రక్షాబంధన్ తో ఆ రాణి.. ఆ శత్రురాజునెలా మార్చేసింది..?

రాఖీ పండుగ అంటే హైందవ సంప్రదాయంలో ఓ సెంటిమెంట్. ఎంత దూరంలో ఉన్నా సోదరులు.. తమ అక్కాచెల్లెళ్ల దగ్గరకు వెళ్లి రాఖీ కట్టించుకోవడం ఆనవాయితీ. ఆ సందర్భంగా ఆడపడుచులకు కట్నాలు పెట్టి, స్వీట్లు పంపిణీ చేసి ఓ ఆత్మీయ వేడుక మనకు హైందవ సంప్రదాయాలు పాటించే ఇళ్లల్లో కళ్లకు కడుతుంది. అలాంటి రక్షా బంధన్ కు సంబంధించి ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఓ కథను మనం ఈ రాఖీపండుగ సందర్భంగా ఓసారి మళ్లీ జ్ఞప్తికి తెచ్చుకుందాం.

అదే రాణి కర్ణావతి రాఖీ పంపినప్పుడు… హ్యూమాయున్ ఏం చేశాడన్న కథ!

చరిత్ర అంటే విజయాలు, అపజయాలే కాదు… కొన్ని భావోద్వేగాలతో ముడిపడిన ముఖ్య ఘట్టాలూ ఉంటాయి.

16వ శతాబ్దంలో రాజస్థాన్ లోని చిత్తోర్ ఘర్ రాజ్యంపై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఆ యుద్ధంలో తాము ఓడిపోతున్నామని అప్పటికే మేవార్ రాజ్య సంస్థానంలోని సైనికులూ గ్రహించారు. ఆ సమయంలో రాణీ కర్ణావతి ఎవరూ ఊహించని ఓ పని చేసింది. అదే రాఖీని పంపించడం. అదెవరో తన సోదరులకో.. లేక, తన రాజ్యంలోని ఇంకెవరికో కాదు.. ఏకంగా శత్రురాజుకు ఆ రాఖీ పంపి వ్యూహాత్మకంగా వ్యవహరించారు రాణి కర్ణావతి. అప్పటికే మొఘల్ రాజులు.. మేవార్ రాజ్యాన్ని ఆక్రమించడం ప్రారంభించారు. సైనికులు చుట్టుముడుతున్నారు. అదిగో ఆ సమయంలో మొఘల్ చక్రవర్తి హ్యూమాయున్ కు.. రాణి కర్ణావతి రాఖీని పంపింది.

అయితే, ఆ రాఖీకి అసలు హ్యూమాయున్ స్పందిస్తాడా, లేదా.. స్పందిస్తే ఎలా స్పందిస్తాడు… అసలు పట్టించుకుంటాడా, లేదా కూడా ఆమెకు తెలియదు. కానీ, ఆమె వ్యూహం ఫలించింది. మొఘలు చక్రవర్తి హ్యూమాయున్ ఇస్లాం మతస్థుడైనప్పటికీ.. మతాన్ని, శత్రుత్వాన్ని, సామ్రాజ్యకాంక్షను దాటి.. ఆమె వ్యూహం ఫలించింది. తాను ఆమె రాజ్యంపై దండయాత్రకు పూనుకుంటే.. రాణి కర్ణావతి మాత్రం ఓ సోదరుడిగా భావించి తనకు రాఖీ పంపించడం… హ్యూమాయున్ ను కూడా ఆలోచింపజేసిందట. దాంతో దండయాత్రకు వెళ్లే సైనికులను ఆపేశాడు హ్యూమాయున్. అంతేనా, సోదరభావంతో తనకు రాఖీ పంపిన కర్ణావతితో రాఖీ కట్టించుకునేందుకు హ్యూమాయున్ బయల్దేరాడు. కానీ, తీరా హ్యూమాయున్ వెళ్లేసరికి అందుకు భిన్నమైన విషాద దృశ్యం మేవార్ రాజ్యంలో సాక్షాత్కారమైంది.

మరి ఇంతకీ ఏం జరిగిందక్కడ..?

హ్యూమాయున్ సకాలంలో చిత్తోర్ ఘర్ ను చేరుకోలేకపోయాడు. అప్పటికే ఆ కోట కకావికలమైన ఏదో ఘోషను వినిపిస్తోంది. సైనికులైన పురుషులంతా వెన్ను చూపకుండా యుద్ధానికి వెళ్లితే.. రాణి కర్ణావతితో పాటు… మిగిలిన ఆడపడుచులంతా జౌహార్ గా పిల్చే అగ్నిలో దూకి ఆహూతయ్యారు. అప్పుడు అంతటి యుద్ధకాంక్షతో రగిలిపోయిన ఆ మొఘల్ ప్రభువూ కంట నీరు పెట్టక తప్పలేదు.

చరిత్ర అంటే ఏం జరిగిందో చెప్పడమే కాదు… ఆ సందర్భంలో జరిగిన సున్నితమైన, సెంటిమెంట్ తో కూడిన అంశాలు ఎలా పనిచేశాయో కూడా చెప్పడం. రాణీ కర్ణావతి.. రాఖీ కట్టి రాజ్యాన్ని కాపాడుకోవాలనుకోలేదు. ఒక మానసిక సంఘర్షణలోనూ ఎవరినైనా జయించడానికి బదులుగా ప్రేమగా రక్షించడాన్ని ఎలా ఎంచుకోవచ్చో హ్యూమాయున్ కు రాఖీ పంపి ఆమె చూపింది. అది హ్యూమాయున్ కళ్లు తెరిపించింది.

అందుకే, రాఖీ అంటే ఓ దారం కాదు.. పరస్పర విశ్వాసాలకు, నమ్మకాలకు ఒక ఆధారం. ఏవో కొన్ని మెరుగులద్ది కట్టే బంధనం కాదు.. అది రక్షాబంధన్. పరస్పర నమ్మకాలు, అవసరాలు, ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు, గౌరవాలు ఇలా అన్నీ కలగలిసిన ఓ వేడుక రక్షాబంధన్.

ఇక ఎలాగైనా యుద్ధంలో ఓడిపోతాననే భయంతో.. తననూ, తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు హ్యూమాయున్ కు రాఖీ పంపలేదు రాణీ కర్ణావతి. ఆ తర్వాత తానేం చేయబోతున్నానో కూడా ముందే తనకు తెలుసు. కానీ, పరిస్థితులన్నీ తమకు ప్రతికూలంగా మారినప్పుడు కూడా తమకు ఎవరో ఒకరు అండగా నిలబడతారనే ఒక నమ్మకం కూడా ఆమెను ఆ పని చేయించింది. కచ్చితంగా స్పందించాల్సిన అవసరం హ్యూమాయున్ కూ లేదు. కానీ, ఆ చిన్న రాఖీ తనకందాక హ్యూమాయున్ లో కల్గిన పశ్చాత్తాపంతో తానూ తన సైన్యాన్ని ఆ కోటపైకి పంపలేదు. ఆమె తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదనుకున్నాడు. అందుకే తానే స్వయంగా మేవార్ కు బయల్దేరాడు.

ఇంతకీ ఏం చెబుతోంది రాణీ కర్ణావతీ రాఖీ కథ..?

మతాలు, రాజకీయాలు, గెలుపోటములు, కిరీటాలను మించి మనుషులుగా సాటివారి పట్ల ప్రేమ, విశ్వాసాలు కల్గి ఉండాలనే విషయాన్ని చెబుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles