నల్లమల్ల దత్తపుత్రుడు జాజి!

ఓరోజు పట్టపగలే చీకటి ఆవరించినంత గుబులుగా ఉన్న అడవిలో… ఒకింత ఆకలనిపించి.. చెట్టుపైనున్న ఓ పుల్లటికాయ కోసుకుని తింటున్నాడు జాజి. ఆ పుల్లటి పండు తింటుంటే.. నోరూరుతుండటంతో ఒకింత తనను తాను మైమర్చిపోయాడు. కింద నుంచి ఓ కాలసర్పం సరిగ్గా జాజి దగ్గరకే వస్తుంది. జాజి చూపు పండును తింటూ.. పైనున్న చెట్టుపైనే ఉంది. ఇంకాసేపట్లో ఆ కాలత్రాచు కాటేస్తే… ఆ అడవిలో బచావో అన్నా వినిపించే వారు లేక.. జాజి విగతజీవే అయ్యేవాడు.

కానీ, అంతలోకే ఓ పిట్ట వచ్చి జాజి తలపై కాస్త గట్టిగా కొట్టుకుంటూ వెళ్లిపోయింది. అంత వేగంగా పిట్ట వచ్చి కొట్టడం.. తన చేతుల్లో ఉన్న కాయ కిందపడేంత గట్టిగా తాకడంతో.. జాజి వెంటనే అలర్ట్ అయ్యాడు. ఒక్కసారిగా అక్కడి నుంచి కాస్త పక్కకు జరిగిపోయాడు. జాజి ఉన్న ప్రదేశంలోంచే కాలనాగు సరసరమంటూ వెళ్లిపోయింది. జాజి బతికి బట్ట కట్టాడు. ఆ నిమిషాల వ్యవధిలో జాజి మనస్సులో ఎప్పుడూ లేనిది ఓ పిట్ట వచ్చి కాయ కోసం కొట్టిందా.. లేక, ఇంకేమై ఉంటుందన్న ఆలోచనలు సుడిగుండాలై తిరుగుతున్నాయి. ఒక్కసారిగా కిందకేసి చూసిన తన మెదడుకు అర్థమైంది… ఆ పిట్ట తనను కాపాడిందని.

అందుకే జాజికి అడవంటే మమకారం. ఒక్కమాటలో చెప్పాలంటే అరణ్యమే… ఇప్పుడు జాజికి అమ్మ. ఇది నల్లమల్ల దత్తపుత్రుడిగా బాగా ఎదిగాక జాజి అనుభవంలోకి వచ్చిన ఓ కథ. ఇలాంటి కథలు.. జాజి అడవి బాట పట్టిన్నాట్నుంచి కొల్లలు.

ఓరోజు జాజి తన పదకొండేళ్ల వయస్సులో అడవి నుంచి వస్తుండగా… మెడిసిన్ బాటిల్స్ పగిలిపోయిన సీసా ముక్కల్లో.. వర్షపు నీరు చేరుకుంటే… ఆ నీటిని ఓ పక్షి తాగుతోంది. అదేం మందు సీసా అయ్యుంటుందో… ఆ బాటిల్ సీసా ముక్కల్లో మిగిలిన నీరు అప్పటికే ఎంత వ్యర్థమై, విషపూరితమై ఉంటాయో… ఇలాంటి నీటినా పక్షులు తాగుతుంది అయ్యో అనుకున్నాడు. అప్పటి నుంచీ పక్షులకు నీటి కొరకు నల్లమల్ల అడవుల్లో తానెక్కడికెళ్లితే అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు.. మరోవైపు నల్లమల్లంతా జల్లెడ పడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలు, బాటిల్స్, పాలిథీన్స్ కనిపించకుండా ఏరివేస్తున్నాడు. జాజి అడవికి చేస్తున్న సేవకు ఇప్పుడు ఒక గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ని అటవీ పరిరక్షణ సలహాదారుగా నియమించడం.. చిత్తశుద్ధి ఉంటే అధికారం అడవులనూ వెతుక్కుంటూ వస్తుందనడానికి జాజి ఓ ఉదాహరణ. అందుకే, ఓసారి జాజి కథ చదివే యుండి.

ఇంతకీ జాజి ఎవరు..?

43 ఏళ్ల కొమెర అంకారావుది పల్నాడు జిల్లా కారంపూడి. అంతా ముద్దుగా జాజి అని పిల్చుకుంటుంటారు. చిన్ననాటి నుంచే ఆ పేరు స్థిరపడింది.

బాల్యం నుంచీ జాజి బతుకుచిత్రం బ్లాక్ అండ్ వైటే . పెద్దగా లౌక్యం కూడా తెలియదు. తను బతుకుతాడో, లేదో తనకే కాదు.. తన కుటుంబీకులకు కూడా తెలియని ప్రత్యేక పరిస్థితుల్లో పెరిగిన గిరిజన బిడ్డడు కొమెర జాజి. కానీ, ఆ తర్వాత ఎస్సెస్సీ వరకు తెనాలిలో చదివిన జాజి.. దూరవిద్య ద్వారా పీజీ కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు హరిత విప్లవకారుడై.. తన నలుపు, తెలుపు రంగుల జీవితం తననేమాత్రం మానసికంగా వేధించకుండా.. అడవిని హరితవర్ణం చేస్తూ.. ఆ రంగుల్లో తనను తాను మర్చిపోతున్నాడు.. ఈ అరణ్యంలోనే మురిసిపోతున్నాడు.

ఎెందుకు జాజి గురించి ఈ కథ..?

సమాజంలో బాగా చదువుకుని.. తాను కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్న మనుషులు సంచరిస్తున్న రోజుల్లో… తమ విలాసాలు, అవసరాలు, వినోదాల కోసం అడవులను చర పడుతున్న సమయంలో.. కొండలను పిండి చేస్తున్న కాలాన.. చెట్లను నరికేస్తున్న తరుణంలో… జాజి నల్లమల్లను కాపాడే ఓ దత్తపుత్రుడయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నల్లమల్ల విస్తరించి ఉన్న ఆరు జిల్లాల పరిధిలోని అటవీశాఖాధికారులెవ్వరూ చేయలేని పని.. ఒక్క జాజే.. అవును ఒక్క జాజి మాత్రమే చేస్తున్నాడు కాబట్టే.. ఈ జాజి కథ.

కాకమ్మ కట్లగూడు, పిచ్చుకమ్మకు పరుకల గూడు వంటి తన తల్లిదండ్రులు చెప్పిన కథలు.. జాజిని సరిగ్గా పదేళ్ల ప్రాయంలోనే అడవి బాట పట్టించాయి.

అలా 3 దశాబ్దాలకు పైగానే జాజి అడవిని కాపాడుతున్నాడు. బాగా చదువుకుని.. విహారయాత్రలకొస్తూ.. అడవుల్లో నానాయాగీ చేస్తూ.. ఎక్కడ పడితే అక్కడ పాలిథీన్ కవర్స్, ప్లాస్టిక్, థమ్సప్, బీర్ బాటిల్స్ పడేస్తూ… నాగరికులమంటూ అనాగిరక చేష్ఠలకు పాల్పడేవారి నుంచి అరణ్యాన్ని రక్షిస్తున్నాడు. చూడటానికి చిరిగిన చొక్కా, రబ్బర్ చెప్పుల కాళ్లతో.. ఓ బహుదూరపు బాటసారై.. అనాగరికుడిలా కనిపించినా… నల్లమల్లను కాపాడేందుకు అడవినే నమ్ముకుని తిరుగుతున్న సిసలైన నాగరికుడు జాజి.

తన పేరు లాగే… తను నల్లమల్లకు చేస్తున్న సేవ ఆరు జిల్లాల పరిధిలో గుబాళిస్తోంది. అడవి కోసమే రిక్రూట్ చేయబడ్డ అటవీశాఖ అధికారులనే సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. జాజికి నల్లమల్ల అవసరం లేదు… కానీ, ఇప్పుడు జాజి అవసరం మాత్రం నల్లమల్లకుందంటేనే జాజి ఎంతగా తన జీవితాన్ని ఆ అడవి తల్లికి ధారపోశాడో చెప్పవచ్చు.

