మహారాష్ట్ర పోలీస్ శాఖలో వండర్.. ఆ ఏఐ మార్వెల్!

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇప్పుడు ఫలానా రంగమంటూ పరిమితం కాకుండా శాసిస్తోంది. దీనివల్ల ఉన్న ఉపయోగాలతో పాటే, ప్రమాదాలూ చర్చకు పెడుతోంది. అయితే, సరికొత్త సాంకేతిక విప్లవాన్ని అనుకూలంగా మల్చుకోవడంతోనే విజయాల్ని ముద్దాడవచ్చు. ఇప్పుడా పనిలో సక్సెస్ అయింది మహారాష్ట్ర పోలీస్. దేశంలోనే నేరాల పరిశోధనకు మొట్టమొదటగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను సమర్థవంతంగా ఉపయోగిస్తున్న పోలీస్ వ్యవస్థగా మహారాష్ట్ర పోలీస్ సాధిస్తున్న ఆ విజయం గురించి ఒక్కసారి కాస్త తెలుసుకుందాం.

ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు తమ యుద్ధ వ్యవస్థలను హెల్మెట్ మౌంటెడ్ రాడార్స్, రిస్ట్ మౌంటెడ్ స్క్రీన్ డిస్ ప్లేస్.. ధ్వని వేగానికి మించిన 20 రెట్ల వేగాన్ని కల్గిన మిస్సైల్స్.. రోబోటిక్ సైనికులు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో ఎప్పుడు ఏ యుద్ధం వచ్చినా సై అనే స్థాయిలో సన్నద్ధమయ్యాయి. ఇక దక్షిణ కొరియా వంటి దేశాలైతే ఏకంగా తమ దేశ భద్రత దృష్ట్యా బార్డర్స్ పై రోబోటిక్ సైనికులతోనే కాపలా కాయిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతను ఆయా రంగాలనకూలంగా మల్చుకోలేకపోతే కచ్చితంగా మనం వెనుకబడ్డట్టే. ఇదే విషయాన్ని మహారాష్ట్ర పోలీస్ స్ఫూర్తిగా తీసుకుంది. ఏఐతో నేరాలను ఛేదించేందుకు శ్రీకారం చుట్టింది.

MAHARASHTRA RESEARCH AND VIGILANCE FOR ENHANCED LAW ENFORCEMENT..షార్ట్ ఫామ్ MARVEL. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా నేర పరిశోధనకు సంబంధించి ఈ మార్వెల్ అనే సంస్థ.. మహారాష్ట్ర పోలీస్ బలగాలకు తగిన సాయం అందించడం, పరిష్కారాలు చూపడంలో ఇప్పుడో ఓ అద్భుతం.

మనకు తెలుసు రావెన్ సెంట్రీ అనే అమెరికన్ ఏఐ టూల్.. ఆఫ్ఘనిస్తాన్ లో ముందే తాలిబన్ దాడులను ఎలా అంచనా వేయగల్గిందో! ఇప్పుడు 70 శాతం కచ్చితత్వాన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాధిస్తున్నట్టుగా ఎకనామిస్ట్ నివేదికలు కూడా పేర్కొంటున్నాయి. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, మిల్ట్రీ వింగ్స్ ఇలా అందరూ ఏఐపై దృష్టి పెట్టలేకుండా ఉండే అనివార్య పరిస్థితిని ఈ ఇంటలిజెన్స్ వ్యవస్థ కల్పించింది.

ఈ క్రమంలోనే మహారాష్ట్ర తన పోలీస్ వ్యవస్థను మరింత పటిష్ఠంగా మార్చేందుకు 2024, మార్చ్ లో ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, నాగ్ పూర్, పినాకా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఈ ఎంవోయూలో భాగంగా ఈ మార్వెల్ అనే స్పెషల్ పర్పస్ వెహికిల్ (SPV)ని ఏర్పాటు చేశారు.

తప్పిపోయిన వ్యక్తులు, హిట్ అండ్ రన్ యాక్సిడెంట్స్, దొంగతనాలు, అత్యా, హత్యాచారాలు, సైబర్ నేరాలు, ఇతర వ్యవస్థీకృత నేరాల శోధనలో ఈ ఏఐది కీలకపాత్ర కాబోతున్నట్టు మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజాత సౌనిక్ చెప్పే మాట.

అయితే, AI కేసులను ఏవిధంగా డీల్ చేయబోతోందన్నదీ ఆసక్తికరమే!

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. అలాగే, రోబోటిక్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్దీ.. రాబోయే రోజుల్లో మానవ వనరులకు ఉపాధి కష్టమేనన్న ఒక ప్రచారాన్ని మనం తరచూ వింటున్నాం. అయితే, అన్ని సందర్భాల్లో ఇదెంతమాత్రం నిజం కాదు. తమ మానవ వనరుల పరిశోధనను సులభతరం చేయడం కోసం మాత్రమే ఏఐ టూల్స్ తప్ప.. అన్ని రంగాల్లోనూ పూర్తిగా రీప్లేస్ మెంట్ జరగడం గురించి ఇప్పుడప్పుడే భయపడాల్సిన అవసరం లేదనే వాదనా ఉంది.

పోలీసుల అపరాధ పరిశోధనలో భాగంగా ఎంతో డాటా వారి దగ్గరకు చేరుతుంది. అయితే, ఆ డాటాను జల్లెడ పట్టి.. ఫోకస్డ్ గా మార్చే ప్రక్రియలో ఏఐ ఉపయోగం ఎంతో అంటున్నారు నాగపూర్ రూరల్ ఎస్పీ, మార్వెల్ ఎక్స్-అఫీషియో డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హర్ష్ పొద్దార్.

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టుగా టెక్నాలజీ అధికమవుతున్నకొద్దీ నేరాల సంఖ్య పెరగడం కూడా ఈ సమాజానికీ, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కూ అర్థం కాని పెద్ద ప్రశ్నగా తయారైంది.

అయితే, ఇవాళ పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న మారుమూల గ్రామాల వరకూ సీసీ కెమెరాలు, మెబైల్ ఫోన్స్ రీచ్ అయిన పరిస్థితుల్లో వాటిల్లో నిక్షిప్తమయ్యే ఏ చిన్న డాటా అయినా సరే.. ఏఐలోని అల్గారిథమ్స్ నేరం జరిగినప్పుడు కచ్చితమైన అంచనా వేయడానికి ఉపయోగపడతాయంటున్నారు నాగపూర్ పోలీసులు. చైన్ స్నాచింగ్ కేసులు వేల సంఖ్యలో జరుగుతున్న క్రమంలో.. సీసీ కెమెరాల్లో రికార్డయ్యే బైక్స్.. వాటి వేగం, నేరస్థుడు ఆ బైక్ పై వచ్చినప్పుడు ఉపయోగించిన హెల్మెట్ రకం వంటివన్నీ ఏఐ ఆక్యురేట్ గా డీకోడ్ చేయగల్గుతుందంటున్నారు.

మహారాష్ట్రతో పాటు ఇప్పటికే ఇతర రాష్ట్రాలు కూడా ఏఐని వినియోగంలోకి తీసుకురావడానికి పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా.. మహారాష్ట్ర మాత్రం ఏకంగా మార్వెల్ వంటి ఓ స్పెషల్ డ్రైవ్ వెహికిల్ నే ఏర్పాటు చేసి ఒక్క అడుగు ముందులో ఉందనేది మాత్రం అక్కడ జరుగుతున్న ఎక్సర్ సైజును బట్టి అర్థం చేసుకోవచ్చు.

అయితే ఏఐ ఏవో కొన్ని నిర్ధిష్ఠమైన కేసులకే పరిమితం కాదని.. సందర్భాన్నీ, కేసు అవసరాన్ని బట్టి పోలీస్ శాఖ గొడుగు కింద ఉండే ఏజెన్సీలు ఏఐని ఉపయోగించుకునేలా ఈ స్పెషల్ డ్రైవ్ వెహికిల్ పనిచేస్తుందంటోంది మహారాష్ట్ర పోలీస్ విభాగం.

మరి AI సంక్లిష్ఠమైన నేరాలను ఎలా పరిష్కరించగలదు..?

