వందేళ్ల క్రితమే హైదరాబాద్ లో దుబాయ్ నమూనా! మదీనా.. అందుకో ఉదాహరణ!!

…………………………………………………………………………..

#hyderabad_is_an_emotion

యాసీన్.. ✍️

మదీనా_బిల్డింగ్‌!

ప్రపంచంలోని మహా మహా మార్కెట్స్‌ మాల్స్‌ అన్నీ దుబాయ్‌లో నిన్నా మొన్నా ఏర్పాటయ్యాయేమో… వందల ఏళ్ల కిందటే అలాంటి మాల్స్‌ ఏర్పాటు చేశారు నిజాం నవాబులు. అదే మదీనా బిల్డింగ్‌!


ఆ మాటకొస్తే.. చెప్పాలంటే… హైదరాబాద్‌ స్పెషాలిటీ ఏమిటో తెలుసా? ఎక్కడెక్కడో నగరాల్లో దానికి ప్రత్యేకమైన ల్యాండ్‌ మార్క్‌ ఏదో ఒకటీ అరా ఉంటుంది. అదొక్కటే అక్కడి ఐకన్‌. అదే అక్కడి స్పెషాలిటీ. కానీ దాదాపు అన్నిదేశాల్లో ఉండే ల్యాండ్‌ మార్క్స్‌ అన్నీ ఒక్క మన హైదరాబాద్‌లోనే ఉంటాయి.

ఉదాహరణలు కావాలా…?

థేమ్స్‌ నది ఒడ్డున లండన్‌!…
మూసీ నది పక్కన హైదరాబాద్‌!!

న్యూయార్క్‌లో స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ!
మన దగ్గర స్టాచ్యూ ఆఫ్‌ బుద్ధ మన ట్యాంక్‌బండ్‌లో!!

మిషిగన్‌ సిటీ ఒడ్డునే మిషిగన్‌ లేక్‌..!
మన దగ్గరా హుసేన్‌సాగర్‌… హిమాయత్‌సాగర్‌!!

కెన్యా పక్కనే కీకారణ్యం మసాయి మారా!… హైదరాబాద్‌లో హరిణ వనస్థలి!!

అందుకే ఏ అంతర్జాతీయ నగరానికీ తీసిపోని విధంగా మన హైదరాబాద్‌. ప్రపంచంలోని అన్ని వింతలూ విశేషాలూ విడ్డూరాలూ హైదరాబాద్‌లో ఉన్నాయని నిశ్చయంగా చెప్పవచ్చు.


ఇప్పుడు కాసేపు మళ్లీ మన మార్కెట్‌ ప్లేస్‌ మదీనా ‘మంజిల్‌’ (గమ్యం) దగ్గరికి వద్దాం.

సౌదీ అరేబియాలో మక్కా మదీనా ఉన్నాయి కదా! అచ్చం అలాగే… చార్మినార్‌కు ఆవల మక్కా మసీదుంటే… ఈవల మదీనా బిల్డింగ్‌!!

రాజసం ఉట్టిపడేలా పొడవాటి బిల్డింగ్‌. నిజానికి మదీనా బిల్డింగే మన హైదరాబాద్‌లో మొట్టమొదటి కమర్షియల్‌ అండ్‌ రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌ అట. ఇందులో మొత్తం 200లకు పైగానే దుకాణాలూ, కొట్లూ… మరో వందకు పైగా నివాస భవనాలూ (ఫ్లాట్స్‌ లాంటివి) ఉన్నాయట.

అప్పుడెప్పుడో నిజాముల కాలంలో సౌదీ అరేబియాలోని మదీనా, హెజాజ్, జెద్దా, తబూక్‌ల నుంచి వచ్చిన ఎందరో వాణిజ్య ప్రముఖులందరికీ ఆవాసాలూ, నివాసాలూ, వ్యాపార సముదాయాలను కల్పించేందుకు కట్టిన భవనమట ఇది.

