కొండ ప్రాంతాల్లో మిలిటెంట్ల నుంచి… ప్రాంతీయ ముప్పుగా! హౌతీల కథేంటి..?

హౌతీలు ఎవరు…? యెమెన్ అంతర్యుద్ధం నుంచి ఎర్ర సముద్రం దాకా ఎలా ఎదిగారు..??

యెమెన్ కొండ ప్రాంతాల్లో ఓ చిన్న సాయుధ ఉద్యమంగా మొదలైంది హౌతీల ప్రస్థానం. ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకునే శక్తిగా మారింది ఇదే హౌతీ మిలిటెంట్ గ్రూప్. ఒకప్పుడు యెమెన్ లో అంతర్యుద్ధానికి కారణమై.. అక్కడి ప్రభుత్వంతో పోరాటం చేసిన స్థానిక మిలిటెంట్ గ్రూప్.. నేడు కీలకమైన బాబ్ అల్ మందెబ్ జలసంధినే ప్రభావితం చేయగల శక్తిగా ఎదిగింది. ఎర్ర సముద్రంలో నౌకాయానాన్ని అడ్డుకోవడం.. సౌదీ అరేబియాలోని కీలక మౌలిక సదుపాయాలపై క్షిపణలు, డ్రోన్స్ తో దాడులు చేయడంతో.. హౌతీలు ఇప్పుడు తమ ప్రభావాన్ని యెమెన్ సరిహద్దులు దాటించారు.

అసలు ఎవరు ఈ హౌతీలు..?

హౌతీల అసలు పేరు అన్సార్ అల్లా. 1990ల చివర్లో ఉత్తర యెమెన్ లోని జైదీ షియా ముస్లింల పునరుజ్జీవన ఉద్యమంతో వీరి ప్రస్థానం ఆరంభమైంది. హౌతీ కుటుంబ నాయకత్వం వహించడంతో ఈ ఉద్యమానికి అదే పేరు స్థిరపడింది.

యెమెన్ ప్రభుత్వానికి, హౌతీలకు మధ్య ఆరు విడతల యుద్ధాలు జరిగాయి. ఈ పోరాటాల ద్వారా హౌతీలు స్థానికంగా బలమైన మిలిటెంట్స్ గా ఎదిగారు.

2010 చివర్లో ఆరంభమై పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలోని అనేక అరబ్ దేశాలకు వ్యాపించిన ప్రజా నిరసనలు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల పరంపరను, కాలాన్ని అరబ్ స్ప్రింగ్ గా పిల్చేవారు. దీర్ఘకాలం అధికారంలో ఉన్న ప్రభుత్వాల తీరుపై ప్రజా వ్యతిరేకత అన్నమాట. అలా అరబ్ స్ప్రింగ్ ప్రభావంతో 2011లో యెమెన్ కేంద్ర ప్రభుత్వం బలహీనపడింది. అదే హౌతీలు విస్తరించడానికి అవకాశం కల్పించిన సమయం. ఇరాన్, లెబనాన్ కు చెందిన హిజ్బుల్లాతో సంబంధాలు కూడా హౌతీలకు అప్పటికే విస్తరించాయి.

దీంతో 2014లో హౌతీలు యెమెన్ రాజధాని సనాను స్వాధీనపర్చుకున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వాన్నే వెనక్కి నెట్టేశారు. దానికి ప్రతిస్పందనగా 2015లో సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి యెమెన్ లో సైనిక జోక్యం చేసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు అంతర్యుద్ధం కొనసాగింది. 2022లో కాల్పుల విరమణ ప్రకటించినా.. శాశ్వత రాజకీయ పరిష్కారం మాత్రం కనిపించలేదు.

గాజా యుద్ధం తర్వాత మారిన హౌతీల పాత్ర!

2023లో ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ఆరంభమైన తర్వాత హౌతీల పాత్ర మరింత అంతర్జాతీయంగా చర్చనీయాశంగా మారింది. పాలస్తీయన్లకు సంఘీభావంగా.. ఇజ్రాయెల్ పై క్షిపణులు, డ్రోన్లను హోతీలు ప్రయోగించారు. ఆ తర్వాత ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలపైనా దాడులు ఆరంభించారు. దీంతో ప్రపంచ వాణిజ్యానికే అత్యంత కీలకమైన సముద్ర మార్గం భద్రత ఒక ప్రశ్నగా మారింది.

బాబ్ అల్ – మందెబ్ ఎందుకంత కీలకం..?

బాబ్ అల్ మందెబ్ ఎర్ర సముద్రాన్ని.. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ తో కలిపే సన్నని జలసంధి. ఆసియా – యూరప్ ఖండాల మధ్య సముద్ర వాణిజ్యంలో ఇది కీలకమైన మార్గం.

తాజాగా హౌతీలు యెమెన్ పశ్చిమ తీరంలో వేగంగా ముందుకు చొచ్చుకుపోతున్నాయి. మోఖా పోర్ట్ నగరాన్ని, రెడ్ సీ తీర ప్రాంతాలను, కొన్ని దీవులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. దీంతో సుమారు 19 కిలోమీటర్ల వెడల్పు ఉన్న బాబ్ అల్ – మందెబ్ జలసంధి మొత్తం పరిధిపైన హౌతీల ఆయుధాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. యెమెన్ లో ఓ కొండ ప్రాంతం నుంచి ఓ చిన్న మిలిటెంట్ గ్రూపుగా ఆరంభమైన హౌతీల ప్రస్థానం.. ఇప్పుడు అంతర్జాతీయ నాకాయానాన్నే అడ్డుకునే స్థాయికి పెరిగింది.

ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ లో భాగంగా ఇప్పటికే అమెరికా ఎంట్రీ… ఇరాన్ కు పొసగని గల్ఫ్ దేశాలతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఈ క్రమంలో ఇరాన్ తో దోస్తీ ఉన్న హౌతీలు సౌదీపై దాడులు, బాబ్ అల్ – మందబ్ జలసంధిపై ఆధిపత్యం ప్రదర్శించడం, ఇప్పుడు ఎర్ర సముద్రంలో తమ ప్రతాపాన్ని చూపిస్తుండటంతో అంతర్జాతీయంగా వీరు ఇప్పుడు మరింత చర్చనీయాశంగా మారారు.

మరి హౌతీల దగ్గర ఎలాంటి ఆయుధాలున్నాయి..?

హౌతీల వద్ద ఉన్న క్షిపణలు బలమైనవి. సుమారు 1800 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలవి. ఇజ్రాయెల్ వరకూ చేరిన సందర్భాలూ ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రధాన విమనాశ్రయం పరిధిలోని ఓ ప్రాంతాన్ని 2025లో ఒక హౌతీ క్షిపణి ఢీకొట్టినట్టుగా కూడా కథనాలు పేర్కొన్నాయి. అలాగే, డ్రోన్లు కూడా వీరి ప్రధాన ఆయుధాలు. సౌదీ అరేబియాలోని నగరాలు, మౌలిక సదుపాయాలపై దాడులతో పాటు.. ఎర్ర సముద్రంలోని నౌకలపై కూడా క్షిపణులు, డ్రోన్లను ఇప్పటికే ప్రయోగించారు.

2026లో యెమెన్‌లో జరుగుతున్న తాజా పోరాటంలో.. డ్రోన్లను కేవలం దూరదాడులకే కాకుండా, యుద్ధభూమిలో ప్రత్యక్షంగా ఉపయోగించడం కూడా పెరిగిందని పలు కథనాలు చెబుతున్నాయి.

ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

2025లో ఐక్యరాజ్యసమితి నిపుణుల నివేదిక ప్రకారం.. హౌతీలు తమ క్షిపణి, డ్రోన్ సామర్థ్యాలను సాంకేతిక సాయం, దేశీయ తయారీ రెండింటి ద్వారా అభివృద్ధి చేసుకున్నారు. అదే సమయంలో ఆయుధాల అక్రమ రవాణా కూడా కొనసాగించినట్టు నివేదికలు పేర్కొన్నాయి. ఒమన్ సరిహద్దు మీదుగా భూభాగం ద్వారా, సముద్ర మార్గాల్లో ఆయుధాలు తరలించిన ఘటనలు బయటపడ్డాయి. డ్రోన్ కంట్రోల్ పరికరాలు, నౌకల నావిగేషన్ సమాచారాన్ని స్వీకరించే పరికరాలు, డ్రోన్ ఇంజిన్లు, క్షిపణి భాగాలు వంటి వాటిని అధికారులు గతంలో స్వాధీనం చేసుకున్నట్టు కూడా ఐక్యరాజ్యసమితి నివేదికలు పేర్కొన్నాయి.

ఇరాన్ నుంచి హౌతీలకు ఆయుధాలు, నిపుణుల సాయం అందినట్టు ప్రచారం ఉంది. ఇరాన్ మాత్రం ఐక్యరాజ్యసమితి పెట్టిన ఆయుధ ఆంక్షలను ఉల్లంఘిస్తూ… హౌతీలకు ఆయుధాలు అందిస్తున్నామంటూ తమపై వస్తున్న ఆరోపణలను అధికారికంగా ఖండించింది. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ అంచనా ప్రకారం హౌతీలు దేశీయ ఆయుధ తయారీలో పురోగతి సాధించినప్పటికీ… సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన సామర్థ్యాల విషయంలో ఇరాన్ పైనే ఇంకా ఆధారపడుతున్నారన్నరట.

చిన్న మిలిటెంట్ గ్రూప్… ఎంత పెద్ద సైనిక శక్తిగా మారింది..?

ఐక్యరాజ్యసమితి నిపుణుల ప్రకారం హౌతీల వద్ద సుమారు 3 లక్షల 50 వేల మంది వరకూ సైనిక బలగం ఉండొచ్చన్నది ఓ అంచనా. ఇందులో 18 ఏళ్లలోపు వారిని కూడా నియమించుకున్నట్టు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. చొరబాట్లు, డ్రోన్ దాడులు, ముందు వరుసల్లో కాల్పులు, మందుపాతరలు, ఇతర పేలుడు పరికరాల వినియోగం.. వీరి యుద్ధవ్యూహాల్లో భాగంగా ఉన్నట్టుగా కూడా అంచనా వేసింది ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం.

దీనికి తోడు ఇరాన్, హిజ్బుల్లా నుంచి అందిన శిక్షణ కూడా హౌతీలను స్థానిక మిలిటెంట్స్ స్థాయి నుంచి మరింత వ్యవస్థీకృత సైనిక శక్తిగా మార్చడంలో కీలకంగా పనిచేసిందన్నది అంతర్జాతీయ విశ్లేషకులు చెప్పే మాట.

ఇప్పుడు హౌతీలను ఎందుకు అంత సీరియస్‌గా చూస్తున్నారు?

హౌతీల అసలు బలం వారి సంఖ్యలో మాత్రమే లేదు. భౌగోళిక స్థానం, క్షిపణులు, డ్రోన్లు, సముద్ర మార్గాలపై ఒత్తిడి తెచ్చే సామర్థ్యం కలిసి.. వారి ప్రభావం రాను రాను పెరుగుతోంది. యెమెన్‌లోని కొండ ప్రాంతాల నుంచి మొదలైన ఈ ఉద్యమం.. ఇప్పుడు ఎర్ర సముద్రం, బాబ్ అల్-మందెబ్ వంటి ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles