సామాన్యుడి నుంచి విజ్ఞానశాస్త్రాన్ని ఛేదించే శాస్త్రవేత్తల వరకూ ఇప్పుడు జరుగుతున్న ప్రధాన చర్చ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరిగి రావడం గురించే.
భారతీయ మూలాలున్న సునీతా, తన మరో సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి వెళ్లి గత రెండు నెలలుగా బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుకోవడం ఇప్పుడో గ్లోబల్ చర్చ!

సునీతా, బుచ్ విల్మోర్ ను తీసుకురావడానికి మరో ఆర్నెల్లు సమయం పడుతుందని.. వచ్చే 2025 ఫిబ్రవరిలో వారు భూమ్మీదకు వస్తారని నాసా చెబుతోంది. అదీ తాము పంపిన బోయింగ్ స్టార్ లైనర్ లో కాకుండా.. ఎలాన్ మస్క్ వంటి గ్లోబల్ బిజినెస్ మ్యాన్ సంధించే ప్రైవేట్ space X CREW-9 క్యాప్యుల్ లో తిరిగి భూమ్మీదకు చేరుకుంటారని ఇప్పటికే ప్రకటించింది.
అయితే, నాసా తాను పంపిన బోయింగ్ స్టార్ లైనర్ ను కాదనుకుని… ఎలాన్ మస్క్ space X CREW-9ను ఎంచుకోవడానికి గల కారణాలేంటన్నవీ ఆ చర్చలో ఇప్పుడు మరింత హాట్ టాపిక్స్.
ఎనిమిది రోజులనుకున్న ప్రయాణం కాస్తా 8 నెలల సుదీర్ఘబాటగా మారడం.. ఇప్పటికే రెండు నెలలు గడిచిపోవడం.. మరో ఆర్నెల్ల పాటు స్పేస్ లోనే ఉండాల్సి రావడం వంటివన్నీ ఎంతో ఆందోళన రేకెత్తించే విషయాలు. ఇవి ఎంతో కొంత అవగాహన ఉన్న సామాన్యుల్లో ఆందోళన రేకెత్తించడం మాట కాస్సేపు అటు పక్కనబెడితే.. శాస్త్ర విజ్ఞానంపై పట్టున్న శాస్త్రవేత్తలకూ కొరకరాని కొయ్యగా మారుతున్న అంశాలు. ఈ క్రమంలో తిరిగి నాసా పంపిన స్టార్ లైనర్ లోనే భూమ్మీదకు తిరిగి జర్నీ ప్రారంభమైతే జరిగే పరిణామాలూ చర్చకొస్తున్నాయి.
విషాదగాధగా ముగిసిన కల్పనాచావ్లా స్పేస్ జర్నీ స్టోరీతో ముడిపెడుతూ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.
అమెరికాకు చెందిన సైనిక అంతరిక్ష వ్యవస్థ మాజీ కమాండర్ రూడీ రిడోల్ఫీ వంటివారు వ్యక్తం చేస్తున్న ఆందోళన ఇప్పుడు కచ్చితంగా మరో చర్చ! స్టార్ లైనర్ వ్యోమనౌకనే గనుక ఎంచుకుని తిరుగు ప్రయాణం చేస్తే గనుక.. కచ్చితంగా సునీతా విలియమ్స్, తన సహచర ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ ప్రమాదాన్నెదుర్కొనే ఛాన్సెసే ఎక్కువ అంటారాయన. దాంతో పాటు.. గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలను పట్టి చూపుతున్నారు. అందులో ప్రధానంగా భారతీయ మూలాలున్న కల్పనాచావ్లా విషాదగాధను ఆయన ముందుకు తీసుకొస్తున్నారు.
స్టార్ లైనర్ తిరుగు ప్రయాణం గనుక జరిగితే విపత్తు తప్పదని.. అది కక్షలోకి ప్రవేశించే సమయంలో అందులో తలెత్తే సాంకేతిక సమస్యలు నౌక ప్రయాణాన్ని విఫలం చేస్తాయంటారు రూడీ రిడోల్ఫీ. అందులో ఇప్పటికే హీలియం లీకేజీ సమస్యగా పరిణమించిన నేపథ్యంలో తలెత్తే సాంకేతిక సమస్యలు తట్టుకుని నిలబడటం వ్యోమగాములకు సాధ్యం కాదంటారాయన. దాంతో ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టవచ్చని చెబుతున్నారు. మొత్తంగా ప్రస్తుతానికి స్టార్ లైనర్ లో గుర్తించిన సమస్యలతో ఆ నౌకే విచ్ఛిన్నమై మరో కల్పనాచావ్లా విషాదం లాంటి ఉదంతాల్నీ చూడవల్సి రావచ్చని హెచ్చరిస్తున్నారాయన.
ఈ నేపథ్యంలో ఓసారి కల్పనాచావ్లా విషాదం గురించి కూడా చెప్పుకుందాం!
అసలు కల్పనాచావ్లా ఎవరు..? కొలంబియా షటిల్ కు ఏమైంది..?
కల్పనాచావ్లా కూడా ప్రస్తుతం స్పేస్ లో చిక్కుకుపోయి యావత్ ప్రపంచమంతా ఆమె రాకకోసం ఎదురుచూస్తున్న సునీతా విలియమ్స్ లాంటి ఓ ఆస్ట్రోనాట్. 1962, మార్చ్ 17వ తేదీన హర్యానాలోని కర్నాల్ లో జన్మించిన ఈ వ్యోమనౌక నిపుణురాలు.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ చేసింది. నాసాలో వ్యోమగామిగా ఉద్యోగం లభించిన తర్వాత.. 1997లో మొట్టమొదటిసారి కొలంబియా స్పేస్ షటిల్ లో రోబోటికి ఆర్మ్ ఆపరేటర్ గా అంతరిక్షంలోకి వెళ్లింది. రెండోసారీ 2003లో కూడా సేమ్ అలాంటి ప్రయాణమే చేసింది. కానీ, ఆ కొలంబియా షటిల్ నౌక భూవాతావరణంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ప్రమాదానికి గురి కావడంతో మరణించిన ఏడుగురు వ్యోమగాముల్లో.. కల్పనాచావ్లా కూడా ఒకరు. భారతదేశం నుంచి స్పేస్ లోకి వెళ్లిన మొట్టమొదటి మహిళగా.. రాకేష్ శర్మ తర్వాత రెండో వ్యక్తిగా కూడా కల్పనాచావ్లా రికార్డ్ సాధించింది. ఆమె మరణానంతరం ఆమెను కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ వంటివాటితో గౌరవించుకోగా.. పలు విశ్వవిద్యాలయాలు, వీధులకు కూడా కల్పనాచావ్లా పేరిట పేర్లు వెలిసి.. ఆమె స్పేస్ హిస్టరీలో ఓ ధృవతారలా నిల్చిపోయింది.
అయితే, 21 ఏళ్ల క్రితం అప్పుడూ ఫిబ్రవరి 1నే జరిగిన ఆ హృదయ విదారక దృశ్యం.. ఇప్పుడు స్టార్ లైనర్ లోనే గనుక తిరిగి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అనే వ్యోమగాముల ప్రయాణం జరిగితే కచ్చితంగా నాటి దుర్ఘటన పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు నిపుణులు. కొలంబియా షటిల్ నౌక ఏ విధంగానైతే విచ్ఛిన్నమైందో… ఆ హార్ట్ బ్రేకింగ్ దృశ్యాలను చూసిన పరిస్థితులను ఓసారి గుర్తు చేసుకుంటున్నారు.
కొలంబియా షటిల్ లో లోని ఇంధన ట్యాంకుకు సంబంధించిన ఫోమ్ ఇన్సులేషన్ ముక్క విరిగిపోవడం.. షటిల్ తిరిగి భూకక్షలోకి ప్రవేశించే ముందు ఏర్పడే తీవ్రమైన వేడిని తట్టుకునే థర్మల్ పవర్ ప్రొటెక్షన్ సిస్టమ్ నే అది కొలాప్స్ చేయడం.. అలాంటి సాంకేతిక కారణాలతో ఏం జరిగిందో.. మననం చేసుకుంటున్నారు. అలాంటి కారణాలే స్టార్ లైనర్ లోనూ తలెత్తే అవకాశాలుంటాయంటున్నారు నిపుణులు. మొత్తంగా స్పేస్ నుంచి తిరిగి అవరోహణ క్రమంలో ప్రయాణంలో బోయింగ్ స్టార్ లైనర్ ఎంతమాత్రం సురక్షితం కాదని నాసా శాస్త్రవేత్తల బృందం ఒక కచ్చితమైన అంచనాకు వచ్చింది. అందుకే అక్కడి వ్యోమోగాములైన సునీతా, బుచ్ విల్మోర్ ను స్పేస్ స్టేషన్ లో ఉంచుతారు. ముందుగా స్టార్ లైనర్ ను ఈ సెప్టెంబర్ 25 వరకే కిందకు తీసుకువచ్చి.. ఆ తర్వాత ఎలాన్ మస్క్ crew-9 space X ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపి.. అక్కడ చిక్కుకున్న వారిని తీసుకురావడానికి కావల్సిన ఏర్పాట్లు ముమ్మురంగా జరుగుతున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు.



