ఈ పువ్వు ఆ పువ్వు అని
భేదంలేకుంట ఎన్నోరకాల పూలు
దేవుని పూజకు పవిత్రమని వాడుతరు.
చుట్టుమెట్టు దేశదేశాలపొన్న
గడ్డిపూలు, అడవిపూలు అనుకునే
ఎన్నోతీర్లపూలు తెలంగాణల పూజకెక్కుతయి.
గోగుపువ్వులేని శివరాత్రిపండుగ మనసునిండుద్దా.
మామూలుగ పొద్దటిపూట పూసే పువులనే
దేవునికి పూజలుగట్టుటానికి ఎక్కువగ వాడినా,
మాపటికి పూసే పువులుగుడ పూజకు పనికస్తయి.
రుద్రాక్ష,పొట్ల,బీర వంటివి బొడ్డెమ్మకు శ్రేష్టమైన పూలు.
ఇన్నితీర్లపూల నడుమ మల్లెపువ్వులు మాత్రం
వెనుకటిసంది మావైపున పూజలకు అసలుకే వాడరు.
ఏడనోవోకాడ ఎవరోఒకరు వాడితే అది లెక్కలకు రాదుగద.
లోకులు నమ్మదే,నడిచేదే.. సంస్కృతికి ముఖ్యమైన ముచ్చట.
మల్లెపూలను దేవునికి ఎంతదూరం పెడుతరో,
మనుషులు తమకోసం అంతగనం పీర్తిజూపిస్తరు.
మల్లెచెట్టు, మల్లెపూలు మాకోసమే అన్నట్టుగవుంటది.
మనుషులవైపునుంచి మల్లెపూవుకు మారుపువ్వు లేదేమో..!!
. డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి.. ✍🏻, ప్రొఫెసర్.
మచ్చుకు చూస్తే–
దేవునిజాబితా పూలు: మోదుగుపూలు
మనుషులజాబితా పూలు: మల్లెపూలు
ఉమ్మడిజాబితా పూలు: బంతిపూలు
ఇది, మన పువ్వులు-మన పూజలు-మన సంస్కృతి.
(పూలు అనుటానికంటే, పువులు అనేమాటకే మా దగ్గర చెల్లుబడి)



