తరగతి గది భిన్నత్వం
……………………………………………………………………………………………………………

డా. పుల్లూరి సంపత్ రావు..✍️
ఈ మద్య ఇద్దరు సంక్షేమ హాస్టళ్ళ ప్రిన్సిపాళ్లతో మాట్లాడే అవకాశం వచ్చింది. రెండు వేరు వేరు సామాజిక వర్గాల కుటుంబాల పిల్లలు చదువుకునే హాస్టళ్ళలో వారు పనిచేస్తున్నారు. నా ఆసక్తి కోసం పిల్లలు ఎలా ఉంటారన్న ప్రశ్నకు సమాధానంగా ఇద్దరూ తలలు పట్టుకున్నారు.
మా హాస్టళ్ళది ప్రత్యేక లోకమని పిల్లలంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లవడం చేత వాళ్ళంతా ఒక జట్టుగా ఉండి సిబ్బందిపై ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తారని నిజానికి మేం వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవలిసిన అగత్యం ఉంటుందని చెప్పారు. మేం వాళ్ళను నియంత్రణ చేయడం మాట అటుంచి మాపై ఫిర్యాదులు రాకుండా ఉండటానికి ఎన్నోసార్లు మేమే సర్దుబాటు అవుతామని అన్నారు. మరోవైపు తల్లిదండ్రులు, కొన్ని సంఘాల నాయకులు, మీడియా వ్యక్తులు మాపై పెత్తనం చెలాయించడానికి, మా నుంచి ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేస్తారని, కొన్నిసార్లు బెదిరిస్తారని కూడా చెప్పారు. నిజానికి వాళ్ళు బహిరంగంగా చర్చించడానికి వీలులేని మరికొన్ని అంశాలను ప్రస్తావించారు. ఉద్యోగం దొరకడమే గగనం కాబట్టి పనిచేస్తున్నామని ఇక్కడ పరిస్థితులు ఇలా ఉంటాయని మేం ఇక్కడకు వచ్చేదాకా మాకూ తెలియవని వాపోయారు.
పరిస్థితి బాగా లేదని అర్థమయింది. అయితే ప్రహారి గోడలు గల భవనాలు, నిఘా వ్యవస్థ, సిబ్బంది పెంపుదల, నిరంతర పర్యవేక్షణ, సమీక్ష వంటివి చేపడితే చాలావరకు నియంత్రణలో ఉండే సమస్యలే. వీళ్ళు చెప్పిన కొన్ని విపరీత ధోరణులు మిగతా హాస్టళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళ హాస్టళ్ళలో కూడా జరిగేవే! అయితే పిల్లలంతా ఒక జట్టుగా ఉండి సిబ్బందిపై అధిపత్యం చెలాయించడం, ఏకపక్ష ఆలోచనా ధోరణి, దురుసు ప్రవర్తన మాత్రం ఇలాంటి హాస్టళ్ళలోనే ఉన్నట్టు తోస్తున్నది. దీనికి పిల్లలందరి ఏకరూప సామాజిక నేపథ్యం కారణం కావచ్చు.
ఉపధ్యాయుడు-పాఠశాల-మతం పేరుతో గతంలో నేను ఒక ఎపిసోడ్ రాశాను. భిన్న సామాజిక నేపథ్యాలు గల పిల్లలున్న స్కూళ్ళలో మతం విషయంలో లౌకిక భావనను పిల్లలలో కలిగించేందుకు ఉపాధ్యాయుడు ఎలాంటి నియమాలు పాటించాలో అందులో చర్చించాను. ఒకే సామాజిక నేపథ్యం గల పిల్లలకు ప్రజాస్వామ్య భావనను నేర్పించడానికి మరిన్ని ఏర్పాట్లు కావాలి. లేదా ఇలాంటి హాస్టళ్ళ స్థానంలో అన్నివర్గాల కుటుంబాల పిల్లలు ఉండేవిధంగా హాస్టళ్ళను రూపొందించుకోవాలి.
పాఠశాలను సాధారణంగా సమాజానికి సంక్షిప్త రూపంగా భావిస్తాము. సమాజం ఎలా ఉంటుందో తరగతి గదిని ఉదాహరణగా చూపిస్తాము. భిన్న నేపథ్యాలు గల పిల్లలంతా ఒక చోట ఉండటం వలన ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటారు. సర్దుబాటు గుణం అలవర్చుకుంటారు. తద్వారా విద్యార్థులు సమగ్ర మూర్తిమత్వం పొందగలరు. సాంఘీకరణ ప్రక్రియ సంపూర్ణమవుతుంది.
అమెరికాలో భిన్నత్వాన్ని ఒక జీవన విధానంగా భావిస్తున్నారట. విద్యాసంస్థల్లో, పనిప్రదేశాల్లో భిన్న రంగుల వ్యక్తులను, భిన్న మతాల వ్యక్తులను, భిన్న ప్రాంతాల వ్యక్తులను, భిన్న దేశాల వ్యక్తులను ఉండేలా చూస్తున్నారట. ఒక అపార్టుమెంట్ లో కూడా ఒకే సామాజిక నేపథ్యం గల వాళ్ళకు ఫ్లాట్స్ కేటాయించరట!
చదువుల లక్ష్యం జీవనోపాధి ఇవ్వడంతోపాటు మంచి మనుషులను తయారుచేయడమని విధాన నిర్ణేతలు గుర్తించాలి.



