ఆపరేషన్ మేఘదూత్.. భారత ఆర్మీ విజయంలో ఓ మైలురాయి!

ఆపరేషన్ మేఘదూత్… 42 ఏళ్ల క్రితం మొదలైన ఓ మిలటరీ ఆపరేషన్.. భారత ధైర్యసహాసాలకు అత్యంత ఎత్తైన సియాచిన్ కొండలంత ప్రతీక.

వ్యూహాత్మకంగా సియాచిన్ గ్లేసియర్ పై భారత్ ఎలా పట్టును సాధించిందో తెలుసుకుంటే.. వెంట్రుకలు నిక్కబొడుస్తాయి!

భారత్ ఇంకా అప్పటికీ అభివృద్ధి చెందుతున్న వర్తమాన దేశాల్లో ఒకటి. అలాంటిది.. ఆసియాలోనే అత్యంత ఎత్తైన.. వివాదాస్పదమైన సియాచిన్ గ్లేసియర్ వంటి సరిహద్దు ప్రాంతంపై పట్టు సాధించడమంటే.. అది భారత్ ఎన్నటికీ మర్చిపోలేని ఓ అపూర్వఘట్టం.

అది 1984.. ఏప్రిల్ 13వ తేదీ.. పాకిస్తాన్, చైనానే కాదు.. యావత్ ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయేలా భారత్ హిమానీనదమైన సియాచిన్ గ్లేసియర్ పై.. తన జెండా పాతి రెపరెపలాడించింది. సియాచిన్ గ్లేసియర్.. ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధభూమి. పైగా.. 1949 కరాచీ ఒప్పందం నాటి నుంచీ భారత్ – పాక్ మధ్య వివాదాస్పదంగా మారిన ప్రదేశం. అక్కడ సరిహద్దుల్లోని ముష్కరులనెదుర్కొని.. వ్యూహాత్మకంగా తన పట్టు సాధించడమంటే.. భారత్ కు అదొక ఘన విజయం.

అక్కడికి వెళ్లి కనీసం సరిహద్దులు కూడా గుర్తించే ధైర్యం ఎవరికీ లేని కాలం. ఉత్తరాన ఉన్న ప్రాంతాలను కనీసం మ్యాప్స్ లో కూడా గుర్తించకుండా వదిలేసిన చోటది. అలాంటి చోట భారత్ సాధించిన విక్టరీకి దారి తీసిన అంశాలేంటో ఓసారి కాస్త తెలుసుకునే యత్నం చేద్దాం.

సియాచిన్ గ్లేసియర్ వ్యూహాత్మక ప్రాముఖ్యత!

సియాచిన్ గ్లేసియర్ ప్రాధాన్యతేంటో ఇండియన్ గవర్నమెంట్ కు తెలుసు. అక్కడ మన పొరుగు దాయాది దేశాలైన చైనా, పాకిస్థాన్ కు ఏ మాత్రం అవకాశమిచ్చినా ప్రమాదమనే కచ్చితమైన అంచనా ఉంది. అందుకే వారిని కనీసం అడుగు పెట్టనీయకుండా.. భారత్ ఆధీనంలో.. నియంత్రణలో ఉండేలా సియాచిన్ గ్లేసియర్ అనే ఎత్తైన యుద్ధభూమిలో పైచేయి సాధించాలన్న పట్టుదలతో భారత్ అడుగులు వేసి సక్సెసై ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న షక్స్గమ్ వ్యాలీ అది భారత్ భూభాగమే అయినప్పటికీ.. 1963లో పాకిస్థాన్ అదేదో తన భూభాగమే అయినట్టు.. దాన్ని చైనా చేతుల్లో పెట్టేసింది. అక్కడ చైనా రహస్య స్థావరాలకు ఆవాసంగా మారుతున్న విషయాన్నిభారత్ సీరియస్ గా పరిగణించింది. ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో వ్యూహాత్మక ప్రదేశంగా ఉన్న ఈ షక్స్గమ్ వ్యాలీ.. గిల్గిత్ బాల్టిస్థాన్ నుంచి లేహ్ కు పడమటి నుంచి వచ్చే మార్గాలను నియంత్రిస్తుంది. అదే సమయంలో తూర్పు ఓల్డ్ కారాకోరం పాస్ పై ఆధిపత్యం చెలాయించే ప్రాంతం కూడాను. అందుకే ఇక ఉపేక్షించకుండా భారత్ నాడు 40 ఏళ్ల క్రితం చేపట్టిన శస్త్రచికిత్సే.. ఆపరేషన్ మేఘదూత్.

పైగా పశ్చిమాన ఉన్న గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతమంతా… 1948లో పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగం. అయితే, 1984లో గనుక భారత్ గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతాన్ని ఆక్రమించకపోయి ఉంటే… పాక్.. చైనా మూకలతో కలిసి ఆక్సాయ్ చిన్ వద్ద తన సైన్యాన్ని మోహరించి ఈ ప్రాంతంపై వ్యూహాత్మక పట్టుకోసం ప్రయత్నించేది. అదే జరిగి ఉంటే.. భారత్ కు అపారమైన ప్రమాదం పొంచి ఉండేది. ముఖ్యంగా లడక్ వంటి ప్రాంతాల్లో కూడా దురాక్రమణల పర్వం ముంచుకొచ్చేది. అందుకే.. 80వ దశకంలోని నాటి భారత ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించింది. అలా భారత్ ప్రారంభించిన ఆపరేషన్ మేఘదూత్ అతి పెద్ద సైనిక చర్యగా కూడా రికార్డులకెక్కింది.

షక్స్గమ్ లోయలో ట్రెక్కింగ్ కు అనుమతించి కవ్వించిన పాక్..

షక్స్గమ్ లోయను చైనాకు ధారదత్తం చేసిన పాక్, చైనా మధ్య ఒప్పందాల్లో భాగంగా.. ద్వంద్వ ప్రయోజనాల కోసం వారి ఎత్తులు, పై ఎత్తులు కొనసాగాయి. అందులో భాగంగా పాకిస్థాన్ ఈ లోయలో పర్వాతారోహణ యాత్రలకు తెరతీసింది. దాంతో అంతర్జాతీయంగా షక్స్గమ్ లోయ ప్రాంతం తమదేనని వాదించడంతో పాటు.. ఆ భూభాగంపై ఫిజికల్ గా కూడా ఆధిపత్యం సంపాదించాలన్న కుటిల యుక్తులతో పాక్ అడుగులు పడ్డాయి. అలా పాక్ ఆ యాత్రకు వెళ్లేవారి వెంట ఓ లైజన్ అధికారితో పాటు.. వారికోసం సైనిక రక్షణ చర్యలు కూడా తీసుకుంది. అది ఇండియాకు కంట్లో నలుసుగా మారుతోందని తెలుసు. కానీ, అక్కడ సరైన ప్రణాళిక, వ్యూహం లేకుండా పాక్ ను నియంత్రించలేమని గమనించిన భారత పాలకులు.. పక్కా ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ మేఘదూత్ కు శ్రీకారం చుట్టారు.

పాక్ కు దీటుగా పర్వాతారోహణ ప్రారంభించిన భారత్!

ముల్లును ముల్లుతోనే తీయాలన్న ప్లాన్ వేసిన భారత్ కూడా.. అదే ప్రాంతంలో ట్రెక్కింగ్ ప్రారంభించింది. అయితే, ట్రెక్కింగ్ తో పాటు.. వారి వెంట వెళ్లే మిలటరీ ప్లానింగ్ బృందాలను ఓకవైపు రక్షణగా, మరోవైపు అక్కడ పాక్ కుట్రలను ఛేదించే ప్రణాళిక రచించేలా ఏర్పాటు చేసి పంపింది. అలా 1978 నుంచి 1984 వరకు పర్వాతారోహణ ప్రక్రియ పెద్దఎత్తున కొనసాగించింది. 1978లో కల్నర్ నరేందర్ కుమార్ నేతృత్వంలో వెళ్లిన మిలటరీ బృందంతో పాటు.. అలాంటి పెద్ద పెద్ద యాత్రలను నిర్వహించిన భారత్.. షక్స్గమ్ లోయపై పట్టు సాధించే క్రమంలో విలువైన డాటాను సంపాందించింది. పేరుకు పర్వాతారోహణే అయినా.. దాని వెనుక ఆ ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకోవడమే భారత్ ప్రాధాన్యత.

పాక్ కుట్రలను బట్టబయలు చేసిన భారత ఇంటలిజెన్స్…

భారత్ షక్స్గమ్ లోయపై పట్టు సాధిస్తుండటంతో పాటు.. ఏవేవో ప్రణాళికలు రచిస్తోందనే విషయాన్ని గమనించిన పాక్.. అందుకు తగ్గట్టుగా ఆపరేషన్ ప్రారంభించాలని యోచించింది. 1984, ఏప్రిల్ 17వ తేదీన గిల్గిట్ అలాగే బాల్టిస్థాన్ ఉత్తర ప్రాంతాల నుంచి ప్రత్యేక సేవా దళాలు, సైనికులను ఉపయోగించి.. సియాచిన్ గ్లేసియర్ పై పట్టుకోసం ప్లాన్ చేసింది. కానీ, అక్కడే ఇండియన్ ఇంటలిజెన్స్ వ్యవస్థ చాకచక్యంగా పనిచేసింది. వారి కంటే వేగంగా స్పందించింది. పాకిస్థాన్ లండన్ బేస్డ్ గా తయారైన ఆర్కిటిక్ గేర్ ఆయుధాలను పెద్ద ఎత్తున సమకూర్చుకుంటుందనే విషయమూ ఇండియన్ ఇంటలిజెన్స్ దృష్టికి వచ్చింది. ఇంటలిజెన్స్ సమయస్ఫూర్తితో.. పాకిస్థాన్ తదుపరి అడుగులన్నీ ఇండియాకు ముందే తెలిసిపోయాయి.

పెర్ ఫెక్ట్ ప్లానింగ్.. ముందస్తు ఆలోచనలతో భారత్ అడుగులు!

సియాచిన్ గ్లేసియర్ పై యుద్ధ మేఘాలు కమ్ముకుంటే ఎలా పనిచేయాలో పాక్ సైన్యానికి తెలిసినంతగా.. అప్పటికి భారత ఆర్మీకి అంతగా అనుభవం లేదు. అందుకే, మొట్టమొదట కొన్ని కీలక భారత సైనిక బృందాలను 1982లో అంటార్కిటికాకు పంపించారు. మంచే కాదు.. మనిషి కూడా గడ్డ కట్టే వాతావరణంలో ఎలా పనిచేయాలో అక్కడ శిక్షణనిప్పించారు. మొత్తంగా సియాచిన్ గ్లేసియర్ అనే అత్యంత ఎత్తైన మంచు కొండలపై భారత సైనికులు దీటుగా పోరాటం చేసేలా.. ఆ పోరాటంలో విజయం సాధించేలా తర్ఫీదునిప్పించారు.

ఆ పంపిన సైనిక దళాల్లో సవాళ్లనెదుర్కొనేందుకు ఎంచుకున్నవారిలో… ముఖ్యంగా మంచుకొండలు అధికంగా కనిపించే గర్హ్వాల్, కుమావోన్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు చెందినవారే ఎక్కువ. పైగా వారప్పటికే లడక్ ప్రాంతంలోని పర్వత ప్రాంత యుద్ధాలపై ఓ స్పష్టతతో ఉన్నవారు. పూర్తి డేటా, మ్యాప్స్, సుశిక్షితులైన సైనిక బృందాలు, ఎప్పటికప్పుడు ప్రత్యర్థి దేశ కదలికలను కళ్లకు కట్టేలా పనిచేస్తూ వివరాలందించే ఇంటలిజెన్స్ వ్యవస్థ, కావల్సిన ఆయుధ భాండాగారం ఇవన్నీ దగ్గర పెట్టుకుని.. శత్రుదేశం కనీసం డిఫెన్స్ ఆడటానికి కూడా ఆందోళన చెందే రీతిలో భారత్.. తన ఆర్మీని సిద్ధం చేసుకుంది.

ఆశ్చర్యపర్చిన ఆ నాల్గు రోజులు…

పాకిస్థాన్ కుట్రలను భారత్ ఇంటలిజెన్స్ బట్టబయలు చేశాక.. వారు 1984, ఏప్రిల్ 17న భారత్ వైపు.. సియాచిన గ్లేసియర్ పైకి చొచ్చుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారన్నది తెలిశాక.. ఇండియన్ గవర్నమెంట్ సత్వరమే స్పందించింది. అందుకే, అంతకుముందే పాక్ పై తన ఆపరేషన్ కు సిద్ధమైంది. సియాచిన్ గ్లేసియర్ ఆక్రమణే ధ్యేయంగా.. నాటి లెఫ్టినెంట్ జనరల్ పీ.ఎన్. హ్యూమ్ ఆధ్వర్యంలో.. బ్రిగేడియర్ కమాండర్స్ ఆ ప్రాంతంలో అటాక్ కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్లాన్ రెడీ చేశారు.

అలా, 1984లో మార్చ్ లోనే.. భారత్ ఆర్మీ ఆపరేషన్ ప్రారంభించింది. ఎయిర్ లిఫ్టింగ్ కు కూడా ఆస్కారం లేని పరిస్థితుల్లో.. శత్రుదేశానికి అనుమానం రాకూడదనే జాగ్రత్తతో నాడు భారత వీర సైనికులంతా అంత ఎత్తైన సియాచిన్ గ్లేసియర్ ప్రాంతానికి కాలిబాటడనే కవాతు చేశారు. అలా మార్చ్ లో ప్రారంభమైన ఆపరేషన్ సియాచిన్ గ్లేసియర్.. 1984, ఏప్రిల్ 13వ తేదీన.. మనం వైశాఖంగా చెప్పుకునే ఉత్తర భారతం బైసాఖీగా పిల్చుకునే పంటకోతల కాలం వరకు దాదాపు భారత్ చేతికి విజయాన్నందించే దశకు చేరుకుంది. సాల్టోరో శిఖరంతో పాటు.. దానికెదురుగా ఉన్న ఎత్తైన పర్వత ప్రాంతాలు, ఇతర సరస్సు ప్రాంతాలు, సరిహద్దులన్నీ భారత్ నియంత్రణలోకి వచ్చేశాయి. దాంతో 1984, ఏప్రిల్ లో సియాచిన్ గ్లేసియర్ దురాక్రమణకు ప్లాన్ చేసిన పాక్ కుట్రలకు తెరదించుతూ… ఎక్కడికక్కడ సరిహద్దుల్లో సుమారు 2500 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో శత్రువు కనీసం లోపలికి అడుగుపెట్టలేని నిఘా వ్యవస్థతో భారత్ తన సైన్యాన్ని మోహరించింది. మొత్తంగా సరిహద్దుల్లో తమ దేశీయులకు సైనికుల చేతుల్లో చావుదెబ్బలు తగలకుండా.. భారత్ కాళ్లు పట్టుకోవడం తప్ప.. పూర్ పాకిస్థానీలకు గత్యంతరం లేని పరిస్థితులను నాటి భారత ఆర్మీ సృష్టించింది.

4 దశాబ్దాల క్రితం మొదలైనా.. సియాచిన్ గ్లేసియర్ పై ఇప్పటికే అదే నిఘా!

సియాచిన్ గ్లేసియర్ భారత్ వశమైనప్పటికీ… ఇక్కడ ఎప్పుడూ శత్రుదేశంతో ప్రమాదం పొంచే ఉంటుంది. పైగా లాజిస్టిక్స్ చేరవేత, సైనికుల ఆరోగ్యం, వ్యూహాత్మకంగా వ్యవహరించడం ఇవన్నీ ఈనాటికీ పెద్ద సవాళ్లే. అప్పటివరకూ తాత్కాలిక మిలటరీ పోస్టులుగా బార్డర్స్ లో ఉన్నవాటిని.. పర్మినెంట్ గా మార్చేసి.. అక్కడ సైనిక సిబ్బందికి కావల్సి అన్ని సదుపాయాలనూ భారత ప్రభుత్వం కల్పించింది. మెడికల్, ఎయర్ డిఫెన్స్, కమ్యూనికేషన్స్ వంటి మిల్ట్రీ సపోర్టెడ్ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ సమకూర్చారు. భారత వైమానిక దళాల కదలికలు శత్రుదేశానికి అర్థంకాని రీతిలో ఇక్కడ ఏర్పాట్లు చేయడంలో.. భారతీయ వైమానిక దళానిది కీలకపాత్ర. సియాచిన్ గ్లేసియర్ భారత్ కు వ్యూహాత్మక ప్రాంతంగా మారడమే కాకుండా.. శత్రుదేశంపై పూర్తి ఆధిక్యం కనబర్చడంలో ఇండియాకు ఒక మైలురాయిగా మారింది. అంతేకాదు, సైనికులు ఇక్కడ పొందిన అత్యంత కఠిన శిక్షణ తర్వాత.. 1999 నాటి కార్గిల్ యుద్ధం, 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లోనూ భారత్ పైచేయి సాధించేందుకు కారణమయ్యాయి. ఓవైపు దాయాది శత్రుదేశమైన పాక్.. మరోవైపు చైనా ఈ రెండింటి కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఇవాళ భారత్ తలభాగంలో త్రినేత్రమై నిల్చింది సియాచిన్ గ్లేసియర్.

అయితే, ఆపరేషన్ మేఘదూత్ ఇంకా ముగిసిపోలేదు. ఇది జమ్మూకశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరికేవరకు.. పాకిస్థాన్, చైనా రెండు దేశాలతో ఒక పొల్టికల్ సొల్యూషన్ వచ్చేవరకూ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే, ఆపరేషన్ మేఘదూత్ ప్రత్యేకమైంది. ఎందుకంటే, చరిత్రలో ఏ దేశానికి చెందిన ఆర్మీ కూడా నాల్గు దశాబ్దాల పాటు.. ఒక టెర్రిటరీని ఆక్రమించి తన వ్యూహాలను అమలు చేసిన దాఖలాల్లేవు. అందుకే, నాల్గు దశాబ్దాలుగా ఆపరేషన్ మేఘదూత్ తో తమ సంకల్పబలమేంటో ప్రపంచ దేశాలకు చాటిచెబుతున్న మన ఇండియన్ ఆర్మీకి ఓ సెల్యూట్ చెప్పేయాల్సిందే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles