మట్టికోట మారాజుకు ఘన వీడ్కోలు!

Nagh Raj, సీనియర్ జర్నో… ✍️

……………………………………………………………………………..

రఫెల్ నాదల్.. ది ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టెన్నిస్ ప్లేయర్!!

చిన్నప్పటి నుంచి క్రికెట్ పిచ్చి బాగా ఉండేది. డిగ్రీకొచ్చాక మెల్లగా టెన్నిస్ పిచ్చొకటి వచ్చి తలకు చుట్టుకుంది. అప్పటికున్న క్రికెట్ ‘గంత’ సరిపోదని, మరో టెన్నిస్ ‘బొంత’ యాడ్ అయిందన్నమాట! ఆ రోజుల్లో, టెన్నిస్ లో సంప్రాస్ అనో జెంటిల్మెన్ ఉండేవాడు. అలాగే అగస్సీ అని ఓ తింగరోడు, బోరిస్ బెకర్ అనే కాస్త కోపధారి మనిషి, ఇవానీసెవిచ్ అనే ఓ జీసెస్ క్రైస్ట్ లాంటి ప్లేయర్స్ కొందరు ఆడుతుండేవాళ్లు. అయితే, ఎందరు ప్లేయర్స్ ఉన్నా, అప్పటికి టెన్నిస్ అంటే సంప్రాస్ అన్నట్టుగా ఉండేది. ఇక వీడు పోతే టెన్నిస్ గతేం కాను అని నాలాంటి అమెచ్యూర్ టెన్నిస్ అభిమానుల్ని ఓ చింత వేధిస్తుండేది. సరిగ్గా ఆ టైంలోనే ‘యథా యథా హి టెన్నిస్ క్రీడస్య…’ అంటూ ఫెదరర్ అనే కుర్రాడు (ధోనీలాగే) ఓ బారెడు జుట్టేసుకుని, దానికో పిలక కట్టి ఆడుతుండేవాడు. మెల్లగా ఆ పిలక జుట్టు ఫెదరరే, జుట్టుకు అంతగత్తెర వేసి, అందరి మీద గెలవడం మొదలెట్టి ‘టెన్నిస్ ఎవరెస్ట్’గా అవతరించాడు! అసలా ఫెదరర్ ఆడుతుంటే, మైకెలాంజిలో ‘సిస్టిన్ చాపెల్’ని చెక్కుతున్నట్టో; డావిన్సీ ‘మొనాలిసా’ని దిద్దినట్టుగానో.. ఉంటుంది. క్రికెట్లో అలాంటి ఆర్టిస్టిక్ ఆటశైలి సచిన్ సొంతం. టెన్నిస్ లో ఫెదరర్ శకం మొదలయ్యాక, ఏ గ్రాండ్ స్లామ్ వచ్చినా అభిమానులకు మాత్రం ఫెదరర్ ఆటను చూట్టం అదో పండగ అంతే!

ఫెదరర్ పీక్ లో ఉండగానే, రఫేల్ నాదల్ అనే పక్కా మొరటోడైన ప్లేయర్ కూడా ఆడుతూ ఉండేవాడు. ఈ నాదల్ ఎప్పుడూ ఎర్రమట్టి ఫ్రెంచ్ ఓపెన్లో మాత్రం గెలుస్తుండేవాడు. మిగతా అన్ని గ్రాండ్ స్లామ్స్ లో ఫెదరర్ చేతుల్లో ఓడి, రన్నరప్ గా మిగిలిపోయేవాడు. అప్పట్లో ఏ గ్రాండ్ స్లామ్ ఫైనల్ జరిగినా అందులో ఫెదరర్ vs నాదల్ ఇద్దరే ఉండేవారు. నాదల్ ఎలాగూ ఓడేవాడు. ఓసారిలాగే ఓడిపోయి, “నేనీ టైంలో అసలు పుట్టి ఉండాల్సిందే కాదు, ఫెదరర్ రిటైర్ అయ్యాక పుట్టాల్సింద”ని ఏడ్చేశాడు. అలాంటి నాదలే తర్వాతర్వాత మెల్లగా ఫెదరర్ ని ఓడించడం మొదలుపెట్టాడు. ఎంతలా ఓడించాడు అంటే, చివరికి రికార్డు టైటిల్స్ కి, ఒకే ఒక్క టైటిల్ దూరంలో నిలిచిపోయి.. దాదాపు నాలుగైదేళ్లు వరుసగా నాదల్ చేతిలో ఓడిపోతూ, ఫెదరర్ కూడా ఏడ్చేశాడు. ఇదీ వీళ్లిద్దరి టెన్నిస్ గ్రేటెస్ట్ ల్ రైవల్రీ!!

ఏమైతేనేం, ఫెదరర్ వీరాభిమానులంతా… బండోడు, మొరటోడు, మొండోడుగా పిలిచుకునే నాదల్ కూడా ఫ్రెంచ్ ఓపెన్ తో పాటు అన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచాడు. ఫెదరర్ లాగే తను కూడా గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైంగా ఎదిగాడు. ఆర్టిస్టిక్ బ్యూటీ ఒక్కటి తక్కువగా ఉన్నప్పటికీ, బంతిని గింగిరాలు తిరిగేలా స్పిన్ షాట్స్ కొట్టడంలో; మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే అతిమొండి పట్టుదల మాత్రం టన్నులకొద్దీ ఉన్న ప్లేయర్ గా నాదల్ కు పేరు. ఫెదరర్ ని (20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్) ఎవరూ అందుకోలేరు అనే భ్రమల్లో ఉన్న అందరినీ ఆశ్చర్యపరుస్తూ నాదల్ కూడా ఆ ఫీట్ ను సాధించేశాడు. తర్వాత జకోవిచ్ కూడా ఈ ఈ ఫీట్ సాధించాడు. ప్రస్తుతానికి నిన్నటిదాకా ఈ ముగ్గురూ టెన్నిస్ శిఖరంపై ఒకే స్థాయిలో ఉన్నారు. ఐతే, ఈరోజు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ గెలిచి 21వ టైటిల్ గెలిచిన ఏకైక ప్లేయర్ గా టెన్నిస్ ఎవరెస్ట్ పై నిలిచాడు.

నిజానికి ఈ నాదల్ చాలాసార్లు గాయాల బారిన పడి, ఆపరేషన్లు చేయించుకుని ఇక కెరీర్ సమాప్తం అనుకున్న దశలో, ఫీనిక్సులా తిరిగొచ్చి ఇలా 21 గ్రాండ్ స్లామ్స్ ఫీటును సాధించడం ఆషామాషీ కాదు. ఫ్రెంచ్ ఓపెన్ ఎర్ర మట్టి కోటపై తిరుగులేని రారాజుగా పేరున్న ఈ స్పెయిన్ బుల్ మెల్లగా వింబుల్డన్ పచ్చికపై, అలాగే ఆస్ట్రేలియన్, యూఎస్ టర్ఫ్ పై కూడా పట్టు సాధించి ఆల్ రౌండర్ గా ఆవిర్భవించడం మాత్రం నిజంగా అద్భుతమే. నిజానికి ఫెదరర్ ఆటని ఆస్వాదించినంతగా అభిమానులు నాదల్ ప్లేని ఆస్వాదించలేకపోవచ్చు కానీ, గ్రౌండ్లో దిగాక, మ్యాచ్ గెలవడానికి 200శాతం ఎఫర్ట్ పెట్టి మొండిగా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆడే టఫెస్ట్ ప్లేయర్ గా నాదల్ ని ఇష్టపడని వారంటూ ఎవరూ లేరు.

ఎవరైనా, ఏ ఫీల్డులోనైనా వంద శాతం ఎఫర్ట్ పెట్టి, పట్టు వదలకుండా పోరాడితే ఏదో ఓ రోజు అంబరాన్ని చుంబిస్తారనడంలో రఫెల్ నాదలే తిరుగులేని ఉదాహరణ.

Congrats Rafa Nadal !!
Tennis GOAT (Greatest Of All Time)!! 😍

(14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ గా… రోలాండ్ గారోస్ లోని ఫిలిప్ ఛాట్రియర్ కోర్టులో ఫేర్వేల్ సందర్భంగా జననీరాజనంతో గౌరవంగా నిష్క్రమించిన సందర్భంగా ఈ కథనం.)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles