జింకల రక్షణకై.. తన పొలాన్నే వదులుకున్న గురుస్వామాయన!

కేవలం నెమళ్లు మాత్రమే తరచుగా కనిపించే వ్యవసాయ పొలాల వద్ద.. 1998 ప్రాంతంలో తన మేకలతో పాటు.. ఓ మూడు మచ్చలున్న జింకలు గడ్డి మేస్తుండగా గమనించాడు గురుస్వామి. గడ్డి తినేందుకు ఇతర పశుసంపదతో కలిసి నిత్యం జింకలు వస్తుండటం తమిళనాడుకు చెందిన గురుస్వామిని ఒకింత ఆశ్చర్యపర్చింది. నీరు, ఆహారం కోసం పొరుగున ఉన్న పశ్చిమ కనుమల్లోని మెట్టుపాళాయం అడవి నుంచి తన భూభాగంలోకి ప్రవేశిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాడు. మెట్టుపాళాయం అటవీ ప్రాంతం గత 25 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటోంది. అక్కడ గలగలా ఏడాది పొడవునా పారే కౌసికా నది ఇప్పుడు ఎడారైంది. చుట్టుపక్కల రైతులు నీటిపారుదల కోసం నీటిని అధికంగా వినియోగించడం వల్ల భూగర్భజలాలు కూడా క్షీణించాయి. ఆ ప్రభావం వన్యప్రాణులపై కూడా పడింది. అందులోనూ ముఖ్యంగా జింకలు ఆ దుర్భిక్షాన్నెదుర్కోలేక.. తమ పంట పొలాల వైపు వస్తున్న విషయాన్ని గురుస్వామి అర్థం చేసుకున్నాడు.

70 ఏళ్ల గురుస్వామికి తన పూర్వీకుల నుంచి సంక్రమించిన 60 ఎకరాల భూమి ఉంది. మొక్కజొన్న, పత్తితో పాటు.. కాలానుగుణ కూరగాయలు పండించేవాడు గురుస్వామి. 15 ఎకరాల్లో పూర్తిగా సేంద్రియ వ్యవసాయమే చేస్తుంటాడు. ఎందుకంటే ఈయన దగ్గర పశుసంపదెక్కువ. తన వద్దనున్న సుమారు వంద మేకలు, ఆవుల మేత కోసమే 45 ఎకరాల భూమిని కేటాయించాడు. ఆవు పేడను సేంద్రీయ ఎరువుల తయారీకి ఉపయోగిస్తుంటాడు.

అయితే జంతు ప్రేమ కల్గిన మానవత్వమున్న గురుస్వామి తన 60 ఎకరాల్లో… కేవలం పదిహేను ఎకరాలు మాత్రమే తన వ్యవసాయం కోసం ఉంచుకుని.. మిగిలిన 54 ఎకరాలు జింకల సంరక్షణ, వాటి పెంపు కోసం అటవీశాఖకిచ్చేశాడు. జింకలు ఆకలికి అలమటించడం, దాహార్తితో నీటికోసం వెతకడం, కుక్కల దాడులకు గురవ్వడం, రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడటం, జింక మాంసం కోసం వచ్చే వేటగాళ్ల ఉచ్చుకు చిక్కడం వంటివన్నీ గురుస్వామిని కదిలించాయి. కొన్నేళ్లు గడిచేకొద్దీ అడవుల్లోంచి నీరు, ఆహారం లభించక పొలాల్లోకి వచ్చే జింకల జనాభా పెరిగింది. 2005 వరకూ కూడా పెద్దగా కనిపించని జింకలు.. పంటపొలాల్లోకి రావడంతో.. పంటలు పాడైపోతున్నాయని.. జింకలు తినేస్తున్నాయంటూ చుట్టుపక్కల రైతుల గగ్గోలు మొదలైంది. చాలామంది రైతుల నుంచి జిల్లా పాలనాధికారులు, అటవీశాఖాధికారులకు ఫిర్యాదులూ వెల్లువెత్తాయి. కొందరు రైతులైతే ఏకంగా జింకలను తరిమికొట్టేందుకు కుక్కలను పెంచుకోవడం మొదలుపెట్టారు. ఈ మొత్తం వ్యవహారం పత్రికలకు కూడా ఎక్కింది.

ఇక లాభం లేదనుకున్న గురుస్వామి జింకల సంరక్షణ కోసం చుట్టుపక్కల రైతుల్లో అవగాహన కల్పించేందుకు నడుంబిగించాడు. ఆ సమయంలో రైతులందరి నుంచీ అసమ్మతే ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ గురుస్వామి స్నేహితుడైన సి. బాలసుందరం మాత్రం తన కొబ్బరి తోటలో జింకలు సంచరిస్తే తనకేమీ ఇబ్బంది లేదని.. వాటికెలాంటి హానీ ఉండబోదనీ హామీ ఇచ్చాడు. 2008, 2010 ప్రాంతాల్లో జింకల కోసం వచ్చే వేటగాళ్ల బృందాల్ని స్నేహితుడు బాలసుందరంతో కలిసి గురుస్వామి అటవీశాఖాధికారులకు పట్టించాడు.

అప్పట్నుంచీ అటవీశాఖ అధికారులు కూడా గురుస్వామికి సహకరించడం.. తానిచ్చిన నలభైఐదు ఎకరాల స్థలంలోనే రెండు చెరువుల్లాంటి కొలన్లను తవ్వించి.. ప్రతీ వేసవిలోనూ వాటిని నీటితో నింపుతూ జింకల సంరక్షణ కోసం కృషి చేయడం ప్రారంభించారు. జింకలను రక్షించడంలో, వాటి ఆహార అవసరాలను అర్థం చేసుకోవడంలో ఫారెస్ డిపార్ట్‌మెంట్ గురుస్వామికి సంపూర్ణ సాయమందించింది. ప్రస్తుతం గురుస్వామి ఇచ్చిన నలభైఐదు ఎకరాల స్థలంలోని జింకల క్షేత్రం చుట్టూ.. వేటగాళ్లను నియంత్రించడానికీ, ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరక్కుండా చూడ్డానికి ఫారెస్ట్ గార్డులు 24/7 అందుబాటులో ఉంటున్నారు. గురుస్వామి జింకల పట్ల కనబరుస్తున్న జాలి, దయ చూసిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వేత్తలు కూడా స్పందించడం మొదలుపెట్టారు. గురుస్వామి కృషిని ప్రశంసించారు. ఇప్పుడు గురుస్వామి నలభైఐదు ఎకరాల పొలం… పద్దెనిమిది వందల జింకలతో అలరించే ఓ అటవీక్షేత్రంగా మారింది.

భూమి కోసం, భుక్తి కోసమంటూ పాలివాళ్లు, అన్నదమ్ములే కొట్టుకునే రోజుల్లో… ఓ వ్యక్తి తన నలభైఐదు ఎకరాల పంట భూమిని జింకల సంరక్షణ కోసం ఈరోజుల్లో దాతృత్వం ప్రకటించి పేరుకు తగ్గట్టే గురుస్వామి అనిపించుకున్నాడు అభినందనీయుడైన ఈ ఆదర్శప్రాయుడు!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles