిపిస్తోంది. భారతదేశం మొత్తంలోనే జీ అనే ప్రత్యయమున్న ఏకైక ప్రదేశంగా ఇప్పుడ గయా జీని సంబోధిస్తున్నాం. అధికారికంగా ఎక్కడా నమోదు కానప్పటికీ.. ఇదే తరహాలో వారణాసిని కూడా కాశీ జీ అని పిల్చే భక్తులూ కనిపిస్తుంటారు. అయితే, ఇలా జీ అని చివరన సంబోధిస్తూ పిల్చుకునే పేర్లలో పూరీలోని జగన్నాథ్ ఆలయం, ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వంటివీ కనిపిస్తుంటాయి.
గయా జీకి పిండ్ బ్రహ్మ, పంచకోశం, గయా క్షేత్రం అని రకరకాల పేర్లున్నాయి. యజ్ఞం ద్వారా పరమ పవిత్రమైన ప్రదేశంగా, తీర్థంగా గయను పేర్కొంటారు. ద్వాపర, త్రేతాయుగాల నాటినుంచే ఇక్కడ పిండప్రదానాలు జరిగేవని పురణాలు ఘోషిస్తున్నాయి. ఇక్కడి సీతా రామశిల, సీతాకుండం వంటివాటి గురించి ఆ పురాణాల్లో వివరించారు. ముఖ్యంగా ఆశ్వీయుజ మాసం కృష్ణపక్షంలో హిందువులతో పాటు, సిక్కులు, జైనులు, బౌద్ధులు కూడా ఇక్కడికి రావడం.. ఆ పితృపక్షాలుగా పిల్చుకునే ఆ పక్షం రోజుల్లో చాలామంది పిండప్రదానాలు చేయడం ఇక్కడ ఒక ఆనవాయితీగా కొనసాగుతోంది.
మరోవైపు బుద్ధగయగా, బోధ్ గయగా కూడా పేరొందిన ఈ క్షేత్రం 2002లో యునెస్కో గుర్తింపు కూడా పొందింది. బీహార్ రాజధాని పాట్నా నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలోనున్న ఈ ప్రాంతం మగధ రాజ్యానికి రాజధానిగా కూడా ఉండేది. మొత్తంగా ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఓ సందర్శించాల్సిన ప్రదేశంగా గయ ఇప్పుడు గయా జీగా పేరు మార్చుకుంది.
అయితే, పిండప్రదానాలకు వచ్చేవారి సంఖ్య రానురాను గయకు పెరుగుతుండటంతో ఏడాది పొడువునా నీటిని ఒడిసిపట్టి సజీవంగా ఉంచేందుకు ఇక్కడ ఒక రబ్బర్ ఆనకట్టను నిర్మించాలని ప్లాన్ చేశారు. 300 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కు సాంకేతికంగా ఇప్పటికే రెడీ కాగా.. ఇక్కడి స్థానికులు, భక్తుల నుంచి మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. నీటితో పాటు, బురద కూడా వచ్చి చేరి పేరుకుపోతోందనే ఆందోళనతో పాటు.. ఆనకట్ట వల్లే నిల్చిపోయే నీటితో ప్రవాహం ఆగిపోయి ప్రకృతి సిద్ధమైన నది తన సహజ స్వరూపాన్ని కోల్పోతోందనే వాదనా వినిపిస్తోంది.



