Shanthi Ishaan… ✍🏻
ashabhosle
92 వసంతాల ఓ కోయిల ఇక సెలవంటూ దిగంతాలకు ఎగిరిపోయింది! పోతూ పోతూ పాటల తోటలను మన కోసం జ్ఞాపకాలుగా విసిరిపోయింది.
‘ఓ హసీన్ దర్ద్ దేదో జిసే మై గలే లగా లూ’ అంటారు ఆశా భోస్లే ఓ పాటలో. ఆ పాట సందర్భం ఏదైనా ‘హసీన్ దర్ద్’ అనే మాట ఎంత బావుందో! అది ఆశాజీ స్వరానికి చక్కగా సరిపోతుంది. ఆవిడ తన పాటతో మనందరికి అలాంటి అందమైన బాధనే కదా పుట్టిస్తారు.

ఆశా భోస్లే స్వరం మెత్తగా లాలించే పిల్ల తెమ్మెర, గుండెను పట్టి కుదిపేసే హోరుగాలి! మెల్లగా సాగే సెలయేరు, ఉవ్వెత్తున దూకే జలపాతం! లతాజీ స్వరం కమ్మగా సాగితే ఆశా తాయీ గొంతుకలో ఎక్కడెక్కడి హొయలూ పలుకుతాయి. నాకైతే ఆ versatile voice అంటేనే ఇష్టం – వినడానికి, పాడుకోవడానిక్కూడా! ఆ అల్లరల్లరి స్వరం నుంచి జాలువారిన పాటలన్నీ ఆణిముత్యాలే!
‘జబ్ చలీ ఠండీ హవా’ రేడియోలో మొదటి సారి విన్నప్పుడు ఎన్నెన్ని గిలిగింతలో! ఆవిడ ‘హాల్ కైసా హై జనాబ్ కా?’ అన్నా ‘అభీ నా జావో చోడ్ కర్’ అంటున్నా తెలియని మైమరుపు.
‘మేరా కుఛ్ సామాన్
తుమ్హారే పాస్ పడా హై’
గుల్జార్ దర్శకత్వం వహించిన “ఇజాజత్” సినిమాలోని పాట ఇది. ఈ పాట లిరిక్స్ కూడా ఆయనే రాశారని వేరే చెప్పాలా? ఇజాజత్ 1987లో రిలీజైంది. ఆర్డీ బర్మన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఓరోజు గుల్జార్ ఒక పాటకి లిరిక్స్ రాసి రికార్డింగ్ కి పట్టుకెళ్ళారు. ఆ లిరిక్స్ చూసి బర్మన్ దా ఇది పాట సాహిత్యమా లేక న్యూస్ పేపరా అని అడిగారు. గుల్జార్ మౌనంగా ఉండిపోయారు. ఆ పాట పాడాల్సిన ఆశా భోస్లే లిరిక్స్ చేతికి తీసుకుని మెల్లగా హమ్ చేస్తూపోయారు. అది వింటున్న బర్మన్ దాకి ఏదో స్ఫురించింది. అంతే! పదిహేను నిముషాల్లో బాణీ కట్టేశారు. అలా పుట్టిందే ‘మేరా కుఛ్ సామాన్’ అనే పాట!
ఈ పాట లిరిక్స్ నిజంగానే పైకి ప్లెయిన్‌గా కనిపిస్తాయి. కానీ తరచి చూస్తే ఆ పదాల్లో ఎంతటి అర్థం దాగుందో తెలుస్తుంది. సుతిమెత్తగా ఉన్నట్లు కనిపించినా ఈ పాట బాణీ చాలా కష్టమైంది. ఆలాపన మొదలుకొని చివరి దాకా ఒక ప్రవాహంలాగా సాగిపోతుంది. పల్లవి, చరణం లాంటి సంప్రదాయ పద్ధతులు కనిపించవు. ఈ పాట పాడ్డం అప్పట్లో ఆశా భోస్లేకి పెద్ద సవాలుగా తోచింది. మాధుర్యం చెడకుండా మంద్రస్థాయి నుంచి తారస్థాయికి, అక్కడి నుంచి మళ్ళీ మధ్యమస్థాయి, మంద్రస్థాయులకు ప్రయాణిస్తూ ఆశా ఈ పాటకు పూర్తి న్యాయం చేశారు. మధ్యమధ్యలో మాటలు, విరక్తి నవ్వులు కూడా వినిపించారు. ఇంత బాగా పాడినందుకు ఆవిడకు, అంత విభిన్నంగా రాసినందుకు గుల్జార్ కి 1988 సంవత్సరానికిగాను జాతీయ అవార్డులు దక్కాయి. ఈ పాట విన్నప్పుడల్లా ఆర్డీ బర్మన్ తో గడిపిన రోజులే గుర్తొస్తాయని ఆశా భోస్లే ఒక ఇంటర్ వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకే ఈ పాటంటే ఆవిడకి ప్రాణమట!