మార్వెల్ స్పెషల్ పర్పస్ వెహికిల్ వేర్వేరు ఏజెన్సీల కోసం పనిచేస్తుండగా.. ఇప్పటికే ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వం 25 మంది నిష్ణాతులైన, నైపుణ్యమున్న నిపుణులను ఏర్పాటు చేసుకుంది.

ఒక నేరం ఎలా జరిగింది… ఎప్పుడు జరిగింది.. చేసిన వ్యక్తులు ఏవిధంగా ఆ సదరు నేరానికి రూపకల్పన చేశారనే పలు అంశాలపైన ఒక ప్రిడిక్షన్ తో కూడిన అంచనాను ఏఐ ఏజెన్సీల ముందు పెడుతుంది. దాన్ని డీకోడ్ చేస్తూ అర్థం చేసుకుని.. ఆ ట్రెండ్ ను బట్టి పరిశోధన కొనసాగితే పెద్ద పెద్ద క్రైమ్ కేసులు కూడా సులభంగా పరిష్కరించే అవకాశముంటుంది. ఇప్పటికే నాగపూర్ పోలీస్ శాఖ తప్పిపోయిన మహిళలు, పిల్లలకు సంబంధించిన కేసుల్లో ఏఐ మద్దతుతో సత్ఫలితాలు సాధిస్తోంది.

ఎెందుకంటే నాగపూర్ వంటి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు ఈ ఏఐ పరిశోధనను మరింత సులభతరం చేస్తోంది. కొన్ని చోట్ల సీసీ కెమెరాలు లేకపోవడమో, పనిచేయకపోవడమో జరిగితే.. యాక్సిడెంట్స్ కు పాల్పడి ఆపకుండా వేగంగా వెళ్లిపోయే వాహనాలను గుర్తించే క్రమంలో.. హిట్ అండ్ రన్ కేసుల్లో టోల్ ప్లాజాల్లో సీసీ ఫుటేజీని స్కాన్ చేయడం ద్వారా అనుమానిత వాహనాలను సులభంగా గుర్తించడంలో కూడా ఈ ఏఐ మంచి ఫలితాలనిస్తోంది. ఎందుకంటే, రోజూ ఒక హైవేపై ఎన్నో వాహనాలు వెళ్తుంటాయి. కానీ, నేరానికి పాల్పడ్డవారు కాసింత ఆదరాబాదరాగా ఉండే సమయంలో వడివడిగా బయటపడాలని చూస్తునప్పుడు.. ఆ వేగంగా వెళ్లే పరిమితితో కూడుకున్న వాహనాలు కొన్నే కనిపిస్తుండవచ్చు. వాటిని ట్రేస్ చేస్తే పరిశోధన సులభతరమైపోతుంది.

గతంలో ఉడ్తా పంజాబ్ అని మాత్రమే పిల్చుకునే చోట.. దేశమంతా మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడి చలామణి అవుతూ ఉడ్తా భారత్ గా మారుతోంది. ఈ క్రమంలో ఏఐ ఉపయోగం మాదక ద్రవ్యాల కేసుల్లోనూ.. అలాగే మానవ అక్రమరవాణా కేసుల్లోనూ కీలకంగా మారుతోంది. డాటాబేస్ పెద్దఎత్తున తయారైన క్రమంలో ఫోకస్డ్ గా పరిమితమైన సమాచారంపై మాత్రమే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ దృష్టి సారించేందుకు వడబోతలో కూడా ఏఐది కీలకపాత్ర.

అయితే, డాటా అంచనాలో కచ్చితత్వం కోసం.. కేవలం ఏఐపైనే పూర్తిగా ఆధారపడకపోయినా… పరిశోధనలో భాగంగా క్రాస్ చెక్ చేసుకోవడానికి, మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మాత్రం ఆర్టీఫిషియల్ ఇంటలిజిన్స్ ఓ మార్వెల్. మరి ఈ మార్వెల్ ఇప్పుడు పోలీసులతో చేతులు కలిపి శాంతిభద్రతల పరిరక్షణలో భాగం కావడం.. సాంకేతికత సాధించిన మరో అద్భుత విజయం.

source: the better india

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles