237 వారాలపాటు నంబర్ వన్ ప్లేయర్: రాకెట్ చేతపడితే రాకెట్ లా దూకుడే!

జీవితంలో ఎన్నో సార్లు పడ్డాడు. పడ్డ ప్రతీసారీ మళ్లీ లేచి నిలబడ్డాడు. దాన్నే తన విజయ రహస్యం చేసుకున్నాడు. ఏకంగా 20 గ్రాండ్ స్లామ్స్ సాధించి.. వరుసగా 237 వారాల పాటు.. మొత్తంగా 310 వారాలపాటు ఏటీపీ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా నిల్చిన విశ్వవిజేత తాను. ఆటలో ఎన్నో గాయాలయ్యాయి. కానీ, అవేవీ మనసును మథనంలో పడేసేంత పెద్దగాయాలేం కావు. కాబట్టి తిరిగి పుంజుకునేవాడు. కానీ, 2020 తర్వాత ఆ ఆటగాడి మోకాలికి ఏకంగా 3 శస్త్రచికిత్సలు జరిగాయి. మళ్లీ ఎప్పటిలానే ప్రయత్నించాడు. కానీ, ఇక, తాను టెన్నిస్ కోర్టులో ఉండలేనననే అంతర్మథనం మాత్రం తనను వేధించడం మొదలుపెట్టింది. మొదట వెన్నునొప్పిలా అనిపించినా… ఆ తర్వాత భయంకరమైన మోనో న్యూక్లియోసిస్ వ్యాధి వెంటాడటంతో ఆయన నిష్క్రమణకు ఆ టెన్నిస్ కోర్ట్ కూడా కన్నీరు పెట్టింది.

ఇవాళ ఆగస్ట్ 8 రోజర్ ఫెదరర్ బర్డ్ డే

జీవితంలో అందరూ ఒకసారే మరణిస్తారు… కానీ, స్పోర్ట్స్ మ్యాన్ కు మరణం రెండుసార్లుంటుందేమో! విశ్వవిఖ్యాత టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ విరమణ తర్వాత ఆయనకు దీర్ఘకాలం కోచ్ గా పనిచేసిన సెవెరిన్ లూతీని నోటివెంట వచ్చిన మాటిది.

రోజర్ రోజర్.. ఫెదరర్ ఫెదరర్… రోజర్ ఫెదరర్.. ఇదిగో ఇలా రకరకాలుగా ఒకే పేరు అభిమానుల గళాల నుంచి ఓ నినాదంలా వినిపిస్తుంటే.. జీవితమే టెన్నిస్ అన్నట్టుగా బతికిన రోజర్ ఫెదరర్ టెన్నిస్ కోర్ట్ నిష్క్రమణ.. ఓవైపు ఆయన అభిమానులు.. మరోవైపు ఆయన సహచర ప్రత్యర్థి ఆటగాళ్లు… ఇంకోవైపు కుటుంబ సభ్యుల భావోద్వేగాల మధ్య 2022 లావర్ కప్ డబుల్స్ తో ముగిసింది.

రోజర్ ఫెదరర్ ఎంత గొప్ప ఆటగాడిగా ఎదిగాడో… టెన్నిస్ కోర్ట్ నుంచి నిష్క్రమించే సమయంలో అంత భావోద్వేగానికి గురైన మరో ఆటగాడు ఉండడేమో! ఫెదరర్ నిష్క్రమణ.. తోటి ప్రత్యర్థి ఆటగాళ్లనూ కంట తడిపెట్టించింది. తన సహచర మరో విశ్వవిజేత రఫెల్ నాదలైతే ఏకంగా దు:ఖాన్ని దిగమింగుకోలేకపోయాడు.

ఆటల పట్ల పిల్లల్లో ఆసక్తి పెంచేందుకు ఎన్నో డొనేషన్స్ ఇచ్చే పెద్ద చేయి అది. అంగవైకల్యమున్న పిల్లల్ని ఛాలెంజింగ్ గా తయారు చేసేందుకు స్ఫూర్తినిచ్చేలా డాలర్లు ఖర్చు పెట్టిన మంచి మనసు అది. అందుకే ఫెదరర్ ను యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.

కానీ, మోనో-న్యూక్లియోసిస్ తో ఇక తాను టెన్నిస్ కోర్టుకు వచ్చి గతం తాలూకు ఆటను అందించలేననిపించింది రోజర్ ఫెదరర్ కు. దాంతో ఓరోజు టెన్నిస్ కోర్టులోనే ఇక తాను కోర్టు నుంచి విరమణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అక్కడికక్కడే తన రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అది ఫెదరర్ అభిమానులందర్నీ ప్రపంచవ్యాప్తంగా కలవరపర్చింది. తన ప్రత్యర్థులనూ ఒకింత భావోద్వేగంతో కూడిన విచారానికీ గురి చేసింది.

అయితే, తన రిటైర్మెంట్ సందర్భంగా తానిచ్చిన స్పీచ్ అందరినీ కంట తడి పెట్టించింది. అభిమానులు, టెన్నిస్ కోర్టులో ఉన్న ప్రేక్షకులైతే దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. తన ప్రత్యర్థైన మరో విశ్వవిజేత రఫెల్ నాదల్ అయితే… కన్నీటి పర్యంతమయ్యాడు.

ఆ సందర్భంగా.. రోజర్ ఫెదరర్ ఏమన్నాడో ఓసారి ఆయన మాటల్లోనే విందాం. ” ప్రపంచంలో అత్యద్భుతమైన దేశమైన స్విట్జర్లాండ్ నా జన్మభూమైనందుకు నేనేనాడు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోలేదు.. తన అలసటకు ఊరటగా నిల్చి తననెప్పటికప్పుడూ ప్రోత్సహిస్తూ వస్తున్న తన జీవిత సహచరిణినిచ్చిందుకూ ధన్యవాదాలు చెప్పలేదు.. ఐదేళ్ల పాటు ప్రపంచ నంబర్ వన్ స్థానంలో తనను నిలబెట్టినందుకూ ఆ దేవుణ్ని ప్రార్థించలేదు… మిలియన్ డాలర్ల ఆస్తులను కూడబెట్టేందుకు కారణమైనందుకూ ఏనాడూ దండం పెట్టుకోలేదు.. మరిప్పుడు ఈ మోనో-న్యూక్లియసిస్ వ్యాధిని మాత్రం ఎందుకిచ్చావని ఎలా అడగ్గలను..?”

ఈ మాటలు క్రీడాభిమానులందరినీ ఒక భావోద్వేగానికి గురి చేసిన రోజది.

ఫెదరర్ భావోద్వేగాలతో పాటు… బాల్యం నుంచే రోజర్ ఫెదరర్ కు టెన్నిస్ పైనున్న మక్కువ… బాలక్రీడాకారుడిగా ఆయన ఎదిగిన తీరు… రోజర్ కుటుంబం.. ఇంటికొచ్చినప్పుడు ఫెదరర్ పిల్లల్లో పిల్లవాడై ఆడుకునే తీరు.. ఇలా ఇవన్నీ ఒక బొకేలా మార్చి తీసిన డాక్యుమెంటరీ అమెజాన్ ప్రైమ్ లోనూ ఉంది. ఆసక్తి ఉన్నవారు చూడొచ్చు.

ఆసిఫ్ కపాడియా, జో సబియా కలిసి నిర్మించిన ఈ 90-నిమిషాల డాక్యుమెంటరీ రోజర్ ఫెదరర్ గురించి దృశ్యరూపంలో చూడాలనుకునేవారికి ఓ మంచి ఛాయిస్.

ముఖ్యంగా తానిక టెన్నిస్ కోర్టుకు దూరం కాబోతున్నాను… సెప్టెంబర్ 2022లో లండన్ లో జరుగబోయే లావర్ కప్ డబుల్స్ ఫైనలే.. తన జీవితంలో ఫైనల్ మ్యాచ్ అన్న భావనతో ఉన్న రోజర్ ఫెదర్ ట్వెల్వ్ ఫైనల్ డేస్ ఎలా గడిపాడన్నదే ది గ్రేట్ స్విస్ టెన్నిస్ ప్లేయర్ డాక్యుమెంటరీ మెయిన్ థీమ్.

అయితే, యూరప్ తరపున తన చిరకాల ప్రత్యర్థుల్లో ఒకడిగా ఎదిగిన రఫెల్ నాదల్ తో డబుల్స్ లో జట్టు కట్టినా… ఆ కప్ లో ఫెదరర్, నాదల్ జంట ఓటమే చవిచూసింది.

రోజర్ ఫెదరర్ అంటే 25 ఏళ్ల టెన్నిస్ కోర్టును గడగడలాడించిన ప్రొఫెషనల్. 1750 మ్యాచులాడి.. 20 గ్రాండ్ స్లామ్స్ సింగిల్స్ టైటిల్స్ అందుకున్న గ్రాస్ కోర్ట్ మొనగాడు. అందుకే రోజర్ ఫెదరర్ 40 ఏళ్ల వృత్తి జీవితం రిటైర్మెంట్ రోజు.. టెన్నిస్ దిగ్గజాలైన రాడ్ లావర్, బోర్న్ బోర్గ్, రఫెల్ నాదల్, జెకోవిచ్ వంటివారి కన్నీటి ప్రసంగాల నడుమ ఆ విరమణ కార్యక్రమం పూర్తిగా భావోద్వేగంతో నిండిపోయింది.

చివరి పన్నెండు రోజుల్లో ప్రెస్మీట్స్, ప్రాక్టీస్ సెషన్స్, సహచర ప్రొఫెషనల్స్ తో మీట్స్ ఇలా ఒక వేడుకలా సాగినా… దానివెనుక తనని ఆటకే దూరం చేసిన మోనో- న్యూక్లియోసిస్ వ్యాధితో టెన్నిస్ కోర్టునే వీడిపోతున్నప్పుడు.. తాను జీవితం నుంచే నిష్క్రమిస్తున్నంతగా ఫెదరర్ లో కనిపించిన భావోద్వేగం ఒక డాక్యుమెంటరీనే రూపొందేంత స్పేస్ క్రియేట్ చేసింది. అంతేకాదు… వాట్ నెక్స్ట్ అనే ప్రశ్ననూ ఫెదరర్ ముందుంచింది.

బ్రెజిలియన్ రేసింగ్ డ్రైవర్, ఫార్మూలా వన్ వరల్డ్ ఛాంపియన్ ఆయిటాన్ సెన్నాతో పాటు, ఫుట్ బాల్ గాడ్ డీయెగో మారడోనా వంటివారి బయోగ్రఫీని డాక్యుమెంటరీస్ గా మల్చిన కపాడియా.. ఫెదరర్ డాక్యుమెంటరీ చివర్లోనూ ఆర్కైవ్స్ లోని వారి దృశ్యాలను చూపిస్తూ లెజెండ్స్ ను ఒక్కచోట చేర్చాడు.

జస్ట్ 8 ఏళ్ల వయస్సులోనే టెన్నిస్ ఆటను ప్రారంభించి… 14 ఏళ్లకే స్విట్జర్లాండ్ జూనియర్ ఛాంపియన్ గా నిల్చిన ఫెదరర్.. పీట్ సంప్రాస్ వంటి మరో దిగ్గజ ప్లేయర్ ఛాంపియన్ గా నిల్చిన 1998 వింబుల్డన్ నుంచి తన టెన్నిస్ ఆరంగ్రేటం చేశాడు. అదే సంవత్సరం స్విట్జర్లాండ్ డేవిస్ కప్ లో 18 ఏళ్ల 4 నెలల యంగెస్ట్ ప్లేయర్ గా అడుగుపెట్టాడు. ఆ ఏడాదిలో వందమంది టాప్ టెన్నిస్ ప్లేయర్లలో 64వ స్థానంతో వార్తల్లోకెక్కాడు. 2000 సంవత్సరం ఆస్ట్రేలియా సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్ లో బ్రౌంజ్ మెడల్ సాధించడంతో పాటు.. అదే ఏడాది ది గ్రేట్ పీట్ సంప్రాస్ ను ఓడించడంతో ఇక ఫెదరర్ టెన్నిస్ కోర్ట్ కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. అలా 2002 వరకు టెన్నిస్ టాప్ ప్లేయర్లలో ఫెదరర్ కు 6వ ర్యాంకు దక్కింది. 2003 లో మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ వింబుల్డన్ ఛాంపియన్ షిప్ ను దక్కించుకోవడంతో… ఇక తిరుగులేని విజయ ప్రస్థానం మొదలైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ ఎక్కడ తను రాకెట్ పడితే.. అక్కడ ప్రత్యర్థి ఇక చేతులెత్తేయాల్సిందే. 2004లో 17 టోర్నమెంట్స్ ఆడితే.. పదకొండింటిలో ఫెదరరే ఛాంపియన్. అలా వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ గా తన ర్యాంకును 1వ నంబర్ మీద 237 వారాలపాటు నిలిపేశాడు. 2005లో కూడా 15 టోర్నమెంట్స్ కు గాను.. 11 టోర్నమెంట్స్ లో ఫెదరరే విజయుడు. 2003 నుంచి 2005 మధ్య 24 స్ట్రెయిట్ ఫైనల్స్ లో తానే విజయం సాధించి ఆ రెండేళ్లు టెన్నిస్ అంటే ఫెదరర్ అనే పర్యాయపదంలా తయారయ్యాడు.

టాప్ టెన్నిస్ ప్లేయర్ గా ఎంత పేరు తెచ్చుకున్నాడో.. అంత మానవత్వం ఉట్టిపడ్డ మనిషిగా కూడా ఫెదరర్ గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన చేసిన గుప్త దానాలు.. ముఖ్యంగా అనాథ పిల్లల చదువుల కోసం తన తల్లి మాతృదేశమైన దక్షిణాఫ్రికాతో పాటు… స్విట్జర్లాండ్ లోనూ తన సంపాదనలో పెద్దమొత్తాన్ని ఖర్చు చేయడం.. ఫెదరర్ హ్యూమానిటీకి ఓ ఎగ్జాంపుల్!

ఫెదరర్ విజయం వెనుక భార్య మిర్కా!

ఫెదరర్ కు 2020లో గాయమై మోకాలి సర్జరీ తర్వాత తన ఆట కొంత స్లో డౌన్ అవుతుండటం.. ఫెదరర్ కన్నా ఆయన భార్య మిర్కానే ఎక్కువ బాధించింది. ముఖ్యంగా భర్త సక్సెస్ లో ముగ్గురు పిల్లల ఆలనాపాలనా అంతా తానై చూసుకున్న మిర్కాకు… ఫెదరర్ ఆడలేకపోవడం.. తాను ఆడలేకపోతున్నానే ఫీలింగ్స్ మరింత బాధించేవి. 2020-2022 మధ్య మూడుసార్లు ఫెదరర్ మోకాలికి ఆపరేషన్స్ కాగా.. 11 గ్రాండ్ స్లామ్స్ లో కేవలం మూడింటిలోనే ఫెదరర్ పెర్ ఫార్మ్ చేయగల్గాడు. అప్పటికే తన వయస్సు ఒకవైపు మిగిలిన టెన్నిస్ స్టార్స్ తో పోలిస్తే.. కాస్త ఎక్కువే. అదే సమయంలో మంచి బూమ్ లో ఉన్న తన చిరకాల ప్రత్యర్థులు, తనకంటే వయస్సు రీత్యా చిన్నవారైన రఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లామ్స్, అదే విధంగా జెకోవిచ్ ఏకంగా 24 గ్రాండ్ స్లామ్స్ తో తనను అధిగమించేసిన సమయం… ఇక లాభం లేదనుకున్న ఫెదరర్ రిటైర్మెంటే తనకు బెటరనే ఒక కన్ క్లూజన్ కు వచ్చేశాడు. ఆ మూమెంట్స్ అన్నీ మిర్కా ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకాలుగా ఆమె మదిలో నిల్చిపోయాయి. ముఖ్యంగా 2021 వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ లో పోలాండ్ ప్లేయర్ హుబర్ట్ హుర్కాజ్ చేతిలో ఓడిపోవడంతో.. అప్పటివరకూ ప్రపంచ నంబర్ వన్, టూ, త్రీ స్థానాల్లో కొనసాగిన ఫెదరర్.. ఏకంగా తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. ఇక అదే తన టెన్నిస్ కోర్ట్ జీవితంలో అత్యల్పస్థాయి. అందుకే తాను రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నాడు. అదే విషయాన్ని భార్య మిర్కాకు చెప్పడంతో.. ఆమె తనకన్నా ఎంత ఎక్కువ బాధపడిందో ఫెదరర్ స్వయానా చెప్పే సన్నివేశాలు డాక్యుమెంటరీలో వాళ్ల మధ్య బంధాన్ని, అందులోని ఎమోషన్ ని కళ్లకు కడతాయి.

యూఎస్ లోని హ్యాంప్ షైర్ లో ఉన్న డార్ట్ మౌత్ కాలేజ్ లోనూ.. ఈమధ్యే ఫెదరర్ స్పీచ్.. అందరినీ కదిలించింది. ఒక ఆటగాడిగానే కాకుండా.. తను ప్రసంగించిన తీరు భావోద్వేగాలతో కూడి ఉండటంతో ఆ ఈవెంట్ ఆయన అభిమానుల కన్నీటి నడుమే అప్లాజ్ అందుకుంది.

2005-2009 మధ్య ఫెదరర్, తన చిరకాల ప్రత్యర్థి నాదల్ ఇద్దరే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్, టూ పొజిషన్ లో కొనసాగారు. 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ లో జెకోవిచ్ ఛాంపియన్ కావడంతో ఇక అప్పట్నుంచి.. ఫెదరర్, నాదల్ కు జెకోవిచ్ తో పోటీ మొదలైంది. 2006లో మాంటెకార్లేలో ఆడినప్పుడు జెకోవిచ్ తనను పెద్దగా ఆకట్టుకోలేదని.. కానీ, ఆ తర్వాత మాత్రం తనకు రెస్పెక్ట్ పెరిగిందని.. అందుకు అతడి టెక్నిక్సే కారణమంటాడు. అందుకే ఆ తర్వాత జెకోవిచ్ వరల్డ్ నంబర్ వన్ గా ఎలా నిల్చాడో కూడా ప్రత్యర్థి బలాన్నీ నర్మగర్భంగా ఒప్పుకునే మనస్తత్వం ఫెదరర్.

తన కెరీర్ మొత్తంలో విజయం సాధిస్తే ఉబ్బి తబ్బిబ్బై పోవడం.. లేకుంటే, మరీ ఎమోషనల్ అయిపోవడం.. కోర్టుల్లోనే కేకలు వేయడం వంటివేవీ చేయలేదని.. స్వతహాగా తనదా మనస్తత్వం కాదంటాడు ఫెదరర్. 2004 నుంచి 2019 మధ్య ఫెదరర్ తో తాను 40 సార్లు ఆడాడని.. తమ మధ్య సాగిన పోటీ ఎప్పటికీ మర్చిపోలేని ఘట్టమంటాడు నాదల్. వార్ కోర్ట్ లో మాత్రమే ప్రత్యర్థులైన ఫెదరర్- నాదల్… కోర్ట్ బయట ఎంత మంచి స్నేహితులో.. ఫెదరర్ రిటైర్మెంట్ సమయంలో నాదల్ ఎమోషన్స్ చూస్తే అర్థమవుతుంది.

ఫెదరర్ వంటి పెర్ఫెక్షనిస్ట్ ను ఇక ముందు కూడా చూడబోమని.. ఆటలో తన ఒరవడి, పరిపూర్ణత, గాంభీర్యం ఇంకెవ్వరికీ రావని.. అందుకే టెన్నిస్ ఆట ఉన్నంతవరకూ ఫెదరర్ పేరు శాశ్వతమంటూ తన మిత్రుణ్ని కొనియాడాడు రఫా. గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ లో ఫెదరర్ తో ఆడేటప్పుడు ఉండే ఉత్సాహం, గెలవాలన్న తాపత్రయం, ఆ ఛాలెంజింగ్ స్పిరిట్, ఆ ఒత్తిడి, ఆ వాతావరణం, మొత్తంగా మజా.. ఇకపై ఉండబోవని కంట తడి పెట్టాడు రఫా. టెన్నిస్ కోర్టులో ఫెదరర్ ను తాను మిస్సవుతున్నందుకు చాలా బాధగా ఉందంటూ నాదల్ లో కనిపించిన ఎమోషన్స్ కూడా ఫెదరర్ గొప్పతనాన్ని పట్టిచూపాయి.

ఇలా అన్ని విషయాలను పూసగుచ్చిన 90 నిమిషాల డాక్యుమెంటరీ రోజర్ ఫెదరర్.

finally, to the game of tennis, i love you, and will never leave you ఫెదరర్ నోట వచ్చే ఈ డైలాగ్.. టెన్నిస్ తో తన జీవితానికున్న అవినాభావ బంధాన్ని చెబుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles