41 రోజులకే తెరంగేట్రం.. నాల్గు దశాబ్దాల ప్రయాణం: లాంగ్ మార్చ్ ఆఫ్ సుజిత!

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా.. నవజాత శిశువుగానే సినీ నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది ఆ నటి. 41 రోజులకే సినీ తెరంగేట్రం చేసి ఏకంగా నలభై సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుండటమే ఆ నటి ప్రత్యేకత. ఎవరామె..?

80వ దశకం చివర్లో వచ్చిన పసివాడి ప్రాణంలో పాలబుగ్గల చిన్నోడు, బెదురుచూపుల పిల్లోడు గుర్తున్నాడా..? అతడే… సారీ, ఆమే.. మనం చెప్పుకోబోతున్న నటి సుజిత. మమ్ముట్టి హిట్ సినిమాలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది సుజిత. అదే సినిమా ఆ తర్వాత తెలుగులో చిరంజీవి హీరోగా పసివాడి ప్రాణంగానూ, హిందీలో గోవిందా హీరోగా హత్యగానూ, తమిళలంలో పూవిలి వాసలిలేగానూ విడుదలై సంచలనం సృష్టించింది ఆ సినిమా. అదే స్థాయిలో మూగ పిల్లాడి పాత్రలో సుజితకు మంచి ప్రశంసలు తెచ్చిపెట్టింది.

మళయాళ సినీ పరిశ్రమలో బాల నటీనటులుగా జీవితాన్ని ఆరంభించిన వారిలో బేబీ షాలినీ, ఆమె చెల్లెలు షామిలీ, గీతూ మోహన్ దాస్, నజ్రిమా నజీమ్, ప్రణవ్ మోహన్ లాల్, మంజిమా మోహన్, సనుష, ఏ. అరుణ్ కుమార్ వంటివారెందరో ఉన్నారు. వీరిలో బాల్యంలో సంపాదించుకున్న క్రేజును తాము పెరిగి పెద్దయ్యాక కూడా అదే స్థాయిలో సంపాదించుకోలేకపోయినవారూ ఉన్నారు. కానీ, బాలనటులుగా అలరించి.. అదే స్థాయిలో నటనలో ఎదిగినవారిలో సుజిత ధనుష్ పేరు మాత్రం కచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, 41 రోజులకు కెమెరా ముందుకొచ్చి.. నాల్గు దశాబ్దాలుగా ఆమె ఇంకా నటిస్తూనే ఉండటమే అందుకు కారణం.

సుజిత తొలి సినిమా తమిళంలో వచ్చిన అబ్బాస్. ఈ అబ్బాస్ సినిమాలోనే లెజెండరీ యాక్ట్రెస్ కే. ఆర్. విజయకు మనవరాలిగా 41 రోజుల నవజాత శిశువైన సుజిత తెరంగేట్రం చేసింది. సుజితది కేరళలోని తిరువనంతపురం. కానీ, చెన్నైలో స్థిరపడ్డ ఫ్యామిలీ. తల్లిదండ్రులు టీవీఎస్ మణి, రాధకు సినీరంగంతో ఏమాత్రం సంబంధం లేకున్నా.. తమ పిల్లలను సినీ తెరపై చూడాలన్న కాంక్ష మాత్రం తల్లి రాధలో ఉండేది. ఆమె ఆశించినట్టే సుజితతో పాటు.. ఆమె అన్న సూర్యకిరణ్ కూడా సినీరంగంలో తెరపై కనిపించి నటులుగా స్థిరపడ్డారు.

ఫాజిల్ సినిమాతో గుర్తింపు!

అబ్బాస్ తమిళ సినిమా తర్వాత సుజిత 1983లో కే. భాగ్యరాజ్, ఊర్వశి కుమార్తెగా ముందానై ముగిచ్చు అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత తమిళ, మళయాళ సినిమాల్లో పలు పాత్రలు వేసింది. అయితే, సుజితకు ఫాజిల్ దర్శకత్వంలో 1986లో వచ్చిన పూవిను పుతియ పూంతెన్నాల్ పెద్ద బ్రేకునిచ్చింది. మాటలు రాని బాలుడి పాత్రలో సుజిత నటన అటు మళయాళంలోనూ.. ఆ తర్వాత రీమేకైన తెలుగు పసివాడి ప్రాణంలోనూ, హిందీ హత్యలోనూ, తమిళం పూవిలి వాసలిలేలోనూ దేశవ్యాప్త ప్రశంసలు తెచ్చిపెట్టింది.

సుజిత బాలనటిగా సుమారు 40 సినిమాల్లో నటించింది. తర్వాత వయస్సుకు తగ్గ పాత్రల్లో నటిస్తూ కెరీర్ ను కొనసాగించింది. 90ల్లో వచ్చిన మణిరత్నం రోజా, బాంబే, ఇరువర్ వంటి సినిమాల్లోనూ అవకాశం సంపాదించింది. సమ్మర్ ఇన్ బెత్లాహమ్, వాలి, ఇంగానే ఒక నిలపక్షి, జై చిరంజీవ, తాండవం వంటి మరెన్నో చిత్రాల్లో తన నటనతో మరింత గుర్తింపు తెచ్చుకుంది.

సుజిత కెరీర్ పై ఎక్కువ ప్రభావం చూపింది తన అన్న సూర్యకిరణే. ఈ విషయం ఆమే పలుమార్లు ఇంటర్వ్యూస్ లో చెప్పారు. మాస్టర్ సురేష్ గా సూర్యకిరణ్ బాలనటుడిగా ఆరంభించి భారతదేశపు తొలి 3డీ సినిమా మై డియర్ కుట్టి చాతన్ లో నటించాడు. అదే హిందీలో చోటా చేతన్ గా విడుదలైంది. సూర్యకిరణ్ రెండేళ్ల క్రితమే 2024లో మరణించారు. అలా అన్నతో పాటు షూటింగ్స్ కు వెళ్లడం వల్ల సుజిత కూడా యాక్టింగ్ పై మమకారం పెంచుకుంది.

సుజిత భర్త యాడ్ ఫిల్మ్ మేకర్!

సుజిత భర్త ధనుష్ యాడ్ ఫిల్మ్ మేకర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. సుజిత, ధనుష్ కు ఓ కుమారుడు కాగా… సుజిత ఇప్పటివరకూ తన 40 ఏళ్ల నట ప్రస్థానంలో మళయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు వందకుపైగా సినిమాల్లో నటించారు. ఇక టెలివిజన్ సీరియల్స్, సీరీస్ లతో సుజిత ఇంటింటికీ ఓ ఆడపడుచులా పరిచయమైపోయింది. హరిచందనంలోని ఉన్నిమయ పాత్రలో ఆమె మళయాళ ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. దేవీ మహత్యం, ఇందిర, సంగమం, స్నేహసంగమం, కుమార సంభవం వంటి సీరియల్స్ లో నటించి.. అలాగే, తమిళంలోని పాండియన్ స్టోర్స్ సీరియల్ లో కీలక పాత్ర పోషించి.. భాషలకతీతంగా ఇంటింటికీ చేరిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుజిత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles