పాలక పక్షానికా..? ప్రతిపక్షాలకా..?? ప్రజలకా..???
వెయ్యిరోజుల పాలన… అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైందా..?
అధికార కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన… బీఆర్ఎస్ వెయ్యి రోజుల ప్రధాన ప్రతిపక్ష పోరాటం… మరో ప్రధాన విపక్షంగా బీజేపీ పాత్ర… ఇవే ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో చర్చించాల్సిన మూడు అంశాలు.
వెయ్యి రోజులంటే క్యాలెండర్ లో మారిన సంఖ్య కాదు. ఓ ప్రభుత్వం పాలనకు లెక్క చెప్పుకోవాల్సిన సమయం. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలూ తమ పోరాటాలకు లెక్క చెప్పాల్సిన సందర్భం.
ఓవైపు అధికార కాంగ్రెస్ తన పాలనను సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, రైతు రుణమాఫీ, మహిళా సంక్షేమం, ఉద్యోగాలు, సామాజిక న్యాయమంటూ ప్రజల ముందుకెళ్తోంది. మరోవైపు, బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని వాదిస్తోంది. అమలుకాని పథకాలు, రైతు సమస్యలు, విద్యార్థుల సమస్యలను అస్త్రాలుగా మార్చుకుంటోంది.
ఈ ఇద్దరి మధ్యలో మరో విపక్షమైన బీజేపీ పాత్రేంటి అన్నదీ ఇప్పుడు చర్చే. మెల్లిగా బీజేపీ విస్తరిస్తుందా… లేక, గతంలో ఉన్న ప్రభ కంటే ఇప్పుడు దాని ఛరిష్మా తగ్గిందా..?

అసలు వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన ఓ సంబరమా, సమీక్షా..?
ఏ పార్టీ గద్దెనెక్కినా కొద్దిరోజులు హనీమూన్ పీరియడ్ గా భావిస్తారు, కాస్త చూసీ చూడనట్టు వదిలేస్తారు. ఎవరైనా విమర్శలు చేసిన కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం.. గత ప్రభుత్వంపై తప్పులు నెట్టేయొచ్చు. వ్యవస్థను గాడిలో పెట్టడానికి సమయం కోరవచ్చు. కానీ, వెయ్యి రోజులైనాక కూడా అవే మాటలు వినిపిస్తే మాత్రం ప్రతిపక్షాలు విరుచుకుపడతాయి, ప్రజలూ నిలదీయడం సర్వసాధారణమైపోతుంది.
ఇంతకాలం పాలన తర్వాత మాకేం ఒరిగింది అనే ప్రజల ప్రశ్నకు జవాబుదారీగా ప్రభుత్వం ఉండగలదా..? ఆ మార్క్ చూపించిందా..? అన్నదానిపైనే చర్చంతా. ఇదే ఇప్పుడు అధికార కాంగ్రెస్ ముందున్న అసలైన పరీక్ష.
ప్రభుత్వం తన విజయాలను తన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతూ ప్రజాపాలనగా ప్రొజెక్ట్ చేస్తోంది. కానీ, రాజకీయాల్లో ప్రభుత్వాలు చెప్పేదానికంటే కూడా ప్రజలు అన్నీ గమనిస్తారు. వారు వేసే లెక్కలే కీలకంగా మారుతాయి.
రైతు సమస్యలకు పరిష్కారం లభిస్తుందా..? నిరుద్యోగికి ఉద్యోగం వచ్చిందా..? విద్యార్థికి ఫీజ్ రీయెంబర్స్మెంట్ అందుతుందా..? ఉద్యోగికి పెండింగ్ బకాయిలన్నీ అందాయా..? మహిళలకిచ్చిన హామీలేమయ్యాయి..? విద్యా, వైద్యం పరిస్థితేంటి…? ఎక్కడికెళ్లాలన్నా కావల్సిన ప్రగతి దారులు ఏ దశలో ఉన్నాయి..? ఇలాంటివెన్నో లెక్కల్లోకొస్తాయి.
మరి ప్రతిపక్షాలెక్కడున్నాయి..?
ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాదు… ట్వీట్స్ చేయడమంతకన్నా కాదు.. ప్రెస్ మీట్స్ తో మమ అనిపించుడూ కాదు.. సోషల్ మీడియాలో మీమ్స్ తోనో, సెటైర్స్ తోనో దెప్పి పొడవడమూ కాదు… స్ట్రీట్ ఫైట్స్ కు దిగడం… ప్రజలను భాగస్వాములను చేయడం… ప్రత్యామ్నాయాన్ని చూపించడం… ఇవి కదా ప్రతిపక్ష పార్టీలు చేయాల్సిన రాజకీయాలు..?
ఉద్యమ పార్టీగా పోరాటం చేసి.. తెలంగాణా రాగానే అధికారంలోకొచ్చిన బీఆర్ఎస్ కు… గత ఎన్నికల్లో చుక్కెదురయ్యాక.. అధికారం లేకుండా ఎలా రాజకీయం చేయాలనే ఓ కొత్త పరీక్ష ఎదురైంది. ఎందుకంటే, పదేళ్లు ఏకఛత్రాధిపత్యమన్నట్టుగా సాగిన పార్టీ.. ప్రతిపక్షంలో వచ్చి కూర్చోవడం కచ్చితంగా రాజకీయంగా ఓ షాకే.
ఎందుకంటే, అధికార యంత్రాంగముండదు. పాలనా నిర్ణయాలపై నియంత్రణ మాయమైపోతుంది. పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించడం, నాయకులను ఐకమత్యంగా ఉంచడం, క్యాడర్ ను కాపాడుకోవడం కష్టమైపోతుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడుండే రాజకీయ ఆకర్షణా తగ్గిపోతుంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అవసరమైతే స్ట్రీట్ ఫైట్ చేద్దామంటే తమ భావాలకనుగుణంగా ఆయా ప్రాంతాల్లో నాయకులుండరు. ఇవన్నీ ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది.
గులాబీ బాస్ నిశ్శబ్దం వ్యూహమా, బలహీనతా..?
తెలంగాణా రాజకీయాల్లో ఈ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనా కాలంలో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశాల్లో కేసీఆర్ రాజకీయ ఉనికికి కూడా ప్రాధాన్యత ఉంది. రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, తెలంగాణా రాజకీయాలను దశాబ్దకాలం తన చుట్టూ వైఫైలా తిప్పుకున్న నేత.. ప్రతిపక్ష నాయకుడిగా ఎంత చురుకుగా వ్యవహరించారనే చర్చా సర్వసాధారణమే. ఇదే ఇప్పుడు అధికార కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న..?
సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానున్న నేపథ్యంలో… కేసీఆర్ ప్రజా జీవితానికీ, అసెంబ్లీకి కూడా దూరంగా ఉంటున్నారంటూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన విమర్శలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
మరి బీఆర్ఎస్ ఏం చెబుతోంది..?
కేసీఆర్ రాజకీయాల్లో లేరనడం సరికాదంటోంది. పార్టీ కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నాయని సమర్థించుకుంటోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలు చేయడమే తమ లక్ష్యమంటోంది. ప్రతీదానికీ కేసీఆర్ రావాల్సిన అవసరమేముందని ఎదురు ప్రశ్నిస్తోంది.
కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ బలహీనంగా కనిపిస్తోందా..? కేసీఆర్ వస్తేనే పూర్తిస్థాయి శక్తిని సమీకరించుకుంటుందా..? కేసీఆర్ ఉనికిపై అధికార కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు.. కేసీఆర్ బలహీనతను బయటపెడుతుందా…? లేక, కాంగ్రెస్ మాటల్ని పట్టించుకోకుండా వ్యూహాత్మకంగా కేసీఆర్ అలాగే ఉండిపోవడమే వారి బలమా..?
ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఇప్పుడిది రాజకీయ అగ్ని పరీక్ష!
ప్రతిపక్షమంటే అధికార పక్షాన్ని తిట్టడం కాదు. ప్రజల అసంతృప్తికి రాజకీయ భాష కావడం. ఆ పని బీఆర్ఎస్ ఎంతవరకూ చేస్తోందన్నదే అసలు ప్రశ్న..?
మరి కాంగ్రెస్ పై వ్యతిరేకత, అసంతృప్తి ప్రజల్లో గనుక పెరిగితే క్యాష్ చేసుకునేదెవరు…? బీఆర్ఎస్సా… బీజేపీనా..? ఈ ట్విస్టే తెలంగాణా రాజకీయాలను ఇప్పుడు ఆసక్తికరంగా మారుస్తోంది.
బీజేపీది సైలెన్స్ గేమా..?
తెలంగాణాలో అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మధ్య పోరు కనిపిస్తున్నప్పటికీ… మూడో జట్టైన బీజేపీని విస్మరించడమూ ప్రమాదకరమే. బీజేపీ ఇప్పటికిప్పుడు తెలంగాణాలో రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని చెప్పడం తొందరపాటే. కానీ, జాతీయ రాజకీయ బలం, కేంద్రంలో అధికారం, పార్లమెంట్ స్థాయిలో ప్రభావం చేసే శక్తి, మరికొన్ని ప్రాంతాల్లో బలమైన క్యాడర్ వంటివి బీజేపీనీ కొట్టిపారేయలేకుండా నిలబెట్టేవి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతీ వివాదాస్పద నిర్ణయమూ బీజేపీ రాజకీయ అవకాశాలను పెంచే అవకాశాలుంటాయి.
బీఅర్ఎస్ బలహీనపడితే అదీ బీజేపీకే లాభం. కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగితే అదీ బీజేపీకే అవకాశం. హిందుత్వ రాజకీయాలతో స్పష్టమైన పోలరైజేషన్ జరిగితే అదీ బీజేపీకే బెనిఫిట్. అంటే, తెలంగాణాలో కాంగ్రెస్ కు ప్రధాన పోటీదారు ఎవరని అడిగితే… బీఆర్ఎస్- బీజేపీ ఈ రెండు పార్టీల పేర్లూ ఇప్పుడు తెరపైకొచ్చే స్థాయిలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రతిపక్షాలుగా ఈ పోటీ నెలకొంది.
ఎందుకంటే, బీజేపీ కూడా ఇప్పటికే కొన్ని నిర్ధిష్ఠమైన సమస్యలను ఎంచుకుని పోరాటాలను ముమ్మరం చేస్తోంది. భూవివాదాలు, ఫీజ్ రీయెంబర్స్మెంట్ బకాయిలు, రైతు సమస్యల వంటివెన్నో రాజకీయ అజెండాగా స్ట్రీట్ ఫైట్స్ కు దిగుతోంది.
మరి బీజేపీ వ్యూహమేంటి..?
తెలంగాణాలో ఇప్పటివరకూ అధికారంలోకి రాకపోవడమే బీజేపీకున్న పెద్ద అడ్వంటేజ్. ఎందుకంటే, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ నూ ప్రశ్నించవచ్చు. బీఆర్ఎస్ పాలనా తీరునూ నిలదీయవచ్చు. వాళ్లు పదేళ్లు పాలించి ఏం చేశారు… వీళ్ల వెయ్యి రోజుల పాలనలో ఏం వెలగబెట్టారంటూ.. ఇద్దరికీ ప్రత్యామ్నాయంగా బీజేపీ తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే అవకాశాలూ కల్గి ఉంది.
కానీ, ప్రభుత్వాన్నో, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నో విమర్శించినంత మాత్రాన బీజేపీకి ఓట్లు రాలవు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు మరింత పెరగాలి. ఇదే తెలంగాణాలో బీజేపీకి అతి పెద్ద పరీక్ష. ఎందుకంటే సోషల్ మీడియా రాజకీయాలు.. ఎన్నికల బూతుల దగ్గరికొచ్చాక అదే స్థాయిలో ప్రభావితం చేస్తాయని చెప్పడానికి ఇతమిద్దమైన ఆధారాల్లేవు. హైదరాబాద్ లోనో, ఎవో కొన్ని చోట్ల ఎంపీలున్న నగరాల్లోనో బీజేపీ వాణి వినిపిస్తున్నంతగా.. గ్రామగ్రామాన వినిపిస్తుందా అన్నదే ఆ పార్టీ చేసుకోవాల్సిన ఆత్మపరిశీలన.
మరి కాంగ్రెస్ కు ప్రమాదమెవరు..?
రేవంత్ సర్కార్ కు మూడు రకాల సవాళ్లు ముందరున్నాయి.
1) పాలనా వ్యతిరేకత: వెయ్యి రోజుల పాలన తర్వాత ప్రభుత్వంపై అంచనాలు పెరుగుతాయి. అదే సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడీ పెరుగుతుంది. హామీల అమలుపై ప్రశ్నలూ పెరుగుతాయి.
2) బీఆర్ఎస్ పునరాగమనం: బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉన్నా ఆ పార్టీపైన గ్రామస్థాయిలో గతంలో నెలకొన్న వ్యతిరేకత పూర్తిగా పోలేదు. పబ్లిక్ నుంచి అంత యాక్సెప్టెన్సూ లేదు. అదే బీఆర్ఎస్ తిరిగి కష్టపడి సంపాదించుకోగల్గితే అదే తెలంగాణాలో అధికార కాంగ్రెస్ కు బలమైన పోటీగా మారే అవకాశాలున్నాయి.
- 3) బీజేపీ విస్తరణ: కాంగ్రెస్ పై అసంతృప్తి ఉన్న ఓటు షేరింగ్ మొత్తం బీఆర్ఎస్ కే వెళ్తుందనుకోవడమూ పొరపాటే. బీజేపీకీ అందులో కొంత భాగముండే అవకాశాలుంటాయి. ప్రత్యేకించి పట్టణాలు, యువత, జాతీయ రాజకీయాల ప్రభావమున్న వర్గాల్లో బీజేపీ తన అవకాశాలను వెతుక్కుంటుంది.
అసలు సమస్య కాంగ్రెస్ కంటే కూడా… ప్రతిపక్షాల మధ్య పోటీనే తెలంగాణాలో ఆసక్తికరం!
అధికార పార్టీగా కాంగ్రెస్.. మరోసారి అధికారంలోకి రావడానికి సర్వశక్తులూ ఒడ్డటం ఖాయం. ప్రతిపక్షాల్లో నెలకొన్న అంతర్గత పోటీ కూడా కాంగ్రెస్ కు ప్లస్ అయ్యే అవకాశాలూ లేకపోలేదు. పైగా కాంగ్రెస్ కు అసలైన ప్రత్యామ్నాయమెవ్వరు అనే స్పష్టత లేని సందేహం ఇప్పటికీ చాలాచోట్ల వినిపిస్తూ ఉంటుంది.
సింపుల్ బీఆర్ఎస్ మళ్లీ బలంగా నిలబడితే అధికార కాంగ్రెస్ కు ఆబ్సల్యూట్ ఆల్టర్నేట్ అవ్వడం ఖాయం. లేదంటే, బీఆర్ఎస్ బలహీనపడితే మత్రం ఆ ఖాళీని బీజేపీ పూరించేందుకు ఏ ఛాన్సును కూడా మిస్ చేసుకోదు. ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న తీవ్రమైన పోటీనే తనకు శ్రీరామరక్ష అనేది కాంగ్రెస్ యోచన.
వెయ్యి రోజుల తర్వాత మొదలైన అసలు పరీక్ష!
ఇప్పుడు ఆరంభమయ్యేది సరికొత్త రాజకీయ దశ. ఇకనుంచి కాంగ్రెస్ కు కొత్త ప్రభుత్వమనే సానుభూతి తగ్గిపోతుంది. బీఆర్ఎస్ కు అధికారం కోల్పోయి, తాము కోలుకుంటున్నాం అనే కారణం కూడా ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందో తెలియదు. మాకు ఒక్క అవకాశమివ్వండని బీజేపీ అన్నంత మాత్రాన సరిపోదు. ఈ మూడు ప్రధాన పార్టీలూ ఇప్పుడు ప్రజల ముందు తామేంటో నిరూపించుకునేలా పనిచేయాలి.
ఇదిగో మేం ఇవి చేశాం మమ్మల్ని గెలిపించినందుకు కనిపించిన ఫలితాలివి అని కాంగ్రెస్ చెప్పుకోగల్గాలి. ఇదిగో మేం పోరాటం చేశాం. మేం మళ్లీ అధికారంలోకొస్తే ఈ ప్రత్యామ్నాయాలు చూపించగలమని బీఆర్ఎస్ ఢంకా బజాయించాలి. ఈ ఇద్దరూ విఫలమయ్యారు.. మేం పాలించిన రాష్ట్రాల్లో ఇవీ సంస్కరణలని బీజేపీ నినదించాలి. అంత గట్టిగా పోరాటం చేస్తేనేగానీ.. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అయినా అధికారపీఠం ఎక్కగలదు.
వెయ్యి రోజుల పాలన కాంగ్రెస్ కు ఓ ప్రోగ్రెస్ కార్డ్! ప్రతిపక్ష పనితీరుకు ఓ రిపోర్ట్ కార్డ్!
ఇప్పటివరకూ కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అనే చర్చ మాత్రమే చూశాం. ఇకముందూ మళ్లీ కాంగ్రెస్సేనా… లేక, ప్రత్యామ్నాయమెవ్వరూ అనే చర్చను చూడబోతున్నాం.



