పర్యావరణ పరిరక్షణలో.. స్కూబాడైవర్ గా ఓ ఇల్లాలు!

నేర్చుకోవడానికి… సాహసించడానికీ వయస్సులో పనిలేదని నిరూపిస్తోంది ఆ నడి వయస్కురాలు. అందుకే సముద్రంలోని జీవవైవిద్యాన్ని కాపాడేందుకు స్కూబా డైవింగ్ నేర్చుకుంది. ఒకింత భయపడుతూనే సరాదాగా మొదలైన ఆమె స్కూబా డైవింగ్… ఇప్పుడు పగడపు దిబ్బల సంరంక్షణ కొరకు.. పర్యావరణ పరిరక్షణ కొరకు అలుపెరుగకుండా సాగుతోంది. ఆమే.. తమిళనాడుకు చెందిన 50 ఏళ్ల ఉమామణి.

హౌజ్ వైఫ్ కాస్తా స్కూబా డైవర్ గా అవతరణం!

వెట్ సూట్, ఫ్లిప్పర్స్, మాస్క్.. మొత్తంగా 20 కిలోల బరువును శరీరంపై మోస్తూ సముద్రంలోకి డైవ్ చేస్తోంది స్కూబా డైవర్ గా ఉమామణి. చెన్నైలోని ఓ సంప్రదాయవాద కుటుంబంలో పుట్టిన ఉమకు పెద్ద ఆశలేమీ లేవు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో ఉన్నత విద్య పూర్తయ్యాక.. అందరిలానే ఆమె వివాహం చేసుకుని మాల్దీవుల్లో డాక్టర్ గా పనిచేస్తున్న తన భర్తతో కలిసి 2004లో ఓ నవవధువుగా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె ఓ సాధారణ గృహిణిగానే కొనసాగింది. కాకపోతే, చిన్నప్పట్నుంచీ ఉమకు చిత్రకళ, పెయింటింగ్ పై ఆసక్తి మెండుగా ఉండేది. కానీ, తన ఇంటి పనులతో పెయింటింగ్ నేర్చుకునే అవకాశం రాలేదు. దాంతో ఓ సాధారణ గృహిణిగానే ఉంటూ.. తనకొచ్చిన విద్యను పిల్లలకు ట్యాషన్ గా చెబుతూ.. తన భర్త, కుటుంబీకులతో కలిసి అప్పుడప్పుడూ యాత్రలకు వెళ్తుండేది. అదే సమయంలో పీహెచ్డీ చేయాలన్న సంకల్పం కూడా తనలో ఉండేదంటోంది ఉమామణి.

45 ఏళ్ల వయస్సులో తన బలమైన కాంక్షైన పెయింటింగ్ లో తర్ఫీదు పొందిన ఉమ.. విభిన్న రకాల పెయింటింగ్స్ వేస్తున్న క్రమంలో.. ఓసారి కోరల్ రీఫ్స్ డాక్యుమెంటరీ ఒకటి చూసింది. దాంతో ఉమకు సముద్రం అంతరభాగంలో కనిపించే పగడపు దిబ్బలపై ఆసక్తి ఏర్పడింది. వాటి రంగుల కలయిక, నీలిరంగులోని ఆ సముద్రపు నీటి మధ్యలో ఏదో బ్యూటీ ఉంది.. వాటిని పెయింట్ చేయాలంటే.. ముందుగా వాటిని చూసి రావాలి అనే ఒక క్యూరియాసిటీతో.. సరిగ్గా 49 ఏళ్ల వయస్సులో స్కూబా డైవింగ్ సర్టిఫికెట్ కోర్స్ కూడా పూర్తి చేసి.. సముద్రపు నీళ్లల్లో దూకి ఈత ప్రారంభించింది ఉమామణి.

అసలు పగడపు దీవులంటే ఏంటన్న ఆసక్తే ఉమను సముద్రమార్గం పట్టించింది.

కానీ, పగడపు దిబ్బలంటే కేవలం మట్టిపెల్లలు కావని.. రంగురంగుల్లో కనిపిస్తుండటంతో రాళ్లనుకుని ఏర్పడ్డ భ్రమ అని గ్రహించిన ఉమ.. మరింత లోతుగా వాటిపై పరిశోధన మొదలెట్టారు. రాళ్లలా కనిపిస్తున్న ఆ పగడపు దీవులు.. పాలిప్స్ అనే ఓ జీవజాతి అని గ్రహించింది. పాలిప్స్, ఆల్గే అనే రెండు జీవజాతుల సహజీవనంతో.. పగడపు దిబ్బలేర్పడతాయని తెలుసుకున్న ఉమకు.. పెయింటింగ్ కోసం సముద్రంలోపల ఎంత అందంగా ఉందని డాక్యుమెంటరీ చూసినప్పుడు అనిపించిందో… లోపలికి వెళ్లి శోధించేకొద్దీ అంతకు భిన్నమైన వాతావరణం కనిపించింది. పర్యావరణపరంగా సముద్రాలు ఎంత దెబ్బ తింటున్నాైయి. సముద్రాల్లోని ఎన్నో జీవజాతులకు నెలవుగా, కొలువులా ఉండే పగడపు దీవులు.. మానవులు వేసే వ్యర్థాలు, ప్లాస్టిక్ తో ఎలా కాలుష్యమయమవుతున్నాయో ఉమ గమనించడం మొదలెట్టింది. దాంతో సరదాగా ప్రారంభమైన స్కూబా డైవింగ్ ప్రయాణం.. పర్యావరణంపై ఓ నడి వయస్కురాలి పోరాటానికి నాందిగా మారింది.

ఓ చెత్తకుండీలా మారిన సముద్రాన్ని చూసి చలించిన ఉమ!

భూతాపంతో పాటు.. కాలుష్య ప్రభావంతో.. జూజాంతలీ, పాలిప్స్ ను విడిచి వెళ్లటం ద్వారా.. పగడపు దీవులు ఇప్పుడు అంతరించే ప్రమాదంలో పడ్డాయి. భూతాపాన్ని తగ్గిస్తేనేగానీ.. పగడపు దిబ్బలకు ఇప్పుడు మనుగడ లేదు. అవే లేకపోతే.. జీవ వైవిద్యానికే పెద్ద దెబ్బ. సముద్రంలో కనిపించే చమురు, రసాయనాలు, ప్లాస్టిక్ వంటివాటితో ఇప్పుడు సముద్రం చెత్తకుండీని తలపిస్తోందని భావించిన ఉమ.. పర్యావరణాన్ని కాపాడేందుకు తన స్కూబా డైవింగ్ ను ఓ ప్రొఫెషనల్ లా కొనసాగించింది. అందుకు ఉమ కుటుంబీకుల నుంచీ తగిన ప్రోత్సాహం లభించింది. అలా సముద్రం అంతరభాగంలోని పగడపు దిబ్బలపై రీసెర్చ్ మొదలెట్టిన ఉమ.. పర్యావరణపరంగా దెబ్బతింటున్న ఎకో సిస్టమ్ ను కాపాడేందుకు నడుం బిగించింది. ఆ క్రమంలో ప్రియా తవస్సేరి అనే ఓ డాక్యుమెంటరీ దర్శకురాలిని కలిసింది. పగడపు దీవులపై ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపొందిద్దామని అడిగింది.

ప్రియ ఒప్పుకోవడంతో ఉమ ప్రయత్నం.. ఓ ముందడుగు నాంది అయింది.

అలా 2019లో కోరల్ ఉమన్ పేరుతో ఉమ.. ప్రియ దర్శకత్వంలో సముద్ర అంతరభాగంలోని సముద్రపు దీవులపై ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. సముద్ర జీవులకు జరుగుతున్న నష్టం, వ్యర్థ రసాయనాలు, ప్లాస్టిక్, ఇతర చెత్త పేరుకుపోవడం వల్ల విలువైన.. వైవిద్యమైన పర్యావరణ సంపద ఎలా వినాశమవుతుందో డాక్యుమెంటరీతో అవగాహన కల్పించింది ఉమ. మొత్తంగా బాధ్యతారాహిత్యంగా చెత్తను సముద్ర జలాల్లో పారేస్తున్నవారికి ఓ చెంపపెట్టులా… కళ్లు తెరిపించే ఓ ఐ ఓపెనర్ లా వారు తీసిన డాక్యుమెంటరీ విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఓ అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీగా నిల్చింది.

కోరల్ ఉమన్ డాక్యుమెంటరీతో పాటు.. ఉమ తాను నేర్చుకున్న పెయింటింగ్ తో కూడా ఇప్పుడు సముద్ర జలాలను, అందులో పగడపు దీవులను కాపాడుకునేందుకు పలు ఆర్ట్ ఎగ్జిబిషన్స్ నూ నిర్వహిస్తోంది. సమాజంలో తీసుకురావల్సిన పరివర్తనపై తనవంతుగా కృషి చేస్తోంది. కళ చాలా శక్తివంతమైన మాధ్యమమని నమ్ముతూ.. ఓ సాధారణ గృహిణి.. ఓ స్కూబా డైవర్ గా సరదాగా సముద్రంలోకి దిగి.. ఇప్పుడు ఓ పర్యావరణవేత్తగా అవతరించి వార్తల్లోకెక్కింది.

పలు పాఠశాలలు, కళాశాలలు, కార్పోరేట్ సంస్థల్లో కూడా సముద్ర కాలుష్యం, పగడపు దీవులపై అవగాహన కల్పిస్తున్న ఉమను.. సోనీ బీబీసీ ఎర్త్.. ఎర్త్ ఛాంపియన్ ఆఫ్ ది మంత్ అవార్డ్ తో సత్కరించింది.

ఎంత మహా సముద్రమైనా.. దానికి మాట్లాడేందుకు నోరు లేదు. అది దాని బాధ చెప్పలేదు. అందులోని జీవుల పరిస్థితీ అంతే. నేను చేసింది కేవలం చిన్న ప్రయత్నం మాత్రమే. కానీ, సమాజం మొత్తం దాన్ని గమనించి.. సవ్యదిశలో అర్థం చేసుకుంటే… తమతో చేయి కలుపగల్గితే.. కచ్చితంగా పర్యావరణాన్ని కాపాడుకోగల్గుతామనేది ఉమామణి మోటో.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles