మత నేపథ్యాన్ని ఓ బలహీనతగా కాకుండా.. బలంగా మార్చుకుంటే ఏం చేయ్యొచ్చు..? 23 సినిమాపై ఓ రివ్యూ!

Aravind Jashua, Film Maker… ✍️

ఇద్దరు దొంగలు. ఒక బస్సు దహనం. సజీవంగా కాలి మసైపోయిన 23 మంది అమాయక ప్రయాణీకులు. పెల్లుబికిన ప్రజాగ్రహం. అత్యంత వేగంగా విచారణ జరిపి, ఆ ఇద్దరికీ మరణ శిక్ష విధించిన కోర్టు. ఆ కోర్టు నిర్ణయానికి, రగులుతున్న ప్రజల ఆగ్రహావేశాలకు ఎదురుగా నిలబడిన ఒకే ఒక్కడు _ లాయర్ భువనగిరి చంద్రశేఖర్!

భువనగిరి చంద్ర శేఖర్ మీద ఒక కథ అనుకుని అనేకమంది ఆయన స్నేహితులని, ఒకప్పటి సహచరులను కలిసినపుడు, ఆయన మీద ప్రచురించబడిన ఒక ఎలిజి లాంటి పుస్తకాన్ని చదివినపుడు ఒక విషయం అర్ధమైంది. ఒకప్పుడు ఆయన్ని ఇష్టపడిన చాలామందికి ఆయన జీవితంలోని ఆఖరి అధ్యాయం గురించి మాట్లాడడం పెద్దగా ఇష్టం లేదు. ఎందుకంటే జీవితమంతా హక్కుల పోరాట యోధుడిగా, నాస్తికుడిగా, లెఫ్టిస్ట్ భావజాల విశ్వాసిగా ఉన్న చంద్ర తమ ఆఖరి రోజులలో గుళ్ళూ గోపురాలూ తిరిగాడు. దేవుడు అనే శక్తిని నమ్మడం మొదలెట్టాడు. సంస్కృతం నేర్చుకోవడానికి ప్రయత్నించాడు. తన బ్రాహ్మణ మూలాలలోకి ప్రయాణం సాగించాడు. అది ఆయన ఒకప్పుడు నమ్మిన సిద్ధాంతాలకు విరుద్ధం. కాబట్టి ఆయన గురించి మాట్లాడడం వాళ్ళకి ఇప్పుడు ఇష్టం లేదు.

చంద్ర దాదాపు క్రైస్తవ మతాన్ని విరోధించినవాడు. ఈ ప్రపంచంలోని అసమానతలకు, అన్యాయాలకి పాశ్చాత్య దేశాలలో మొదలైన industrialisation ఏ కారణం అని, ఆ industrialisation కి కారణం క్రైస్తవం అని ఆయనకి అనిపించింది. అది ఎంతవరకూ వెళ్ళింది అంటే ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా అమ్మబడి, గొప్ప వ్యక్తిత్వ వికాస సాహిత్యంగా పరిగణింపబడిన “పరసవేది(The Alchemist)”, ఒక క్రైస్తవ ప్రాపగాండా పుస్తకం అని ఆయన ఒక వ్యాసం రాసేంత వరకూ వెళ్ళింది. కానీ క్రైస్తవ్యాన్ని, లేదా పాశ్చాత్య దేశ సంస్కృతికి గుండెకాయ అయిన క్రైస్తవాన్ని అంతగా వ్యతిరేకించిన చంద్ర, ఆయన వాదించిన అత్యంత ముఖ్యమైన కేసులు అయిన చిలకలూరిపేట బస్ దహననం కేసు వెనక తెలియకుండానే బైబిల్ నియమాలని, క్రీస్తు బోధల సారాన్ని అనుభవించాడు. వాడాడు.

“మీలో పాపం చేయనివాడు ఎవడన్నా ఉంటే, వాడిని విసరనియ్యండి మొదటి రాయి!” అన్నాడు యేసు. ఒక వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి, ఆయన ముందు నిలబెట్టి “బోధకుడా…మన (మోషే ఇచ్చిన)న్యాయశాస్త్రం ప్రకారం ఈమె రాళ్ళతో కొట్టబడడం ద్వారా మరణ శిక్ష అనే శిక్షకు అర్హురాలు. కానీ నువ్వు ఏమంటావో వినాలి అనుకుంటున్నాం” అన్నప్పుడు యేసు అన్న మాట “మీలో ఎవరురా పాపం లేనివాడు? మీరు అందరూ చిన్న పాపమో, పెద్ద పాపమో, దొరకని, రుజువు చేయబడని పాపమో, మనసులో చేసిన వ్యభిచారం అనే పాపమో చేసిన నేరస్థులే అయినప్పుడు… ఆమె మాత్రమే పాపం చేసింది అని వేలెత్తి చూపి, రాళ్ళెత్తి కొట్టి చంపే అర్హత మీకు ఎక్కడ ఉందిరా?” అని.

“23 మందిని సజీవ దహనం చేసిన ఈ హంతకులను ఉరి తీసి చంపాలి” అని జనం, కోర్టు నిర్ణయించినపుడు చంద్ర చెప్పింది అదే.

1) శిక్షించడం న్యాయమే కానీ ప్రాణం తీసే హక్కు మనకి లేదు. అది అమానవీయం. అనేకమైన నాగరిక దేశాలలో మరణ శిక్ష నిషేధించబడింది..

2) వాళ్ళు చంపారు కాబట్టి మనం వాళ్ళని చంపితే ~ మనకీ ఆ హంతకులకీ తేడా ఏముంటుంది? ఈ హంతకుల కన్నా ఏ విధంగా మనం విరుద్ధం ? ఏ విధంగా మనం మెరుగైన మానవ స్వభావాన్ని, నాగరిక స్వభావాన్ని(civilized nature) ప్రదర్శిస్తున్నాం??

3) మీలో నేరస్తుడు కానీ వాడెవ్వడు? ఒక మనిషిని మనిషిలా చూడకుండా, తక్కువ కులస్తుడనో, అంటరానివాడనో వందల సంవత్సరాలు అవమానించి, వేధించి, హింసించి మానసికంగా హత్య గావించిన సమాజానికి వేరే ఎవడినో వేలు పెట్టి చూపించి వీడు హంతకుడు, వీడు నేరస్తుడు, వీడిని చంపండి అని అరిచే హక్కుందా? Rape చేసి దొరికిన వాడు రేపిస్ట్ . వాళ్ళని చట్ట, న్యాయ విరుద్ధంగా encounters చేస్తుంది వ్యవస్థ. మరి కళ్ళతో రేప్ చేసే మగాళ్ళు, వేధించే పై ఆఫీసర్లు, టీచర్లు, బస్సుల్లో, మీటింగుల్లో, ఇళ్ళల్లో అసభ్యంగా తాకుతూ వేధించే, నరకం చూపించే కుటుంబ సభ్యులు, అన్నయ్యలు, పక్కింటి అంకుల్స్, తాతయ్యలు…వీళ్లు రేపిస్టులు కాదా? వాళ్ళకి లేదా శిక్ష? వీళ్లు దొరకలేదు కాబట్టి వీళ్ళకి శిక్ష లేదు. దొరికారు కాబట్టి, సమాజం ఆగ్రహంతో చంపండి అని అరుస్తుంది కాబట్టి వాళ్ళకి బుల్లెట్లు! ఉరి శిక్షలు!

ఇలా ఉంటుంది చంద్ర వాదన. చంద్ర కి తెలియకపోవచ్చు. చంద్ర అంగీకరించక పోవచ్చు. కానీ చంద్రని ప్రభావితం చేసింది అనేకమైన పుస్తకాలు. పాశ్చాత్య దేశాల్లోని కోర్టుల్లో విచారించబడిన కేసుల్లో ఆ కోర్టులు ఇచ్చిన తీర్పులు. మరి పాశ్చాత్య సమాజాన్ని, అక్కడి సమాజ వికాసాన్ని, న్యాయ విధానాన్ని ప్రభావితం చేసింది ఎవరు? క్రైస్తవ్యం! క్రీస్తు బోధలు.

చిలకలూరి పేట బస్సు దహనం లాంటి ఒక కథ చెబుతున్నపుడు, తన చుట్టూ ఉన్న అందరితో ద్వేషించబడి, మరణ శిక్ష విధించబడి, తనని తానే క్షమించుకోలేని తీవ్రమైన నిరాశలో, నిస్పృహలో కుంగిపోయిన మానసిక స్థితిలో ఉన్న ఒక వ్యక్తి _ విజయవర్ధన రావు… జైల్లో ఉండే చదువుకున్నాడు. డిగ్రీ పాస్ అయ్యాడు. భార్య, బిడ్డల్ని పొందుకున్నాడు. పుస్తకం రాశాడు. ఎలా బతికాడు ఆ జైలు గోడల మధ్య? నాశనం అయిపోయింది అనుకున్న తన జీవితాన్ని తిరిగి బూడిదలోంచి ఎలా పునర్నిర్మించుకున్నాడు. ఎలా పొందాడు అంత Hope ? ఎవరు ఇచ్చారు అంత ఆదరణ, నిరీక్షణ? దేవుడు! In his case, It’s Jesus! మీరు గానీ విజయవర్ధన రావుని కలిసి మాట్లాడి, అడిగితే అతను చెప్పే సమాధానం అదీ!

“బైబిల్ చదువు అనేవారు great writer పతంజలి గారు ఎప్పుడు కలిసినా” అంటాడు film maker అయిన నా స్నేహితుడు ఒకరు. అతను christian కాదు. పతంజలి గారూ క్రిస్టియన్ కాదు. మరెందుకు చదవాలి Bible?

బైబిల్ చదువు. Not (only)as a religious text. But as a book that influenced most of the world. Influenced art, literature, poetry, cinema, collective human conscience, influenced law& Justice.

Writers of 23 గానీ అసలు కథని, తమకున్న క్రైస్తవ నేపథ్యాన్ని disown చేసుకోకుండా, దాన్ని ఒక stength గా వాడుకుని ఉంటే, 23 మానవ స్వభావాన్ని చర్చించిన మరింత గొప్ప కథ అయిఉండేది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles