యుద్ధక్షేత్రం నుంచి హృదయాలను పరిశీలించే డాక్టర్ గా: రంగూన్ టూ ఇండియా… పద్మావతి ప్రయాణం!
95 ఏళ్ల వరకూ అలుపెరుగకుండా రోజుకు 12 గంటలు పనిచేసిన వైద్యురాలు… దేశంలోనే తొలి మహిళా కార్డియాలజిస్టుగా చరిత్ర సృష్టించిన ఘనత. ఆమే ఎస్.ఐ. పద్మావతి.
వైద్య రంగంలో మహిళలు చాలా అరుదుగా కనిపించే రోజులవి. కార్డియాలజీ అంటే నాడు పురుషాధిక్య విభాగం. అలాంటి సమయంలో ఓ మహిళ ఆ రంగంలోకి అడుగుపెట్టడమే కాదు.. భారతదేశంలో కార్డియాలజీ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారు.

ఎవరీ పద్మావతి..?
భారత తొలి మహిళా హృద్రోగ నిపుణురాలిగా వినతికెక్కిన శివరామకృష్ణ అయ్యర్ పద్మావతి జీవితాన్ని కేవలం వైద్యురాలి విజయగాధగానే చూడలేం. వలస, విదేశీ విద్య, వైద్య పరిశోధన, సంస్థల నిర్మాణం… ఇవన్నింటినీ దాటి భారతదేశంలో గుండె వైద్యానికి ఓ కొత్త దిశ చూపించిన ప్రయాణం ఈమెది.
జీవితాన్ని మార్చేసిన యుద్ధం!
1917 అప్పటి బ్రటీషర్స్ కాలంలోని బర్మా రంగూన్ లో పద్మావతి తొలి శ్వాస తీసుకుంది. న్యాయవాదుల కుటుంబంలో డాక్టర్ గా ఎదిగింది. రంగూన్ మెడికల్ కళాశాలలో వైద్య విద్య పూర్తి చేసింది. రెండో ప్రపంచ యుద్ధం ఆమె జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. 1942లో జపాన్ బర్మాపై దాడి చేయడంతో.. పద్మావతి కుటుంబం భారత్ కు తరలివచ్చింది. యుద్ధం కారణంగా తాను పుట్టిన గడ్డను వదిలి రావాల్సి వచ్చిన ఆ యువతే… తర్వాత భారతదేశ చరిత్రలో ఓ ముఖ్యమైన అధ్యాయాన్ని సృష్టించింది.
ప్రపంచస్థాయి శిక్షణ తీసుకుని భారత్ తిరిగి వచ్చిన డాక్టర్
రంగూన్ నుంచి భారత్ కు వచ్చిన డాక్టర్ పద్మావతి.. తన వైద్య విద్యను అక్కడితో ఆపలేదు. లండన్, ఎడిన్ బర్గ్ లో ఉన్నత వైద్యశిక్షణ పొందారు. అమెరికాలో జాన్స్ హాప్కిన్స్ ఆసుపత్రి, హార్వర్డ్ మెడికల్ స్కూల్ వంటి ప్రముఖ సంస్థల్లో కార్డియాలజీలో సుశిక్షితురాలయ్యారు. ప్రపంచంలో కార్డియాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న రోజుల్లో… దాన్ని భారత్ కు తీసుకురావాలన్న సంకల్పంతో పద్మావతి పని చేశారు.
1953లో ఢిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కళాశాలలో లెక్చరర్ గా ఆమె వైద్య వృత్తిని ఆరంభించారు. అప్పటికి భారతదేశంలో కార్డియాలజీ విభాగం ఇంకా ఆరంభ దశలోనే ఉంది.
హృద్రోగ వైద్యంలో కొత్త అధ్యాయం!
లేడి హార్డింజ్ లో పనిచేస్తున్న సమయంలోనే పద్మావతి కార్డియాలజీ క్లినిక్ ను ఆరంభించారు. 1954లో ఉత్తర భారతదేశంలో తొలి కార్డియాక్ క్యాథెటరైజేషన్ ల్యాబును ఏర్పాటు చేశారు. గుండెను పరీక్షించేందుకు ఉపయోగించే క్యాథెటర్ విధానం అప్పట్లో భారత్ కు కొత్త పరిచయం. ఆ తర్వాత జీబీ పంత్ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. వైద్య సేవలతో పాటే.. నైపుణ్యమైన వైద్య విద్యాభివృద్ధికీ ఆమె ప్రాధాన్యమిచ్చేవారు. ఆ తర్వాత మౌలానా ఆజాద్ మెడికల్ కళాశాల డెరెక్టర్ కమ్ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టారు. అక్కడా కార్డియాలజీ విద్య, చికిత్సా విభాగాల అభివృద్ధికి కృషి చేశారు. భారతదేశంలో కార్డియాలజీకి ప్రత్యేక శిక్షణనందించే వ్యవస్థ అభివృద్ధిలోనూ ఆమె పాత్ర కీలకం.
చికిత్సలకు మాత్రమే పరిమితం కాని డాక్టర్!
పద్మావతి ఆలోచనలో గుండె వైద్యం అంటే కేవలం ఆసుపత్రిలో చికిత్స చేయడం మాత్రమే కాదు. అసలు గుండె జబ్బులు రాకుండా ముందుగానే అవగాహన కల్పించడం. అందుకే, 1962లో ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ ను స్థాపించారు. ప్రజల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన, పరిశోధన, వైద్య సిబ్బందికి శిక్షణ వంటి కార్యక్రమాలకు ఆ సంస్థ వేదికగా మారింది. 1981లో ఆమె నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ను స్థాపించారు. తర్వాత అది ఢిల్లీలో గుండె సంబంధిత చికిత్స, పరిశోధన, వైద్య శిక్షణ, ప్రజారోగ్య కార్యక్రమాలకు ముఖ్యమైన కేంద్రంగా అభివృద్ధి చెందింది.
పని పట్ల నిబద్ధతే.. ఆమె జీవితంలోని ప్రత్యేకత!
2015 వరకు ఆమె నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో రోజుకు సుమారు 12 గంటలు, వారానికి ఐదు రోజులు పనిచేసేవారు. 90 ఏళ్లు దాటిన తర్వాత కూడా వైద్య రంగంతో సంబంధం కొనసాగిస్తూ, పాత రోగులను చూసేవారు. వైద్య విద్యార్థులకు, ముఖ్యంగా మహిళా వైద్యులకు ఆమె ఒక మార్గదర్శి. ఒకప్పుడు తాను ఎదుర్కొన్న పురుషాధిక్య వాతావరణంలోనే.. తర్వాతి తరాల మహిళా కార్డియాలజిస్టులకు మార్గం సుగమం చేశారు.
ఆమె పనితో నడుచుకుంటొచ్చిన అవార్డులు!
భారత ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించింది. 1967లో పద్మభూషణ్, 1992లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.
అవార్డులతో ముగియని వారసత్వం డాక్టర్ పద్మావతి!
కార్డియాలజీ విభాగం భారత్లో ఇంకా రూపుదిద్దుకుంటున్న సమయంలో క్లినిక్స్, క్యాథెటరైజేషన్ ల్యాబ్స్, వైద్య విద్య, పరిశోధన, ప్రజారోగ్య కార్యక్రమాలు.. ఇలా అనేక స్థాయిల్లో ఆమె పనిచేశారు. 2020 ఆగస్టు 29న, 103 ఏళ్ల వయసులో కోవిడ్-19తో ఆమె కన్నుమూశారు. ఒకప్పుడు యుద్ధం కారణంగా బర్మా నుంచి భారత్కు వలస వచ్చిన ఓ మహిళ.. చివరికి, భారతదేశ గుండె వైద్య చరిత్రలోనే ఓ కీలక వైద్యురాలిగా ఎదిగింది.
వేలాది గుండెలకు చికిత్స అందించడమే కాదు.. భారతదేశంలో గుండె వైద్యం ఎలా ఉండాలన్న ఒక వ్యవస్థను నిర్మించడంలోనూ తన వంతు పాత్ర పోషించారు. అందుకే డాక్టర్ ఎస్ఐ. పద్మావతి కథ.. ఓ మహిళ విజయగాధగానే కాదు.. భారత వైద్య రంగం ఎలా ఎదిగిందో చెప్పే ఒక ముఖ్యమైన అధ్యాయంగా గుర్తుండిపోయారు.


