విభిన్న చర్చల తంగలాన్ స్ఫూర్తేంటి..? ఓ పరిశోధకుడిగా పా. రంజిత్ తపనేంటి…?

#THANGALAN

సొలోమోన్ విజయ్ కుమార్ ✍🏼


బంగారాన్ని తంగలాన్ చేతపట్టుకొని తనవాళ్ల మధ్యన ట్రోఫీలా పైకెత్తి పట్టడంతో కథ ముగిసింది. ఏమిటి ఈ సినిమా స్ఫూర్తి ? మెసేజ్ ? ట్రెజర్ హంట్ సినిమాల కోవలో అష్టకష్టాలు పడి చివరికి హీరో విజయం సాధించాడని చెప్పడమేనా దర్శకుడి ఉద్దేశం ?

ఇదిగో ఓ సినిమా తీశా, ‘మనోళ్లందరూ’ చూసి సంబరపడండి, హిట్ చేసి నన్ను కూడా సంబరపెట్టండి అనే ఫక్తు వ్యాపార కోణం ఏమైనా కనబడుతోందా పా‌. రంజిత్ ఆలోచనలో ?

కొన్ని ఆధునిక ఆవిష్కరణలు ఒక్కరితో పూర్తి కాలేదు. ప్రారంభించేది ఒకరు, నిత్యం పరిశోధనలతో మల్లగుల్లాలు పడేది మరొకరు. తుది ఫలితం లోకానికి వెల్లడించింది ఇంకెవరో…

సినిమా మాధ్యమం ద్వారా నిత్యం మల్లగుల్లాలు పడుతోన్న పరిశోధకుడి స్థానంలో కనబడుతాడు నాకు పా. రంజిత్, ఇంతకీ ఏమి ఆవిష్కరణకి అతని తపన ?

చినువా అచబే రాసిన చెదిరిన సమాజం అనే పుస్తకం చదివినవారికి గుర్తుండే ఉంటుంది, నాగరికత నేర్పుతాం అంటూ వచ్చినవాడు అడివి మనుషుల తిండిని బట్టని సంస్కృతిని తప్పుపడతాడు. దెయ్యాలని పూజిస్తున్నారు అంటాడు. మీరే దెయ్యాలు అనీ అంటాడు. నిజమైన బతుకుని, దైవాన్ని, నాగరికతనీ తెలిపేందుకు వచ్చానంటాడు. క్రమంగా అడవి మనుషుల పైన ‘అధికారాన్ని’ చేజిక్కించుకుంటాడు. చివరికి నిన్నటిదాకా తమదైన నేలపైన ఈరోజు అడుగు కదపాలన్నా తమ కొత్త పాలకులకి చెందిన పోలీసువారి అనుమతి కావాలి.

ఇంతకీ తంగలాన్ దళితుల కన్నీళ్లు కష్టాలు వెలి, ఎదుర్కొంటున్న ఆకలి, దోపిడీలను చర్చకు పెట్టే సినిమా మాత్రమేనా ? అంతకు మించి ఏం లేదా ?

నెమలి, ఏనుగు కొండ, పాములు, బంగారంలా కనపడే మాయ, ఆరతి కడుపు చీల్చినప్పుడు ఎగదన్నే రక్తం, ఆ రక్తం పడినంత మేరా బంగారు రంగులో మెరవడం, తంగలాన్ తాత పాములపైన చల్లే నీలిరంగు పొడి, ఇచ్చిందే తీసుకోవాలి అని ఏట్లో ఇసుక జల్లిస్తూ ఆ ముసలాడు చెప్పిన మాట, ఇవన్నీ అర్ధం కావలసిన అవసరం లేనివాడికి అర్ధం కాకపోనీ నష్టం లేదు. అర్ధం కావలసినవాడికి ఏది ఏమేరకు అర్ధం అయ్యింది ?

అర్ధం కావలసిన అవసరం లేనివాడు, ఉన్నవాడు అంటూ రెండు రకాలు ఉంటారా అంటే ఉండరా ? లేరా ? కులపు నీడన ఈ దేశంలో ఎన్ని రకాల మనుషులున్నారో తెలియనిదా ?

తంగలాన్ మీద జరుగుతోన్న అనేక అనుకూల ప్రతికూల చర్చల్లో ఆ సినిమా ఇచ్చిన లేక ఇవ్వాలనుకున్న స్ఫూర్తి / మెసేజ్ గురించి జరుగుతోన్న చర్చ ఎంత ?

ప్రతీకలతో సినిమా చెబితే జనాలకి అర్ధం కాదని తెలియని మూర్ఖత్వం ఏమైనా ఉందా దర్శకుడిలో ?

కావాలని సినిమాను తక్కువ చేస్తున్నవాడికీ, సినిమాని సెలబ్రేట్ చేసి వదిలేస్తున్నవాడికీ తేడా ఏమైనా ఉందా ?

ఏట్లో బంగారం దొరుకుతుంది అనే అర్థంలో పల్లె బైరాగి పదాలు ఉండేవి తెలుసా ? పల్లె సంచార బైరాగుల్లో శ్రమజీవులైన దళితులకంటే బీసీ కులస్తులే ఎక్కువగా ఉండేవారనీ తెలుసా ? మా ఊరి మొగిలేరులో (స్వర్ణముఖి నది) బంగారం దొరికిందనే కథ చెప్పేవాళ్లు పెద్దోళ్ళు, వీళ్లందరూ చెప్పిన ఆ ఏట్లో బంగారం ఏంది ? నిజానికి భూగర్భంలో ఎక్కడో ఉండే బంగారు ఖనిజం ఏట్లో కొట్టుకురావడం అనేది జరుగుతుందా ? మరి ఎందు నిమిత్తం దర్శకుడు ఆ సీన్ రూపకల్పన చేశాడు ?

తనకంటే ఆలోచనల్లో అందనంత ఎత్తులో ఉన్నవాడ్ని పిచ్చోడిగా జమకడుతుంది లోకం.

తంగలాన్ ద్వారా పిచ్చోడైన పా. రంజిత్ చెప్పాలనుకున్న మెసేజ్ అందిందా ?

నాగజాతిని నాగజాతి చేతనే చంపించే తెల్లతోలు జాతుల క్రౌర్యం ఒకనాటిదా, ఇప్పుడు లేదా ?

పాముని సైతాన్ అన్నాడు తెల్లోడు. వాడి పక్కన చేరాడు కాళింది మడుగు, ఖాండవదహనం, సర్పయాగం కధలు రాసుకున్న బ్రాహ్మడు. వాళ్ల మాటల రాతల చాటున ఆ ఇద్దరి ఉమ్మడి ప్రయోజనం ఎటువంటిది ?

అందర్నీ చంపగా దొరికిన ముసలాడ్ని బంధించి పడేస్తే రాత్రి పగలు తేడా లేకుండా నిమిషనిమిషానికీ ఊళలాంటి పిలుపుతో ఎవర్ని పిలుస్తున్నాడు ?

కూలి నాలి అనే మాట ఉంది. కూలి అంటే డబ్బు రూపంలో నాలి అంటే తిండిగింజల రూపంలో చెల్లించేది. ఈనాటికీ కూలికో నాలికో నోచుకోవడమే అబ్బురంగా తలచే దళితులకు తంగలాన్ ఏం చెబుతున్నాడు ?

తంగలాన్ అర్ధం కాలేదు అంటున్నారు. అది అర్ధం కావాలంటే ఉత్తర ఆర్కాడు (పాత తొండనాడు రాజ్యం) చరిత్ర తెలియాలి. పెన్నా నది రెండుపాయలై దక్షిణ పెన్నా తిరువణ్ణామలై మీదుగా, ఉత్తర పెన్నా నెల్లూరు మీదుగా ప్రవహిస్తూ అక్కడి సాగు భూములు మాలల చేతుల్లో ఉండేవన్న చరిత్ర అయినా తెలవాలి. ఆ భూములు వాళ్ల చేతులనుంచి తప్పించేందుకు సాగించిన అన్యాయాలు తెలియాలి. రాజుల ద్వారా బ్రాహ్మలు అగ్రహారాలు పొందితే వారి నుంచి జమీందారీలు ఆ భూముల్ని లాక్కున్న ఇంకో చరిత్ర తెలియాలి. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చెంచుల తలల్ని తెగనరికించినటువంటి లెక్కలేనన్ని ఘోరాలు తెలియాలి. బొబ్బిలి, పిఠాపురం, ఐజ, వెంకటగిరి జమీందారీ సంస్థనాల చరిత్రల్లో వెలికిరాని దళితుల అగచాట్లు తెలిసుండాలి. టిప్పు సుల్తానుకి వ్యతిరేకంగా ఆర్కాటు నవాబు తెల్లవాళ్లతో కలిసి సాగించిన కుట్రలు తెలియాలి.

KGF గా చెప్పబడే కోలార్ ప్రాంతం మాదంటే మాదని గొడవలు రేపిన తమిళ కన్నడ వివాదాలు తెలియాలి. కోలారులో ఇద్దరు అన్నా డియంకే ఎమ్మెల్యేలు గెలిచి కర్ణాటక అసెంబ్లీలో ఆ ప్రాంతం మా తమిళులదే అని నినదించడం తెలియాలి. ఈ తమిళ కన్నడ గొడవల మధ్యన తొక్కివేయబడిన ‘కోలారు తెలుగువాళ్ల’ చరిత్ర తెలియాలి.

సినిమాలో దళిత మహిళలు రవికలు తొడుక్కొని సంబరపడడాన్ని చులకన చేస్తున్నవాళ్లకి తెలియాల్సింది, నలభై ఏళ్ళ క్రితం వరకూ బిసి కులాల్లో భర్త పోయిన ఆడపిల్ల ఆజన్మాంతం రవిక వేసుకోకూడదు అనే కఠినమైన ఆచారం అమల్లో ఉండేదని తెలియాలి. తిరుపతమ్మ అనే పేరంటాలు కథ (పాత తెలుగు సినిమా ఉంది తిరుపతమ్మ కథ పేరిట) తెలియాలి. కమ్మలు మా ఇంటి ఆడపడుచు అని చెప్పుకున్న ఆ తిరుపతమ్మ సతీసహగమనం చేస్తుంది. పాత పంటనాడులో (కొత్తగా ఏర్పాటు చేయబడిన ఇప్పటి తిరుపతి జిల్లా ప్రాంతం) చితిమంటల మధ్య నమస్కరిస్తూ కూర్చున్న రవికలేని స్త్రీ చిత్రపటం పూజలందుకొనేది ఆమే తిరుపతమ్మ.

దక్షిణాపధాన వైదీకంకంటే ముందు బౌద్ధం, సంస్కృతం కంటే ముందు ప్రాకృతం బలంగా వేళ్లుతన్నాయని తెలియాలి. బౌద్ధాన్ని కూకటివేళ్లతో కూల్చిన శైవ వైష్ణవ ఉమ్మడి దురాగతాలు తెలియాలి. గుళ్ళల్లో దేవదాసీ వ్యవస్థను పెంచి పోషించిన వర్గం బౌద్ధారామాలను లంజలదిబ్బలుగా ప్రచారం సాగించిన కుతంత్రాలు తెలియాలి.

భూమేలేని రాజులు కమ్మలు రెడ్లు ఎలా వేల ఎకరాలకు జమిందారులైనారో భూమికలిగిన మాలలు ఎట్లా భూమిలేనివాళ్లైనారో ఆంధ్రోపాలజీ తెలియాలి.

ఇన్ని తెలిస్తే తంగలాన్ అర్ధం అవుతుంది.

పా. రంజిత్ సినిమా తీశాడు. చరిత్ర పుస్తకం రాయలేదు అనే గమనం అయినా ఉండాలి.

బూతు ఊపుల ద్వంద్వార్ధాల పాటలు, ఫైట్లు, తొడలు కొట్టి మీసాలు మెలేసే కులపు డైలాగులతో ఊగిపోయే ప్రేక్షకుడికి తంగలాన్ ఎలా అర్థం కాగలదు ?

ఇవన్నీ సరే – నాగజాతి బంగారాన్ని చేజిక్కించుకుని తంగలాన్ లాగా గర్వంగా ఎత్తిపట్టి చూపడం అనేది గతంలో ఎప్పుడైనా జరిగిందా ? సమీప భవిష్యత్తులో జరుగుతుందా ? సుదూర కాలంలోనైనా జరగనుందా ?

నా ప్రశ్నతోనే ఈ వ్యాసం ముగిస్తున్నాను.

దర్శకుడు చెప్పింది బంగారం కథేనా ?

మరైతే తంగలాన్ ద్వారా పా. రంజిత్ అందించబూనిన స్ఫూర్తి / మెసేజ్ ఏమిటి ? అది చేరాల్సినవారికి చేరాల్సిన రీతిలో చేరిందా ? తంగలాన్ జరిగిపోయిన చరిత్రను జ్ఞాపకం చేస్తోందా ? జరగవలసిన చరిత్రకు నిర్దేశకత్వం వహిస్తోందా ?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles