సెక్షన్ – 198 ఏ… ఏం చెబుతోంది..?
రోడ్డు ప్రమాదం జరిగింది… ఒకరో ఇద్దరో, లేక పది మందో మృత్యువాత పడ్డారు… అందుకు, వేగం కారణం.. లేదంటే, డ్రైవర్ తప్పిదమే కారణం!
తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పుడల్లా మనం ఎలక్ట్రానికి మీడియా ఛానల్స్ లోగానీ, ఇతర పత్రికల్లోగానీ… ఇంతకంటే ఎక్కువ లోతుల్లోకి వెళ్లి రోడ్డు ప్రమాదాలకు కారణాలేంటనే చర్చను పెద్దగా చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే, మన దగ్గర ప్రమాదాల తర్వాత సర్వసాధారణంగా వినిపించే కథలివే.
కానీ, ఒక్క ప్రశ్న మాత్రం సమాజంలో విస్తృతమైన చర్చకు రావడం లేదు. ఉదారణకు హైదరాబాద్ గోదావరిఖని మధ్య రాజీవ్ రహదారి. వంకర టింకర డిజైన్లతో రోడ్డు పనులు మొదలైనప్పుడు చర్చకొచ్చినా… అడ్డొచ్చినోళ్లకు తృణమో ఫణమో అందించి తామనుకున్న డిజైన్లలోనే రోడ్లు పూర్తి చేయడం ఆనవాయితీ. అలాంటి ఆరోపణలు హైదరాబాద్ చుట్టుపక్కల రింగ్ రోడ్డు సమయంలోనూ చూశాం. అందుకు, బడాబాబుల భూములకు నష్టం కాకుండా చూసుకోవడం, పైగా విలువ పెంచుకోవడం.. బలహీనుల భూముల్లోంచి రోడ్లు వేయడమనే విమర్శలూ ఉన్నాయి.
ఇలాంటి సమయంలోనే రోడ్డు డిజైనింగ్ పై విస్తృతమైన చర్చలు జరగాలి. అసలు రోడ్డు డిజైనింగ్స్ సరిగ్గా చేస్తున్నారా అనే ప్రశ్నలు ఎక్కడా సమాజంలో చైతన్యవంతంగా వినిపించకపోవడం విషాదం.
మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయా… సరైన క్రాష్ బ్యారియర్స్ మెయింటైన్ చేస్తున్నారా… ప్రమాణాలు పాటిస్తున్నారా… హెచ్చరికల బోర్డులు సరైన చోట పెడుతున్నారా.. రోడ్డును కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ సరిగ్గా నిర్వహిస్తోందా…? ఈ ప్రశ్నలకు సమాధానాలు కూడా మనుషుల ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడేవే.

అందుకే సెక్షన్ 198 ఏ!
2019లో మెటార్ వెహికిల్స్ చట్టంలో సెక్షన్ 198 ఏ తీసుకొచ్చారు. రోడ్డు డిజైన్, నిర్మాణం, నిర్వహణలో నిర్దేశిత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల జరిగే ప్రమాదాల్లో ఎవరైనా మరణించినా, వైకల్యం సంభవించినా సంబంధిత డిసిగ్నేటెడ్ అథారిటీ, కాంట్రాక్టర్, కన్సల్టెంట్, కన్సెషనైర్ ను బాధ్యులను చేసే ఉద్ధేశంతో ఈ నిబంధన తీసుకొచ్చారు.
కానీ, అమలేది…?
2019లో ఈ చట్టం తీసుకొస్తే… ఇప్పుడు 2026. అంటే ఏడేళ్లు గడిచాయి. ఈ నిబంధన కింద ఒక్క రోడ్డు ఏజెన్సీపైనగానీ, కాంట్రాక్టర్ పైనగానీ శిక్ష వేయలేదు. అంటే, చట్టం తీసుకొచ్చినా… ఇప్పటికీ అయితే డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, నిద్రమత్తు.. లేదంటే, ఇతర వాహనాల ఓవర్ టేకింగ్ ఇవే సాకులు తప్ప… కన్సల్టెన్సీలు, కాంట్రాక్టర్లు, ఏజెన్సీల తప్పే లేనట్టు ఒక్కటంటే ఒక్క శిక్ష కూడా లేకపోవడం చూస్తుంటే ఆ చట్టమెందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు అలాంటి కోణంలో ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయా అనే సందేహాలూ నెలకొంటున్నాయి.
చట్టముంది… మరి కేసులెక్కడ..?
2026 ఆగస్ట్ వరకూ కూడా కేంద్ర ప్రభుత్వానికి అందిన పార్లమెంటరీ సమాచారాన్ని బట్టి ఈ నిబంధన కింద ఇప్పటివరకూ కూడా ఒక్కటంటే ఒక్క ప్రాసిక్యూషన్ జరగలేదనే నివేదికలు చెబుతున్నాయి. అంటే చట్టం చేశారు. బాధ్యతలను నిర్దేశించారు. పెనాల్టీలనూ డిసైడ్ చేశారు. కానీ, ఆ కోణంలో వ్యవస్థ మాత్రం పని చేయడం లేదు. పైగా 2026లో చేసిన మరి కొన్ని మార్పుల్లో భాగంగా సెక్షన్ 198 ఏ కింద జరిమానాను ఏకంగా 50 లక్షల రూపాయలకు పెంచారు. మరి పెనాల్టీ పెంచితే ఏం లాభం..? ప్రమాదాలు జరగడానికి అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వంటి కారణాలని చేతులు దులుపుకోకుండా.. రోడ్డు లోపముందా అనే కోణంలో శాస్త్రీయంగా గుర్తించే దర్యాప్తు వ్యవస్థలూ ఉండాలిగా..?
ఈ ప్రశ్నలకు ఓ ఉదాహరణ కూడా చెప్పుకుందాం!
ముంబై కోస్టల్ రోడ్డులో ఓ ప్రమాదం ఇలాంటి ప్రశ్నను ముందుకు తెచ్చింది. సెప్టెంబర్ 20వ తేదీన ముంబై కోస్టల్ రోడ్డుపై బీఎండబ్ల్యూ కారు ప్రమాదానికి గురైంది. అక్కడి పోలీసుల కథనాల ప్రకారం మనం ఇంతదాకా చెప్పుకున్నట్టే మితిమీరిన వాహన వేగమే కారణమై ఉండొచ్చన్న కోణంలోనే దర్యాప్తు జరుగుతున్నది. అదే సమయంలో వాహనంలో సాంకేతిక లోపాలు, మానవ తప్పిదమా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ఈ సమయంలోనే సెక్షన్ 198 ఏ చట్టం ఒక్కసారిగా ఎందుకు వెలుగులోకొచ్చిందో, ఏమోగానీ… బీఎండబ్ల్యూ ప్రమాదం జరిగినచోట మలుపు రోడ్డుపై రక్షణ వ్యవస్థలు, రోడ్డు డిజైన్ భద్రతా ప్రమాణాల ప్రకారం ఉన్నాయా, లేదా అనే కోణంలోనూ దర్యాప్తు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే, ఇదే రోడ్డులో 2024లో రోడ్డు ఆరంభమైన్నాట్నుంచి పలు ప్రమాదాలు జరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. బీఎండబ్ల్యూ ప్రమాదానికి గురైన ఘటనలో.. వాహనం రోడ్డు అంచును దాటి సుమారు 75 అడుగుల కిందకు పడిపోయింది. దీంతో ఇక్కడ రోడ్డు డిజైన్ పై దర్యాప్తు జరగాలి కదా అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
డ్రైవర్లపైన నెట్టేస్తూ.. కరువైన శాస్త్రీయ పరిశోధన!
అతి వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఇవన్నీ ప్రమాదకరమే. ఇవన్నీ నిజమే. కానీ, రోడ్డు నిర్మాణ వ్యవస్థ కూడా బాగుండాలి. మానవ తప్పిదాన్ని పెద్ద ప్రమాదాలుగా మార్చకుండా ఉండేలా ఆ డిజైనింగ్స్ రూపొందించాలి.
ప్రపంచవ్యాప్తంగా రోడ్డు భద్రతలో దీన్ని ఫర్ గివింగ్ రోడ్ డిజైన్ అనే భావనతో చూస్తారు. అంటే డ్రైవర్ ఒకవేళ తప్పు చేసినా.. దాని ఫలితం మరణాలకు దారి తీయకుండా రోడ్డు డిజైనింగ్, క్రాష్ బ్యారియర్స్ (రోడ్డు పక్కన ఉండే ఇనుప, కాంక్రీట్ కంచెలు), మీడియన్స్ (కాంక్రీట్ డివైడర్), షోల్డర్స్ (ప్రధాన రోడ్డుకు ఇరువైపులా కావల్సినంత స్పేస్ తో విడిచిపెట్టే స్థలం) వంటి రక్షణ వ్యవస్థలు పని చేయాలి. ఐఐటీ ఢిల్లీకి చెందిన రోడ్డు భద్రతా నిపుణులు కూడా ఈ విషయాల్ని ప్రస్తావించారు.
