2001 టెస్ట్.. భారత క్రికెట్ చరిత్రలో ఓ నోస్టాల్జియా!

క్రికెట్ చరిత్రలో కొన్ని చారిత్రాత్మక మ్యాచులెప్పటికీ మర్చిపోలేం. అవి సగటు క్రికెట్ అభిమానితో పాటు… ఆ ఆటలో భాగస్వాములైనవారు.. కీలకపాత్ర పోషించినవారు… ఆ ఆట స్ఫూర్తితో ఎదిగిన యువక్రికెటర్లు.. ఇలా ఎందరికో నోస్టాల్జియా. 2001 బోర్డర్-గవాస్కర్ క్రికెట్ ట్రోఫీలోని సెకండ్ టెస్ట్ మ్యాచ్ జరిగి సరిగ్గా 23 ఏళ్లు గడుస్తున్న తరుణంలో… ఆ హిస్టారికల్ క్రికెట్ మూమెంట్ గురించి ఓసారి మననం చేసుకుందాం.

2001 టెస్ట్ ఎందుకు ప్రత్యేకం..?

అది కలకత్తా ఈడెన్ గార్డెన్… మార్చ్ 11-15 వ తేదీ మధ్య 2001లో ఐదురోజుల పాటు జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్ మ్యాచ్. ఆ మ్యాచ్ ను భారత్ 171 రన్స్ తేడాతో గెల్చింది. అయితే, ఎన్నో మ్యాచులు ఇండియా గెల్చినా… ఈ మ్యాచ్ మాత్రమే ఎందుకు ప్రత్యేకమంటే… 1877 నుంచి టెస్ట్ క్రికెట్ ప్రారంభమయ్యాక ఇండియా అలాంటి చారిత్రాత్మక మ్యాచులను కేవలం మూడింటినే గెలిస్తే.. అందులో మూడోది 2001 ఈడెన్ గార్డెన్ టెస్ట్ మ్యాచ్. అందుకే 2001లో కలకత్తాలో జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఇప్పటికీ.. ఇంకెప్పటికీ వెరీ వెరీ స్పెషల్.

ఆస్ట్రేలియా అప్పటికే ప్రపంచ క్రికెట్ లో నంబర్ వన్ గా కొనసాగుతున్న పీక్ టైం అది. అంతకుముందు ముంబై వాంఖడే స్టేడియంలో పది వికెట్ల తేడాతో మొదటి టెస్ట్ గెలవడంతో పాటు… వరుసగా 16 టెస్ట్ మ్యాచులు గెల్చిన జట్టుగా ఐసీసీ టెస్ట్ క్రికెట్ లో నంబర్ వన్ పొజిషన్ లో ఉంది. అలాంటి సమయంలో ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ రాహూల్ ద్రవిడ్… తన ఇంటిపేరు వీవీఎస్ అంటే వెరీ వెరీ స్పెషల్ గా ఈ మ్యాచుతోనే మార్చుకున్న లక్ష్మణ్.. ఈడెన్ గార్డెన్ టెస్టును నిలబెట్టిన తీరు క్రికెట్ ప్రేమికులకు ఓ అనూహ్యమైన ఓ పండుగనందించింది. వారితో పాటు హ్యట్రిక్ వికెట్లు పడగొట్టిన పంజాబీ హర్భజన్ సింగ్ స్పిన్ మాయాజాలం.. మొదటి ఇన్నింగ్స్ లో 7.. రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టిన సన్నివేశాలన్నీ వెరసి ఇండియా ఎన్నటికీ మరవలేని ఓ టెస్ట్ విజయమది

ఆ మ్యాచ్ నాటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ దక్షతకు నిలువెత్తు రూపం. ప్రపంచ ప్రసిద్ధ బ్యాట్స్ మ్యాన్ గా.. క్రికెట్ దేవుడిగా గుర్తింపు సాధించుకున్న సచిన్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన బౌలింగ్ స్పెల్ తోనూ మాయ చేసి 3 వికెట్లు పడగొట్టడంతో… మొత్తంగా టీమ్ ఇండియా స్పిరిట్ కు ఓ సింబల్ లా కనిపించింది.

ఎన్నో విజయాలున్నాయిగా… 2001 టెస్ట్ గొప్పేంటంటే…? మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఎప్పటిలాగే తన ఆధిక్యాన్ని చాటింది. కెప్టెన్ అంటే ఎలా ఉంటాడో చూపెట్టేలా స్టీవ్ వా 110 రన్స్ తో చేసిన సెంచరీ… మ్యాథ్యూహెడెన్ 97 రన్స్ తో కలిసి విధ్వంసక ఇన్నింగ్స్ తో మొత్తంగా 445 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. కానీ, భారత ప్లేయర్స్ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం వీవీఎస్ లక్ష్మణ్ 59 పరుగులు మినహాయిస్తే.. మిగిలినవారంతా చేతులెత్తేయడంతో.. 171 రన్స్ కే కుప్పుకూలి ఫాలోఆన్ గండంలో పడింది.

అలాంటి సమయంలో ఫాలోఆన్ గండంతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు వచ్చిన భారత్ సదగోపన్ రమేష్, శివసుందర్ దాస్ ఇద్దరు ఓపెనర్ల వికెట్స్ కోల్పోయి మళ్లీ ఇబ్బందుల్లోకి వెళ్తున్న క్రమంలో.. బ్యాటింగ్ కు వచ్చిన వీవీఎస్ లక్ష్మణ్ వెరీ వెరీ స్పెషల్ అన్న పేరుకు తగ్గట్టుగా నిలబడ్డాడు. కానీ, సచిన్ 10 పరుగులకే వెనుదిరగడం.. కుదురుకుంటున్నాడుకుంటున్న సమయంలో గంగూలీ కేవలం 48 పరుగులకే చేతులెత్తేయడంతో మళ్లీ భారత్ కు ఎదురీత తప్పలేదు. అదిగో అదే సమయంలో వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ గా అందరూ ఎందుకు పిల్చుకుంటారో మరోసారి నిరూపించాడు రాహూల్ ద్రవిడ్. ఐదు రోజుల టెస్ట్ క్రికెట్ లో నాల్గోరోజు ఆస్ట్రేలియన్ బౌలర్స్ కు వీవీఎస్, రాహూల్ ఇద్దరూ కలిసి నిద్రలేకుండా చేశారు. కెప్టెన్ స్టీవ్ వా ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. మార్చి మార్చి బౌలర్లను ఏమార్చినా… 2001 మార్చి ఈడెన్ గార్డెన్ లో ఇండియా ఈడ్చి కొట్టింది. దాంతో వీవీఎస్ లక్ష్మణ్ డబుల్ సెంచరీతో చెలరేగి.. 281 పరుగులు చేస్తే.. రాహూల్ ద్రవిడ్ ఆరోజు చేసిన 180 రన్స్ ఎంతో కీలకంగా మారాయి. మొత్తంగా ఏడు వికెట్లకు 657 పరుగులు చేశాక.. ఇండియా డిక్లేర్ చేసింది.

మళ్లీ మాథ్యూ హెడెన్ తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఇంకోవైపు మిచెల్ స్లాటర్ కూడా బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడనుకుంటున్న తరుణంలో.. బజ్జీ బౌలింగ్ లో మిచెల్ స్లాటర్ ను పెవిలియన్ కు పంపాడు. తాను బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ సత్తా చాటగలనంటూ సిసిలైన ఆల్ రౌండర్ లా సచిన్ హెడెన్ వికెట్ తీశాడు. దాంతో ఆ తర్వాత వచ్చిన కంగారులన్నీ… కంగారు కంగారుగానే పెవిలియన్ బాట పట్టాయి. ఆస్ట్రేలియా 212 పరుగులకే కుప్పకూలింది. ఇండియా 171 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది.

వీరేంద్ర సెహ్వాగ్ చేసిన రెండు ట్రిపుల్ సెంచరీలు.. కరుణ్ నాయర్ చేసిన ఓ ట్రిపుల్ సెంచరీ తర్వాత… వీవీఎస్ లక్ష్మ ణ్ ఈడెన్ గార్డెన్ వేదికగా చేసిన 281 పరుగులే అత్యధిక టెస్ట్ వ్యక్తిగత స్కోర్ గా భారత క్రికెట్ చరిత్రలో నమోదైంది. అందుకే, 2001 ఈడెన్ గార్డెన్ టెస్ట్ ఎప్పటికీ మరవలేని.. మరపురాని ఓ క్రీడాఘట్టంగా అభిమానుల అనుభూతిగా మిగిలిపోయింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles