దుమారం రేపిన మరో పేపర్ లీకేజీ వ్యవహారం!
ఎక్కడో ఓ చిన్న లీకేజీని అడ్డుకోవం ఎంత కష్టం..? అందుకే దేశవ్యాప్తంగా ఎక్కడో ఓచోట పేపర్ లీకేజీల వ్యవహారం వెలుగు చూస్తూనే ఉంది. అలాంటిదే ఇప్పుడు మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ బీలోని డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్. ఏంటీ ఈ లీకేజ్.. మళ్లీ ఏం జరిగింది..?
ఎంపీఎస్సీ నిర్వహించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్షా పత్రం లీకేజీలో మరో సంచలన పరిణామం దేశవ్యాప్తంగా మరో కలకలానికి కారణమవుతోంది. ఏడో ర్యాంక్ సాధించిన అభ్యర్థినిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు… తీగ లాగితే డొంక కదిలినట్టు మరో ఏడుగురినీ పోలీసులు తమ విచారణలో భాగంగా అరెస్ట్ చేశారు.
మహారాష్ట్ర నందూర్ బార్ కు చెందిన రుతుజా పాటిల్ కు పరీక్షకు ముందే లీకైన ప్రశ్నాపత్రం చేతికొచ్చింది. అంతేకాదు, కేటుగాళ్ల ఆలోచలెలా ఉంటాయో కూడా.. పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలను వెల్లడించాయి. పరీక్ష లీకైనట్టు ఎక్కడా అనుమానం రాకుండా రుతుజా పాటిల్ ఏకంగా ఒక పది ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు రాయాలనేదీ ఈ లీకేజీ వ్యూహంలో మరో భాగమవ్వడమే ఈ కేసులో మరో ట్విస్ట్. అయినప్పటికీ రుతుజా పాటిల్ ఏకంగా ఏడో ర్యాంక్ సాధించడంతో.. ఎంపీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం మరో దుమారాన్ని మోసుకొచ్చింది.

రుతుజా పాటిల్ తో పాటు… ఈ కేసులో మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు ఎంపీఎస్సీ అధికారులు కూడా ఉండటం గమనించాల్సిన విషయం. ఎంపీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ విశ్వేశ్వర్ దత్తాత్రేయ నకాటే, గోపాల్ భట్టు మరాఠే, అండర్ సెక్రటరీగా ఉన్న అభిజిత్ గణ ప్రతాప్ లెండ్వేతో పాటు.. కౌటిల్య అకాడమీ డైరెక్టర్ ప్రవీణ్ దిలీప్ పాటిల్ అనేవాళ్లు ఈ పేపర్ లీకేజీలో కీలక నిందితులు.
అసలేం జరిగింది..?
ఈ నిందితులు పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాలను సంపాదించి.. వాటిని అనధికారిక వ్యక్తులకు పంపిణీ చేయడంతో పాటు… అస్మదీయులైనవారికి పంపిణీ చేశారన్నది క్రైమ్ బ్రాంచ్ అనుమానం.
మహారాష్ట్ర ఆహార, ఔషధ పాలనాశాఖలో డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం మార్చ్ 20న స్క్రీనింగ్ పేపర్ నిర్వహించారు. కానీ, ఈ పేపర్ లీకైనట్టు ప్రాథమిక విచారణలో తేలడంతో మొత్తం నియామక ప్రక్రియనే మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు, పారదర్శకత కోసమే తిరిగి పరీక్ష నిర్వహిస్తామంటూ వెల్లడించిందియ
ఈ కాంప్టీటివ్ ఎగ్జామ్ కు సంబంధించిన ఫలితాలు జూన్ 12నే విడుదలయ్యాయి. 506 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హులయ్యారు. వీరిలో 488 మంది జూలై 1 నుంచి 22 మధ్య జరిగిన ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఆ తర్వాత విడుదల చేసిన మెరిట్ జాబితాలో 485 మంది నియామకానికి అర్హులని తేల్చారు. అయితే, జూలై 22 నుంచి 25 మధ్య జరిగిన ఇంటర్వ్యూల్లో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులందాయి. కొందరు అభ్యర్థులకు పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీకైందని.. ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా వేదికగా ఆ ప్రశ్నలు వారికి చేరినట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో భారతీయ న్యాయసంహిత కింద మోసం, నమ్మకద్రోహం, నేరపూరిత కుట్ర, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి వంటి ఆరోపణలపై ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ వ్యవహారం భారతదేశంలో పేపర్ లీకేజీల పరంపరను కళ్లకు కడుతోంది. ఈ మధ్యే నీట్, సీబీఎస్ఈ, బీహార్, జార్ఖండ్ ఇలా ఎన్నో పేపర్లలో, ఎన్నో చోట్ల ఇలాంటి అవకతవకలు చూస్తున్న క్రమంలో… ఇప్పుడు ఆ వరుసలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కూడా చేరడంతో వ్యవస్థలను అసలు పారదర్శకంగా మార్చడమెలా అనే ఒక అంతుచిక్కని ప్రశ్న.. ఓ సమాధానం, మరో పరిష్కారం కోసం వెతుకుతూనే ఉంది.



