మేధోసంపత్తి చౌర్యం కేసులో ఓ చారిత్రాత్మక తీర్పు: ఓ జంట న్యాయపోరాటానికి దక్కిన సామాజిక విజయం!

మీరసలు లా చదవలేదు. కానీ, ఓ కేసులో పిటిషనర్స్ గా కోర్టులోకి అడుగుపెట్టారు. అటువైపు ప్రత్యర్థి వర్గంలోనేమో లా పుస్తకాలను ఔపోసన పట్టి, తిమ్మిని బమ్మి చేసే అడ్వకేట్స్ ఉన్నారు. తమ వాదనలతో రాజ్యానికే రక్షణ కల్పించే ప్రభుత్వ ప్లీడర్స్ ఉన్నారు. అప్పుడాకేసు ఎంత ఆందోళనకరంగా ఉంటుంది..? ఆ కేసులో మీరు న్యాయాన్ని పొందాలంటే ఎంత సమర్థులై ఉండాలి…? కానీ, ఓ దళిత జంట ఫైట్ చేసింది. విజయం సాధించింది. ఆ కేసు ఇప్పుడు ఓ సంచలనం. అది తెలుసుకోవాలంటే ఓసారి మహారాష్ట్ర వైపు చూడాలి.

ప్రధానంగా కోర్టుకు కావల్సింది సాక్షాధారాలే అయినప్పుడు కొన్ని కేసుల్లో సంతృప్తికర తీర్పులు రాలేదనే భావన ఉంటుండొచ్చు. కోర్ట్ తీర్పులపైనా భిన్నాభిప్రాయాలూ ఉండొచ్చు. కానీ, కొన్ని కేసుల్లో మాత్రం న్యాయం జరుగుతుందని.. న్యాయస్థానాలు స్పందిస్తాయనేది నిరూపితమవుతూనే ఉంది. అలాంటి కేసే ఓ దళిత జంటకు సంబంధించిన మేధోసంపత్తి కేసు. ముంబై హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీం కోర్టు కూడా ఇచ్చిన ఆ సంచలన తీర్పును ఓ ల్యాండ్ మార్క్ గా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఏం జరిగిందంటారా..? విందాం పదండి.

క్షిప్రా ఉకే, శివశంకర్ దాస్ అనే దళిత జంట ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పూర్తి చేసిన స్కాలర్స్. వీరిద్దరూ తమ ఓ ప్రాజెక్ట్ రీసెర్చ్ లో భాగంగా సామాజిక, ఆర్థికపరమైన సర్వే చేపట్టారు. అందుకోసం మహారాష్ట్ర నాగపూర్ లోని వివిధ విద్యాలయాల్లోని విద్యార్థులు, యువతను కలిసి 5 వేల శాంపిల్స్ డాటా తో ఒక రీసెర్చ్ నిర్వహించారు. అదంతా ఈ ఇద్దరికి సంబంధించిన ల్యాప్ టాప్ లో నమోదై ఉంది.

కానీ, ఓరోజు వారుంటున్న ఇంటి తాళాలు బద్ధలు కొట్టి, వారి సామాన్లు చెల్లాచెదురు చేసి వారి అమూల్యమైన రీసెర్చ్ డాటా నిక్షిప్తమైన ల్యాప్ టాప్ ను ఎత్తుకెళ్లారు దుండగులు. అలాగే వారికి సంబంధించిన 33 అకడమిక్ సర్టిఫికెట్స్, పాస్ పోర్ట్స్ వంటివెన్నో తమ జీవితాంతం కష్టపడి సాధించనవీ దొంగతనానికి గురయ్యాయి.