జాజి అడవిబిడ్డడై ఎందుకు తిరుగుతున్నట్టు..?

జాజికి చిన్ననాట్నుంచే అనారోగ్యం పీడించేది. ఎంతకాలం బతుకుతాడో కూడా తెలియని రోగం వెంటాడింది. తల్లిదండ్రుల బీదలపాట్లతో స్థానిక డాక్టర్లకు చూపిస్తే.. చాలా సున్నితంగా పెంచాలని చెప్పారు. ఏ అర్ధరాత్రో లేచి బాగా ఏడ్చేవాడు. అలాంటి బిడ్డణ్ని ఎక్కడికీ పంపకుండా అడవి కథలు చెబుతూ పెంచారు తల్లి ఏడుకొండలు, తండ్రి రాములు.

పదో తరగతి వరకూ తెనాలిలో బంధువుల ఇంట్లో చదివిన జాజి.. పదిహేనేళ్లు వచ్చేసరికి బతకుదెరువుకై బయల్దేరి అడవి బాట పట్టాడు. ఉపాధి కోసం.. అడవికెళ్లి తల్లిదండ్రులు చెప్పిన పనులు చేసుకొచ్చేవాడు. అలా అడవిపై మమకారం.. దాంతోపాటే అనుబంధమూ పెరిగిపోయింది. అదే సమయంలో.. తన కళ్లముందే మూడు దశాబ్దాల కాలంలో నల్లమల్ల వంటి దట్టమైన అటవీ ప్రాంతం స్మగ్లర్స్, దోపిడీదారులు, విహారయాత్రల పేరిట అడవులను చెరపట్టేవారెందరితోనో.. కన్నీరు పెడుతోంది. తల్లి నల్లమల్ల దృశ్యాలు జాజిని కదిలించాయి. అలాగే, నానాటికీ అరణ్యం అంతరించిపోతూ.. ఎడారి వాతావరణం దర్శనమిస్తుండటంతో చూడలేకపోయాడు. దాంతో తన కింకర్తవ్యమేంటో తనకు తానే.. ఓ పార్థుడై.. తనకు తానే ఓ కృష్ణుడై.. తనకు తానే ఓ గీతాబోధన చేసుకున్నాడు. అలా అడవంతా కలియదిరగడం మొదలెట్టాడు.

ఎక్కడ బాటిల్స్, ప్లాస్టిక్ వ్యర్థాలు, బయో మెడికల్ వేస్టేజెస్, పాలిథీన్ కవర్స్ ఉన్నా వాటన్నింటినీ గోతాల్లో ఎత్తి.. అడవికి దూరంగా… లోయల్లో పడేస్తాడు. ఎందుకంటే.. అడవంటే అందరిదీ. అందరిదీ అంటే కేవలం మనుషులే కాదు.. జీవమున్న మొక్కలు, పశుపక్షాదులు, వన్యప్రాణులు.. ఇలా సాగుతుంది జాజి ఫిలాసఫీ. అందుకే, వాటన్నింటినీ కాపాడేందుకు కంకణం కట్టుకున్నాడు.

అంతేనా..? ప్రతీ వానా కాలంలో సీడ్ బాల్స్ చల్లి.. నల్లమల్ల అటవీ విస్తీర్ణాన్ని విస్తారంగా పెంచుతున్న ఎకో ఫ్రెండ్లీ మ్యాన్ జాజి!

గత జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ జాజి కోటి విత్తనబంతులు చల్లే కార్యక్రమాన్ని చేపడితే.. అటవీ అధికారులే కాదు.. పల్నాడు జిల్లా కలెక్టర్ కూడా ఒక్కడివే ఇదంతా ఎలా చేస్తున్నావని ఆశ్చర్యపోయారు. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున పల్నాడు కలెక్టర్ లోతేటి శివశంకర్.. అక్కడి అటవీశాఖాధికారులు కలిసి.. ప్రశంసాపత్రంతో జాజిని సన్మానించి.. జాజివంటి వారి అవసరాన్ని ఆ స్వతంత్ర వేడుకల్లో కొనియాడారు. ప్రముఖ తెలుగు మీడియా సంస్థ సాక్షి కూడా జాజి సేవలకుగాను… సాక్షి ఎక్సలెన్స్ అవార్డును బహుకరించింది.

వేప, కానుగ వంటివాటితో.. నల్లమల్ల ప్రాంతంలో అధికంగా కనిపించే మొక్కలను విరివిగా పెంచేందుకు.. ప్రతీ ఏటా కోటి సీడ్ బాల్స్ చల్లే ఓ మిషన్ ఇంపాజిబుల్ వంటి టాస్కునే ముందరేసుకున్నాడు జాజి. అయినా.. ఆ మిషన్ ను పాజిబుల్ చేస్తూ అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు.

అసలు జాజి సీడ్ బాల్స్ ను ఎందుకు ఎంచుకున్నాడు..?

ముందు మొక్కలు తీసుకొచ్చి అంటుకట్టి పెట్టేవాడు జాజి. కానీ అంటుకట్టే పద్ధతి వల్ల ప్లాస్టిక్ కవర్స్ లో తీసుకొచ్చిన మొక్కలను నాటాక.. మళ్లీ ఆ ప్లాస్టిక్ ఎక్కడ వేయడమా అన్న ప్రశ్న ఉద్భవించింది. అలా పర్యావరణ పరంగా కూడా అడవికి తన వల్ల మేలు జరగాలే తప్ప.. లేనిపోని కొత్త కీడు శంకించొద్దన్న భావనతో విత్తనబంతులను వెదజల్లే పద్ధతిని ఎంచుకుని.. మళ్లీ నల్లమల్లకు పూర్వవైభవం తెచ్చేందుకు తెగ ఆరాటపడిపోతున్నాడు ఈ 43 ఏళ్ల కృషీవలుడు. ఇప్పటికే పది కోట్ల సీడ్ బాల్స్ నల్లమల్లంతా కలియతిరిగి వెదజల్లాడు. నలభై లక్షల మొక్కలు నల్లమల్లలో కేవలం జాజి వల్లే మొలకెత్తి.. ఇవాళ అటవీ సంపద పెరిగిందని ఏకంగా అటవీశాఖ అధికారులే కలెక్టర్ కు నివేదికనిచ్చారు. ఇప్పుడు వాటి ఫలితం ఏకంగా కోటి మొక్కలు మొల్చాయనేది వారి అంచనా. మొక్కలను తీసుకెళ్లడం కూడా కష్టమయ్యే దయనీయ స్థితిలో ఆటోవారిని అడుక్కుని అడవుల్లోకి తీసుకెళ్తుంటాడు. దగ్గర్లో ఉండే స్కూల్ పిల్లల సాయాన్ని వెదజల్లే ప్రక్రియలో తీసుకుంటుంటాడు.

జాజి సొంతూరు కారంపూడి నాగార్జున సాగర్ కుడికాలువను ఆనుకునే ఉంటుంది. మరోవైపు అంతా నల్లమల్ల అడవి. అలాంటి ప్రకృతి రమణీయత మధ్య మరింత ప్రకృతిసిద్ధంగా పెరిగిన వ్యక్తి జాజి. చిన్నప్పుడు తన ఆరేళ్ల వయస్సులో నల్లమల్లలోని కొండ ప్రాంతం.. పూర్తిగా గిరిజన తెగలు మాత్రమే కనిపించే దుర్గి మండలం గండిగర్ములకు వెళ్లిన జాజిని ఏదో విషపురుగు కుడితే… ఆసుపత్రికి వెళ్లాలంటే వీలయ్యే పరిస్థితి లేదు. ఓవైపు తాను అరుస్తున్నాడు. ఆ అడవిలో పేరున్న ఓ మూలికా ఔషధ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు తన తల్లిదండ్రులు. ఇంకేం, ఆ వైద్యుడు చెట్ల పసరుతో చేసిన వైద్యంతో.. వెంటనే తనకు తగ్గిపోయిందంటాడు జాజి. అందుకే నల్లమల్లలో ఔషధ మొక్కలేవి.. పనికిరాని మొక్కలేవి.. వేటివల్ల ఏ ఉపయోగముంటుందనే పలు అంశాలపై.. ఓ శాస్త్రవేత్తై అధ్యయమే సాగిస్తున్నాడు.