అప్పట్లో అందరికంటే ఎక్కువగా నవాబ్‌ అల్లాదీన్‌ అనే వణిక్‌ ప్రముఖుడికి ఎక్కువ దుకాణాలూ, కొట్లూ కేటాయించారట. అలా వాణిజ్యాభివృద్ధి కోసం వ్యాపారస్తులకు కట్టించి ఇచ్చిన భవనం కారణంగా ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు ఎంతో వృద్ధి కలుగుతుందనే ఉద్దేశంతో ఏర్పాటైన భవనమట ఇది.

అందుకే ఇక్కడ రకరకాల దుకాణాలు. కోట్లలో వ్యాపారాలు. ఎనెన్నో వస్తువుల వాణిజ్య వినిమయాలు. ఎగుమతులు–దిగుమతులు… ఇలా ఎన్నో. దీని ప్రభావం వల్ల అప్పట్లో చుట్టుపక్కల ఉండే ప్రాంతాలైన పత్థర్‌గట్టీ, చార్‌మినార్, లాడ్‌బజార్‌లలో కూడా పెద్దఎత్తున వాణిజ్యవ్యాపారాలు జరుగుతుండటంతో రేయింబగళ్లూ ఈ ప్రాంతమంతా ఇబ్బడిముబ్బడిగా జనాలతో సందడి సందడిగా ఉంటుంది.

ఇక్కడంతా వాణిజ్యం.. ఎగుమతులూ అని అనుకున్నదే కదా. అందుకే పెళ్లిపేరంటాలకు సంబంధించిన అన్ని వస్తువుల వ్యాపారం ఇక్కడ జోరుగా జరుగుతుంటుంది. మన దేశాల వివాహాది శుభకార్యాలకే కాదు… యూఎస్, యూరప్, మధ్యప్రాచ్యంలోని అన్ని ముస్లిం దేశాలూ, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌… ఇలా ఎన్నెన్నో దేశాల్లోని వేడుకలకూ ఇక్కడి దుస్తుల్లేకపోతే పెళ్లి కుదరదూ… పండగ జరగదూ… పబ్బం గడవదు.

మరి ఇంతమంది వచ్చీపోతూ ఉంటే తిండీ తిప్పలకు తినుబండారాలు ఉండొద్దా? అందుకే వెలసింది మదీనా హోటల్‌. కొన్ని తరాల పాటు మరెన్నో కుటుంబాల కోసం బిర్యానీలూ, హరీసులూ, హలీములూ, పసందైన వంటకాలూ, రుచికరమైన వ్యంజనాలూ, చవులూరించే పదార్థాలు.

అన్నీ అయ్యాక వేసుకోవాల్సిన జఫ్రానీ, జవ్వాదీ ఇత్యాది తాంబూలాదికాల కోసం… ఆకూవక్కలతో పాన్‌లూ… పసంద్‌లూ…!

ఇక రంజాన్‌ లాంటి పండుగ ఏదైనా వచ్చిందా… అక్కడ రాత్రీ లేదూ… పగలూ లేదు. రాత్రి మాయమైపోయి… రవి అస్తమించని పట్టపగటి సందోహమే.

సౌదీలో మక్కా నుంచి మదీనాకు వెళ్లడమంటే… ఆ దేశంలో ఎంతో మంచి పవిత్ర క్రతువూ, పుణ్యమార్గం, పుణ్యకార్యం.

అచ్చం అలాగే… మన హైదరాబాద్‌లోని మక్కా మసీదు నుంచి మదీనా బిల్డింగ్‌ వరకు నడవడమంటే… అదో ప్రపంచ పర్యాటకం… పర్యాటక ప్రపంచం.. ఓ వేడుక, ఓ వినోదం, ఓ వింతవింతల ప్రపంచంతో పాటు పెద్ద ఎత్తున వర్తకం. వర్తక వాణిజ్యతో పాటు విజ్ఞాన విశేష విషయాలెన్నో తెలుసుకునే ఓ విహారమార్గం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles