మూడేళ్ల క్రితం మిత్రులు.. ఇప్పుడు ప్రత్యర్థులు: వాంగ్ చుక్ వర్సెస్ ధర్మేంద్ర ప్రధాన్!

మూడేళ్ల క్రితం వాళ్లిద్దరూ స్నేహితులు. ఇప్పుడు వాళ్లిద్దరూ ప్రత్యర్థులు. కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచే రాజీనామా చేయాలన్న డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ నిరాహర దీక్ష శిబిరాన్ని ఆరంభిస్తే… అందులో ఇప్పుడు కీలక పాత్రధారుడయ్యాడు సోనమ్ వాంగ్ చుక్. మరి మూడేళ్ల క్రితం వాళ్ల స్నేహం ఎలా చిగురించింది… వాళ్లెందుకు కలిశారు..?

ఒకప్పుడు కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆలోచనలు.. లడాఖ్ కు చెందిన విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ భారత విద్యా వ్యవస్థపై, భవిష్యత్తుపై ఒకే అభిప్రాయంతో కనిపించారు. చాలా అంశాల్లో ఏకీభవించారు. ఈ ఘటనకు 2023 సంవత్సరం సాక్షీభూతమైంది. ఈ ఇద్దరూ కూడా జాతీయ విద్యావిధానంపై (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) సమావేశమై పరస్పరం చర్చించుకున్నారు. ఒకరినొకరు ప్రశంసించుకున్నారు. విద్యావ్యవస్థను మార్చాలనే ఆశయాన్ని కూడా బహిరంగంగానే కలిసి వ్యక్తపర్చారు.

అందుకు ప్రస్తుత X అప్పటి ట్విట్టర్ వేదికైంది. ఒకరినొకరు అభినందించుకున్న వారి సంబంధం ఓ థ్రిల్లర్ సినిమా మలుపుల్లా ఇప్పుడు కొద్ది కాలంలోనే ప్రత్యర్థులుగా మార్చింది. ఏ విద్యారంగమైతే వారిద్దరూ ఒకరినొకరు అభినందించుకుని, ప్రశంసించుకునేందుకు కారణమైందో అదే విద్యారంగం ఇప్పుడు ఇద్దరి మధ్యా బహిరంగ ఘర్షణకూ కారణమైంది.

ఢీల్లీ జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు సోనమ్ వాంగ్ చుక్ ఇప్పుడు ప్రధాన ముఖచిత్రంగా మారాడు. 2026 నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో నిరవధిక నిరహారదీక్షకు కూర్చున్నాడు. గురువారం నాటికి ఈ వాంగ్ చుక్ దీక్ష 19 రోజులకు చేరుకుంది. చాలామంది ప్రముఖులు కూడా ఆయన్ను దీక్ష విరమించమని కోరుతున్నారు. కానీ, కేంద్రం నుంచిగానీ.. తన మూడేళ్ల క్రింది స్నేహితుడైన ధర్మేంద్ర ప్రధాన్ నుంచిగానీ స్పందన మాత్రమ కనిపించడం లేదు.

2023 భేటీ విశేషాలేంటి..?

విద్యారంగంలో వినూత్న ఆలోచనలు, సుస్థిరాభివృద్ధి కోసం చేసిన కృషితో గుర్తింపు పొందిన సోనమ్ వాంగ్ చుక్ ను 2023, మార్చ్ లో ధర్మేంద్ర ప్రధాన్ కలిశారు. సమావేశం తర్వాత వాంగ్ చుక్ తో పాటు, ఆయన భార్య, సామాజిక, పారిశ్రామికవేత్తైన గీతాంజలి జే ఆంగ్మోతో కలిసి దిగిన ఫోటోనూ Xలో షేర్ చేసుకున్నారు. స్ఫూర్తిదాయకమైన ఆలోచన మార్పిడిగా అభివర్ణించారు.

అనుభవాధారిత విద్య, ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న వారి ఆలోచనలు ఎంతో ప్రేరణనిచ్చాయనని పేర్కొన్నారు ధర్మేంద్ర ప్రధాన్. దానికి ప్రతిస్పందనగా.. వాంగ్ చుక్ కూడా ప్రభుత్వ విద్యా సంస్కరణలపై విశ్వాసం వ్యక్తం చేశాడు. విద్యలో మీరు చూపుతున్న సానుకూల దృక్పథానికి ధన్యవాదాలంటూ ధర్మేంద్ర ప్రధాన్ కు రిప్లై ఇచ్చారు. జాతీయ విద్యావిధానాన్ని క్షేత్రస్థాయికి తీసుకువచ్చే సంకల్పం ఇంకా బలపడిందని మెచ్చుకున్నారు. ఎక్స్ లో పోస్ట్ చేశారు.

అలా మూడేళ్ల క్రితం జాతీయ విద్యావిధానం ద్వారా భారత విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు తేవచ్చన్నది ఇద్దరి ఏకాభిప్రాయంగా కనిపించింది.

పరస్పర సహకారం నుంచి ఘర్షణ వరకు!

2026 నీట్ – యూజీ పరీక్ష, సీబీఎస్ఈ ఆన్లైన్ మార్కింగ్ వివాదాల తర్వాత వాంగ్ చుక్, ప్రధాన్ మధ్య సంబంధాలు పూర్తిగా మారిపోయాయి.

22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరైన నీట్ పేపర్ లీకేజీతో మే 12న పరీక్షను రద్దు చేసి.. జూన్ 21న దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్ష నిర్వహించారు. ఆ మధ్యకాలంలో సుమారు 11 నుంచి 14 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం దేశంలో దుమారం రేపింది. విద్యావ్యవస్థ, ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శల జడివాన మొదలైంది.

అలాంటి సమయంలో నిరుద్యోగితపై విచారణ నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన.. నిరుద్యోగ యువత పరాన్నజీవులు, బొద్దింకల్లా ఉన్నారన్న వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు తెరలేపాయి. ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చినప్పటికీ.. అప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఓ వెటకారపు నిరసనోద్యమం ఆరంభమైంది.

సోషల్ మీడియా వేదికగా సీజేపీకి వచ్చిన అనూహ్య స్పందనతో కొద్దిరోజులు తిరక్కుండానే మాస్కులు ధరించిన వందలాది మంది యువత ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఆందోళన చేపట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్ ను తెరపైకి తెచ్చింది.

జూన్ ఆరో తేదీన జరిగిన తొలి సీజేపీ నిరసనలో పాల్గొన్న సోనమ్ వాంగ్ చుక్ విద్యాశాఖామంత్రి రాజీనామా చేసే వరకూ కూడా నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ఆనాడే ప్రకటించారు. అన్నట్టే జూన్ ఎండింగ్ లో నిరహార దీక్షకు కూర్చున్న వాంగ్ చుక్ నిరశన దీక్ష నేటికి 19 రోజులైపోతోంది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది.

ప్రస్తుతం 59 ఏళ్ల వాంగ్ చుక్ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి ప్రధాన ముఖచిత్రమయ్యాడు. తన నిరాహార దీక్షతో దేశవ్యాప్తంగా భిన్నరకాల చర్చల్లో పాత్రధారుడయ్యాడు. తన నిరహార దీక్ష వల్లే మంత్రి రాజీనామా చేయకపోవచ్చు.. ప్రభుత్వం స్పందించకపోవచ్చు.. కానీ, ప్రజల్లో చైతన్యం వస్తే మన లక్ష్యం నెరవేరినట్టేనంటున్నాడు వాంగ్ చుక్.

అలాగే, ఒక్క మంత్రి రాజీనామాతో ఏదో జరిగిపోదని.. భారత ప్రజ మేల్కొన్న రోజే ప్రభుత్వంలోని ప్రతీ శాఖలో మార్పు కనిపిస్తుందంటూ ఆయన మరో కీలక వ్యాఖ్య చేశారు.

2023లో జాతీయ విద్యావిధానం విజయవంతం చేసేందుకు కలిసి పనిచేద్దామని ఒప్పందం కుదుర్చుకున్న ధర్మేంద్ర ప్రధాన్, సోనమ్ వాంగ్ చుక్.. 2026 వచ్చేసరికి పూర్తిగా భిన్నదారుల్లో ప్రత్యర్థులుగా మారిపోయారు. ఒకరు ఎన్ఈపీ అమలులో కీలక బాధ్యుడి హోదాలో ఉంటే.. మరొకరు విద్యావ్యవస్థలో జవాబుదారీతనం కోసం పోరాటం చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles