విలేజ్ రాక్ స్టార్స్
…………………………………….
వంశీకృష్ణ.. ✍🏻
9573427422
జీవితం ఏ క్షణమూ, ఏ స్థిర బిందువు దగ్గరా ఘనీభవించదు . అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రవాహ వేగంలోనే అనంతమైన శక్తి దాగి వుంది. దాన్ని మనం కనుగొంటే వెలుగు పువ్వుల పరిమళాలతో జీవితం రసవంతం అవుతుంది. ఆ శక్తిని విస్మరిస్తే నిరాశల సముద్రంలో మునిగిపోతుంది. జీవితానికి మనం ఇచ్చే కృతజ్ఞత ఏదైనా ఉన్నదా అంటే దాన్ని ప్రతిక్షణం అనుభూతిస్తూ జీవించడమే. కష్టం రానీ, దుఃఖ గంగ పోటెత్తనీ, ఈ క్షణం గడిస్తే వచ్చే క్షణం మరింత మధురంగా ఉంటుంది అనే తత్వ చింతనకు దృశ్యరూపం విలేజ్ రాక్ స్టార్స్!

జీవితానికి సినిమా ఎంత దగ్గరగా ఉంటే, జీవితాన్ని సినిమా ఎంత అర్ధవంతంగా చూపిస్తే అంత గొప్పగా ప్రపంచంలో ఏ మూల ఉన్న ప్రేక్షకుడి హృదయాన్ని అయినా అది అలవోకగా స్పర్శిస్తుంది. విలేజ్ రాక్ స్టార్స్ ఒక అర్ధవంతమైన సినిమా. అరుదైన సినిమా. కథగా చెప్పడానికి ఇందులో ఏమీ లేదు. ఒక్క పంక్తిలో చెప్పాలి అంటే ధను అనే పదేళ్ల అల్లరి అమ్మాయి ఒక ఎలక్ట్రిక్ గిటార్ కొనుక్కుని తనకంటూ ఒక మ్యూజిక్ బాండ్ సమకూర్చుకోవాలి అన్న కలను ఎలా సాకారం చేసుకున్నది అనేదే ఈ సినిమా కథ అని చెప్పొచ్చు .
కానీ ఈ సినిమా అది మాత్రమే కాదు. ఇది ఒక ప్రయాణం. ధను తన నుండి తనలోకి చేసిన ప్రయాణం. బసంతి అనే ఒక ఒంటరి స్త్రీ మహిళా సాధికారికత అనే పదబంధానికి చెప్పిన అర్ధవంతమైన వ్యాఖ్యానం.
ఎక్కడో ఈశాన్య భారతంలోని అస్సాం రాష్ట్రంలోని మరొక మారుమూల ప్రకృతి వొడిలో ఒదిగిన అందమైన పల్లెటూరు ఛాయ్యోగాం. ఆ ఊళ్ళో బసంతి ఒక ఒంటరి మహిళ. ఆమెకు ధను అనే పదేళ్ల కూతురు, మానవేంద్ర దాస్ అనే కొడుకు, ఒక బుజ్జిమేక పిల్ల, వ్యవసాయం చేయడానికి చారెడు నెల. ఇదే ఆమె ప్రపంచం. భర్త చిన్నప్పుడే ప్రమాద వశాత్తు నదిలో మునిగి చనిపోతాడు. పిల్లలల్ని పెంచి పెద్ద చేయడం, మంచి భవిష్యత్తు ఇవ్వడం ఆమె లక్ష్యం.
ధను అల్లరి పిల్ల. ఆకాశంలో ఎగిరే గువ్వకు, కొమ్మ ఊయలలూగే పిట్టకీ ఆమెకూ పోలిక. మానవేంద్ర దాస్ కాక ఇంకా రింకు, బోలెరాం, బిష్ణు, భాస్కర్ ఆమె స్నేహితులు. ఆ పిల్ల గ్యాంగ్ కు ధను లీడర్. తల్లికి సహాయంగా అప్పుడప్పుడు స్నాక్స్ అమ్ముతూ ఉంటుంది. అలాంటి ఒక సందర్భంలో ఒక మ్యూజిక్ బాండ్ చేసిన సంగీత కచేరి ఆమెను సమ్మోహ పరుస్తుంది. అప్పటి నుండీ ఒక ఎలక్ట్రిక్ గిటార్ కొనుక్కోవడం, తనకంటూ ఒక మ్యూజిక్ బాండ్ ఏర్పరచుకోవడం ఆమె లక్ష్యం. తన కోరిక గురించి తల్లికి చెపితే సినిమా చూస్తున్న ప్రేక్షకుడి అంచనాకి భిన్నంగా ఆమె స్పందించి బుజ్జి మేకను అమ్మాలనుకుంటుంది.