పాలబర్రంకి, తులసీ, పిప్పెంటాకు, అశ్వగంధ, అడవిరేగు వంటి ఎన్నో అంతరించిపోయే మొక్కలు, అరుదైన జాతులను కాపాడుతున్నాడు. నలమల్ల అటవీ విస్తీర్ణం పెంచడానికి ఇప్పటికే పదికోట్ల సీడ్ బాల్స్ వేసి ఓ రికార్డే సష్టించాడు. 1952 అటవీశాఖ తీర్మానం ప్రకారం 33.3 శాతం అటవీ విస్తీర్ణం ఉండాలన్న నిబంధనల ప్రకారం… అడవిని పెంచుదామనే ఒక మోటోనూ భుజానికెత్తుకుని కాలికి బలపం కట్టి తిరుగుతున్నాడు. కానీ, ప్రస్తుతం భారతదేశం మొత్తంలో 21 శాతం అడవులుంటే.. తెలుగు రాష్ట్రాల్లో వాటి సంఖ్య మరీ తక్కువగా 19 శాతానికి పడిపోయిందంటున్నాడు ఈ కొమెర అంకారావు. అందుకే అడవిని పెంచాలన్న సంకల్పంతో.. ఇప్పటికే గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న అరణ్యమంతా జల్లెడ పట్టేశాడు.

అటవీశాఖ అధికారుల సిఫార్స్ మేరకు కలెక్టర్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధిగా ఉంటుందని జాబ్ చేయమన్నారు. కానీ, ఉద్యోగం పేరుతో ఓ చట్రంలో ఇరుక్కుని.. తన లక్ష్యాన్ని దెబ్బ తీసుకోవద్దన్న ఉద్ధేశ్యంతో సున్నితంగా తిరస్కరించాడు జాజి. సుమారు లక్ష ఎకరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసాడు జాజి. నల్లమల్లలో తిరిగే జంతువులకు, పక్షులకు, ఇతర క్రిమీకీటకాలకే కాకుండా.. అప్పుడప్పుడూ సంచరించే అధికారులకు కూడా ఎక్కడో ఓ చోట జాజి కనిపిస్తూనే ఉంటాడు. జస్ట్ రబ్బర్ చెప్పులు… మాసిన బట్టలు.. ఇవే జాజిని గుర్తుపట్టడానికి కేరాఫ్ ఐడెంటిఫికేషన్స్.

జాజి అడవిపై ఎంత మమకారం పెంచుకున్నాడో.. అతను పెంచుకున్న మమకారం అధికారులనూ భావోద్వేగానికి గురిచేస్తోంది. జాజిని కాపాడుకోవాలని ఏకంగా రాష్ట్ర స్థాయి అధికారగణానికి కూడా నివేదికలిచ్చారంటే.. నల్లమల్ల విషయంలో జాజి ఎంత ప్రత్యేకమో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పన్లేదు.

నల్లని కొండల మధ్య ఉండటం వల్లే నల్లమల్లగా పేరొందిన ఈ అడవిలో నిర్మించుకున్న శ్రీశైలం, జూరాల, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులను కాపాడుకోవాలన్నా.. జీవవైవిధ్యాన్ని సంరక్షించుకోవాలన్నా… ఔషధ మొక్కలను పెంచాలన్నా.. వర్షాలు సమృద్ధిగా కురవాలన్నా… భూగర్భ జలాలు పెరగాలన్నా.. తాగు, సాగు నీరు సమృద్ధిగా లభించాలన్నా.. రాబోయే రోజుల్లో మంచి ఆక్సిజన్ పొందాలన్నా… కచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల గుండెకాయలా.. మన పాలిట అమెజాన్ లా అవతరించిన నల్లమల్లను కాపాడుకోవాలన్నదే పర్యావరణవేత్త జాజి లక్ష్యం.

