యోగాకు విశ్వగురువు భారత్. అలాంటి యోగాకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. అంతేకాదు, ప్రపంచంలోని ఇతర దేశాలకు చెందిన యోగా సాధకులు, గురువులు కూడా ఏకంగా భారతదేశ అత్యున్నత పురస్కారాలందుకునే స్థాయిలో ఇప్పుడు యోగా ఆదరణ కనిపిస్తోంది. అందుకో ఉదాహరణ షైఖా అలీ జబర్ అల్ సబా. అవునూ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి పద్మశ్రీ అవార్డ్ అందుకున్న షైఖా అలీ గురించి కాస్త చెప్పుకుందాం.

షేఖా అలీ జబర్ అల్ సబా పద్మశ్రీ అందుకున్న మొట్టమొదటి కువైట్ జాతీయురాలు. ప్రతీ ఏటా కొందరు విదేశీయుల్ని కూడా పద్మ అవార్డులకు ఎంపిక చేస్తున్న క్రమంలో ఎనిమిది మంది విదేశీయుల్లో షైఖా అలీ ఒకరు. మరింతకీ ఈ షైఖా అలీ జబర్ అల్ సబా ఎవరు..?
యోగాపై మక్కువేర్పర్చుకుని సాధన చేసి కువైట్ లో ఏకంగా యోగా స్టూడియోనే పెట్టిన గురువు షైఖా అలీ జబర్. ఆమె నేతృత్వంలో దారాత్మ యోగా ఫౌండేషన్ ను స్థాపించి కువైట్ లో యోగా గురించి ప్రచారమూ, బోధన రెండూ చేపట్టి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు షైఖా. యోగా కోసం ఇది కువైట్ లో మొట్టమొదట రిజిస్టరైన లైసెన్స్డ్ యోగా స్టూడియో కావడం గమనించాల్సిన విషయం.
2001లో షైఖా తన యోగా ప్రయాణాన్ని ప్రారంభించారు. 2014లో కువైట్ వేదికగా స్టూడియో ఏర్పాటు చేశారు. దారాత్మ అని ఆమె తన స్డూడియోకు పెట్టిన పేరు వెనుక కూడా నిగూఢమైన అర్థముంది. అరబిక్ భాషలోనూ, ఖురాన్ లోనూ దార్ అంటే ఇల్లు లేదా నివాసమని అర్థం. ఇక సంస్కృత పదమైన ఆత్మను జోడించి దారాత్మ అని తన స్డూడియోకు నామకరణం చేసింది షైఖా అలీ. యోగా స్టూడియో ఏర్పాటు కోసం.. అధికారికంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి కువైట్ లో ఒక స్థానం కోసం ఆమె వాణిజ్య మంత్రిత్వ శాఖను సంప్రదించి.. ఎట్టకేలకు 2014లో స్టూడియో ఏర్పాటుతో తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది.
శారీరక, మానసిక ఎదుగుదలకు యోగా ఎలా ఉపయోగపడుతుందో చెప్పడానికి షైఖా అలీ ఓ ఉదాహరణ. యోగాతో మొదలైన తన ప్రయాణం మానవీయ కోణంలో ఎందరో శరణార్థుల పట్ల కనీస మానవత్వాన్ని ప్రదర్శించే ఒక సమున్నత లక్ష్యంవైపు నడిపించింది. అందుకే, షైఖా అలీ అంటే కేవలం యోగా పేరే కాకుండా.. దాతృత్వ కార్యక్రమాలకు కేరాఫ్ గా కూడా చెప్పుకుంటుంటారు. అలాగే, సమాజంలో కుల, మతాల పేరుతో పేరుకుపోయిన అంతరాలను చర్చకు పెట్టడం కాకుండా.. వాటిని తగ్గించే ఒక గొప్ప మనస్తత్వంతో ఆమె చేస్తున్న పని అంతర్జాతీయ సమాజం గుర్తించింది. 2021లో యెమన్ శరణార్థుల కోసం సాయమందించేందుకు.. యోమ్నాక్ లిల్ యెమన్ పేరిట ఆమె చేపట్టిన నిధుల సేకరణ కార్యక్రమంతో ఆమె ఆ గుర్తింపును సాధించింది.
యోగా శిక్షణా తరగతులకు కువైట్ లో తన స్టూడియోను ప్రారంభించినా షైఖా కువైట్ కే పరిమితం కాలేదు. అంతర్జాతీయంగా ఆమె యోగా క్లాసెస్ తీసుకుంటోంది. అమెరికా వంటి దేశంలో మన్రో ఇనిస్టిట్యూట్ యోగా శిక్షణా తరగతులు నిర్వహించారు షైఖా.
కోవిడ్ 19 మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమయాన… షైఖా సమాజంలో తనవంతు బాధ్యతగా కీలకపాత్ర పోషించింది. కువైట్ లోని నిరుపేద పిల్లలెందరికో విద్యకు అవసరమయ్యే పుస్తకాలు, బ్యాగులు, ఇతర సామాగ్రిని పంపిణీ చేసింది. తద్వారా సమాజ సంక్షేమం పట్ల ఆమెకున్న దృక్కోణం ఆకట్టుకుంది.
షైఖా అలీ జబర్ అల్ సబా ను ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. 2024, డిసెంబర్ 22న మోడీ ఆమెను కువైట్ లో మొదటిసారి కలిశారు. ఆ తర్వాత ఆయన తన X ఖాతాలో ఓ పోస్టును షేర్ చేశారు. యోగాతో పాటు, ఫిట్ నెస్ విషయంలో ఆమెకున్న దూరదృష్టిని కొనియాడుతూనే… ఆమె ప్రారంభించిన యోగా వెల్ నెస్ సెంటర్ గురించీ ఆ పోస్టులో ప్రస్తావించారు. యువతలో యోగా గురించి మరింత అవగాహన కల్పించేందుకు షైఖా అలీ వంటివారి చొరవ మరింత ఉపయోగపడుతుందని మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు.
షైఖా అలీ జబర్ అల్ సబా సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ ప్రకటించగా… ఆమె తాజాగా ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా పద్మశ్రీ అందుకున్న మొట్టమొదటి కువైట్ జాతీయురాలిగా గుర్తింపు పొందారు.



