వావ్ మొస్సాద్.. హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ వార్..!
…………………………………………………………………………………….
Ganesh Thota… ✍️
హాలీవుడ్ సినిమాల్లో కూడా కనిపించని యాక్షన్ సీన్స్.. ప్రత్యర్థుల అంచనాలకు అందని వ్యూహాలు.. ఒకే ఒక్క మూవ్ మెంట్ తో శతృవులకు కోలుకోలేని దెబ్బ.. యావత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థగా మొస్సాద్ కు ఎందుకు పేరు వచ్చిందో.. “హెజ్బొల్లాపై అటాక్” చెబుతుంది. ఈ సరికొత్త వ్యూహంతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధనిపుణులు, ఉగ్రవాద సంస్థలు, మిలటరీ సర్వీసులు సైతం ఉలిక్కిపడ్డాయి. అమెరికా, చైనా సహా అన్ని దేశాలు.. అవాక్కయ్యాయి. లెబనాన్ కేంద్రంగా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పనిచేస్తోన్న హెజ్బొల్లా ఉగ్రవాదలుపై పేజర్లతో అటాక్ చేసిన ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్.. తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

ఇరాన్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పై యుద్ధానికి సిద్ధమవుతోన్న లెబనాన్ కేంద్రంగా పనిచేస్తోన్న హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ చేసిన స్ట్రాటజిక్ వార్ తో.. ఆ సంస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేసేసింది. హెజ్బొల్లా ఉగ్రవాదుల దగ్గరున్న వందలాది పేజర్లు ఒకేసారి, ఒకే సమయంలో పేలిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు సహా మొత్తం నలుగురు మరణించారు. వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీని వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఉందని తేలింది. అయితే ఇదెలా సాధ్యమైందన్న విషయం.. ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దీనిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. మొబైల్ వాడితే వాళ్ల డేటా మొత్తం ప్రపంచానికి తెలుస్తుందనే భయంతో.. ఈ ఉగ్రవాదులు పేజర్లు వాడుతున్నట్లు తేలింది.
పేజర్లు అంటే ఈ కాలానికి ఎవరికీ తెలియకపోవచ్చు కానీ.. సెల్ ఫోన్లు రాకముందు.. కమ్యూనికేషన్ కోసం దీన్ని వాడేవారు. కాకపోతే ఇది ఇన్ కమింగ్ మెస్సేజ్ మాత్రమే అందజేస్తుంది. దీంతో మొబైల్ వినియోగంతో వచ్చే ట్రాకింగ్ వంటి సమస్యలు తలెత్తకుండా.. హెజ్బొల్లా ఉగ్రవాదులు ఈ పేజర్లు వినియోగిస్తున్నట్లు తేలింది. వీటి కోసం తైవాన్ కు చెందిన ఓ కంపెనీకి.. ఈ ఉగ్రవాద సంస్థ బల్క్ గా ఆర్డర్ ఇచ్చింది. ఆ తైవాన్ కంపెనీ.. యూరప్ కు చెందిన మరో సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అక్కడే ఏదైనా జరిగి ఉండొచ్చనే సమాచారం అందుతుంది. పేజర్ తయారీ సమయంలోనే మొస్సాద్ ఆదేశంతో.. మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు అందులో అమర్చినట్లు ఆరోపణలు వినిపస్తున్నాయి. అలా కాకపోతే.. పేజర్లు రెడీ అయిన తర్వాత అవి ఉగ్రసంస్థకు చేరే సమయంలో.. వాటి ప్లేస్ లో హ్యాక్ చేసినవి ఉంచే అవకాశం ఉందనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి.
పేజర్ల తో అటాక్ గురించి నివ్వెరపోయిన ప్రపంచం ఇంకా దాన్నుంచి బయటపడకముందే.. కొన్ని గంటల్లోనే ఈ సారి వాకీ టాకీలతో మొస్సాద్ అటాక్ చేసింది. పేజర్ల పేలుళ్లలో మరణించిన వారి అంత్యక్రియల్లో వందలాది మంది ఉగ్రవాదులు, సానుభూతిపరులు పాల్గొన్నారు. ఈ సమయంలో వాకీ టాకీలను హ్యాక్ చేసి పేల్చారు. ఈ సారి విధ్వంసం భారీగా జరిగింది. 14 మంది మరణించగా.. మరో 450మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులకు ఇజ్రాయెలే కారణమని భావిస్తున్నట్లు.. లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ఆ ప్రాంతంలో పలు ఇళ్లల్లో ఉన్న సోలార్ పరికరాలు, హెజ్బొల్లా గ్రూప్‌కు చెందిన రేడియో పరికరాలూ సైతం పేలిపోయాయి. ఇటు పేలిన వాకీ టాకీలు జపాన్ తయారవగా.. వాటిపై ఐకామ్ అనే సంస్థ పేరు ఉంది. అయితే, లెబనాన్‌లో పేలిన వాకీటాకీల ఉత్పత్తిని చాలా కాలం కిందట ఆపేశామని ఐకామ్ ప్రకటించింది.
ఈ చర్యలు.. హెజ్బొల్లాకు కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. అసలు దాడి ఎలా జరిగిందనేది సైతం అర్థం కాని స్థితిలో ఉగ్రసంస్థ పడిపోయింది. ఇప్పుడప్పుడే దాని కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలు లేనేలేవు. ఇక దాడులు, ప్రతిదాడులు, రక్షణ, నిఘా విషయంలో.. టెక్నికల్‌గా మొస్సాద్ ఎంతో ముందంజలో ఉంటుంది. పైగా తమ దేశానికి నష్టం చేసే ఏ దేశాన్నీ, ఏ సంస్థనూ వదిలిపెట్టదు. ఈ ఘటనతో అది మరోసారి నిరూపితమైంది.