2018, సెప్టెంబర్ 8వ తేదీన ఈ ఘటన జరగ్గా.. దళిత జంట క్షిప్రా ఉకే, శివశంకర్ దాస్ ఇద్దరూ కూడా నాగపూర్ లోని బజాజ్ నగర్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తాము ఇంట్లో లేనప్పుడు కొందరు దుండగులు తమ ఇంటి తాళాలు పగులగొట్టి తమ ల్యాప్ టాప్ దొంగిలించాడని ఫిర్యాదు చేశారు. కానీ, ఆరోజు ఆదివారం అని చెప్పి పోలీసులు కేసు నమోదు చేసుకోలేదు. అప్పటికే 8 నెలల గర్భవతిగా ఉన్న క్షిప్రా, శివశంకర్ దాస్ ను గంటలకొద్ది సమయం పోలీస్ స్టేషన్ లో వెయిట్ చేయించారు. చివరకు జాయింట్ కమిషనర్ ను కలిశాక.. ఆయన ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ ఛార్జ్ షీట్ నాగపూర్ స్పెషల్ కోర్టుకు చేరింది. ఆ తర్వాత జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ కూ మేధోసంపత్తి దొంగతనం గురించి క్షిప్రా, శివశంకర్ ఫిర్యాదు చేశారు. కానీ, నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్ నుంచి కూడా ఎలాంటి ఉలుకూ పలుకూ లేకుండా పోయింది.

దాంతో క్షిప్రా, శివశంకర్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్ స్పందించకపోవడంతోనే రిట్ వేసినట్టు వారు హైకోర్టుకు వెల్లడించారు. తమ మేధోసంపత్తి దొంగతనం జరిగినందుకు, తక్షణమే కీలక వ్యవస్థలు స్పందించనందుకు, తమ జీవితకాల లక్ష్యాలను కాలరాసినందుకు, తాము వెచ్చించిన సమయానికీ విలువ కట్టి 127 కోట్ల 55 లక్షల 11 వేల 600 రూపాయల నష్టపరిహారం తమకు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ రిట్ వేసింది ఈ జంట. డాటా చౌర్యమనేది కేవలం తమ వ్యక్తిగతానికి సంబంధించింది కాదని, సామాజికమైన ఆస్తి అంటూ పేర్కొనడంతో పాటు… ఆ డాటా దొంగతనం వల్ల తాము సామాజికంగా, ఆర్థికంగా కూడా నష్టపోయి తమ బతుకులు ఆగమైపోయాయని.. అది ఒక వర్గంపై జరిగిన దాడిగా రిట్ లో పేర్కొన్నారు. తమ వ్యక్తిగత నష్టానికిగాను మరో 3 కోట్ల 91 లక్షల 85 వేల రూపాయలనూ పరిహారంగా ఇప్పించాలని కోరారు. మొత్తంగా 131 కోట్ల రూపాయల భారీ పరిహారం కోరుతూ వారు వేసిన ఆ రిట్ సంచలనం రేపింది.

దాంతో నాగపూర్ లోని ముంబై హైకోర్ట్ బెంచ్ 2023, నవంబర్ 10వ తేదీన కేసు విచారణ చేపట్టి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ పరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది. అంత పెద్దమొత్తం పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పివ్వడంతో మహారాష్ట్ర ప్రభుత్వం గొంతులో పచ్చివెలక్కాయ పడ్డంత పనైంది. దాంతో నాటి దేవంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్ట్ మెట్లెక్కింది.

కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్ట్ పోయిన నెల జనవరి 24, 2025న కొట్టేసి.. మహారాష్ట్ర హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. దాంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద మేధోసంపత్తి చౌర్యానికి పరిహారం ఇవ్వాలంటూ జస్టిస్ బీ.వీ. నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఇచ్చిన సంచలన తీర్పు ఇప్పుడు అట్రాసిటీ యాక్ట్ లో ఓ ల్యాండ్ మార్క్ కేసుగా తెరపైకొచ్చింది. నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నప్పుడు ఘటన జరిగి అక్కడి ప్రభుత్వం సుప్రీం తలుపు తట్టిందో.. అదే ఫడ్నవీస్ మళ్లీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక ఇప్పుడు 2025లో ఆ దళిత జంట తమ కేసులో విజయం సాధించింది.

అసలు క్షిప్రా, శివశంకర్ దాస్ ఎందుకు టార్గెట్ అయ్యారు..?

