ప్రజా సమస్యలే ఆయన ప్రిస్క్రిప్షన్… పాదయాత్రతో స్కానింగ్
…………………………………………………………………………………………..
వైఎస్సార్ యాదిలో!
వైఎస్సార్ అంటే… గుర్తొచ్చేవి పాదయాత్ర, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం. కానీ, ఆయన జీవితంలో మరో ఆసక్తికరమైన ఘట్టముంది. అది ఆయన రాజకీయ నాయకుడు కాకమునుపే రోగుల పల్స్ తెలుసుకున్న ఓ డాక్టర్ గా ఆ కోణమే… ఆ తర్వాత రాష్ట్ర ప్రజల పల్స్ పట్టుకునేందుకు కారణమైంది.
నాయకుడంటే నల్గురిని వెనుకేసుకుని ముందు నడిచేవాడే కాదు.. వారి కష్టసుఖాల్లో తోడుండేవాడని నిరూపించిన నేత వైఎస్సార్. వైఎస్ అంటే రైతు గుర్తుకొస్తాడు. రాజశేఖర్ రెడ్డి పేరు చెబితే ఆరోగ్య శ్రీ కళ్లముందు మెదులుతుంది. కుయ్ కుయ్ మంటూ ఆపదలో తక్షణమే స్పందించే 108 మదిలో మెదులుతుంది. అంతకుమునుపు ఈ పథకాలన్నీ రూపుదిద్దుకోవడానికి ప్రజల ఈతి బాధలను తెలుసుకున్న ఆయన పాదయాత్రా గుర్తొస్తుంది.
ఒక డాక్టర్ గా రోగుల పల్స్ పట్టుకుని జబ్బు నయం చేసిన రాజశేఖర్ రెడ్డిని.. విధి, ఎక్కువ కాలం స్టెతస్కోప్ పట్టుకోనివ్వలేదు. కానీ, ఆయన డాక్టర్ గా నేర్చుకున్న తన అనుభవాన్ని సామాజిక వైద్యమందించే రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు మాత్రం ఉపయోగపడింది. ఆ నైపుణ్యమే ఆయన్ను ఇప్పటికీ జనం గుర్తు చేసుకునే నాయకుడిగా నిలిపింది.
ఓ డాక్టర్ రోగిని మొదట ఏంటి నీ నొప్పి.. ఎక్కడా అని అడుగుతాడు. రోగి చెప్పేకంటే ముందే అతడి శారీరక సంకేతాలను బట్టి తానే చదివేస్తాడు. పల్స్ పరీక్షిస్తాడు. ముఖం చూస్తాడు. కళ్లల్లోని అలసను అబ్జర్వ్ చేస్తాడు. ఇవన్నీ రాజకీయ నాయకుడిగా వైఎస్సార్ చేశాడు కాబట్టే ఆయనో వెర్సటైల్ లీడర్ గా చిరస్మరణీయుడయ్యాడు.

ప్రజల మాటల్ని వినడమే కాదు.. ఆ నొప్పిని వ్యక్తిగతంగా భావించడమే లీడర్షిప్!
2003లో వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర చాలామంది దృష్టిలో కేవలం ఎన్నికల వ్యూహం మాత్రమే. అయినప్పటికీ వైఎస్సార్ పాదయాత్రకు దక్కిన ప్రాధాన్యత ఇప్పటివరకూ ఏ నాయకుడు పాదయాత్ర చేపట్టినా దక్కడం లేదు. ఎందుకంటే, ఏదో నడిచామా అంటే నడిచినట్టుగా కాకుండా… మీడియా దృష్టి కోసం కాకుండా… ఓ పేషంట్ ను డాక్టర్ పరీక్షించినట్టుగా రాష్ట్రం మొత్తాన్నీ తన పాదయాత్రలో పరిశీలించాడు వైఎస్.
ఓ రైతు ఇంటికెళ్లాడు, ఎండిపోయిన బావిని, కాలిపోయిన మోటార్ నూ చూశాడు. కరెంట్ బిల్లులు చేతుల్లో పట్టుకున్న రైతుల దుఖాన్ని గమనించాడు. ఫీజులు కట్టలేక చదువులు మధ్యలో ఆపేసిన డ్రాపవుట్స్ పరిస్థితులను తెలుసుకున్నాడు. ఆసుపత్రి ఖర్చులు భరించలేక అప్పుల్లో మునిగిపోయిన కుటుంబాలను పలకరించాడు. అలా అప్పుడాయనకు అర్థమైంది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకే సమస్యతో బాధపడటం లేదని.
ఎక్కడో నీటి సమస్య, ఇంకెక్కడో ఆరోగ్య ఖర్చులు, మరెక్కడో రైతుల అప్పులు, చదువులందని విద్యార్థులు.. ఇవన్నింటికీ సరైన మందులివ్వాలంటే డాక్టర్ గా ముందు తాను ఈ వ్యాధులన్నింటినీ గుర్తించాడు. ముందు సమస్యను డయాగ్నసిస్ చేయడం.. ఆ తర్వాతే దానికి చికిత్స చేయడం అలా డాక్టర్ పరిశీలనే వైఎస్సార్ ను గొప్ప నాయకుడిగానూ నిలబెట్టింది.
డాక్టర్ నుంచి నాయకుడిగా!
వైఎస్సార్ వైద్య విద్య పూర్తి చేశాక కొంతకాలం వైద్యసేవలూ అందించారు. పులివెందులలో తన తండ్రి పేరిట 70 పడకల ఆసుపత్రినీ ఆరంభించారు. కానీ, ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అయితే, ఆయన డాక్టర్ వృత్తిని వదిలేయొచ్చుగానీ… వైద్యుడి ఆలోచనా విధానాన్ని మాత్రం విడనాడలేదు. అదే వైఎస్సార్ ను నాయకుడిగాను మిగిలినవారితో ప్రత్యేకంగా నిలిపింది.
ఆరోగ్య శ్రీ వంటి పథకాల్లో ఆయన ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తాయి. పేదవాడికి జబ్బు వస్తే అది కేవలం అతడి ఆరోగ్య సమస్యే కాదు.. కుటుంబ ఆర్థిక వ్యవస్థనే ఛిన్నాభిన్నం చేసే సమస్య. ఒక సంపాదించే మనిషి అనారోగ్యం పాలైతే… ఆ ఇల్లు ఎలా గడిచేది..? ఆసుపత్రి ఖర్చులెలా భరించేంది..? అప్పులు చేస్తే ఎలా తీర్చేది..? ఇవన్నీ కుటుంబాల్నే ఛిద్రం చేస్తాయి. ఇదిగో ఈ సామాజిక ఆలోచనా సరళే వైఎస్సార్ ను ఎప్పటికీ హీరోలా అంతెత్తు నిలబెట్టే ప్రత్యేకత.
వైఎస్సార్ పాదయాత్ర అంటే నడక కాదు.. రాష్ట్రానికి ఫుల్ బాడీ చెకప్!
రాజకీయాల్లో పాదయాత్రలు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. కానీ, ఓ పాదయాత్ర తర్వాత ప్రభుత్వ విధానాలే మారడం అరుదు. అదే వైఎస్ గద్దెనెక్కాక జరిగింది. ప్రజాసమస్యలే… డాక్టరైన నాయకుడి ప్రిస్క్రిప్షన్ గా మారాయి. ఆ సమస్యల స్కానింగ్ నుంచే ప్రభుత్వ విధాన నిర్ణయాలు పుట్టుకొచ్చాయి. ఇదే వైఎస్సార్ ను విభిన్నంగా ప్రపంచానికి పరిచయం చేసింది.
వైఎస్సార్ కు, మిగతా నేతలకు తేడా ఏంటి..?
వ్యాధి వచ్చిన తర్వాత మందు ఇవ్వడమే డాక్టర్ పని కాదు. వ్యాధి మూలాన్ని గుర్తించడం. వైఎస్సార్ రాజకీయాల్లో అదే చేశారు. రైతు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబానికింత పరిహారం చెల్లించి దులుపుకోవడం కాదు… ఎందుకు పంటకు నీరు రాలేదు.. ఆ రైతు ఎలాంటి కష్టాన్నెదుర్కొంటున్నాడు.. ఎందుకు విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోతున్నాడు.. ఇలా మూలాల్లోకి వెళ్లే ప్రయత్నమే వైఎస్సార్ శైలి. ఆయన డాక్టర్ గా ఉన్నప్పుడు ఆయన దగ్గరకే రోగులు వచ్చేవారు. కానీ, ఆ డాక్టరే నాయకుడయ్యాక.. ఏకంగా ఆయనే లక్షల మందిని కలిశాడు. డాక్టర్ గా స్టెతస్కోప్ తో గుండె చప్పుడు వినేవాడు.. పాదయాత్రతో రాష్ట్రం గుండె చప్పుడు విన్నాడు.
వైఎస్సార్ ప్రత్యేకతలేంటి?
నాయకులన్నాక ప్రసంగాలు చేస్తారు. వైఎస్సూ చేశారు. కానీ, ఆయన రాజకీయ జీవితాన్ని మార్చింది ప్రసంగాలు కాదు. కన్నీళ్లు, అప్పులు, ఆశలు, నిరాశలతో నిండిన సమాజాన్ని చూశాడు. ఏదో దూరం నుంచి రాష్ట్రాన్ని ఓ మ్యాపులా చూడలేదు కనుకే వైఎస్ విభిన్నమైన నాయకుడిగా ఎదిగారు. ఆయన వెళ్లిపోయినా చిరంజీవై నిల్చారు.
సెప్టెంబర్ 2, ఆ మహానేత వర్ధంతి సందర్భంగా ఆ డాక్టర్ లీడర్ కిచ్చే నివాళిది.



