75 ఏళ్ల పదవీ విరమణ వయస్సనేది అద్వానీకి వర్తించినప్పుడు… మోడీకెందుకు వర్తించదు…? ఇదీ ఇప్పుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి… లిక్కర్ కేసులో ఆరోపణలతో అరెస్టై… ఈమధ్యే తీహార్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్న..? అయితే.. ఈ ప్రశ్న ఆయన ఎవరికి వేశారు…? నేరుగా ఆర్ఎస్ఎస్ ను ఇరుకునపెట్టారు. ఇప్పటికే మోడీపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పరోక్షంగా కొన్ని స్వీపింగ్ కామెంట్స్ చేస్తున్న తరుణంలో… కేజ్రీవాల్ వేసిన ప్రశ్నకు ఆర్ఎస్ఎస్ సమాధానమేంటన్నది ఇప్పుడు సర్వత్రా రాజకీయాల్లో కనిపిస్తున్న ఒకింత ఆసక్తి.
అంతేకాదు.. మరో నాల్గు ప్రశ్నల్ని కూడా కేజ్రీవాల్ మోహన్ భగవత్ ముందుంచారు..? మరి వాటికి ఆర్ఎస్సెస్ నుంచి కేజ్రీవాల్ ఊహించిన స్థాయిలో సమాధానాలు వస్తాయా.. లేక, బీజేపీ పెద్దలే ఇన్వాల్వై కేజ్రీకి క్రేజీ ఆన్సర్స్ ఇస్తారా… అసలు కేజ్రీవాల్ వేసిన ప్రశ్నలతో చర్చ మరింత ముందుకెళ్తుందా.. లేక, పక్కదారి పట్టే రాజకీయాలు జరుగుతాయా అన్నవీ ఇప్పుడు మరింత ఆసక్తికరమే.

తనను అవినీతిపరుడని నిరూపించేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారన్న ప్రధాన ఆరోపణతో… ఆయన తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. అదే సమయంలో మోహన్ భగవత్ భుజంపై తుపాకీ ఎక్కుపెట్టి మోడీని.. మోడీ భుజంపై ఎక్కుపెట్టి అటు మోహన్ భగవత్ ని ఇలా ఏకకాలంలో ఇద్దరి మధ్య ఇప్పటికే ఉన్న అగ్గికి మరింత ఆజ్యం పోసి.. తానేమంత తక్కువ పొలిటీషియన్ ను కాదనే సంకేతమిచ్చాడు.
ఢిల్లీలో గత పదేళ్లుగా ప్రభుత్వాన్ని నిజాయితీగా నడుపుతున్నామన్న కేజ్రీవాల్.. ఉచిత కరెంట్, మంచినీళ్లు, నాణ్యమైన విద్యా, వైద్యమందిస్తూ ఢిల్లీని నంబర్ వన్ స్థాయిలో నిలబెట్టామన్నారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో తమపై గెలవాలంటే… తమపై బురద జల్లాలి.. తాము అవినీతిపరులమని నమ్మించాలి… అందుకు, వ్యూహాత్మకంగా ఒక కుట్ర పన్నాలి.. కేంద్ర నిఘా వ్యవస్థలనుపయోగించుకుని దాడి చేయాలి.. ఇదీ మోడీ ప్లాన్ అన్నది కేజ్రీవాల్ మాటల సారాంశం. ఆ విధంగానే ముందు సిసోడియా, ఆ తర్వాత ఇప్పుడు నన్ను ఇలా ఆప్ నాయకులందరినీ ప్రతినాయకులుగా చిత్రించే ఓ గుడుపుఠాణీకి తెరలేపారంటూ ఢిల్లీలో జరిగిన జనతాకీ అదాలత్ బహిరంగసభలో విరుచుకుపడ్డాడు కేజ్రీ.
మరికొద్ది రోజుల్లోనే తాను ముఖ్యమంత్రి బంగ్లా విడిచి వెళ్లిపోతానన్నారు. తాను అవినీతిపరుణ్నైతే.. పదేళ్ల తన ముఖ్యమంత్రి పదవీకాలంలో కనీసం తనకు ఓ ఇల్లు కూడా ఎందుకు లేదన్నారు..? అయితే, అందుకు భిన్నంగా.. పదేళ్లలో అంతకుమించిన ప్రజాభిమానం తాను సాధించానన్న కేజ్రీవాల్.. ఇల్లు లేని తనకు చాలామంది తమ ఇంట్లో ఉండమని కోరుతున్నారన్నారు. దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కాగానే… చీఫ్ మినిస్టర్ బంగ్లా వదిలి.. అభిమానంగా, ఆప్యాయంగా నన్ను వాళ్ల ఇండ్లల్లో ఉండాలని కోరతున్నవారింట్లో ఎక్కడో ఒకచోట వచ్చి ఉంటాననీ ఆయన చెప్పుకొచ్చారు.
ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్… తీహార్ నుంచి బయటకు వచ్చాక.. గత మంగళవారం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఫిబ్రవరి 2025లో జరగనున్న ఎన్నికల వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో బహిరంగసభలో మాట్లాడిన కేజ్రీవాల్… లిక్కర్ కేసు మరో పదేళ్లపాటు కొనసాగవచ్చని న్యాయవాదులు తనతో చెప్పినట్టుగా కూడా బహిరంగసభలో బహిరంగపర్చారు.
మోడీ పరివార్ తనపై వేసిన మచ్చతో తాను బతకలేనన్నారు కేజ్రీవాల్. అందుకే తాను ప్రజాకోర్టులోనే తేల్చుకుంటానన్నారు. తాను నిజాయితీ లేనివాడినైతే.. ఉచిత కరెంటు కోసం మూడు వేల కోట్లు ఎందుకు కేటాయించేవాణ్నని ప్రశ్నించారు. మహిళలకు ఇంటి అద్దె లేకుండా ప్రభుత్వమే భరించే స్కీమ్ ను ఎందుకు తీసుకొచ్చేవాడినని నిలదీశారు. పిల్లల నాణ్యమైన విద్య కోసం పాఠశాలలను అత్యాధునికంగా ఎందుకు నిర్మించేవాడినన్నారు..? బీజేపీ పాలనలో దేశంలోని 22 రాష్ట్రాల్లో మరి వాళ్లు పిల్లలకు పాఠశాలలెందుకు నిర్మించలేదు.. ఎక్కడా ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదు.. ఒంటరిగా ఉన్న మహిళలకు అద్దెను ప్రభుత్వమే చెల్లించే స్కీమ్ ఎందుకు తేలేదని అడిగారు…? మరిప్పుడు దొంగ ఎవరో చెప్పాలంటూ ఘాటుగా స్పందించారు. మరి ఇన్ని చేసిన కేజ్రీవాల్ దొంగనా… లేని ఆరోపణలు గుప్పించి.. అవినీతిపరుడిగా ముద్రవేసి కుట్రకు తెర తీసినవారు దొంగా…? అసలు జైలుకు వెళ్లాల్సినవారెవరంటూ ఆయన వరుస ప్రశ్నలతో సాగింది ఢిల్లీ పబ్లిక్ మీటింగ్.
ఈ ప్రశ్నలన్నీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కోట్ చేస్తూ కేజ్రీవాల్ ఎక్కుపెట్టగా… ఈడీని, సీబీఐని ఉపయోగించుకుని బెదిరించడం, ప్రలోభపెట్టడం, దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం ఇవి నైతికమైనవా… వీటిని కొడుకులాంటి బీజేపీకి తల్లిలాంటి మాతృసంస్థైన ఆర్ఎస్ఎస్ నేర్పిస్తుందా…? అంటూ ఆయన ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేశారు.
అవినీతిపరులైన నాయకులెందరినో బీజేపీలో చేర్చుకున్న మోడీనే అతి పెద్ద అవినీతిపరుడన్న కేజ్రీవాల్.. ఆర్ఎస్ఎస్ మూలాలతో పుట్టిన బీజేపీ పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు సంఘ్ పరివార్ పైనే ఉందని హితవు పలికారు. మోడీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే.. ఆర్ఎస్ఎస్ కనీసమెప్పుడైనా అడ్డు తగిలిందా.. ఆయన్ను ప్రశ్నించిందా అంటూ మోహన్ భగవత్ పై ప్రశ్నలు గుప్పించారు. అంతేకాదు, గత లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా చేసిన కామెంట్స్ ను ఓసారి గుర్తు చేశారు. ఇకపై బీజేపీకీ, ఆర్ఎస్ఎస్ తో ఎలాంటి అవసరం లేదన్న వ్యాఖ్యల్నీ కోట్ చేస్తూ… ఆర్ఎస్ఎస్ పట్ల మోడీ నేతృత్వంలోని బీజేపీ వైఖరిని ఆర్ఎస్ఎస్ ఫోకస్ లోకి తీసుకెళ్లే యత్నం చేశారు. తల్లిలాంటి మాతృసంస్థపై… కొడుకులాంటి పార్టీ అంతమాటంటే… మోహన్ భగవత్ కు బాధనిపించకపోవడం తనను ఆశ్చర్యపర్చిందన్నాడు కేజ్రీవాల్. మొత్తంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య ఉన్న దూరాన్ని పట్టి చూపే యత్నం చేశారు.
75 ఏళ్లనంతరం ఎంతటి నాయకుడైనా పదవీ విరమణ చేయాలన్న ఆర్ఎస్ఎస్ నిబంధనేమైందన్నది… కేజ్రీవాల్ ప్రసంగంలో నొక్కివక్కాణించిన మాట. ఎల్. కే. అద్వానీ వంటివారికి ఆ నియమం వర్తించినప్పుడు… మోడీకెందుకు వర్తించదన్నది ఆయన ప్రశ్న..? అంతేకాదు.. ఆ నిబంధన మోడీకి వర్తించదంటూ అమిత్ షా మాట్లాడటాన్నీ కోట్ చేసిన కేజ్రీవాల్.. అద్వానీకో రూల్… మోడీకో రూల్ ఎందుకని ప్రశ్నిస్తూ.. ఆర్ఎస్ఎస్ కూ, బీజేపీకి ఈమధ్య ఏర్పడిన గ్యాప్ ను ఆసరా చేసుకుని వారి బంధాన్నే ఓ చర్చకు పెట్టాడు. మొత్తంగా ఓ పవర్ ఫుల్ స్పీచ్ ద్వారా ఆర్ఎస్ఎస్ లో ఒక చలనం తేవాలన్న తపన.. ఢిల్లీ సభలో కేజ్రీవాల్ లో స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో ఇప్పటికే చెరో దారి అన్నట్టుగా తయారై.. పరోక్ష వ్యాఖ్యలు చేసుకుంటున్న ఆర్ఎస్ఎస్, బీజేపీల మధ్య కేజ్రీవాల్ మరింత అగ్గిరాజే ప్రయత్నమైతే చేశాడు. మరి దాన్ని ఆర్ఎస్ఎస్ సీరియస్ గా తీసుకుంటుందా… బీజేపీ ఏం కౌంటర్ ఇస్తుంది… ఇదంతా ఒకవైపు జరుగుతున్నా తన ప్రసంగంతో మరోసారి చర్చకు పెట్టాలనుకున్న కేజ్రీవాల్ ఆలోచనకు పర్యవసానాలెలా ఉంటాయన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్!
అయితే, కేజ్రీవాల్ ప్రశ్నలకు ఇప్పుడిప్పుడే బీజేపీ స్పందిస్తున్నా.. అంత షార్ప్ గా, ప్రశ్నకు బదులైన ఆన్సర్సైతే కనిపించడం లేదు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేజ్రీవాల్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కేజ్రీవాల్ అడిగిన ప్రశ్నలకు కాకుండా.. జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రస్తావన తెస్తూ కేజ్రీని కార్నర్ చేసే ప్రయత్నం మాత్రమే కిషన్ రెడ్డి మాటల్లో కనిపించింది.



