Ramaakanth.. ✍️
……………………………………………………………………………………………………..

తిరుమలంటే ఆ ఇరుకు వీధులే గుర్తొస్తాయి!
కరోనా ఫస్ట్ వేవ్ ముగిసిన తరువాత 2021 జనవరిలో అనుకుంటా … మిత్రులందరితో కలిసి తిరుపతికి వెళ్లా. అద్భుతం… మేముంటున్న రూములన్నింటినీ మేఘాలు తాకుతూ ఆహ్లాదాన్ని పంచాయి. ఆ వాతావరణంలో కరోనాను జయించినట్టు చల్లని ఆ గాలిని గుండెల నిండా పీల్చుకుని చిన్నపిల్లల్లా పదే పదే మేఘాల గురించే చర్చించుకున్నాం.. ఆ రాత్రి మేఘాలు మోసుకొచ్చిన మంచు అలా మా రూములపైనే వర్షించాయి. అలా తాకుతూ వెళ్లిపోయిన ఆ మేఘాలను చీల్చుకుంటూ నాకు కొన్ని వీధులు కనిపించాయి. అవి చాలా ఇరుకు సందులు. చాలా ఇరుకైనవి.. అచ్చం మురికివాడలకు ఏమాత్రం తక్కువ కాదు.

ఆ ముందురోజు రాత్రి పైన ఫ్యాన్ గాలి శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నా.. సాధారణమైన చలి మరింత వణుకు తెప్పిస్తున్నా.. రోజంతా తిరిగిన అలసట, ఫ్రెండ్స్ తో గడిపిన ఉత్సాహం నిద్ర తీసుకొచ్చింది..
రూమ్ కాస్త దిగువగా ఉంది.. బాగా ఎత్తుగా ఉండే కొండ ఎగువ దిగువలు ఎక్కి దిగి ఆ వెదర్ ని కాస్త ఎంజాయ్ చేశాం.. తిరుమలలో అలా ఇరుకుగా ఉన్న వీధుల గొడవేమిటో తెలుసుకుందామని మనసు పీకుతూనే ఉంది. శ్రీవారి దర్శనం చేసుకున్న తరువాత అక్కడ చూడాల్సినవి ఏముంటాయో తెలుసుకుందామని ఓ చోట ఆగాం.
భక్తులకు తిరుమల విశేషాలు చూపించడానికి రెడీగా ఉన్నారు నలుగైదుగురు డ్రైవర్లు. మాటల్లో పెట్టి మురికివాడలు తలపిస్తున్న ఆ వీధుల సంగతి అడిగా.. అది ఊరని, కాలక్రమేణా ఇది దేవుడి ఊరుగా మారిందని… అందరూ తరతరాల నుంచి అక్కడే ఉంటారని చెప్పాడు. కాస్త ఆశ్చర్యంగా అనిపించింది.. ఎవరుంటారన్నా.. అమాయకంగా చూసి ఈ ఊరివాళ్లే అన్నాడు.. మరి చనిపోతే వీళ్ల దహన సంస్కారాలు ఎక్కడ చేస్తారని అడిగా… ఇక్కడే అన్నాడు.. అర్థమైంది.. మరింత లోతుల్లోకి వెళ్లలేదు… అప్పటికే ఆరేడు సార్లు తిరుమల తిరిగాను.. ఎప్పుడూ కనిపించని ఆ చోటు ఆరోజు కంటపడింది.
ఆ ఊరి పేరు తిరుమల.. దేవుడు ఆ ఊరిని ఆక్రమించాడు.. అపవిత్రమని కాళ్లకు చెప్పులు కూడా తొడుక్కోకుండా ఎక్కడి నుంచో వచ్చిన భక్తులందరూ ఆ వీధుల్లోనే తిరుగుతారు. ఏడు కొండలను పరమ పుణ్య క్షేత్రంగా మార్చిన పరిణామ క్రమం కంటే సుదూరమైన ఏ ఏడు కొండలు ఎక్కి, ఆ అడవిలో ఊరు నిర్మించుకున్న వాళ్ల తాతముత్తాతల శ్రమకు జోహార్లని మనసులోనే అనుకున్నా. !
మళ్ళీ దేవుడున్నాడని అక్కడ ఊరు తయారైందా… లేకపోతే అన్నన్ని తరాలుగా ఇంత ఎత్తులోకి వచ్చి ఊరు కట్టుకొంటారా ..? మరో సందేహం వెంటాడింది! గతంలో ఊరు పెద్దది.. గుడి చిన్నది. ఇప్పుడు గుడి పెద్దదై ఊరు ఇరుకైందని మాత్రం అర్థమైంది.!
తిరిగొస్తున్నప్పుడు నా కోటా లడ్డూలు ఇవ్వకుండా మా మిత్రులు కొట్టుకుంటున్నారు.. నేనే తక్కువ తీసుకుంటా అని నాతో పాటే వచ్చిన ఓ ముస్లిం మిత్రుడికి ఉన్న లడ్డూలు సమానంగా పంచాను. పెద్ద ఎమోషన్ లేదు.. స్వామివారి ప్రసాదం మాములుగానే ఉంది.. నాకున్న దిగులల్లా ఆ స్వామి ఆ ఊరిని ఇరుకైన వీధులుగా మార్చకపోతే ఎంత బావుండేదో అనే!
తిరుమలలో, తిరుపతిలో ఉండే ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసనే అనుకుంటున్నా.. ఆ ఊరు దేవుడి పేరు మీద కుచించుకుపోయిందని. మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఆ ఊరి వాళ్ళని మరో చోటికి తరలించారు. వెళ్ళలేనివాళ్ళు అలా ఆ వీధుల్లో నివాసముంటున్నారు. దాదాపు వెయ్యి ఓట్లు ఉన్నాయని తెలిసింది.
ఇక తిరుమల లడ్డూ తయారీలో బూందీ , ఇతర ఇంగ్రీడియెంట్స్ మిక్సింగ్ మేన్ మేడ్ కాదు. మెషీన్ మేడ్! తరువాత దశలో చేత్తో కలిపితే లడ్డూ తయారవుతుంది. అంతకుముందు దర్శనం టికెట్ మీద రెండు ఇచ్చేవాళ్లు. దానికే బ్లాకులు, వైటుల్లో అమ్మేవాళ్లు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లడ్డూ ప్రొడక్షన్ పెంచారు. దర్శనం, టికెట్ లేకుండానే ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఆ వెసులుబాటు కల్పించారు. అందుకే అప్పుడెప్పుడో ఉన్న రుచి ప్రొడక్షన్ పెంచిన తరువాత తగ్గిందనేది వాదన. ఇక రోజుకో లక్ష ఖర్చు పెట్టి ఆవు నెయ్యి తెప్పించి స్వామి వారి నైవేద్యం కోసం చేసే లడ్డూలు మాత్రం వీవీఐపీలకే దక్కుతాయనుకుంటా! ఆ రుచి సామాన్యమైన జనానికి ఎక్కడ దొరుకుతుంది?
టీవీ ఛానల్స్ లో కనిపించే వీవీఐపీలందరూ రుచి గురించి మాట్లాడరు. మనలాగా యాభై రూపాయల లడ్డూల కోటా కాదది! లక్ష రూపాయల కోటా వాళ్ళవి! కోట్లాటలు పెడతారంతే! అగ్గి రాజేసి చలి కాచుకుంటారంతే! ఇప్పుడు తిరుపతి లడ్డూకి నెయ్యి, జీడిపప్పు కంటే రాజకీయ రంగు, రుచి, వాసనను ఎక్కువ కలిపేశారు. భక్తుల మనోభావాలు మట్టిగడ్డలు చేసి మరీ చెలరేగుతున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో తిరుమలలో మేఘాలు చీల్చుకుని కనిపించిన ఆ ఇరుకు వీధులే ఎక్కువ గుర్తొస్తున్నాయెందుకో నాకు. అన్నింటికంటే విషాదం ఏంటంటే మాతోపాటు తిరుమలకు వచ్చిన మిత్రుడు ఆ తరువాత ఏడాదికి అనారోగ్యంతో అందరినీ విడిచి వెళ్లిపోయాడు. ఆ రెండు రోజులు మాకంటే ఎక్కువ యాక్టివ్ గా కనిపించాడు. అందుకేనేమో దాదాపు నాలుగేళ్లయినా మళ్ళీ ఆ కొండపైకి అంత ఆసక్తిగా వెళ్ళాలనిపించట్లా!