2015లో నాగపూర్ లోని దీక్షాభూమి ప్రాంతంలో శివశంకర్, క్షిప్రా జంట ఓ ఇంటికోసం వెతుకుతున్నారు. బ్రాహ్మణ సమాజ ఆధిపత్యం ఎక్కువగా ఉండే ప్రాంతంలో వారికో ఇల్లు దొరికింది. క్షిప్రా, శివశంకర్ కు కూడా అలాంటి క్యాస్ట్ పట్టింపులేం లేవు. వారో ఇంట్లోకెళ్లారు. ఆ యజమాని కాస్త జెంటిల్మెన్. ఓ మంచి ఉద్యోగం, స్థిరంగా ఉంటారా, లేదా.. చదువుకున్నవారా, కాదా అనేవే తప్ప.. కులం గురించి కూడా ఎలాంటి ప్రస్తావన లేకుండానే ఆ జంటకు తన ఇంట్లో అద్దెకిచ్చాడు. తాను మాత్రం శుద్ధ శాకాహారి అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు ఆ ఓనర్. ఆ తర్వాత వారు బాగా దగ్గరయ్యారు. ఆయన కూడా ఆ జంట దగ్గరకు వెళ్తుండేవాడు. లెమన్ టీ వంటివి సేవిస్తూ వస్తూ పోతూ ఉండే క్రమంలో హాయిగా సాగుతోంది నాగపూర్ లో క్షిప్ర, శివశంకర్ దాస్ ప్రయాణం.

కానీ, రోహిత్ వేములది వ్యవస్థీకృత హత్య అనే ఆరోపణలనంతరం సామాజిక, రాజకీయ పరిశోధన అంటూ క్షిప్రా, శివశంకర్ దాస్ రంగంలోకి దిగడం, అప్పటికే క్షిప్రా జేఎన్టీయూ ఎలక్షన్స్ లో బరిలోకి దిగడంతో వారిపైన అబ్జర్వేషన్ పెరిగింది. పైగా రోహిత్ వేముల ఫైట్స్ బ్యాక్ నినాదంతో అప్పటికే పదివేల మందితో క్షిప్రా, శివశంకర్ భారీ ర్యాలీ నిర్వహించి ఉండటం.. అక్కడితో ఆగకుండా ఈ ఇద్దరూ నాగపూర్ లోనూ ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించాలంటూ ఓ కవాతు చేపట్టారు. నాగపూర్ వంటి ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రంలో అలాంటి భారీ ర్యాలీ అదే మొదటిసారి కావడంతో ఇక అక్కడినుంచి ఈ జంటకు ప్రత్యర్థులు పెరుగుతూ వచ్చారు.

ఓ ఏడెనిమిది నెలల తర్వాత ఇంటి యజమాని వచ్చి.. తమతో ఆయనకెలాంటి ఇబ్బంది లేదుగానీ.. చుట్టూ ఉన్న సమాజం అసౌకర్యంగా ఫీలవుతుందని చెప్పాడు. మళ్లీ మా రెంటల్ అగ్రిమెంట్ పునరుద్ధరణ సమయంలోనూ యజమాని సుముఖంగా వ్యవహరించలేదు. పది శాతం అద్దె ఎక్కువగా పెంచుతానంటే వెళ్లిపోతామనుకున్నారు. కానీ, మేము అందుకు ఒప్పుకోవడంతో.. ఆయన మళ్లీ కాదనలేకపోయాడు. కానీ, ఆ ఇంటి యజమాని కొద్దిరోజుల తర్వాత మరణించడం, ఆయన వారసుడైన కొడుకు పూణే నుంచి వచ్చీ రాగానే 2016లో ఓరోజు వెంటనే ఇల్లు ఖాళీ చేయమని బలవంతం చేశాడు. అప్పటికి క్షిప్రా 8 నెలల గర్భవతి. ఇల్లు ఖాళీ చేసే విషయం తీవ్రమైన వాగ్వివాదం వరకూ దారితీసింది. మొత్తానికి అప్పటికప్పుడు తమను బలవంతంగా వెళ్లగొట్టలేనప్పటికీ ఆయన మనసులో మాత్రం మమ్మల్ని ఖాళీ చేయించాలనే పట్టుదలతో ఉన్నట్టర్థమైందంటూ మీడియా సంస్థలకు వెల్లడించారు క్షిప్రా, శివశంకర్ దాస్.

కొద్దిరోజుల తర్వాత ఏకంగా ఇంటి తాళాలు పగులగొట్టి తమ ల్యాప్ టాప్ దొంగిలించడంతో వారు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఆ రోజు ఆదివారం కావడంతో పోలీసులెవ్వరూ కంప్లైంట్ కూడా తీసుకోలేదు. చిన్నపాపను పెట్టుకుని తాము పడ్డ కష్టాలు వర్ణనాతీతమంది ఆ జంట. ఆ తర్వాత జాయింట్ కమిషనర్ ను కలిశాక ఆయన ఆదేశాల మేరకు కేసు పెట్టారని తెలిపింది. అవి కూడా అన్నీ పెట్టీ కేసులేనన్నారు. ఆ తర్వాత ఇంటి ఓనర్ ను కలుద్దామని ప్రయత్నించినా ఆయన కలువకపోవడం, తమ ఇంట్లో దొంగతనం, వస్తువుల ధ్వంసం వెనుక ఆయనే ప్రధాన పాత్రధారని తెలిశాక మేం ఇక ఆయనపైనే కేసు పెట్టాలని నిర్ణయించుకున్నామన్నారు క్షిప్రా, శివశంకర్. కానీ, పోలీస్ వ్యవస్థ నిందితుల పక్షం వహించిందన్న ఆవేదన, ఆగ్రహం ఆ జంటను ఊరికే ఉండనివ్వలేదు. దాంతో న్యాయపోరాటానికి దిగింది క్షిప్రా, శివశంకర్ జంట.

ఓ పోలీస్ ఆఫీసర్ ఒక ఫేక్ కంప్లైంట్ నూ సృష్టించారని.. ఆర్నెల్ల నుంచి మేం అద్దె చెల్లించకుండా వెళ్లిపోయామంటూ ఓనర్ పేరిట ఓ లేఖ తయారుచేసి మా ఇంటి తాళాలు పగులగొట్టేందుకు ఆ అధికారి చొరవ చూపారని వెల్లడించారు ఆ జంట. ఆ తర్వాత ఓ మహిళా కానిస్టేబుల్ విచారణతో పోలీస్ అధికారి వ్యవహారం బట్టబయలైందన్నారు. అలా ఓ సినిమాను తలపించేలా కష్టాలెదుర్కొన్న క్షిప్రా, శివశంకర్ దాస్ జంటకు సంబంధించి 2018లో నమోదైన కేసులో.. ఏడేళ్ల తర్వాత 2025లో వారికి ఊరటనిచ్చే తీర్పు రావడం విశేషం.

మొత్తంగా దళిత జంట క్షిప్రా, శివశంకర్ దాస్ కేసులో నాగపూర్ జాయింట్ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో ఓ ముగ్గురు అధికారులతో కూడిన దర్యాప్తు కమిటీని నియమించడంతో పాటు.. వారికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి కచ్చితంగా పరిహారం చెల్లించాలంటూ నాగపూర్ కలెక్టర్ కు.. జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకీ సా మెనెజెస్ తో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. షెడ్యూుల్ కులాలు, షెడ్యూల్ తెగల చట్టం 1989 ప్రకారం పరిహారం మంజూరు చేయడానికి మేధోసంపత్తిని ఆస్తిగా భావించొచ్చని తీర్పు వెల్లడించింది.

ఓ దళిత రీసెర్చ్ స్కాలర్స్ జంట తాము చేసిన డాటా అనాలిసిస్ ను తిరిగి పొందలేకపోవచ్చు. వారి లక్ష్యాన్నీ చేరుకునే క్రమంలో తీవ్ర ఆటంకాన్ని ఎదుర్కొని ఉండొచ్చు.వారు సామాజికంగా తీసుకురావాలనుకున్న మార్పు నేపథ్యంలో వారు వెచ్చించిన సమయానికి దక్కిన పరిహారం సరైన విలువా కాకపోవచ్చు.. ఈ కేసు గెలుపు వారికి జస్ట్ ఓ ఊరటనే కావచ్చు. కానీ, రాజ్యంపై వారు చేసిన ఈ ఫైట్ ఇప్పుడు కచ్చితంగా చెప్పుకోవాల్సిన ఓ గొప్ప ఘనవిజయం. న్యాయవ్యవస్థపై మరింత విశ్వాసాన్ని పెంచే ఓ ఉదంతం. అట్రాసిటీ యాక్ట్ లో మొట్టమొదటి మేధోసంపత్తి పరిహారంగా కూడా నిలిచే విశేషం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles