హిరోషిమాపై యూఎస్ అణుబాంబు దాడికి 80 ఏళ్లని మాట్లాడుకుంటున్న తరుణంలోనే… భారత ఎన్నికల కమిషన్ పై రాహూల్ బాంబు పడింది. అదిప్పుడు సంచలనంగా మారింది. భారత రాజ్యాంగాన్ని కాపాడే పని మీకు అప్పగించారే తప్ప.. దాన్ని ధ్వంసం చేసే పని కాదంటున్నాడు రాహూల్. అంతేకాదు, భారత రాజ్యాంగానికీ, పతాకానికీ వ్యతిరేకంగా వ్యవహరించిన ఓ నేరంగా అభివర్ణిస్తూ తాను పేల్చిన బాంబ్ ఇప్పుడు దేశంలో ఎన్నికల ప్రక్రియపైనా, కమిషన్ తీరుపైనా ఓ చర్చకు తెరలేపింది.
బెంగళూర్ సెంట్రల్ పార్లమెంట్ పరిధిలోని మహదేవపూర అసెంబ్లీ స్థానాన్ని తమ ఆరోపణలకు ఆధారంగా చూపిస్తూ రాహుల్ సంధించిన ప్రశ్నలపై ఇప్పుడు ఎన్నికల కమిషన్ కచ్చితంగా సమాధానం చెప్పాల్సిన స్థానంలో బోన్ లో నిలబడింది. ఒక్క మెతుకు చాలు అన్నం ఉడికిందా, లేదా తేల్చడానికన్నట్టుగా.. తాము ఒక్క నియోజకవర్గంలో చేసిన అధ్యయనం భారతదేశ ఎన్నికల వ్యవస్థ పనితీరును కళ్లకు కడుతోందన్నారాయన. తాము స్టడీ చేసిన మహదేవపుర అసెంబ్లీ తరహాలోనే దేశం మొత్తం ఓ పెద్ద నేరపూరిత కుంభకోణం జరిగిందన్నది ఇప్పుడు రాహూల్ చేస్తున్న సంచలనమైన ప్రధానారోపణ. సీసీ టీవీ ఫుటేజీ ధ్వంసం చేశామని ఎన్నికల కమిషనే చెప్పిందని.. షకుణ్ రాణి అనే మహిళ రెండుసార్లు ఓటు ఎలా వేసిందో అందుకే తాము పట్టుకోలేకపోయామన్నారు.

అంతకుముందే ఎన్నికల కమిషన్ పై ఓ అణుబాంబు వేయబోతున్నట్టు రాహూల్ ఇండికేషన్ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఢిల్లీ ఇందిరాభవన్ ను వేదిక చేసుకున్న రాహూల్ నిన్న ఆగస్ట్ 7న ఓట్ హ్యాజ్ బీన్ డెస్ట్రాయిడ్ అనే నినాదంతో ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ మీడియా ముందుంచారు. రెండుసార్లు అప్పటికే అధికారంలో ఉన్న బీజేపీని మూడోసారి కూడా గద్దెనెక్కించేందుకు ఎన్నికల కమిషన్ ఓట్లను దొంగిలించిందనే విషయాన్ని ఉదాహరణలతో సహా ప్రజల ముందుకు తీసుకువచ్చే ఒక క్రిస్టల్ క్లియర్ ప్రెజెంటేషన్ చేశారు. ఎక్కువ కాలం వరుసగా అధికారంలో ఉంటూ ప్రజావ్యతిరేకత ఎదుర్కోనట్టుగా బీజేపీ నిలబడటానికి ఎన్నికల కమిషన్ ఆ పార్టీకి వంతపాడటమేనంటాడు రాహూల్.
అసలెందుకు రాహూల్ ఎలక్షన్ కమిషన్ పై అంత ఫోకస్ చేశాడు..?
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై గంపెడాశలు పెట్టుకుంది. కానీ, అక్కడా అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చి అధికారం బీజేపీ వశమైంది. అలాగే, మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికల్లో 48 స్థానాల్లో 30 స్థానాలను ఇండియా కూటమి గెల్చుకున్నా.. అసెంబ్లీ ఎన్నికలకొచ్చేసరికి ఘోర ఓటమిని చవిచూసింది. ఒపినీయన్ పోల్స్ అన్నింటికి భిన్నంగా ఫలితాలు వెల్లడవ్వడం… మహారాష్ట్రలో జనాభాను మించి ఓటర్ల సంఖ్య రిజిస్టరవ్వడం ఆశ్చర్యపర్చిందంటాడు. ఐదేళ్లల్లో కనిపించని ఓటర్ల సంఖ్య.. అనూహ్యంగా ఐదునెలల్లో ఎలా పెరిగిందన్నది రాహూల్ ప్రశ్న..? అటు ప్రజలతో పాటు.. ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేసిందని.. అందుకు తగ్గట్టే ఫలితాలూ వెల్లడైనాయంటారాయన. ఇక కర్నాటక రాష్ట్రంలో అధికారం నిలబెట్టుుకున్నా.. లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుస్తామనుకుంటే కేవలం తొమ్మిదికి పరిమితమవ్వడంతో రాహూల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓటర్స్, ఓటింగ్ ప్రక్రియపై ఫోకస్ చేసింది. అందుకు, కర్నాటకలోని మహదేవపూర అసెంబ్లీ రిజల్ట్స్ పై స్టడీ చేసి.. తామేం స్టడీ చేశామో రాహూల్ ప్రజల ముందుంచారు.
రాహూల్ లో మరింత అనుమానాలెందుకు బలపడ్డాయి.. ఎందుకంత లోతుగా మహదేవపుర అసెంబ్లీపై దృష్టి పెట్టాడు..?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ను కలిసి మహదేవపుర ఓటర్ల లిస్టును ఇమ్మంటే.. వరుసగా పేర్చితే ఏడడుగుల ఎత్తుండే బెండల్ ను చూపిస్తూ ఇదిగో ఈ లిస్ట్ ఇచ్చారని చూపించారు. అయితే ఆ పేపర్సేవీ కూడా స్కాన్ చేసే వీలు లేకుండా ఉన్నాయి. అలాంటి అవకాశమే ఉంటే.. ఇవాళ అందుబాటులోకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, చాట్ జీపీటీ వంటి టెక్నాలజీతో అందులో రిపీటెడ్ ఓట్లెన్ని, దొంగ ఓట్లెన్ని, బతికున్నవారెందరు, చనిపోయినవారి ఓట్లున్నాయా, ఒకే ఓటర్ పలు బూతుల్లో ఓటు కల్గి ఉన్నాడా, వివిధ రాష్టాల్లోనూ, వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ నమోదై ఉన్నాడా ఇలాంటి బోగస్ ఏరివేతకు సులభమయ్యేది. కానీ, ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీకిచ్చిన ఆ పేపర్స్ ఏవీ కూడా స్కానింగ్ కు అనుకూలంగా లేవు. దాంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 40 మంది నిపుణుల వరకూ ఆ పేపర్లలో ఏరివేతకు ఆర్నెల్లు కష్టించాల్సి వచ్చిందంటాడు రాహూల్. ఒక్క మహదేవపుర్ అసెంబ్లీకి సంబంధించి ఇంత పెద్ద పార్టీ స్టడీ చేయడానికే ఆర్నెల్ల సమయం పట్టిందంటే.. దేశంలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో జరిగిన ఓట్ల తీరును నిశితంగా పరిశీలించాలంటే ఎంత సమయం పడుతుందో ఊహించండంటాడు. అలా అనితరసాధ్యంగా ఎవ్వరికీ దొరక్కుండా ఉండేందుకే ఈసీ చీటింగ్ చేస్తోందని.. అలాంటి అసాధ్యాలపైనే బోగస్ ఓట్లు పుట్టుకొచ్చాయని.. అలా దొంగ ఓట్లను కట్టబెట్టే ఈసీ బీజేపీని గెలిపించిందంటాడు రాహూల్. ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ ఎరాలో.. డిజిటల్ అనలిసిస్ కు అవకాశం లేకుండా డాటానివ్వడమేంటన్న రాహూల్ ప్రశ్నకూ ఇప్పుడు సమాధానం దొరకాల్సి ఉంది. ఎందుకు ఈసీ నిజాలను దాస్తోందని ప్రశ్నిస్తున్నాడతను.
కాంగ్రెస్ పరిశోధనలో తేలిందేంటి..?
మహదేవపుర నియోజకవర్గంలో ఆరులక్షల 50 వేల ఓట్లుంటే.. అందులో 1 లక్షా 250 ఓట్లు చోరీ అయినాయంటున్నాడు రాహూల్. ఆ చోరీ అయిన రకాలను కూడా రాహూల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వెల్లడించాడు. అందులో డూప్లికేట్ ఓటర్స్ 11 వేల 965 అయితే.. అసలు అడ్రస్ లేని ఫేక్ ఓట్లు 40 వేల పైచిలుకున్నాయి. ఇక ఒకటే అడ్రస్ లో 10 వేల 452 ఓట్లున్నాయని.. ఫోటోలే లేని ఓటర్స్ 4 వేల 132 ఉంటే.. ఇక మరో ప్రధానమైన ఫామ్ 6 ను దుర్వినియోగం చేసి.. యువత ఎన్రోల్ చేసుకునే చోట వృద్ధులు, ముదిమి వయస్సువాళ్ల పేర్లతో ఫామ్ 6 ఓటర్లుగా చేర్చారని.. ఆ సంఖ్య 33 వేల 692గా చెప్పుకొచ్చారు రాహూల్. దాంతోనే బెంగళూర్ సెంట్రల్ ఎంపీ బీజేపీ ఖాతాలోకి వెళ్లిందన్నారాయన.
రాహూల్ కు అనుమానం ఎక్కడ మొదలైంది..?
బెంగళూర్ సెంట్రల్ ఎంపీ స్థానంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ గెలిస్తే.. ఒక్క మహదేవపురాలో మాత్రం బీజేపీ గెల్చింది. దాంతో తమ ఎమ్మెల్యేలున్నచోట కూడా తాము పార్లమెంట్ సీటును ఎందుకు గెలువలేకపోయామనే డౌట్ సహజంగానే కాంగ్రెస్ లోనూ, రాహూల్ లోనూ కల్గింది. దాంతో తమ పరిశోధనకు రాహూల్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం ఇదిగో బెంగళూర్ సెంట్రల్ పార్లమెంట్ స్థానాన్ని.. అందులోనూ మహదేవపుర స్థానాన్ని ఎంచుకుంది. బెంగళూర్ సెంట్రల్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ కేవలం 32 వేల 707 ఓట్లతో ఓటమిపాలైతే… మహదేవపురా అసెంబ్లీలో మాత్రం 1 లక్షా 14 వేల ఓట్ల భారీ తేడాతో ఓటమిపాలైంది.
ఒకే వ్యక్తి నాల్గు పోలింగ్ బూతుల్లో ఎలా ఓటు కల్గి ఉంటారన్నది రాహూల్ ప్రశ్న..? అలాగే ఆదిత్య శ్రీవాత్సవ అనే వ్యక్తి పేరు కర్నాటకతో పాటు, యూపీలో కూడా ఓటర్ల లిస్టులో ఎలా ఉంటుందన్నది ఆయన మరో ప్రశ్న..? ఇదేదో ఒక్క ఓటర్ కు సంబంధించిన విషయం కాదని.. వేల సంఖ్యలో ఇలాంటి తప్పిదాలను ఈసీ చేసిందని బల్లగుద్ది చెబుతున్నాడు రాహూల్. ఆ 11 వేల మంది డూప్లికేట్ ఓటర్స్ ఎక్కడిపడితే అక్కడ ఎలా పడితే అలా ఓట్లరూపంలోకి మారుతుండటం నేరం కాదా అని నిలదీస్తున్నాడు. ఇంటి నంబర్లు జీరోలతో ఉండటమేంటన్న రాహూల్ ప్రశ్న నిజంగానే కచ్చితంగా ఆశ్చర్యపర్చేది. తాను చూపిస్తున్న డాటా ప్రకారమైతే ఆ ఫేక్ ఓట్లు కచ్చితంగా షాక్ కు గురిచేసేవే. మొత్తం వ్యవస్థనే చోరీ చేసేశారు కదా అంటూ ఒక మెరుపుదాడి చేశాడు రాహూల్. ఇక అదే మహదేవపురాలో బూత్ నంబర్ 366లో ఒక్క సింగిల్ బెడ్రూం ఫ్లాట్ లో చెక్ చేస్తే ఎవ్వరూ లేరు.. కానీ, అక్కడ 46 మంది పేర్లు ఓటర్ల జాబితాలో కనిపించాయి. ఇలాంటి కొన్ని ఉదాహరణలను ఆయన చూపించారు. అలాగే, ఫోటో లేకుండా.. లేదంటే, కనిపించనంత చిన్నఫోటోలతో వేల ఓట్లున్నట్టు చెప్పుకొచ్చారు.
మహదేవపుర అసెంబ్లీ స్థానంలో ఓట్ల కుంభకోణంపై రాహూల్ ఐదు రకాలగా వర్గీకరించి చూపించాడు. పైనాల్గింటితో పాటు.. ఐదోది ఇంకా కీలకం. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫామ్ 6 ఫిల్ చేసి ఓటు వేయాల్సి ఉంటుంది. అలాంటివారిలో సహజంగా ఓటు హక్కు వచ్చిన 18 ఏళ్లవారి నుంచి మ్యాక్స్ అప్పటివరకూ ఓటు హక్కు నమోదు చేసుకోకపోతే 25 ఏళ్ల వారివరకూ ఉండే అవకాశముంటుంది. కానీ, ఫామ్ 6 కింద వృద్ధులు, ముదిమి వయస్సువాళ్లు మొత్తం 33 వేల పైచిలుకు ఒక్క మహదేవపురాలోనే బట్టబయలవ్వడమంటే ఈసీ కచ్చితంగా నేరానికి పాల్పడిందంటున్నాడు రాహూల్.
ఒక్క నియోజకవర్గంలోనే ఇన్ని అవకతవకలు బట్టబయలైనాయంటే.. మిగిలిన దేశంలోని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎలా మ్యానిప్యులేషన్ జరుగుతుందో ఊహించుకోండంటున్నాడు. ఇలాంటి పరిణామాలతోనే గెలుపు గుర్రాలు ఓటమిపాలై.. అసలూహించనివాళ్లు గెలుపు గుర్రాలవుతున్నారని ఆయన ఆరోపిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీగా ఇంత కష్టపడితే ఒక్క నియోజకవర్గం డాటా మాత్రమే మేం సంపాదించగల్గితే.. గెలుస్తామనుకుని ఓటమిపాలైన వ్యక్తులు ఒక్కరుగా ఇంత పరిశోధన చేయగలరా అన్నది రాహూల్ ప్రధాన ప్రశ్న ఇప్పుడు.
అయితే, ఇలాంటి ఆరోపణలు చాలామంది నాయకులు చేస్తూనే ఉన్నారు. రాహూల్ మాత్రం కాస్త ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయగల్గాడు. ఆంధ్రప్రదేశ్ గత అసెంబ్లీ ఎన్నికలపైనా చాలా అనుమానాలు నెలకొన్నాయి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటివారు బాహాటంగానే ఏం అవకతవకలు జరిగాయో వెల్లడించారు. పోల్ అయిన ఓట్లకూ.. లెక్కించిన ఓట్లకు మధ్య 12.54 శాతం తేడా ఉందని ఆయన ఆరోపించారు. ఆ ఎన్నికల రిజల్ట్స్ వెల్లడైన పదిరోజుల్లోనే డాటా మొత్తం లేకుండా చేశారన్నదీ ఆయన ప్రధానారోపణ. సెక్షన్ 81 రిప్రజంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం 45 రోజుల వరకూ ఎన్నికల ఫలితాల డాటా ఉంచాలనీ.. కానీ, దాన్ని తుంగలో తొక్కారనీ అరుణ్ కుమార్ ఆరోపించారు. అలాంటివాటిల్లో చంద్రబాబు నిపుణుడంటూ ఆయన చురకలంటించారు.
తాజాగా ఈసీపై రాహూల్ వేసిన బాంబుతో పాటు… గతంలో చాలామంది ఈసీ తీరును తప్పుబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈసీ విశ్వసనీయతపైనే నీలినీడలు కమ్ముకంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ ఏవిధంగా స్పందిస్తుంది.. రాహూల్ ప్రశ్నలకు ఏం సమాధానాలు చెబుతుంది.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇంటర్ఫియర్ అవుతుందా… ఏం జరుగనుందన్న ఒక ఉత్కంఠ మాత్రం సర్వత్రా కనిపిస్తోంది. అదే సమయంలో రాహూల్ కూడా సమర్థవంతంగా తన ప్రెజెంటేషన్ తో ఇప్పుడు జనం చర్చల్లో నానుతున్నాడు.
(గమనిక: రాహూల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పత్రికలు, కొందరు ప్రముఖ ఇండిపెండెంట్ జర్నలిస్టుల అనాలిసిస్ ప్రకారం, వారందరి సౌజన్యంతో రాసిన స్టోరీ ఇది.)



