ప్రపంచంలో జనం ఇష్టపడే స్యాండ్ విచెస్ లో… మన వడాపావు స్థానం 19. ఫుడ్ అండ్ ట్రావెట్ గైడ్, టేస్ట్ అట్లాస్ వంటి సంస్థలు కలిసి నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయమిది. అలాంటి, వడాపావంటే తెలియని వారుండరేమో! ముఖ్యంగా ముంబైతో పరిచయమున్నవారికి.. మహారాష్ట్ర కల్చర్ తో అంతో ఇంతో అనుబంధమున్నవారెందరికో నోరూరించే స్యాండ్ విచ్. ముంబై మహానగరంలో ఎందరికో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్. అసలెవరు వడాపావు తయారీకర్త..?

అశోక్ వైద్య… అతి తక్కువలో జనం ఉవ్విళ్లూరే వడాపావును తయారుచేసిన ఓ క్రియేటివ్ చెఫ్. 1966వ సంవత్సరంలో ముంబైలోని టెక్స్ టైల్ మిల్స్ లో వర్కర్స్ కి వడాపావే ఉదయం టిఫిన్ గా మారిన నేపథ్యం నుంచి… ముంబై మొత్తం పొద్దున్నే తమ డ్యూటీలకు వెళ్లే సమయంలో తినే టిఫిన్ గా కూడా వడాపావు అనే స్యాండ్ విచే డామినేట్ చేస్తోందంటే.. వడాపావు టెస్టుకు ముంబైకర్స్ ఎంతగా అలవాటు పడ్డారో అర్థం చేసుకోవచ్చు.
కొన్ని మీడియా ఇంటర్వ్యూస్ లో అశోక్ వైద్య కుమారుడైన నరేంద్ర చెప్పిన మాటల ప్రకారం 1960ల్లో తన తండ్రి వడతో పాటు.. పోహా తయారుచేసి అమ్మేవారు. కానీ, మిల్స్ కు, ఇతర ఉద్యోగాలకు హర్రీబర్రీగా ఉదయం లేస్తేనే వెళ్లేవారి సంఖ్య విపరీతంగా పెరిగి.. వారికి ఇన్ స్టంట్ ఫుడ్ అవసరమేర్పడిన కాలాన్ని గుర్తించిన తన తండ్రి చేసిన సృష్టే వడాపావు అంటాడు నరేంద్ర.
మహారాష్ట్ర సంప్రదాయ వంటకమైన వడ అంటే.. బటాటా వడ. తెలుగు రాష్ట్రాల్లో దాన్నే ఆలుబోండాగా కూడా పిలుస్తాయి. అలాంటి బటాటా వడాను పావులో పెట్టి… వాటికి మరికొన్ని చట్నీల వంటివి యాడ్ చేసి.. దాన్ని మరోసారి పెనంపైన వేడి చేసేస్తే సరి. వడాపావు రెడీ. ఇంకేం.. అశోక్ వైద్య సృష్టితో రూపుదిద్దుకున్న వడాపావు ముంబైకర్స్ కు అమితంగా నచ్చింది. ఎంతగా అంటే.. ముంబైలో ఫుడ్ బిజినెస్ చేస్తే వడాపావు బిజినెస్సే చేయాలని చిన్న, మధ్యతరహా వ్యాపారులంతా ఆలోచించాల్సినంత స్థాయిలో అన్నమాట. అందుకే, ముంబైలో వడాపావు బండ్లు, హోటళ్లు పుట్టగొడుగుల్లా కనిపిస్తాయి. ఫుడ్ బిజినెస్ లో వడాపావు తర్వాతే ముంబైలో ఇంకే బిజినెస్ దైనా స్థానమంటే నమ్మాల్సిందే మరి.
వడాపావు సృష్టికర్త అశోక్ వైద్య 1998, జూలై 6వ తేదీనే మరణించగా… ఇప్పుడా బిజినెస్ ముంబైతో పాటు… మహారాష్ట్ర సంప్రదాయ వంటకంగా మారిపోయి.. ఇతర రాష్ట్రాల ఆహారప్రియుల జిహ్వచాపల్యానికీ కారణమవుతుండగా… అశోక్ వైద్య వడాపావు బిజినెస్ మాత్రం యథావిధిగా నడుస్తూనే ఉంది. ఇప్పటికీ దాదర్ లోని వెస్టర్న్ లైన్ ప్లాట్ ఫామ్ నంబర్ 1 దగ్గర వడాపావు సృష్టికర్తైన అశోక్ కుమారుడి నేతృత్వంలోని వడాపావు బిజినెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఒకనాడు మిల్ వర్కర్స్ ను దృష్టిలో పెట్టుకుని.. తన వ్యాపార అభివృద్ధి కోసం అశోక్ వైద్య చేసిన వడాపావు అనే ప్రయోగం వికసించి… ఇప్పుడు డైలీ లేబర్ దగ్గర నుంచి ఫిల్మ్ స్టార్స్, స్పోర్ట్స్ సెలబ్రిటీస్, బిజినెస్ టైకూన్స్ వరకూ అమితంగా ఇష్టపడే స్యాండ్ విచ్ గా మారిపోయింది. అందుకే మన వడాపావుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో స్యాండ్ విచెస్ లో… 19వ స్థానం దక్కింది. మరి మహారాష్ట్ర వడాపావా.. మజాకా..?



