అమ్మమ్మ వెళ్లిపోయినా… బొమ్మల కథ మాత్రం నడుస్తోంది!
ఓ చిన్న కర్ర… దానిమీద చెక్కబొమ్మలు.. ఆ కర్రను ముక్కుకు, పై పెదవికి మధ్య ఉంచి సమతుల్యంగా నిలబెట్టుకుని ఆడించే ఓ కళాకారిణి.. ఆమె చేతిలో దారాలు… ఆమె చూపంతా ఆ కదిలించే బొమ్మలపైనే.. ఏమాత్రం ఏకాగ్రత తప్పినా ఆ బొమ్మ కింద పడిపోతుంది. ఒక చిన్న కదలికలో తేడా వచ్చినా కథ ఆగిపోతుంది. కానీ, ఆ బొమ్మలను ఆడిస్తున్నప్పుడు అవి చెక్క బొమ్మల్లా అనిపించవు. ఆ బొమ్మల్లో రామాయణం కనిపిస్తుంది. మహాభారతం దృశ్యమానమవుతుంది. ఒక్కొక్క పురాణం.. ఒక విజువల్ ట్రీటులా కళ్లముందు నడుస్తూ ఉంటుంది.
కేరళ నేలపై మాత్రమే కనిపించిన, ప్రపంచంలోనే ఒక అరుదైన నొక్కువిద్య పావకళి.. దీన్నే పప్పెట్రీ అని కూడా పిలుస్తుంటారు.
ఈ కళలో ప్రసిద్ధురాలైన పద్మశ్రీ మూఱిక్కల్ పంకజాక్షి ఇప్పుడు లేరు. కానీ, ఆమె వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఈ కళను బతికించేందుకు తన మనవరాలైన రంజనీ మాత్రం ఇంకా ఈ ప్రదర్శనలు కొనసాగిస్తోంది.

ఓ కుటుంబంతో పెనవేసుకున్న కళ పప్పెట్రీ!
మూఱిక్కల్ పంకజాక్షి అమ్మ జీవితాన్ని నొక్కువిద్య పావకళి నుంచి వేరు చేసి చూడలేం. కేరళకు మాత్రమే ప్రత్యేకమైన… శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం పంకజాక్షి కుటుంబంలో తరతరాలుగా కొనసాగుతోంది. చిన్ననాటే పంకజాక్షికి ఈ విద్య అబ్బింది. ఎనిమిదేళ్లకే సాధన మొదలుపెట్టింది.
పప్పెట్రీ ఓ ప్రదర్శన మాత్రమే కాదు.. జనానికి వేలంవెర్రి!
కేరళలో ఏ పండుగ వచ్చినా పంకజాక్షి కుటుంబ ప్రదర్శన ఉండాల్సిందే. బొమ్మలు, పాటలు, కథలు.. వీటితో ప్రేక్షకుల ముందు పప్పెట్రీతో ఒక రసాస్వదనే జరిగేది.
కానీ, కాలం మారింది. నాటకం, సినిమా, టెలివిజన్, డిజిటల్ విప్లవం, చివరకు ఫింగర్ టిప్స్ పైనే ప్రపంచాన్ని వీక్షించే మోబైల్ చేతికొచ్చింది. దీంతో ఇప్పుడు ఈ నొక్కువిద్య పావకళి మాత్రం నెమ్మదిగా తెర వెనక్కి వెళ్లిపోతుందనే ఆందోళన రేకెత్తింది.
మరి పంకజాక్షితో పప్పెట్రీ అంతరించిపోయిందా..?
2026, జూలైలో సరిగ్గా నెల క్రితమే 90 ఏళ్ల వయస్సులో మూఱిక్కల్ పంకజాక్షి కన్నుమూశారు. ఆమె మరణంతో కళ ఆగిపోకూడదని భావించింది. ఆ బాధ్యతను తన మనవరాలైన రంజని భుజానికెత్తుకుంది
ఒక దశలో ఈ కళకు పంకజాక్షే చివరి బలమైన వారసురాలనుకున్నారు. కేరళ ప్రభుత్వం కూడా ఆమెను పప్పెట్రీ అనే అరుదైన కళకు చెందిన జీవించి ఉన్న చివరి కళాకారిణిగానే చూసింది.
అసలు ఈ నొక్కువిద్య అంటే ఏంటి..?
మళయాళంలో నొక్కు అంటే చూడటం.. విద్య అంటే పద్దతి.
పేరులో పేర్కొన్నట్టే ఈ విద్యలో కళాకారిణి చూపు, ఏకాగ్రత, శరీర సమతుల్యతే అసలైన మాయ. సుమారు రెండడుగుల పొడవైన సన్నని కర్రపై బొమ్మలను అమర్చుతారు. ఆ కర్రను ముక్కుకు, పై పెదవికి మధ్య ఉన్న చిన్న ప్రదేశంలో నిలబెడతారు. ఆ బొమ్మలకు అనుసంధానమైన దారాలను చేతుల్లో పట్టుకుని నియంత్రిస్తూ వాటిని కదిలిస్తారు. మరోవైపు పాట సాగుతుంటుంది. మధ్య మధ్యలో కథ వస్తూ ఉంటుంది. పైన బొమ్మలు నర్తిస్తాయి. అలా చెక్క బొమ్మల ప్రదర్శన ఓ పురాణంలాంటి కథను మన ముందుంచుతుంది. రామాయణం, మహాభారతం, భాగవతం ఇలాంటి పౌరాణిక గాధల్ని ఈ పప్పెట్రీ ద్వారా ప్రదర్శించడంలో పంకజాక్షి కుటుంబం ఆరితేరింది.

ఇది సాధారణ పప్పెట్ షో కాదు!
బొమ్మలాటల్లో ఎన్నో రకాలున్నాయి. బొమ్మలాట అంటే గుర్తొచ్చేది సాధారణంగా దారాలతో ఆడించే బొమ్మలు. లేదా, తెరవెనుక నుంచి వెలుగులను ప్రసరిస్తూ తెరపైన కదిలే తోలుబొమ్మలు. కానీ, నొక్కువిద్య పావకళి మాత్రం వీటికి పూర్తి భిన్నమైంది. ఇక్కడ కళాకారిణి శరీరమే ప్రదర్శనకు ఓ వేదిక. ఓ స్టాండ్. ఓ ట్రైపాయిడ్.
ముక్కు కింద, పై పెదవి పైన నిల్చిన కర్రే బొమ్మలకు ఆధారం. చేతులే దారాలతో ఆ బొమ్మలను ఆడించే యంత్రాలు. ఆడించే కళాకారిణి చూపే నియంత్రణా వ్యవస్థ. ఏకాగ్రతే మొత్తం ప్రదర్శనకు ప్రాణాధారం.
అందుకే, ఈ కళను నేర్చుకోవడం అంత సులభం కాదు. పంకజాక్షి వారసత్వాన్ని భుజానికెత్తుకున్న మనవరాలు రంజని చెప్పేదాన్ని బట్టి ఏళ్ల తరబడి సాధనతో పాటు.. అపారమైన ఏకాగ్రత, శారీరక శ్రమ అవసరం.
పంకజాక్షమ్మకు పద్మశ్రీ!
ఇంత అరుదైన కళను దశాబ్దాల పాటు మోసిన పంకజాక్షి అమ్మను.. 2020లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. ఒక సంప్రదాయ ప్రదర్శనతో కేరళలోని ఓ చిన్న గ్రామం నుంచి బయల్దేరిన పంకజాక్షి.. కేరళ సరిహద్దులు దాటి అంతర్జాతీయ వేదికలపైనా ఈ నొక్కువిద్య పావకళి అనే ప్రదర్శనలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. 2008లో పారిస్ లో జరిగిన ప్రదర్శన ఆమె జీవితంలో మరుపురానిది.

పంకజాక్షిని వేధించిన ప్రశ్నేంటి మరి..?
తన తర్వాత నొక్కువిద్య పావకళి ఎవరి చేతుల్లోకి వెళ్లుతుంది..? అసలు అందుకు వారసులెవరైనా ఉన్నారా…? ఇదిగో ఇలాంటి ప్రశ్నలు ఆమెను తన వృద్ధాప్యంలో వెంటాడేవి. కానీ, ఆ ప్రశ్నకు సమాధానంగా తన మనవరాలైన రంజని ఆమె ముందుకొచ్చింది. అమ్మమ్మ దగ్గర చిన్నప్పట్నుంచే కే.ఎస్. రంజని ఈ కళ నేర్చుకోవడం మొదలుపెట్టింది. మొదట్లో బొమ్మలను సమతుల్యంగా ఆడించడం రంజనికి పెద్ద సవాల్ గానే ఉండేది. బొమ్మలను ముక్కుకు, పై పెదవికి మధ్య కర్రపై పెట్టుకుని.. కింద చేతుల్లోని దారాలతో ఆడించడం.. పైగా చెప్పే కథను గుర్తు పెట్టుకుని అందుకనుగుణంగా ప్రదర్శనను నడిపించడం.. పాటల సమయలో బొమ్మలను నృత్యం చేయించడం.. ఇవన్నీ ఒకేసారి చేయడం కర్రమీద సామే అయింది. కానీ, ఐదేళ్లపాటు తీవ్రంగా శ్రమించి రంజని ఈ కళలో నిష్ణాతురాలైంది.
వారసత్వంగానే కాదు.. ఓ బాధ్యతగా స్వీకరించిన రంజని!
రంజనికిది ఇప్పుడు అమ్మమ్మ వారసత్వమే కాదు. ఆ కుటుంబం పెంచి పోషించిన ఒక అరుదైన ప్రదర్శనను అంతరించిపోకుండా కాపాడటం ఓ బాధ్యత. పప్పెట్రీ షోతో జీవించడమంటే కష్టమే. అయినా, తానున్నంత కాలమైనా ఈ కళను బతికించాలన్న సంకల్పం రంజనిది.
నేలపై కాళ్లు ముందుకు చాపి… తలను పైకెత్తి… ముక్కుకు, పై పెదవికి మధ్య ఓ సన్నని కర్రనుంచి… ఆ కర్రపై బొమ్మలనుంచి.. చేతుల్లోని దారాలను కదిలిస్తూ… బొమ్మలపైనే దృష్టంతా సారించి ఆడించే సమయంలో ఓ చిన్న ఈగనో, దోమనో, చీమనో చిటుక్కుమనిపించినా, వాలినా ఆ ఏకాగ్రత దెబ్బ తినే అవకాశాలే ఎక్కువ. ఒక్క రెప్పపాటు క్షణంలో ఏం జరిగినా ప్రదర్శన మొత్తం బెడిసికొట్టే అవకాశముంటుంది. అంతటి నియంత్రణతో చేసే ప్రదర్శన కాబట్టే… ఒక అథ్లెట్ శిక్షణకు ఏమాత్రం తీసిపోని ప్రాక్టీస్ ఈ నొక్కువిద్య పావకళికి అవసరం.
పంకజాక్షి వెళ్లిపోయినా ఈ కళా ప్రదర్శన మాత్రం ఆగిపోలేదు!
ఏడు దశాబ్దాలపాటు తన కళతో అలరించిన పంకజాక్షమ్మ కన్నుమూసినా.. ఆమె చేతుల్లో ప్రత్యేకతను సంతరించుకున్న పప్పెట్రీ షో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ చేతులను, ఆ చూపును మనవరాలు రంజని సొంతం చేసుకుంది. పంకజాక్షి పప్పెట్రీకి రంజని ఇప్పుడు కొనసాగింపైంది.
బొమ్మలు చిన్నవే.. కథ మాత్రం పెద్దది!
పప్పెట్రీ అంటే పిల్లల వినోద ప్రదర్శన మాత్రమే కాదు. ఒక జాతి సంప్రదాయంలోని అస్తిత్వం. ఒక సమాజానికి ఒక వినూత్న పద్ధతిలో చెప్పే కథ. ఒక తరాన్ని మరో తరంతో కలిపే దారం. ఈ దారం తెగిపోతే బొమ్మలు మాత్రమే కిందపడవు.. ఏకంగా ఒక జాతి సంస్కృతే నేలరాలిపోతుంది. మూఱిక్కల్ పంకజాక్షమ్మ జీవితాంతం ఆ దారం తెగకుండా పట్టుకుంది. ఇప్పుడు అదే దారాన్ని అంతే గట్టిగా రంజని పట్టుకుంది. అమ్మమ్మ నుంచి మనవరాలికి అందివచ్చిన ఒక శతాబ్దపు జ్ఞాపకంగా ఇప్పుడు రంజనీ పప్పెట్రీ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
నొక్కువిద్య పావకళిని కాపాడటమంటే ఓ కళా మ్యూజియంలో భద్రపర్చడం కాదు… ఆ బొమ్మల ప్రదర్శనకు మళ్లీ వేదికనివ్వడం. అమ్మమ్మలాగే ప్రేక్షకులను ఆకట్టుకోవడం.
అందుకే అమ్మమ్మ వెళ్లిపోయినా కేరళకు మాత్రమే ప్రత్యేకమైన ఈ సంప్రదాయ పప్పెట్రీ షో ఇప్పుడు రంజనీ రూపంలో కొనసాగుతోంది.