నిజానికి ధను తన కోరిక వెల్లడించినప్పుడు ఆమె సానుకూలంగా స్పందిస్తుందని మనం అస్సలు అనుకోము . ఎందుకంటే ఆ కుటుంబ పేదరికాన్ని కంచంలో కనీసం ఒక కూరో పచ్చడో లేకుండా కేవలం అన్నం చూపడం ద్వారా ప్రేక్షకుల అనుభవంలోకి తీసుకుని వస్తుంది రీమాదాస్ . హవా హవాయి సినిమాలో పారేసిన వస్తువులతో పిల్లాడు స్కేటింగ్ షూస్ తయారు చేసుకున్నట్లుగానే ఇక్కడ ధను కూడా పనికిరాని వస్తువులతో ఒక గిటార్ తయారు చేస్తుంది.
ఒక పాత ఇనుప సామానులు అమ్మే దుకాణంలో దొరికిన ఒక పాత పేపర్ లో సానుకూల దృక్పథంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న విషయం చదివి ధను సానుకూలంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. పైసా పైసా పోగు చేస్తుంది. ఈలోగా వరద వచ్చి పంట అంతా కొట్టుకు పోతుంది. అప్పుడు ధను ప్రాధాన్యతలు మారతాయి. వరదలో పంటను పనికి రాకుండా చేయడం ద్వారా జీవితం ఆమెకు ఒక పరీక్ష పెట్టి ఆ ఆ తరువాత పాఠం నేర్పుతుంది.
సినిమా అంతా ధను బసంతి నలుగురు పిల్లల చుట్టూ తిరుగుతుంది. కానీ, వాళ్లే కాకుండా ప్రకృతి కూడా ఒక ప్రధాన పాత్ర పోషించింది. సినిమా అంత సన్నగా వాన పడుతూనే ఉంటుంది. ఎటు చూసినా నీళ్ళే కనపడుతూ ఉంటాయి. వరదలను ధను ఉద్వేగాలకీ, మానసిక ఊగిసలాటకీ ప్రతీకగా దర్శకురాలు రీమా దాసు వాడుకున్న తీరు అద్భుతం అనిపిస్తుంది. వరద వచ్చి పంట కొట్టుకుపోయినప్పుడు ధను తల్లిని ఒక మాట అడుగుతుంది.
“ప్రతి సంవత్సరం వ్యవసాయం చేయడం, సరిగ్గా సమయానికి వరద వచ్చి మనలని నష్టాలపాలు చేయడం, మనం ఎందుకమ్మా వ్యవసాయం చేయాలి ? “
అప్పుడు బసంతి వ్యసాయం ఒక వృత్తి కాదమ్మా అది ఒక జీవన విధానం. పని మన మతం. పని చేయడం ఒక్కటే మనకు మిగిలింది అంటుంది. భారతదేశపు ఆత్మను ఇంతకంటే గొప్పగా ఒక వాక్యంలో ఎవరు మాత్రం చెప్పగలరు ?
మరొక సన్నివేశం, వానలో తడిసి నాని పోయిన పిల్లలు వరదలు వద్దు.. వరదలు వద్దు.. వానలు వద్దు.. వానలు వద్దు ఆంటూ తెగ అరవడం మనసులో మిగిలి పోతుంది. కావాలనే చిత్రించిందేమో రీమా దాసు తెలియదు కానీ ధను రజస్వల అయిన సన్నివేశాన్ని చాలా బలంగా చిత్రించింది. ఏ చిన్న విషయాన్నీ ఆమె వదలలేదు. బాలిక యువతిగా మారాక సమాజం మొత్తం దృష్టీ ఆమె మీద ఎలా కేంద్రీకృతం అవుతుందో బలంగా చెప్పిన సన్నివేశం అది.