క్రీస్తుపూర్వమే ఔషధ మొక్కల కోసం చైనా, బర్మా, మయన్మార్ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన ఎందరికో.. సిద్ధనాగార్జునుడు పాఠాలు బోధించిన చరిత్ర నల్లమల్లది. మెడికేటెడ్ ప్లాంట్స్ కు తోడు.. ఎన్నో చారిత్రక ప్రదేశాలు, పురాతన శిల్పసంపద, శాసనాలు, అరుదైన జీవజాతి కనిపించే నల్లమల్లకు పూర్వ వైభవం తెచ్చేందుకు నడుం బిగించాడు జాజి. మొత్తంగా తన సీడ్ బాల్స్ ప్రయోగాన్ని నల్లమల్లలోని అడవులు, లోయలు, కొండలు, గుట్టలు అన్ని చోట్లా వెదజల్లుతూ.. కాకులు దూరని కారడవిని.. చీమలు దూరని చిట్టడవిని మళ్లీ నల్లమల్లలో చూడాలన్నదే ఈ హరిత విప్లవకారుడి ఆశయం.

అందుకే, జాజి పేరు కూడా నల్లమల్లంత విస్తరిస్తోంది. చిన్నప్పుడు వానాకాలం చదువులకు పరిమితమైన జాజే.. ఇప్పుడు పాఠశాలల్లో పర్యావరణ పంతులయ్యాడు. విద్యార్థులకు అడవుల గురించి పాఠాలు చెబుతున్నాడు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పాఠశాలల్లో గెస్ట్ లెక్చరర్ గా వెళ్లి.. ఎన్విరాన్ మెంటల్ పాఠాలు చెప్పాడు ఈ పర్యావరణవేత్త. నల్లమల్ల ప్రాంతంలో మరో సోనమ్ వాంగ్ చుక్ జాజి. అంతేనా.. ? జాజి మనస్సెంత గొప్పదంటే…? ఇవాళ జానెడు జాగా వదులుకునేందుకు సిద్ధంగా లేని మానవ సమాజంలో… తన ఎకరం పొలంలో జొన్న, సజ్జ పంటను కేవలం పక్షుల కోసమే పండిస్తున్నాడంటే.. ఇంతకన్నా ప్రకృతి ప్రేమికుడెవరుంటారు..?

భార్యా, ఇద్దరు పిల్లలున్న జాజి.. అలియాస్ కొమెర అంకారావు.. తన పేరు జాజి ఏంటని.. చిన్ననాట స్కూల్ లో అంకారావేంటనీ అవమానాలు ఎదుర్కొన్నాడు. తన పరిస్థితి తన పిల్లలకు రాకూడదని ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడికి.. లవిత్ర వేద అద్విక్, చిన్నవాడికి.. రిషిక్ అని మాడర్న్ పేర్లు పెట్టానంటాడు. పల్నాడు కలెక్టర్ నుంచీ, అటవీ అధికారుల నుంచి తన జీవితం సాఫీగా సాగడానికి సాయమందిస్తామన్నా ఇంతకాలం వాటిని తిరస్కరిస్తూ వచ్చాడు జాజి. కానీ, కన్నతల్లిలాంటి నల్లమల్లను జల్లెడ పట్టే క్రమంలో ఇప్పుడు జాజి బాగా అలిసిపోయాడు. ఇద్దరు పిల్లలు పెరిగి పెద్దయ్యారు. ఎన్నో విష జంతువుల కాట్లతో.. రకరకాల వాతావరణ పరిస్థితులతో.. ఓపూట తిని మరో పూట తినక అడవికే తన సర్వస్వాన్నీ ధారపోసిన జాజి ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బందుల్లోనే గడిచింది. ఎన్నో మొక్కలు, జీవజాతులకు నెలవై.. మనందరికీ తల్లిలా నిల్చే వనసంపదను.. తన సొంత తల్లిలా కాపాడుతున్న జాజికి ప్రభుత్వంలో ఈ సమయంలో ఓ సలహాదారుగా సముచిత స్థానం కల్పించి ఒక గుర్తింపునివ్వడం అభినందనీయం!

Related Articles

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles