పేరులోనేముంది…? ఇదో ప్రశ్న… అదే సమయంలో ఓ సమాధానం కూడాను! పేరులో ఏముందనేది ఆ ప్రశ్నైతే.. పేరులో నేముందనేదే ఆ జవాబు. అలాంటి పేర్లు పెట్టుకునేటప్పుడు ఎంతగా ఆలోచిస్తామో తెలియంది కాదు. ఈ కాలంలోనైతే న్యూజనరేషన్ కిడ్స్ కి వెతికి వెతికి పలకరాని పేర్లన్నీ తెచ్చి పెట్టేయడమూ ఓ పేషన్. గతంలోనైతే సంప్రదాయాలకనుగుణంగానో.. లేక, పెద్దల పేర్లో పిల్లలకు పెట్టుకోవడం ఆనవాయితీ. అయితే అలాంటి పేరు విషయంలో న్యూజిలాండ్ కు చెందిన ఓ వ్యక్తి ఇప్పుడో రికార్డ్ సృష్టించాడు. తన రికార్డ్ సృష్టించిన కలకలంతో అక్కడి చట్టాల్లోనే మార్పులు కూడా చేయాల్సి వచ్చింది. అందుకే పేరు గురించి ఇంత కథ.

ఏకంగా 2253 పదాల పేరు. పలకడానికెంత సమయం పడుతుందసలు..? సరే, అంత పేరు పెట్టి పిల్చే ఓపిక, ,సమయం ఎవరికున్నాయిగానీ.. ఆ పేరు పెద్ద చర్చే అయిందక్కడ. ఏకంగా న్యూజిలాండ్ లో చట్టాల్లో మార్పులకే అతగాడి పేరు కారణమవ్వడమే ఆ పేరు సృష్టించిన విశేషం.
20 నిమిషాల నుంచి కనీసం అరగంట సమయం పలికితేనేగానీ పూర్తి పేరు పిలువలేమంటే విశేషమేగా మరి!
అందుకే అంటారు బుర్రకో బుద్ధి జిహ్వకో రుచి అని.
పొడవైన పేర్లు లేవని కాదు. చాలా సంస్కృతుల్లో కొందరి పేర్లు పొడవుగా పెట్టుకోవడం.. పిల్చుకోవడానికి షార్ట్ నేమ్స్ ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. మన దక్షిణ భారతదేశంలోనైతే గ్రామాల పేర్లే మనుషులకు కనిపిస్తాయి. అలాగే తండ్రుల పేర్లు వెనుక వచ్చి చేరతాయి. ఇక అరబ్ దేశాల్లోనైతే తాతలు, తండ్రులు, కుటుంబాల పేర్లతో పితృస్వామ్య వ్యవస్థనను అనుసరించే విధంగా పేర్ల తీరు కనిపిస్తుంటుంది. ప్రాశ్చాత్య దేశాల్లోనూ కొన్ని సంస్కృతుల్లో పొడవైన పేర్లను గమనిస్తుంటాం.
అలాంటి కొందరు ప్రముఖులకూ చాంతాడంత పొడవైన పేర్లను మనం చూడవచ్చు. ఉదాహరణకు బిల్లీ ఐలిష్ అనే అమెరికన్ రైటర్ కమ్ సింగర్ పేరునే చూడండి.. బిల్లీ ఐలిష్ పైరెట్ బేర్డ్ ఓ కానెల్. అలాగే ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు, మోనాలిసా సృష్టికర్త పికాసో పేరే తీసుకోండి.. పాబ్లో డియాగో జోస్ ఫ్రాన్సిస్కో డె పౌలా జువాన్ నెపోమూసెను మారియా డి లాస్ రెమెడియోస్ సిప్రియానో డి లా సంతిసిమా ట్రినిడాడ్ రూయిజ్ వై పికాసో. చూశారుగా ఎంత పెద్ద పేరో..?
అయితే, ఇవన్నీ మొదట మనం చెప్పుకున్న న్యూజిలాండ్ వాసి లారెన్స్ వాట్కిన్స్ పేరు ముందు తేలిపోతున్నాయి. తన పేరుతో అతనిప్పుడు.. ప్రపంచంలోనే అతి పెద్ద పేరు కల్గిన వ్యక్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్సుకెక్కాడు.

మరి వాట్కిన్స్ పేరు మార్పు వెనుక కథేంటి..?
1990 మార్చ్ నెలలో న్యూజిలాండ్ లో జన్మించిన లారెన్స్ తన పేరులో 2000కు పైగా కొత్త పదాలను మధ్యలో చేరుస్తూ చట్టపరంగా పేరు మార్పించుకున్నాడు. దాంతో లారెన్స్ వాట్కిన్స్ అతి పెద్ద పేరు కల్గిన వ్యక్తిగా పేరు సంపాదించాడు. మొత్తం 2 వేల 253 పదాలతో ఇప్పుడు లారెన్స్ వాట్కిన్స్ పేరు ఓ కొత్త రికార్డ్.
గిన్నీస్ ప్రతినిధులతో మాట్లాడుతూ లారెన్స్ ఏమంటాడంటే..?
రికార్డులంటే లారెన్స్ కు క్రేజీ. అందులోనూ కొందరు చేసే విచిత్రమైన రికార్డులు చూసినప్పుడు తానూ ఏదో ఒకటి చేసి రికార్డులకెక్కాలనే ఓ కుతూహలం లారెన్స్ లో ఉండేదట. అలా గిన్నీస్ బుక్ రికార్డ్స్ కు సంబంధించి క్షుణ్నంగా చదివి అధ్యయనం చేశాక.. తాను సంపాదించగల్గే ఏకైక రికార్డ్ ఏదైనా ఉందంటే అది కేవలం.. తన పేరును మరింత పొడవుగా, ఇప్పటివరకూ ప్రపంచంలోనే ఎవ్వరికీ లేనంత పెద్ద పేరుగా మార్చుకోవడమొక్కటే అనిపించిందంటాడు లారెన్స్.
1990ల కాలంలో కంప్యూటర్స్ కూడా పెద్దగా ఇంకా విపణిలోకి పెద్దగా రాలేదు. ఆ సమయంలో తన పేరు మార్చుకునే ప్రక్రియకు చాలా సమయం పట్టిందట లారెన్స్ కు. తన పూర్తి పేరు టైప్ చేయించుకోవడానికి కొన్ని వందల డాలర్లు ఖర్చు చేశాడు వాట్కిన్స్. స్థానిక జిల్లా కోర్ట్ లారెన్స్ అభ్యర్థనను ఆమోదించాక.. రిజిస్ట్రార్ జనరల్ మాత్రం తిరస్కరించాడు. దాంతో లారెన్స్ ఏకంగా న్యూజిలాండ్ హైకోర్టును కూడా ఆశ్రయించాడు. చివరకు లారెన్స్ కు అనుకూలమైన తీర్పు వచ్చింది. దాంతో ప్రపంచంలోనే అతి పెద్ద పేరు పెట్టుకున్న వ్యక్తిగా వాట్కిన్స్ పేరు సంపాదించుకున్నాడు.
చట్టాల్లో మార్పు!
లారెన్స్ పేరు మార్పు… అంత పెద్ద పేరు పెట్టుకోవడం న్యూజిలాండ్ లో ఓ పెద్ద చర్చగా మారింది. ఎంతలా అంటే.. ఏకంగా చట్టాలనే మార్చే స్థాయిలో లారెన్స్ పేరు మార్మోగిపోయింది. ఇంకెవ్వరూ కూడా భవిష్యత్తులో పరిమితిని మించి పేర్లు పెట్టకుండా ఏకంగా రెండు చట్టాలను సవరిస్తూ న్యూజిలాండ్ చట్టసభలు ఆమోదించాయి.
వాస్తవానికి లారెన్స్ వాట్కిన్స్ తన పేరును మొత్తం 2 వేల 310 పదాలతో కూడిన పేరుగా మార్చుకుంటే… గిన్నీస్ మార్గదర్శకాల్లో మార్పుల కారణంగా పేరును 2 వేల 253 పదాలకు తగ్గించి రికార్డ్సుకు ఎక్కించారు.
అంత పొడవైన, పెద్ద పేరును ఎలా ఎంపిక చేసుకున్నాడు..?
లారెన్స్ ఓ నగర గ్రంథాలయంలో పనిచేస్తుండేవాడు. చాలా పుస్తకాల్లోంచి పేర్లను తీసుకుని తన పేరులో అమర్చుకోవడంతో పాటు, సహోద్యోగుల సూచనల మేరకు మొత్తంగా ఓ పొడవాటి పేరును సృష్టించుకుని చట్టపరంగా అదే తన పేరుగా మార్చేసుకున్నాడు.
అలా A టూ Z వరకు అన్ని పదాలతో వచ్చేలా తన పేరును 2 వేలకు పైగా పదాలతో పేరు గొప్ప మనిషిగా లారెన్స్ వాట్కిన్స్ ఘనతకెక్కాడు.
మరి పేరు వల్ల ఎలాంటి సమస్యలెదురయ్యాయి..?
దరఖాస్తులు చేసుకునేటప్పుడు, గుర్తింపు కార్డుల్లో పేరు వేయాల్సి వచ్చినప్పుడు, ఇతరులు తన పేరును పిలవాల్సి వచ్చినప్పుడు ఇలా పలు సమస్యలెదుర్కొన్నాడు లారెన్స్. తన పేరులో మిడిల్ ఈస్ట్, ఆసియా, పోలినీషియా, యూరప్, మరిన్ని ఇతర దేశాల్లోని ఎన్నో పేర్లన్నీ వచ్చేలా తన పూర్తి పేరును ఎంపిక చేసుకున్నాడు. కొసమెరుపేంటంటే.. లారెన్స్ వాట్కిన్స్ పూర్తి పేరును పెళ్లి సమయంలో పలకడానికి 20 నిమిషాల సమయం పట్టిందట. ఇదండీ పేరులోనేముంది అంటే.. ఇదిగో ఇంత కథ ఉంది.



