సంగీతం కోసం ఓ లోయకు క్యూ కడుతున్న ప్రపంచం!

వెదురు బొంగుల వేదిక.. పచ్చని పొలాల మధ్య సంగీతం… ఈ జీరో ఫెస్టివల్ కథేంటో మీకు తెలుసా..?

సాధారణంగా నేటి ఓ పెద్ద సంగీత కార్యక్రమమంటే ఏం గుర్తొస్తాయి..? భారీ వేదికలు, వేల వాట్ల లైట్లు, భారీ ఎల్ఈడీలు, ప్లాస్టిక్ గ్లాసులు, ఫుడ్ కోర్టులు, ఎక్కడ చూసినా జన సందడి.. ఇవే కదా..?

కానీ, అరుణాచల్ ప్రదేశ్ జీరో వ్యాలీ ఈ నిర్వచనాన్నే మార్చేసింది!

చుట్టూ పచ్చని పొలాలు, కొండలపై పైన్ చెట్లు, చల్లటి గాలి, మబ్బుల్లోంచి ఆ కార్యక్రమాన్ని జనంతో పాటే తొంగిచూసే కొండలు.. మధ్యలో కంక బొంగులతో తయారైన వేదిక!

ఇలాంటి వేదికపై ఇక సంగీతం మొదలవుతుంది. అది రాక్, ఫోక్, జాజ్, పాప్, ఎలక్ట్రానిక్ ఏదైనా కావచ్చు. అది ప్రకృతితో మమేకమవుతుంది. ప్రకృతిని వేదిక నుంచి బయటకు పంపకుండా… ప్రకృతినే వేదిక చేసే సంగీతోత్సవమిది.

దీన్నే జీరో ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్ అని కూడా పిలుస్తారు.

ఈ ఉత్సవం వెనుక ఓ లోయ కథా తెలుసుకోవాలి!

ఇక్కడ జీరో అంటే అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ లోయ పేరు. ఆపతాని అనే గిరిజన సమాజానికి జీవన ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 15 వందల మీటర్ల ఎత్తులో ఉండే ఈ పర్వత సానువుల్లో.. ఆపతానీలు ప్రకృతితో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని పెనవేసుకుని జీవిస్తున్నారు. వీరి వ్యవసాయ విధానాలే అందుకు ఉదాహరణలు.

ఒక పొలంలో వరి పండిస్తూనే.. అదే పొలంలో చేపల చెరువులను తవ్వి.. ప్యాడీ కమ్ ఫిష్ కల్చర్ విధానాన్ని పాటిస్తున్నారు. కొండల నుంచి జాలువారుతూ వచ్చే జలపాతాలను పొలాలకు మళ్లిస్తూ, అడవులను, పరిమితంగా ఉన్న భూమిని కాపాడుతూ వ్యవసాయం, మరోవైపు ఫిషింగ్ చేయడంలో నేర్పరులు ఈ ఆపతానీ గిరిజనులు.

యునెస్కో గుర్తింపు!

అందుకే యునెస్కో ఆపతాని కల్చరల్ ల్యాండ్ స్కేప్ ను తన వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్ట్ లో చేర్చింది. ఇక్కడ మనిషి, వ్యవసాయం, అడవి, నీటి వనరులు, సంప్రదాయాలు అన్నీ కలిసి ఒక సానుకూల జీవన సాంస్కృతిక భూదృశ్యాన్ని ఎలా నిర్మించాయో యునెస్కో వివరించింది.

మరి అసలు జీరో వ్యాలీ ఫెస్టివల్ నేపథ్యం ఏంటి..?

2012లో మొదలైన ప్రయోగం ఇప్పుడు ఎల్లలు దాటి ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. బాబీ హానో, అనూప్ కుట్టి అనే ఇద్దరు సంగీతకారులు కలిసి ఈ జీరో వ్యాలీలో మ్యూజికల్ ఫెస్టివల్ కు 2012లో శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో అంత పెద్దగా దీని గురించి ఎవ్వరికీ తెలీదు. ఆ తర్వాత ఊహించనంత ఎత్తులో ఈ మ్యూజిక్ ఫెస్ట్ కు ఆదరణ లభిస్తుందనీ ఎవ్వరూ ఊహించలేకపోయారు.

ముఖ్యంగా ఇది పెద్ద పెద్ద సంగీత దర్శకుల కోసమో, పేరు మోసిన సంగీత కళాకారుల కోసమో కాకుండా.. ఇండిపెండెంట్ ఆర్టిస్ట్సు కు ఒక వేదిక కావాలన్న ఉద్ధేశంతో ఏర్పాటు చేశారు. ఈశాన్య భారతంలోని కళాకారులను దేశ, విదేశాల్లో పరిచయం చేయాలన్న సంకల్పం ఈ వేదిక ఏర్పాటు వెనుక ఉంది. కానీ, ఆ తర్వాత జీరో ఫెస్ట్… స్థానిక సంగీతం నుంచి మొదలు, భారత్ లోని ఇతర ప్రాంతాలు, అంతర్జాతీయ స్వతంత్ర కళాకారులెందరి సంగీతంతోనో మార్మోగిపోయింది. ఇప్పుడు ఇండిపెండెంట్ కళాకారులకు దేశంలోనే ఓ ప్రముఖ వేదికగా చిరునామా అయ్యింది.

వెదురుబొంగు వేదికా ఇక్కడ ప్రత్యేకతే!

జీరో వ్యాలీ ఫెస్టివల్ కు వెళ్లేవారిని ఆకట్టుకునేది కేవలం సంగీతం మాత్రమే కాదు.. ఇక్కడి వేదిక నుంచి మొదలు ఇక్కడ అమలయ్యే ప్రతీ విషయం ఎకో ఫ్రెండ్లీగా స్ఫూర్తినిచ్చేవి.

భారీ స్టీల్ నిర్మాణాలు, శాశ్వతంగా నిర్మించిన కాంక్రీట్ వేదికలకు బదులు.. స్థానికంగా లభించే వెదురు, కలప వంటివాటితో అందంగా నిర్మించే ఇక్కడి వేదిక నుంచి మొదలు అన్నీ ప్రకృతిసిద్ధంగా మమేకమైనవే కనిపిస్తాయి. పైగా ఈ వేదికను తయారుచేసేది ఆపతాని స్థానిక కళాకారులే.

ప్రతీ సెప్టెంబర్ మాసంలో జరిగే ఈ జీరో మ్యూజికల్ ఫెస్టివల్ కు సుమారు 40 రోజుల పాటు కష్టపడి… రెండు ప్రధాన వేదికలను స్వహస్తాలతో తయారు చేస్తారు ఆపతాని కళాకారులు.

ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం!

ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వెతికినా కనిపించదు. ప్లాస్టిక్ బాటిల్స్ విక్రయం మాటే ఉండదు. 2018 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రేక్షకులు తమ సొంత వాటర్ బాటిల్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఫెస్ట్ కు వచ్చే వారికోసం ఉచితంగా వాటర్ రీఫిల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు ఆకులు, బయోడీగ్రేడబుల్ ప్లేట్స్ ఉపయోగిస్తారు. పానీయాలనకు వెదురుతో చేసిన మగ్గులుంటాయి. సైన్ బోర్డులు కూడా ప్లాస్టిక్ తో చేసిన ఫ్లెక్సీలతో కాకుండా.. రీక్లెయిమ్డ్ వుడ్ (అంతకుముందు ఉపయోగించిన కలప చెక్కలు) తో ప్రదర్శిస్తారు. మొత్తంగా పర్యావరణం గురించి చాలాచోట్ల కనిపించినట్టు ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదు. అణువణువూ, అడుగడుగూ పర్యావరణహితంగా ఎలా ఉండాలో ఇక్కడి జీరో మ్యూజికల్ ఫెస్ట్ పరిసరాలు వచ్చే జనానికి సందేశాన్నిస్తుంటాయి.

స్థానికులకు పని కల్పిస్తున్న ఫెస్ట్!

ఇక్కడ స్థానికులు 300 మంది వరకూ కార్మికులు, కళాకారులు, ఆర్కిటెక్ట్ లు ఒక బృందంగా కలిసి పనిచేస్తారు. వెదురు బొంగులతో స్టేజ్ నిర్మాణం నుంచి విద్యుత్ దీపాల అలంకరణ వరకూ స్థానిక నైపుణ్యానికే ప్రాధాన్యత. దీంతో ఫెస్టివల్ కు వచ్చే డబ్బు మొత్తం కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోదు. స్థానికులకే ఉపాధి లభిస్తుంది. అలాగే, ఈ ఫెస్ట్ వల్ల హోంస్టేలకు ఆదాయమూ లభిస్తోంది. స్థానిక ఆహారానికి మార్కెట్ పెరుగుతోంది. హస్తకళలకు గిరాకీ పెరుగుతోంది. ఇలా జీరో వ్యాలీ మ్యూజికల్ ఫెస్ట్ ఒక చిన్న ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థగా మారి ఈ ప్రాంతానికి దన్నుగా నిలుస్తోంది.

ముఖ్యంగా ఆపతాని సమాజంలో హోంస్టేస్, హాస్పిటాలిటీ రంగానికి గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలతో ఇక్కడి పర్యాటక రంగం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

సంగీతాన్ని మించి ఆపతాని రుచులు!

జీరో మ్యూజిక్ ఫెస్ట్ కు వచ్చేవారు కేవలం సంగీతం కోసమే రారు.. ఇక్కడి స్థానిక ఆహారం కూడా పర్యాటకులను ఆకట్టుకునేది. స్మోక్డ్ పోర్క్, వెదురు బొంగుల్లో వండే చికెన్, ఫెర్మెంటెడ్ వెదురుబొంగుల్లో తయారు చేసే వంటకాలు, స్థానికంగా పండించే బియ్యం ఆధారిత ఆహారాలు ఇక్కడి ప్రత్యేకత. ఫెస్ట్ లో స్థానిక యువతదే హవా. హోం చెఫ్ లుగా, చిన్న వ్యాపారులుగా వీరే ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తారు.

అంటే మ్యూజిక్ వినడానికి వచ్చిన ఓ వ్యక్తి మొత్తంగా ఈ ప్రాంత పర్యావరణంతోనూ, సంస్కృతితోనూ ప్రేమలో పడిపోతాడు.

ప్రపంచ సంగీతానికి వేదికైన ఓ లోయ కథ ఇది!

ఇది మొదట ఈశాన్య రాష్ట్రాల కళాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటైనా.. అక్కడితో ఆగిపోలేదు. లీ మార్క్ రనాల్డో, స్టీవ్ షెల్లీ వంటి సోనిక్ యూత్ ఆల్టర్నేటివ్ రాక్ బ్యాండ్ నుంచి జపాన్ కు చెందిన ఇన్స్ట్రుమెంటల్ పోస్ట్ రాక్ బ్యాండ్ మ్యూజిషయన్స్ మోనో, యూకేకి చెందిన జాజ్ సాక్సఫోన్ వాద్యకారిణి నుబ్యా గార్సియా వంటి అంతర్జాతీయ ఇండిపెండెంట్ కళాకారులంతా ఇక్కడి పర్యావరణ సంగీత వేదికపై తమ సంగీతంతో అలరించారు. అందుకే, కేంద్ర పర్యాటక శాఖ కూడా జీరో వ్యాలీని ప్రపంచంలోని 40కి పైగా ఇండిపెండెంట్ మ్యూజిక్ యాక్ట్స్ ను ఒకే వేదికపైకి తీసుకొచ్చే నాల్గు రోజుల సంగీతోత్సవంగా పేర్కొంది.

ఈసారి 2026 సెప్టెంబర్ 24 నుంచి 27వరకు జరిగిన ఎడిషన్ లో కూడా భారత్ తో పాటు, శ్రీలంక, అల్జీరియా, ఐర్లాండ్, పాలస్తీనా, నేపాల్, థాయ్ లాండ్, కొరియా తదితర దేశాలకు చెందిన కళాకారులెందరో ఈ నాల్గు రోజుల వేడుకల్లో పాల్కొన్నారు. మొత్తం 41 విభిన్న రకాల ప్రదర్శనలతో ఈసారి 13వ ఎడిషన్ కూడా విజయవంతంగా సాగింది. ఒక ప్రాంతానికి చెందిన వేదిక విస్తరించి.. ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచీ వచ్చినవారి భిన్న స్వరాల సమ్మేళనం ఇక్కడ చూడొచ్చు.

ప్రశంసలతో పాటే విమర్శలు కూడా!

అయితే, జీరోకు ప్రశంసలతో పాటే, ఈమధ్య విమర్శలూ పెరుగుతున్నాయి. టిక్కెట్ల ధరలు అమాంతం పెరగడం, పర్యాటకుల సంఖ్య పెరగడం, స్థానికంగా పడుతున్న ఒత్తిడి, వచ్చిపోయేవారితో డ్రగ్స్ వినియోగంపై కొందరు స్థానికుల ఆందోళనలు ఇప్పుడు చర్చనీయాశంగా మారాయి. ఫెస్ట్ వల్ల తమ ప్రాంతానికి వచ్చిన గుర్తింపు, ఆర్థిక ప్రయోజనాలకు సంతోషపడే ఇక్కడి ప్రజానీకం.. ఇప్పుడు ప్రధానంగా డ్రగ్స్ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకు జీరో వ్యాలీ మ్యూజికల్ ఫెస్ట్ ప్రత్యేకం..?

ప్రపంచంలో ఎన్నో గొప్ప మ్యూజిక్ ఫెస్టివల్స్ ఉన్నాయి. కొన్నింటికి భారీ వేదికలుంటాయి. మరికొన్ని లైటింగ్ తో అదరగొడతాయి. ఇంకొన్నిచోట్ల ప్రసిద్ధ కళాకారుల కార్యక్రమాలు అలరిస్తాయి. కానీ, జీరో ప్రత్యేకతేంటంటే ఇది సంగీతాన్ని ఓ ప్రాంత సంస్కృతితో కలిపిన ఈవెంట్. సంస్కృతిని, సంగీతాన్ని ప్రకృతితో మమేకం చేసి.. ఒక ప్రాంత ఆర్థిక వ్యవస్థగా మారిన మ్యూజికల్ షో. అలాగే స్థానిక కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసిన వేదిక. అందుకే ఇది కేవలం నాల్గు రోజుల సంగీతోత్సవం మాత్రమే కాదు.. ప్రకృతిని బ్యాక్ డ్రాప్ గా కాకుండా భాగస్వామిగా మార్చుకున్న ఫెస్టివల్.

మనదేశంలో పర్యాటకం పెరుగుతున్నకొద్దీ.. ప్రకృతిసిద్ధమైన ప్రాంతాల్లో వివిధ రకాల కార్యక్రమాల రూపకల్పన జరుగుతోంది. ఇలాంటి సమయంలో అరుణాచల్ ప్రదేశ్ జీరో లోయలో జరిగే ఈ మ్యూజికల్ ఫెస్ట్ అందుకో మాడల్ గా నిలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక లోయ తన సంస్కృతిని మేళవించి సంగీత రూపంలో ప్రపంచానికి చెబుతున్న ఓ కథ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles