లార్జ్ ఫార్మాట్ కు ఎక్కిన ఆ ఫోటోల విలువ.. లార్జర్ దేన్ లైఫ్!

ఆయన చిత్రాల్లో మనకు గతం కనిపించదు.. గతకాలపు భారతదేశ జీవన విధానం కనిపిస్తుంది!

నేడంటే, మోబైల్ చేతిలో ఉంటే చాలు క్లిక్కుమనిపించి ఫోటోలతో ప్రపంచాన్నే బంధిస్తున్నాం… కానీ, 150 ఏళ్ల క్రితమే మన భారతాన్ని లార్జర్ దేన్ లైఫ్ గా లార్జ్ ఫార్మాట్ కు ఎక్కించిందెవరో తెలుసా..? ఇవాళ మోబైల్ కెమెరా చేతిలో ఇమిడిపోయేది… కానీ, నాడు కెమెరా పెద్దది, బరువైనది, సాంకేతికంగా కూడా ఫోటో తీయడం పట్ల అవగాహన కల్గి ఉండాల్సింది. అలాంటి కాలాన దేశమంతా తిరిగి భారతదేశ చరిత్రను, రాజప్రసాదాలను, ఆలయాలను, ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను, ప్రకృతిని కెమెరాకెక్కించవాడే రాజా దీన్ దయాళ్.

నేటి మోబైల్ యుగంలో ఆయన తీసిన ఫోటోలు పాత చిత్రాలైపోవు. అవన్నీ 19వ శతాబ్దపు భారతావని ఎలా ఉండేదో చూపే చారిత్రక ఆధారాలు.

ఇంజనీర్ నుంచి ఫోటోగ్రాఫర్ గా!

1844లో మీరట్ సమీపంలో సర్దానాలో జన్మించారు లాలా దీన్ దయాళ్. మొదట ఫోటోగ్రాఫర్ అవుతాననే అనుకోలేదు. రూర్కీలోని థామ్సన్ సివిల్ ఇంజనీరింగ్ కళాశాలలో చదివి.. ఇండోర్ లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఎస్టిమేటర్, డ్రాఫ్ట్స్ మ్యాన్ గా ఉద్యోగం చేయడంతో ఫోటోగ్రఫీపైన ఆసక్తి ఏర్పడింది.

అక్కడ భూసర్వే చేయడం, నిర్మాణాలకు సంబంధించినవాటిని ఫోటోగ్రఫీ చేయడంతో.. క్రమంగా కెమెరాపై ఆసక్తి పెరిగింది. ఆయన అలా పెరిగిన ఆయన ఆసక్తి.. తనను మంచి ఫోటోగ్రాఫర్ గా మల్చింది. రాజా దీన్ దయాళ్ ప్రతిభను గుర్తించిన ఇండోర్ రెండో మహారాజైన తుకోజీరావ్ ఆయన్ను ప్రోత్సహించారు. అలా 1870ల నాటికే ఫోటోగ్రఫీ ఆయన జీవన వృత్తిగా మారిపోయింది.

రైలు, ఎడ్ల బండ్లపై కెమెరాలతో ప్రయాణం!

ఈరోజు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఫ్లైట్స్ లో గంటల్లో సుదూర తీరాలకు వాలిపోతున్నాం. కానీ, దీన్ దయాళ్ కాలంలో పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నం. భారీ కెమెరాలు, గాజు ప్లేట్లు, లెన్సులు, ఇతర ఫోటోగ్రఫీ పరికరాలను వెంటబెట్టుకుని రైల్లో, ఎడ్ల బండ్లపై దేశమంతా తిరిగారు దీనదయాళ్. ముఖ్యంగా లార్డ్ ఫార్మాట్ అంటే ఇవాళ ఎంతమందికి తెలుసో తెలియదుగానీ… తన ఫోటోగ్రఫీలో రాజా దీన్ దయాళ్ లార్జ్ ఫార్మాట్ నే ఎక్కువ వాడారు.

గ్వాలియర్, ఖజురహో, సాంచి, ఎల్లోరా, ఆగ్రా, వారణాసి, ఢిల్లీ, జైపూర్, ముంబై, హైదరాబాద్ వంటి పలు ప్రాంతాలన్నింటిపైనా ఆయన కెమెరా కన్ను పడింది. 1880ల్లో సర్ లెపెల్ గ్రిఫిన్ తో కలిసి మధ్య భారతంలో పర్యటించారు దీన్ దయాళ్. అనేక చారిత్రక కట్టడాలను తన లార్డ్ ఫార్మాట్ కెమెరాలో బంధించాడు. ఆయన తీసిన గ్వాలియర్, ఖజురహో, సాంచి తదితర ప్రాంతాల ఫోటోగ్రాఫ్స్.. సర్ లెపెల్ గ్రిఫిన్ రచనలో 1886లో లండన్ లో ప్రచురించబడిన ఫేమస్ మోనూమెంట్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియాలో ప్రచురితమయ్యాయి.

తాజ్ మహల్ నుంచి ఎల్లోరా వరకు!

ఈరోజు తాజ్ మహల్ ను సందర్శించిన ప్రతీ ఒక్కరూ తమ మోబైల్ లో ఒక్క ఫోటోనైనా బంధించకుండా ఉండరు. కానీ, మనం చూసే నేటి పోటోల కంటే.. 19వ శతాబ్దపు దీన్ దయాళ్ ఫోటోలు భిన్నమైనవి. సజీవమైనవి. ఎందుకంటే, అవి కేవలం అందంగా తీసినవి కావు. అప్పటి నిర్మాణ కౌశలం, పరిసరాలు, రహదారులు, మనుషులు, ప్రకృతి, సాంస్కృతిక జీవన శైలి ఇలాంటివన్నీ మిళితం చేసి చూపే ఫోటోలవి.

తాజ్ మహల్, సాంచీ స్థూపం, ఎల్లోరా శిల్పాలు, అంబర్ కోట, ఫతేపూర్ సిక్రీ, హవామహల్, కాశీ ఘాట్స్, ఢిల్లీ జామా మసీద్, చార్మినార్ పరిసరాలు.. వాట్ నాట్ ఇలా ఎన్నో చారిత్రక ప్రదేశాలు లార్జర్ దేన్ లైఫ్ గా ఆయన లార్డ్ ఫార్మాట్ లో బంధించబడ్డాయి.

నిజాం ఆస్థాన ఫోటోగ్రాఫర్!

దీన్ దయాళ్ జీవితంలో హైదరాబాద్ తో అనుబంధం మరింత ప్రత్యేకమైంది. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ ఆయన ప్రతిభను మెచ్చి హైదరాబాద్ కు ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయనే నిజాం ఆస్థాన ఫోటోగ్రాఫర్ గా మారిపోయారు.

నిజాం వేట యాత్రలు, వివాహ వేడుకలు, రాజసభ కార్యక్రమాలు, విదేశీ అతిథుల సందర్శనలు, రాజకుటుంబ సభ్యులు, ప్యాలెసులు, ఊరేగింపులు ఇవన్నీ ఆయన కెమెరాల్లో నమోదయ్యేవి. అంతేకాదు, హైదరాబాద్ కరువు, దుర్భిక్షం, నాటి సహాయక చర్యలు కూడా ఆయన ఫోటోల్లో నమోదయ్యాయి.

ఆయన ప్రతిభకు మెచ్చిన నిజాం.. దీన్ దయాళ్ ను రాజా బహదూర్ ముసావిర్ జంగ్ వంటి గౌరవ బిరుదులతో సత్కరించారు. ముసావిర్ అంటే చిత్రకారుడని అర్థం.

రాణి విక్టోరియా నుంచీ గుర్తింపు!

దీన్ దయాళ్ ప్రతిభ హైదరాబాద్ కో, భారతీయ రాజవంశాలకో మాత్రమే పరిమితం కాలే. 1885లో వైస్రాయ్ లార్డ్ డఫెరిన్ కు అధికారిక ఫోటోగ్రాఫర్ గా నియమితులయ్యారు. 1887లో రాణి విక్టోరియాకు ఫోటోగ్రాఫర్ గా నియమితులయ్యారు. అంతర్జాతీయ ప్రదర్శనల్లోనూ ఆయన చిత్రాలకు పురస్కారాలు లభించాయి. 1893లో చికాగో వరల్డ్స్ కొలంబియన్ ఎక్స్ పొజిషన్ లో ఆయన ఛాయాచిత్రాలను ప్రదర్శించారు.

ఫోటోగ్రఫీని వ్యాపారంగా మల్చినవాడు!

దీన్ దయాళ్ కేవలం కెమెరా వెనుక ఓ కళాకారుడిగా మిగిలిపోలేదు. విజయవంతమైన వ్యాపారవేత్త. ఇండోర్, సికింద్రాబాద్, ముంబైల్లో ఆయన స్టూడియోలుండేవి. హైదరాబాద్ లో మహిళలు ప్రైవేట్ గా ఫోటోలు తీయించుకునేందుకు ప్రత్యేకంగా జెనానా పేరుతో ఓ స్టూడియో కూడా నిర్వహించారు. ఆయన స్టూడియోల్లో పని చేసి అనేకమంది ఆ తర్వాత ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ గా ఎదిగారు.

గాజు పలకల్లో భారతదేశ చరిత్ర!

అప్పటి ఫోటోగ్రఫీలో గ్లాస్ ప్లేట్ నెగటివ్స్ పాత్ర కీలకం. దీన్నే లార్జ్ ఫార్మాట్ ఫోటోగ్రఫీ అంటారు. ఈ లార్జ్ ఫార్మాట్ ఫోటోగ్రఫీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా దీని తర్వాత ఆర్టికల్ లో చెప్పుకుందాం. మధ్యలో బెల్లోస్ తో దాని నిర్మాణ శైలి ఎలా ఉంటుంది.. అది నాటి ఇండస్ట్రియల్, ల్యాండ్ స్కేప్, ఇతర ఫోటోగ్రఫీ వర్క్స్ లో ఎలా వాడారో తెలుసుకుందాం. ఈ లార్జ్ ఫార్మాటే దీన్ దయాళ్ ఫోటోగ్రఫీకి ప్రాణం పోసింది. వేలాది గాజు ప్లేట్లపై ఆయన ఛాయాచిత్రాలను నమోదు చేశారు. ఆయన తీసి, డెవలప్ చేసిన ఆ ఫోటోలు కూడా అత్యంత నాణ్యమైనవిగా నాడు గుర్తింపు పొందాయి.

దీన్ దయాళ్ తన జీవితకాలంలో సుమారు 30 వేల ఫోటోలు తీసినట్టు కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. ఆయన మరణం తర్వాత ఆ భారీ ఆర్కైవ్స్ లో కొంత భాగం చెదలు పట్టి చెదిరిపోయింది. కొన్ని గ్లాస్ ప్లేట్ నెగటివ్స్ ను వాటి విలువ తెలియకో, అవి పనికి రాకనో స్క్రాప్ గా అమ్మేశారు. అయితే, ఆ తర్వాత దీన్ దయాళ్ వారసత్వాన్ని కాపాడేందుకు గట్టి ప్రయత్నాలు కూడా జరిగాయి. 1989లో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్.. ఆయన స్టూడియో నుంచి ఏకంగా 2 వేల 857 గాడు ఫ్లేట్ నెగటివ్స్ ను సేకరించింది. ఐజీఎన్సీఏ వద్ద ఇప్పుడు దీన్ దయాళ్ ఫోటోగ్రఫీకి చెందిన వేలాది చారిత్రక గాజు ప్లేట్ నెగటివ్స్ ఇంకా ఉన్నాయి.

1905లో రాజా దీన్ దయాళ్ మరణించారు. కానీ, ఆయన కెమెరా బంధించిన చిత్రాలు మాత్రం ఇప్పటికీ మాట్లాడుతున్నాయి. అందుకే అది ఓ ఫోటోగ్రాఫర్ కెమెరా పనితనం మాత్రమే కాదు… ఒక కాలాన్నే బంధించిన ఓ ఛాయాచిత్ర కళాచరిత్ర!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles