ప్రస్తుత భారత కార్పోరేట్ ప్రపంచాన్నే కుదిపేస్తున్న పెద్ద చర్చ… సుభాష్ చంద్ర ఎపిసోడ్. పైకి చూస్తే జస్ట్ 22 వేల కోట్ల రూపాయల అప్పులే. ఇది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తీర్పు… అందుకు వ్యతిరేకంగా బ్యాంకుల రికవరీ వివాదంలా కనిపిస్తున్నా… లోతుకు వెళ్లినకొద్దీ జీ సామ్రాజ్య పతనం, కార్పోరేట్ వార్.. రియలన్స్ వంటి సంస్థలతో గతంలో ఉన్న విభేదాలు.. పెట్టుబడిదారుల ఒత్తిడి ఇలా ఎన్నో ఈ ఆర్థిక వ్యవహారాల్లో కనిపిస్తాయి.
అసలేం జరిగింది…? కార్పోరేట్ వార్ గా ఎందుకు మారుతోంది..?
22 వేల కోట్ల బాకీకి… కేవలం ఆరున్నర కోట్లు మాత్రమే చెల్లిస్తానంటున్న సుభాష్ చంద్రపైన మూకుమ్మడి కార్పోరేట్ దాడి వెనుక కారణాలు ఆసక్తికరంగాను, ఆర్థికపరమైన లెక్కల్లో ఎత్తుగడలను కళ్లకు కట్టే విధంగానూ కనిపిస్తాయి.
అసలు సుభాష్ చంద్ర చుట్టూ ఇంత పెద్ద కార్పోరేట్ వార్ కు కారణమేంటి..?
సుభాష్ చంద్ర అంటే ఒకనాడు భారతీయ టెలివిజన్ ప్రపంచాన్నే మార్చేసిన ఒక దిగ్గజం. దూరదర్శన్ ఏకఛత్రాధిపత్యానికి గండికొట్టినవాడు. ఇంటింటికీ ప్రైవేట్ టెలివిజన్ ను పరిచయం చేసిన మీడియా మొఘల్. జీ అంటే సుభాష్ జీ… సుభాష్ జీ అంటే జీ అనే స్థాయికెదిగిన బిజినెస్ మ్యాన్.
కానీ, ఇప్పుడు అదే సుభాష్ చంద్ర పేరు చుట్టూ దేశంలోని కార్పోరేట్ ప్రపంచంలో ఒక వివాదమే చుట్టుముట్టింది.

సుభాష్ చంద్ర 22 వేల కోట్ల అప్పుల వ్యవహారంతో.. బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టే మరో కథ వెలుగులోకొచ్చింది. సుభాష్ చంద్రకు చెందిన కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులకు చెందిన ఐదు కంపెనీలే బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో అప్పులు తీసుకున్నాయి. సుభాష్ చంద్ర వాటికి పూచీకత్తుగా ఉన్నాడు. సదరు కంపెనీలకు చెందిన షేర్స్ కూడా బ్యాంకులు తనఖా పెట్టుకున్నాయి. అలా తనఖా పెట్టుకున్నందుకు ఆ కంపెనీలకు ఏదైనా నష్టం జరిగితే.. దానికి కూడా పూచీకత్తు తానేనని.. పరిహారం చెల్లిస్తాననే చట్టపరమైన ఒప్పందం కూడా సుభాష్ చంద్రకు, తమ షేర్స్ తనఖా పెట్టిన కంపెనీలకు మధ్య జరిగింది. కానీ, ఇప్పుడు ఆ అప్పు తీర్చకపోవడంతో వివాదం తెరపైకొచ్చింది. పైగా, తాను పూచీకత్తుగా ఉన్న కంపెనీలను లెటర్ ఆఫ్ ఇండెమ్నిటి ఇచ్చినందుకు.. వారిని కూడా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కు వెళ్లి తనకు వ్యతిరేకంగా పోరాడాలని ఒక వ్యూహంతో ఆయనే పురిగొల్పాడనేది మరో ప్రధాన ఆరోపణ.
బ్యాంకులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయిస్తే ఓ కమిటీని వేసి.. సుభాష్ చంద్ర పేరిట చెల్లించాల్సిన అప్పులు 22 వేల కోట్లకు సంబంధించిన ఒక ఓటింగ్ ప్రక్రియను నిర్వహించింది. అందులో మళ్లీ సుభాష్ చంద్రకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆయన కంపెనీలవే సుమారు పదమూడున్నర వేల కోట్ల రూపాయల బకాయి. ఇక సుభాష్ చంద్ర వ్యక్తిగత బకాయి తాను చెబుతున్నట్టుగా సుమారు ఓ నాల్గువేల కోట్లు. అందులోనూ ఇప్పటికే బ్యాంకులు తనఖా పెట్టుకున్న షేర్లను అమ్ముకోవడంతో సుమారు 620 కోట్ల రూపాయలకు పైగా ముట్టాయన్నది ఆయన సుభాష్ చంద్ర వాదన. అయితే, తాను దివాలా తీశానని పిటిషన్ వేసి.. ఇప్పుడు తన దగ్గర కేవలం ఆరున్నర కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. అవే చెల్లించగలను అని ఆయన పిటిషన్ పైనే ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. అందులో ఆయన కంపెనీలన్నీ ఆయనకు మద్దతుగా నిలవడంతో… సుమారు 80 శాతంకుపైగా అప్పులు తీసుకున్న కంపెనీలే ఆయన వాదనతో ఏకీభవించడంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సుభాష్ చంద్ర చెల్లిస్తానన్న ఆరున్నర కోట్ల రూపాయలకు అంగీకరించింది. దీనిపై ఇప్పుడు బ్యాంకులు మరో పోరాటానికి సిద్ధమయ్యాయి. ఇది ఇప్పుడు జరుగుతున్న అందరికీ తెలిసిన వివాదం.
మరి ఇది కార్పోరేట్ వార్ గా ఎందుకు మారింది..?
22 వేల కోట్ల రూపాయల క్రెడిట్ క్లెయిమ్స్ ఉంటే.. వ్యక్తిగతంగా కేవలం ఆరున్నర కోట్లు మాత్రమే చెల్లించడమంటే ఇది 99.97 శాతం హెయిర్ కట్ అన్న మాటే. ఈ లెక్కలు బయటకు రావడం… సుభాష్ చంద్రకు దివాలా పరిష్కారాన్ని ఎన్ఎల్సీటీ చూపడం.. దేశవ్యాప్తంగా కార్పోరేట్ యుద్ధానికి తెరలేపింది. సుభాష్ చంద్ర స్వయంగా రంగంలోకి వచ్చి ఏకంగా దేశంలోనే ఓ కీలకమైన పారిశ్రామికవేత్తగా ఎదిగిన ముఖేష్ అంబానీ పేరు ప్రస్తావిస్తూ వీడియో రిలీజ్ చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడొక హాట్ టాపిక్ అయింది. దీంతో ఇది కేవలం బ్యాంకు క్రెడిట్ క్లెయిమ్ వివాదంగా మాత్రమే కాకుండా… ఇప్పుడు కార్పోరేట్ వార్ కూడా పులుముకుని మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది..?
సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూట్ ఒక రీపేమెంట్ ప్లానుకు తెలిపిన ఆమోదమే… ఇవాళ దేశవ్యాప్త చర్చకు తెరలేపింది. 22 వేల కోట్లకు పైగా రుణాలు బాకీపడితే… సుభాష్ చంద్ర వ్యక్తిగత ఎస్టేట్ నుంచి రికవరీ అయ్యే మొత్తం కేవలం ఆరున్నర కోట్లు కావడమే ఈ వివాదానికి ప్రధాన కారమైంది. ఒక సాంకేతిక కారణమే ఇక్కడ కీలకాంశంగా మారింది.
22 వేల కోట్ల రూపాయలు వ్యక్తిగతంగా తీసుకున్న అప్పు కాదన్నది సుభాష్ చంద్ర వాదన. ఎస్సెల్ గ్రూపుకు చెందిన వివిధ కంపెనీలు తీసుకున్న రుణాలకు తాను కేవలం వ్యక్తిగత పూచీకత్తు మాత్రమే ఇచ్చానన్నది ఆయన సమర్థన. అంటే అప్పులు తీసుకున్నవి కంపెనీలు.. గ్యారంటీర్ గా ఉన్నది సుభాష్ చంద్ర. ఈ విషయంలో రెండింటినీ ఒక్కటి చేసి తానే 22 వేల కోట్ల వ్యక్తిగత అప్పు చేసినట్టుగా చిత్రీకరించడం తప్పుదారి పట్టించడం, పూర్తిగా వక్రీకరించడమేనంటున్నాడు సుభాష్ చంద్ర. ఈ కేసులో వివాదమంతా ఈ అంశం చుట్టే తిరుగుతోంది.
మరి బ్యాంకులు ఎందుకు మండిపడుతున్నాయి..?
22 వేల కోట్ల అప్పుంటే… రికవరీ కింద కేవలం ఆరున్నర కోట్లకే ఒప్పందం చేయడం న్యాయమా అనేది బ్యాంకుల వాదన. దీంతో ఆర్థిక సంస్థలు ఇప్పుడు ఎన్సీఎల్టీ తీర్పును సవాల్ చేసేందుకు సిద్ధమయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్, మరికొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ పరిష్కారంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఫ్రంట్ లైన్ లో సుభాష్ చంద్ర వర్సెస్ బ్యాంక్స్ అన్నట్టుగా పోరాటం నడుస్తోంది.
ముఖేష్ అంబానీపై సుభాష్ చంద్ర విమర్శలతో మరో ట్విస్ట్!
సుభాష్ చంద్ర వివాదం బ్యాంక్స్ వర్సెస్, సుభాష్ చంద్ర వరకే ఆగిపోతే ఇది సాధారణ కార్పోరేట్ ఇన్సాల్వెన్సీ ఇష్యుగా మిగిలిపోయేది. కానీ, సుభాష్ చంద్ర తనపై జరుగుతున్న ప్రచారం వెనుక ముఖేష్ అంబానీ రిలయన్స్ మీడియా సంస్థల హస్తమున్నట్టు ఆరోపణలు గుప్పించడంతో కథలో మరో ట్విస్ట్ మొదలైంది.
తనపై లేవనెత్తిన ప్రచారం మొత్తం జస్ట్ మీడియా కవరేజ్ ఏమాత్రం కాదు… ఇది కార్పోరేట్ వార్ ను పెంచి పోషించడమేనంటున్నారు సుభాష్ చంద్ర. ఆయన వాదనల్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా తోసిపుచ్చింది. ఆయనంటే తమకు గౌరవముందని పేర్కొంటూనే.. తమ మీడియా సంస్థలకు ఎవ్వరిపైనా వ్యక్తిగత దాడులు చేయాల్సిన పని లేదని స్పష్టం చేసింది.
సుభాష్ చంద్ర వర్సెస్ ముఖేష్ అంబానీ ఫైట్ లో కాస్త వెనక్కి వెళ్లితే మరింత అర్థం చేసుకోవచ్చు.
జీ వర్సెస్ ఇన్వెస్కో యుద్దం నుంచి ఇప్పుడు రిలయన్స్ వరకు అసలేం జరిగింది..?
2021లో జీ ఎంటర్టైన్మెంట్ లో పెద్ద వాటాదారుగా ఇన్వెస్కో కంపెనీ ఉండేది. ఆ సమయంలో కంపెనీ బోర్డులో మార్పులు కోరుతూ ఇన్వెస్కో జీపై ఒత్తిడి తెచ్చింది. ఆ సమయంలో అది పెద్ద కార్పోరేట్ పోరుగా మారింది. ఆ వివాద కాలంలో రిలయన్స్ మీడియా వ్యాపారాలతో, జీ గ్రూపుకు కొన్ని కార్పోరేట్ కాంబినేషన్స్ అవకాశాలపై చర్చలు కూడా జరిగాయంటారు. కానీ, ఆ డీల్ ఎందుకోగానీ ముందడుగు పడలేదు. ఆ తర్వాత జీ గ్రూప్.. సోనీ సంస్థతో జత కట్టింది. ఇప్పుడు తాజాగా సుభాష్ చంద్ర రిలయన్స్ మీడియా చేస్తున్న వాదనల వెనుక ఆ వెనుకటి నీడలు మళ్లీ ప్రత్యక్షమవుతున్నాయా అనే చర్చ జరుగుతోంది.
సుభాష్ చంద్ర వర్సెస్ ఎవరెవరు..?
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పుడు మూడు వేర్వేరు శక్తులు కనిపిస్తున్నాయి.
- బ్యాంకులు, ఆర్థిక సంస్థలు: వీటి పోరాటం పూర్తిగా డబ్బు కోసం మాత్రమే. వారిచ్చిన అప్పులకు వచ్చే రికవరీపైనే వారి ఫోకస్. సుభాష్ చంద్రతో ఎలాంటి వ్యక్తిగత వైరం లేదు.
- కార్పోరేట్ ప్రత్యర్థులు: ఈ కథే ఈ ఎపిసోడ్ లో కాస్తా సంక్లిష్టమైంది. భారత మీడియా రంగంలో గత కొన్నేళ్లుగా చాలా మార్పులు వచ్చాయి. ఒకనాడు దేశాన్ని జీ, స్టార్ వంటి మీడియా సంస్థలు శాసించేవి. ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ఫామ్స్ పెరిగిపోయాయి. టెలికాం కంపెనీలు, భారీ కార్పోరేట్ గ్రూపులు మీడియా రంగంలోకి అడుగుపెట్టాయి. ఈ మార్పుల్లో భాగంగానే రిలయన్స్ మీడియా గ్రూప్ అనూహ్య శక్తిగా ఎదిగింది. ఇదే సమయంలో జీ బలహీనపడిపోయింది. అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది. యాజమాన్య వివాదాలూ చుట్టుముట్టాయి. ఇవన్నీ మీడియా రంగంలో పవర్ బ్యాలెన్స్ ను పూర్తిగా మార్చేశాయి. అందుకే, సుభాష్ చంద్ర ఆరోపణలను కేవలం వ్యక్తిగతమైనవిగా చూడలేమనేవారూ ఉన్నారు. అదే సమయంలో రిలయన్స్ గానీ, ఇతర పారిశ్రామికవేత్తలుగానీ.. సుభాష్ చంద్రపై కుట్ర చేస్తున్నారనేందుకూ పక్కాగా నిరూపించే ఆధారాలూ లేవు. ఈ క్రమంలో సుభాష్ చంద్ర ఆరోపణలొకవైపు.. రిలయన్స్ ఖండన మరోవైపు.. ఏది నిజం…? స్పష్టత లేదు. కానీ స్పష్టత వచ్చేవరకూ చర్చ జరుగుతూనే ఉంటుంది. స్పష్టత రాకుండానే కాంప్రమైజేషన్సూ, వివాదానికి తెరపడటాలూ జరిగిపోవచ్చు.
- షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు: సుభాష్ చంద్ర అప్పుల వ్యవహారం తెరపైకొచ్చాక.. ఈ ప్రభావం జీ షేర్ హోల్డర్స్ పైనా సహజంగానే పడుతుంది. సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆర్థిక వివాదం ఇప్పుడు జీ సంస్థ ప్రతిష్ఠనే మసకబారేలా చేస్తే ఎలా..? ఎందుకంటే, భారత కార్పోరేట్ ప్రపంచంలో ఫౌండర్ పేరును.. కంపెనీ బ్రాండును విడదీయడం అంత సులువేం కాదు. చట్టపరంగా జీ సంస్థ వేరైనప్పటికీ… జనం దృష్టిలో జీ అంటే సుభాష్ చంద్ర మాత్రమే. అందుకే, ఈ మొత్తం వివాదం కంపెనీపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.
కానీ, తన అప్పు జీరో అంటున్నారు సుభాష్ చంద్ర.
మరి ప్రజాకోణమేంటి..?
ఓ సామాన్యుడు పది లక్షల రుణం తీసుకుని చెల్లింపుల్లో తేడా వస్తే.. బ్యాంక్ నోటీసులు, ఆస్తుల వేలం, రికవరీ ఏజెంట్లు ఇంటిముందు పాగా వేయడం, కోర్టుల్లో కేసులు ఎదుర్కోవాల్సి రావడం ఇలా ఎన్నో భయంకరమైన ఒత్తిళ్లు తప్పవు. కానీ, ఒక భారీ కార్పోరేట్ గ్రూపుకు చెందిన వేల కోట్ల రుణాల విషయంలో 99. 97 శాతం హెయిర్ కట్ అంటే.. కార్పోరేట్ చట్టాలెలా ఉన్నా కూడా.. సాధారణ జనం నుంచి మాత్రం వ్యవస్థ తీరుపై ప్రశ్నల వర్షమే కురుస్తుంది. అదే ఇప్పుడు జరుగుతోంది. దీంతో భారత బ్యాంకింగ్ వ్యవస్థలో చట్టం అందరికీ చుట్టం కాదనే వాదన వినిపిస్తోంది. ఇదో పబ్లిక్ డిబేట్ గా మారిపోయింది.
సుభాష్ చంద్ర ఎపిసోడ్ కేవలం అప్పుల యుద్ధం మాత్రమే కాదు.. ఇదో నాల్గు యుద్ధాల సంగమం!
రికవరీ కోసం బ్యాంకులు, మీడియా రంగంలో ఆధిపత్యం కోసం కార్పోరేట్ శక్తులు, మరోవైపు లీగల్ ఫైట్, ఇంకోవైపు, సుభాష్ చంద్ర కార్పోరేట్ ఇన్వాల్వెన్సీ వ్యవస్థలో లబ్ది పొందుతున్న పారిశ్రామికవేత్తా… లేక, ఈ మొత్తం వ్యవహారంలో బాధితుడా అన్న నేరెటివ్.. ఇలా ఈ సంగమంలా ఈ ఎపిసోడ్ మనకు కనిపిస్తుంది.
అంబానీపై విమర్శలతో నేషనల్ లెవల్ కార్పోరేట్ డ్రామాగా మారిన ఇష్యూ!
22 వేల కోట్ల రూపాయల అప్పు వ్యవహారం బట్టబయలు కావడంతో అన్ని మీడయాల్లోలాగే రిలయన్స్ మీడియాలో వార్తా కథనాలు రావచ్చు. ఇంకాస్త ఎక్కువ రావచ్చు. కానీ, ఈ సమయంలో సానుభూతి కోసం సుభాష్ చంద్ర రిలయన్స్ మీడియాను, దాని అధినేతను టార్గెట్ చేసి ఉండొచ్చు. మొత్తంగా అసలు వివాదం పక్కకుపోయి.. ఈ కార్పోరేట్ హైడ్రామా ఇప్పుడు నేషనల్ లెవల్ కార్పోరేట్ ఫైట్ లో ఫోకస్డ్ గా మారింది.
మరి సుభాష్ చంద్ర కేసు ఏమవుతుంది..?
కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇప్పటికే సుభాష్ చంద్రకు అనుకూలంగా ఎన్సీఎల్టీలో వచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు పరిశీలిస్తున్నాయి. ఇది రాబోయే రోజుల్లో మరో పెద్ద కార్పోరేట్ యుద్ధానికే తెరలేపుతుందా… లేక, గతంలో అప్పులు చేసి విదేశాలకు వెళ్లిపోయినవారి రీతిలోనే కొంతకాలం చర్చగా మారి సమసిపోతుందా చూడాల్సి ఉంది.
మొత్తానికి ఒకప్పుడు ఒక పెద్ద సామ్రాజ్యాన్నే నిర్మించిన వ్యక్తి.. అప్పుల కోసం నేడు ఆస్తులమ్ముకునే స్థితికి రావడం… భారత కార్పోరేట్ ప్రపంచంలో జరిగే వార్ ఫేర్ కు ఓ ప్రతీక.



