త్యాగయ్యగారు సంగీత విద్వాంసులైతే కావచ్చు.. కానీ, కవి ఎలా ఔతారు.. ? అనేవారూ లేకపోలేదు. అటువంటి వారు త్యాగయ్య గారి కృతుల సాహిత్యాన్ని సమగ్రంగా పరిశీలిస్తే.. ఆమాట అనలేరు. ఆయన కవితావైభవాన్ని కళ్ళకు కట్టే ఒక కృతి మీ ముందుంచుతాను. అది మందారి రాగ కృతి. ఆ కృతిలో త్యాగయ్య.. కలిమానవుడి అగమ్యగోచర మానసిక స్థితిని వర్ణిస్తారు.
పరలోక భయము లేక భవపాశబద్ధులయ్యేరు.. ఇదీ కృతి యొక్క పల్లవి.
పాపాలు చేస్తే నరకానికి, పుణ్యం చేస్తే స్వర్గానికి పోతామనే భయం లేదు ఈ కలినరులకు! అటు రాజ్యాలేలే రాజులనుండి, ఇటు మధ్యతరగతి జీవులదాకా ఇదే పరిస్థితి. ఈ భూమినే స్వర్గమనుకుంటూ.. ఏదో భ్రాంతితో బ్రతికేస్తూ.. తాము అనుభవిస్తున్న క్షణికానందాలనే స్వర్గసౌఖ్యాలని నమ్ముతూ.. వాటిని పొందటానికై చేయకూడని పనులు చేస్తూ.. పాపభీతి లేక సంచరించే వారికి… త్యాగయ్య వేసిన చక్కటి చురకలు ఇవి.

అనుపల్లవిలో.. విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ.. గజ, అశ్వాది సకలసైన్య సమేతులై.. అద్భుత శిల్పసౌందర్యంతో.. ఉద్యానవనాలతో అలరారే అంతఃపురాది శృంగార ఆరామాలకు అధిపతులై.. నిత్యం పల్లకీల్లో తిరిగే రారాజులు.. తమ పదవే శాశ్వతమని.. ఈసౌఖ్య సంపదలే నిత్యమని.. అవన్నీ తమకుగాక ఎవరికి కల్గుతాయని.. అని విర్రవీగుతున్నారంటారు త్యాగయ్య. అయితే, జరిగేది అందుకు పూర్తి భిన్నమేనని.. ఎవరైనా చివరికి చేరవలసింది కాటికేనన్న వైరాగ్యస్ఫూర్తిని చెబుతారు త్యాగయ్య!
ఇక చరణంలో.. సగటు సామాన్య మానవుడు సైతం.. కన్యాశుల్కమిచ్చి ఖరీదుచేసిన భార్యలతో.. గంపెడు సంతానాన్నికని.. వారిని సాకటంలో నిరంతరం తరిస్తూ.. రంగురంగుల చీరలను.. వానకు కురిసే గుడిసెలను చూసుకుని పొంగిపోతూ.. స్వర్గం మరెక్కడో లేదని మాయలో పడిపోతున్నాడనీ వాపోతారు త్యాగయ్య.
ఏ దేవుని పేరూ చెప్పకనే.. తన ఇలవేల్పైన శ్రీరాముడి కరుణ కలిగి.. స్వర్గలోకాన్ని చేరుకోవాలంటే.. దుర్లభమైన మానవజన్మను సత్కార్యాలతో, భగవద్భక్తితో సార్థకం చేసుకోమని మనకు సూచిస్తారు త్యాగయ్య.
‘తన్నుకోళ్ళు’ అనే విశేషమైన పదాన్ని చరణంలో ప్రయోగించారు అయ్యగారు. తన్నుకోవడాలు, మాయ, లేదా సందిగ్ధావస్థలో పడికొట్టుకోవడాలని ఆ పదానికి అర్థం. తెలుగుభాషలో కనుమరుగైన పదాల్లో ఇదీ ఒకటి. కలిమానవుడి స్థితిని తెలియజేయడానికి ఇంతకంటే సరైన పదం దొరకదు. ప్రత్యేకించి.. చరణంలో త్యాగయ్యగారు కవితాత్మకంగా చెప్పిన పదాలు.. ఆయన భాషాచమత్కారానికి నిదర్శనాలు. తను చెప్పదలచిన విషయాన్ని అక్షరగతంగా అందరికీ దృగ్గోచరం చేశారు.
త్యాగయ్యగారు రచించిన తత్త్వబోధ కృతుల్లో తలమానికమైనది ఈ కృతి. ఈ కృతిని పాడితే, వింటే సరిపోదు. దీనిలోని భావసౌందర్యాన్ని అర్థంచేసుకొని, ప్రతివారూ త్యాగయ్య చూపిన నైతిక మార్గాన్ని అనుసరించటానికి ప్రయత్నిస్తే.. అదే ఆ మహానుభావుడుకిచ్చే నిజమైన నివాళి
ఇప్పుడు ఆ కృతిని చూడండి..
—మందారి-ఆది-త్యాగరాజస్వామి—
పల్లవి: పరలోకభయము లేక భవ-
పాశబద్ధులయ్యేరు || పరలోకభయము
అనుపల్లవి: కరి, వాజి, శృంగారారామ శిబి-
కాదులెల్ల మనకే కల్గెనని || పరలోకభయము
చరణం: కొన్న కాంతలను,కన్నబిడ్డలను,
వన్నె చీరెలను, వాన గుడిసెలను
తిన్నగా గని, దేవలోకమనే
తన్నుకోళ్ళలో త్యాగరాజనుత! || పరలోకభయము
Modumudi Sudhakar… ✍️