1933, సెప్టెంబర్ 8న పుట్టిన ఆశా భోస్లే అక్క లతా మంగేష్కర్ సాయంతో సినిమాల్లో పాడ్డం మొదలుపెట్టినా తొందరలోనే తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. మత్తుగా, గమ్మత్తుగా పలికే ఆమె స్వరానికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘ఆయియే మెహర్బాన్’ అంటూ ఒక పాటలో కవ్విస్తే ‘ఓ మేరే సోనారే’ అంటూ మరో పాటలో మురిపిస్తారు. ‘హరే రామ హరే కృష్ణ’లోని ‘దమ్ మారో దమ్’ అనే రాక్ నంబర్ పాడినా ‘ఉమ్రావ్ జాన్ లోని ‘ఇన్ ఆంఖోంకీ మస్తీ కే’ అనే ఘజల్ ఆలపించినా ఆశా స్టైల్ దేనికదే ప్రత్యేకం. నాకైతే ఈ సినిమాలోని “దిల్ చీజ్ క్యా హై” చాలా ఇష్టం. ఆశాజీ తన గొంతుకనే కత్తిలా మార్చి గుండెను కోసేస్తుందా అన్నట్లుంటుందీ పాట.
ఏం గొంతు అది! ‘బేచారా దిల్ క్యా కరే’ అంటూ మన గుండెల్ని నిస్సహాయమైన హాయిలోకి నెట్టేస్తుందో చోట. ‘పియా బావరీ’ అంటూ పిచ్చి మైకాన్ని కుమ్మరిస్తుందో చోట! ‘మన్ క్యూన్ బెహకారీ’ పాటలో లతా గొంతు కంటే ఆశా పాడే లైన్ల కోసమే కాసుక్కూచుంటాను. “హమ్ నే పీ చాందిని” అని ఆశా పాడుతుంటే వెన్నెల తాగేసే కాబోలు ఈవిడ గొంతు ఇంత మార్దవంగా మారిపోయిందని అనిపించక మానదు!
హెలెన్ కోసం పాడిన ‘పియా తూ అబ్ తో ఆజా’ ఎంత ఊపునిస్తుందని! హెలెన్ కి వచ్చిన పేరులో సగం క్రెడిట్ ఆశాజీకే చెందాలంటాను. ‘ఏ మేరా దిల్ యార్ కా దివానా’, ‘ఓ హసీనా జుల్ఫోవాలీ’ లాంటి డాన్స్ నంబర్స్‌ని ఎవరు మాత్రం మర్చిపోగలరు?
ఆశాజీ అప్పటిదాకా పాడిన పాటలు ఒక ఎత్తయితే
90s తర్వాత ఎ. ఆర్. రహమాన్ కాంబోలో పాడిన పాటలు మరో ఎత్తు. రంగీలా టైటిల్ సాంగ్, ‘తన్హా తన్హా’ పాటలు ఆవిడ వర్సటాలిటీకి అద్దం పడతాయి. ‘లగాన్’లోని ‘రాధ కైసే న జలే’లో ఆవిడ గొంతు ఎన్నెన్ని చిన్నెలు పోతుందని!
అన్నట్లూ ఆశాజీ మన తెలుగులో కూడా కొన్ని పాటలు పాడారు. 1988లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘చిన్ని కృష్ణుడు’ సినిమాలోని ‘జీవితం సప్త సాగర గీతం’ అన్న ఆర్డీ బర్మన్ కంపోజిషన్ ఇప్పటి తరానికి కూడా బాగా తెలుసు. ఇక ‘చందమామ’ సినిమా కోసం కె.ఎం. రాధాకృష్ణన్ పాడించిన ‘నాలో ఊహలకు’ అనే పాట ఎంత హాయిగా, లయబద్ధంగా సాగిపోతుందో!
మనలోని ఊహలకు, ఊసులకు అడుగులు నేర్పిన అ స్వరం ఇప్పుడొక స్మృతి మాత్రమే! అయితేమి గుండెను తడిమినప్పుడల్లా పలకరిస్తూనే ఉంటుంది!