అసలు బలహీనత చట్టంలోనా… దాని అమలులోనా…?
రోడ్డు ప్రమాదాన్ని శాస్త్రీయంగా దర్యాప్తు చేయడానికి మోటార్ వెహికిల్ యాక్ట్ లో ఇతర నిబంధనలు కూడా ఉన్నాయి. సెక్షన్ 135 (1ఏ) – ఇది శాస్త్రీయ ప్రమాద దర్యాప్తు ద్వారా ఇంజనీరింగ్ లోపాలను గుర్తించేందుకు ఈ యాక్ట్ తీసుకొచ్చారు. ఇలాగే సెక్షన్ 219 సీ, 210 డీ వంటి సెక్షన్స్… రోడ్డు ఇంజనీరింగ్ ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలను తెలిపేవి.
కానీ, చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ నిబంధనలు అమలు చేయడానికి అవసరమైన పూర్తి నియమావళిని, వ్యవస్థలనే రూపొందించుకోకపోవడం విషాదం. వ్యవస్థల నిలువెత్తు నిర్లక్ష్యం. అందుకే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడల్లా డ్రైవర్ మితిమీరిన వేగం, నిద్ర మత్తు, లేకుంటే, నిర్లక్ష్యం, ఓవర్ టేకింగ్ వంటి అంశాలే తెరపైకొస్తున్నాయి. శాస్త్రీయ దర్యాప్తు లేదు. చట్టాల అమలు లేదు. ఏ ప్రమాణాలు ఉల్లంఘనకు గురయ్యాయో చూసేవారు కరువయ్యారు. ఎవరు బాధ్యులో తేల్చే పనిపై చిత్తశుద్ధి లేదు. ఏ లోపం వల్ల ప్రమాదం జరిగింది.. అందుకు కారణమేంటన్న ఇన్వెస్టిగేషన్ కనిపించదు. దీంతో రోడ్డు ప్రమాదాలన్నింటినీ ఒకే గాటన కడుతూ.. ఏవిధంగా ప్రమాదాలు జరుగుతున్నాయో ఓ శాస్త్రీయ అంచనాకు రావడం, నిరూపించడం కష్టమవుతోంది.
ఈ విషయాన్ని రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ కూడా పలుమార్లు చెప్పారు. లోపభూయిష్ఠమైన ప్లానింగ్, తప్పుడు డీపీఆర్ లు, సివిల్ వర్క్స్ లోపాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయనీ గుర్తించామన్నారు. కానీ… తీసుకొచ్చిన చట్టాలను మాత్రం సమర్థవంతంగా అమలు చేయడం లేదు.
ఈమధ్యే సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్న ఖమ్మం – జగిత్యాల NH-563 రోడ్డు మార్గం కూడా ఇలాంటి కోవలోదే. పైన పటారం. లోన లొటారం. గ్రామాల అస్తిత్వాన్నే దెబ్బతీసింది. రైతుల పొలాలొకవైపు.. వారి ఇళ్లు మరొకవైపు.. అండర్ పాసెస్ లేవు… హైవేలపై రోడ్డు దాటితే ప్రమాదాలు తప్పడం లేదు. ఇప్పటికే రోడ్డు పూర్తిగా ఆరంభించకమునుపే ప్రమాదాల పరంపర మొదలైంది. అక్టోబర్ నుంచి టోల్ ట్యాక్స్ కూడా వసూల్ చేస్తారు. కానీ, ప్రమాదాలపై ఫోకస్ కరువైంది. మరి పట్టించుకునేవారేరీ..?
జస్ట్ స్టీరింగ్ వెనుక కూర్చున్న డ్రైవర్ ను బాధ్యుణ్ని చేసి కేసులు ముగించడం వల్ల, చేతులు దులుపుకోవడం వల్ల, చట్టాలు కాగితాలకే పరిమితం చేయడం వల్ల ప్రమాదాలు ఆగిపోవు. అందుకే ఏడేళ్లైనా అమలు కాని 198 ఏ ఇప్పుడు ఓ చర్చ.


