Anwar The Artist..✍️
“ఈడెన్ ఈజ్ వెస్ట్” కోస్టా గావ్రస్ దర్శకత్వం వహించిన సినిమా. ఇది 2009 లో విడుదలయ్యింది. గావ్రస్ సినిమాల్లో నేను ఆఖరిసారిగా చూసింది 2005 లో వచ్చిన “The Axe” నిజానికి ఆక్స్ సినిమా కథ చూడ్డం అప్పట్లో నాకు ఒక పెద్ద షాక్. ఒకానొక సమయం లో చదువు ముగించి పట్టా పుచ్చుకుని ఇదిగో అంటూ ఉద్యోగంలోకి కుదురుకున్న ఒక మనిషి తన జీవితంలో ఒక తరువాత ఇకపై ఏం చెయ్యాలి అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కేవలం అతని ఉద్యోగపు రిటైర్మెంట్ తరువాత మాత్రమే అవసరం అయ్యేది. మానవ జీవితం అభివృద్ది అనే డెవలప్మెంట్ మార్గం లోకి ప్రవేశించిన తరువాత మనిషి తను చేసే ప్రతి పనిలోనూ, వృత్తి లోనూ ఈ రోజు ఉదయం పనికి వెడుతున్నాను అంటే ఈ సాయంకాలానికి ఉద్యోగం ఉంటుందో, ఊడబోతుందో తెలియని పరిస్థితి. ఉద్యోగం పోగానే మరో ఉద్యోగం సంపాదించుకోవాలి , ఆ సంపాదించుకునే వరకు పొట్టకు గడవాలి. ఉద్యోగం పోవడం, మరోటి సంపాదించుకోవడం అనే ఒక చేదు విషం మింగడమే ఈ సినిమా విషయం. పద్దెనిమిదేళ్ల క్రితం చూసిన కోస్తా గావరస్ ఆక్స్ సినిమా తరువాత, ఎందుకనో ఏ వేగంలో పడి కొట్టుకుపోతూనో అప్పటి ఆ మాస్టర్స్ కొత్త సినిమాలు ఏం తీస్తున్నారు అనే దానిమీద నా దృష్టి పడలేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తరువాత, అనుకోకుండా “ఈడెన్ ఈజ్ వెస్ట్” సినిమా చూడటం జరిగింది. ఈ సినిమా నాకు తెలిసిన కోస్తా గావ్రస్ శైలికి భిన్నం. అయితేనేం సినిమా తనపై నుండి సాంతం మన చూపులు తిప్పుకోనివ్వకుండ కదులుతుంది.

ఇది ఎలియాస్ అనే ఒక వ్యక్తి జీవితం లోని ఒకటి రెండు రోజుల కథ. మనకు పేరు చెప్పని ఒక దేశం నుండి ఓడలో కొంతమంది వలసదారులు ఫ్రాన్స్ కు దొంగచాటుగా ప్రయాణమవుతారు. ఓడ ప్రాన్స్ సరిహద్దులు చేరుకునేంతలోనే గస్తి వాళ్ళు ఈ ప్రవాసకుల ఓడని చుట్టుముట్టుతారు. జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టిన ఎలియాస్, ఇంకా కొంతమంది ఇతరులు ఆ పాటున సముద్రంలో దూకి ప్రాన్స్ వైపు ఈదుకుంటూ వెడతారు. మిగతా వారి సంగతి పక్కకు నెట్టేసి మనం ఎలియాస్ వైపే మన దృష్టి పెడదాం. సముద్రంలో ఈదీ ఈదీ ఎలియాస్ ఒక రిసార్ట్ తాలూకు బీచ్‌లోకి వచ్చి పడతాడు. తెల్లవారుతుంది. కళ్ళు తెరిచి చూసేసరికి బీచ్ కు ఒకవైపు పోలీసులు మరోవైపు సర్వాంగ సుందరంగా ఉన్న యువతీ యువకులతో నిండి ఉన్న న్యూడిస్ట్ క్యాంప్. పోలీసుల బారి నుండి తప్పించుకోవడానికి వంటి మీద ఉన్న చొక్కా, చెడ్డీ తీసేసి ఆ ఉత్తబిత్తల జనభా మధ్యలో దూరి తప్పించుకుంటాడు ఇలియాస్ . కథ కాస్త అటూ ఇటూ నడుస్తుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సంకటంగా పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండే క్రమంలో ఆ రీసార్ట్ లోనే ఒక జర్మన్ అమ్మాయి తో ఈ కుర్రవాడికి స్నేహం కలుస్తుంది. ఆ అమ్మాయి సాయంతో అప్పటికప్పుడు పట్టుబడకుండా కాస్త కాలాన్ని నడిపిస్తాడు. రిసార్ట్ కు వచ్చిన జనం వినోదం కోసం, పారిస్ నుండి ఒక ప్రఖ్యాత మెజీషియన్ అక్కడికి వచ్చి ఉంటాడు . అనుకోకుండా అతను ఇచ్చే మంత్రజాల ప్రదర్శనలో ఎలియాస్ ఒక భాగం అవుతాడు, ఎలియాస్ ని చూసి ముచ్చటపడ్డ ఆ ఇంద్రజాలికుడు పారిస్ కు పయనమవుతూ అతనికి తన విజిటింగ్ కార్డును అందజేసి, “నువ్వు ఎప్పుడైనా పారిస్‌లో ఉన్నట్లయితే, అక్కడ నన్ను చూడడానికి రావాలి ” అని చెబుతాడు. దానిని ఒక ఉద్యోగ అవకాశంగా భావించి ఎలియాస్ పారిస్ కి ప్రయాణమవుతాడు. ఇక మిగిలిన కథ అంతా అతను నడుస్తూ, పరిగెడుతూ, లారీల్లో, కారుల్లో, వీలు దొరికిన సకల రవాణా వాహనాల్లో నానా తంటాలు పడుతూ చివరికి పారిస్ చెరుకుంటాడు. అక్కడకు చేరిన తరువాత ఆ దేశపు భాషా,సంస్కృతి సాంప్రదాయాలు తెలియని ఎలియాస్ పడ్డ పాట్లు మరో కథ.
ఈ సినిమా అంతా ఒక ప్రయాణం. ఒక ఆకర్షణీయమైన యువకుడితో మన ప్రయాణం. అతను ఆకలి బాధపడ్డప్పుడు మనమూ అతనితో పాటూ ఆకలినొప్పికి బాధ చెందుతాము. అతను చటుక్కున పోలీసుల బారినుండి తప్పించుకున్నప్పుడు మనమూ తెగ సంబరపడతాం. ఇదిగో ఇలా రా నేను నీకు సాయం చేస్తానని మనుషులు పిలిచి అతని దగ్గర ఉన్నా అణా, కానీ లాక్కున్న క్షణాల్లో మనమూ ఈ మనుష్య జాతికి చెందిన వాళ్లమే కదాని తల దించుకుని సిగ్గు పడతాం, ఇదే మనుష్య జాతిలోని కొందరు మనుషులు ఎలియాస్ కు గుప్పెడు అన్నం పెట్టినప్పుడు, గొంతెడు దప్పిక తీర్చినపుడు, జేబులో ఇన్ని రూపాయి కాగితాలు కుక్కినపుడు, అతని మేలు కోరినపుడు, ఆ మనుష్యులలో ఒక మనిషిగా కాస్త సంతోషపడతాం. సినిమా అనేది ఒక గొప్ప కళ. మనకు చాలా మటుకు అలవాటయిన ఒక మాదిరి వెకిలితనపు కొన్ని గంటల కాలక్షేపం కాదు, వెర్రి మొర్రి పాటలు, ప్రసంగాలు, ప్రయోజనాలు, సుఖాంతాలు, నెత్తురు చావులు, అతి పోకడలు, భయంకర పోరాటాలు కావు ఇవి ఏమీ ఈ సినిమాలో లేవు . ఏ సినిమా ఏమిటో చూస్తుండగానే మన మనసుకు తెలిసిపోతుంది , ఆ సినిమా ఏమిటో అది మనకు ఇచ్చిన అనుభూతి చెబుతుంది, ఆ రాత్రి మనకు పట్టిన,లేదా పట్టని నిద్ర కూడా చెబుతుంది.