ఇక చెట్లు ఎక్కకూడదు, మగ పిల్లల్తో తిరగకూడదు, నదిలో పడవలోకి ఒంటరిగా వెళ్ళకూడదు ఇలా చాలా చాలా ఆంక్షలు. వేడుకలో ఉన్నంత సేపు జరుగుతున్న తంతుపట్ల చిర చిరలాడుతూ, ధిక్కారాన్ని ప్రదర్శించిన ఆమె మోము వేడుక అయిన వెంటనే తేట నీటి అడుగు చేప పిల్లలా స్వచ్ఛ పడుతుంది. వెంటనే ధను తూనీగలా పరుగెత్తి చెట్టు ఎక్కుతుంది. సమకాలీన సమాజం మీద రీమాదాస్ వేసిన మొదటి చురక అది. చుట్టుపక్కల జనం అంతా తలా ఒక మాట ఆంటుంటే
“నా భర్త చనిపోయి ఒంటరిగా ఇద్దరు పిల్లల్తో ఒక్కదాన్నీ అవస్థ పడుతున్నప్పుడు ఎలా వున్నావు అని అడగడానికి ఒక్కళ్ళూ రాలేదు కానీ.. ఇప్పుడు నా కూతురుకు ఏది మంచో, ఏది చెడో చెప్పడానికి వచ్చారా ? అలా చెప్పడానికి మీరు ఎవరు ? “అని ప్రశ్నిస్తుంది బసంతి. రీమాదాసు వేసిన రెండో చురక అది
భర్త ఈత రాక చనిపోయాడు కనుక తన పిల్లలు ఈత నేర్చుకోవాలి అన్నది ఆ తల్లి కోరిక. ఈత కేవలం నదిని ఈదడానికే కాదు. జీవిత సముద్రాన్ని ఈదడానికి కూడా. తల్లి ఆ విషయం ఎక్కడా చెప్పదు కానీ.. ఆమె ఉద్దేశ్యం ప్రేక్షకుడికి అర్ధం అవుతూనే ఉంటుంది. హృదయంలో గొప్ప ధైర్యం, దేన్నైనా సమానంగా చూడగల స్థితప్రజ్ఞత కల స్ట్రాంగ్ హార్టెడ్ ఉమెన్ గా బసంతిని తీర్చిదిద్దిన విధానం కూడా ఆకట్టుకుంటుంది
రీమా దాస్ ఈ సినిమాలో ఏది చెప్పినా దృశ్యరూపంగా తప్పిస్తే ఎక్కడా వాచ్యంగా ఏదీ చెప్పలేదు. అది పేదరికమైనా, మహిళా సాధికారికత అయినా. ఎంత పెద్ద కఠిన విషయమైనా సున్నితంగా, సునిశితంగా దృశ్యమానం చేస్తుంది . సినిమాకు ఇది ఆత్మ. ఇతరేతర సినిమాలలోలాగా రీమాదాస్ పేదరికాన్ని ఈ సినిమాలో రొమాంటిసైజ్ చేయలేదు. అది హృదయాన్ని ఆకట్టుకుంటుంది.
మనం తరచూ సినిమా అంటే పాషన్ అనే మాట వింటూ ఉంటాము. వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పే బర్నింగ్ డిజైర్ అనే మాట కూడా వింటూ ఉంటాము. దర్శకురాలు రీమాదాస్ కు ఈ రెండూ వున్నాయి. అందుకే ఈ సినిమాను ఒంటి చేత్తో తీయగలిగింది. ఈ సినిమాకు నిర్మాత, దర్శకుడు, ఎడిటర్, కాస్ట్యూమ్ డిజైనర్, ఫైనాన్సియర్ అన్నీ ఆమె. అనేకానేక ఒడిదుడుకుల మధ్య రెండేళ్లపాటు ఈ సినిమాను తీసిందామె. ఆమె కష్టం వృధా పోలేదు. జాతీయ స్థాయిలో మూడు అవార్డులు, ఆస్కార్ నామినేషన్, మరిన్ని అంతర్జాతీయ అవార్డులు సాధించింది .
ఇప్పటికిప్పుడు ఈ సినిమా విజయం అస్సామీ చిత్ర పరిశ్రమకు చాలా అవసరం. జాహ్ను బారువా లాంటి గొప్ప దర్శకులు భూపేన్ హజారికా లాంటి గొప్ప వాగ్గేయకారుల ప్రాతినిధ్యంతో ఒక వెలుగు వెలిగిన అస్సామీ చిత్ర పరిశ్రమ ఇప్పుడు మూత పడే స్థితిలో ఉంది.



