ఆ ఉదయం ప్రశాంత వదనంతో ఉన్న బుద్ధుడు లోలోపల నవ్వుతున్నాడు. 1974, మే 18వ తేదీన అదే రోజు ఉదయం ఢిల్లీ పాళం విమానాశ్రయంలో సెనెగల్ నుంచి అధ్యక్ష విమానం వచ్చి ల్యాండ్ అయింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ సెనెగల్ అధ్యక్షుడు లియోపోల్డ్ సెడార్ సెంగోర్ కు ఘన స్వాగతం పలికింది. ఇంకొకవైపు.. రాజస్థాన్ ఎడారిలో మండుటెండాకాలంలో ఒక భారీ విస్ఫోటనం జరిగింది. చూసేందుకు ఇవన్నీ వేర్వేరుగా కనిపిస్తుండవచ్చు.. కానీ, నాటి ప్రధాని మైండ్ గేమ్, వ్యూహరచన.. ఈ సంబంధం లేకుండా కనిపించే ఈ ఘటనల వెనుక కనిపిస్తాయి.

తనకు పరుపు – ప్రతిష్ఠ ముఖ్యం కాదు. అలా అని అణుపరీక్షలు చేయడాన్ని ఏదో ఉత్సాహంగా ఛాతీ గుద్దుకుని చెప్పే విషయమూ కాదు. ఎందుకంటే తాము చేస్తున్న అణుపరీక్షలు శాంతియుత వినియోగం కోసం మాత్రమేనంటూ అదే రోజు నాటి ప్రధాని ఇందిర మీడియాతో చెప్పిన మాట.
ఆ సమయంలో భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరో దాయాది దేశం చైనా అప్పటికే అణుబాంబును తయారుచేసుకుంది. మొత్తంగా చుట్టుముట్టు శత్రుగణమంతా అణ్వాయుధాలతో ఎప్పుడు యుద్ధం వచ్చినా సంసిద్ధంగా ఉన్నామనే సంకేతాలిస్తున్నారు. అదిగో ఆ సమయంలో భారత్ కూడా తన రక్షణ వ్యవస్థను మరింత బలపర్చుకోవాల్సిన ఒత్తిడితో కూడుకున్న తరుణమది.
అమెరికా, యూరప్ వంటి వెస్టర్న్ కంట్రీస్ అణుపరీక్షలను వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ అణుపరీక్షలు నిర్వహిస్తే గనుక కచ్చితంగా అంతర్జాతీయ సమాజం నుంచి, ముఖ్యంగా ఎన్పీటీలో భాగస్వాములైన దేశాల నుంచి వ్యాపార వాణిజ్యం, పరస్పర సహకారం, ఎగుమతులు, దిగుమతులు ఇలా ఎంతో నష్టం జరిగే అవకాశాలూ లేకపోలేదు. అయినా, ఇందిరాగాంధీ వెనుకడుగు వేయలేదు. అలాంటి కఠినమైన ఆంక్షల నడుమ ఇందిర తీసుకున్న నిర్ణయమే పోఖ్రాన్ లో జరిగిన మొట్టమొదటి అణుపరీక్షకు సిద్ధమవ్వడం. భారత శాస్త్రవేత్తలకు రహస్య అణుపరీక్షలను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. అలా నాటి శాస్త్రవేత్త రాజారామన్న నేతృత్వంలో.. భారత్ అణుపరీక్షలు నిర్వహించింది
.
ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ!
రాజస్థాన్ పోఖ్రాన్ వేదికగా జరిగిన నాటి అణుపరీక్షలకు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని నామకరణం చేశారు. డీకోడ్ చేసినా అర్థంకాని రీతిలో 1974, మే 17న.. మీరు ముందుకు వెళ్లండి.. ఇది దేశానికి మేలే చేస్తుందన్న ఇందిరాగాంధీ ఆదేశాలతో ఆ తర్వాత రోజే ఉదయం 8 గంటల 5 నిమిషాలకు రాజస్థాన్ పోఖ్రాన్ లో అణుబాంబు విస్ఫోటనం జరిగింది.
అప్పటికే అంతర్జాతీయ అణు నిరోధక వ్యవస్థను (INTERNATIONAL NON PROLIFERATION SYSTEM) ఏర్పాటు చేసి ఎవ్వరూ అనుమతి లేకుండా అణు పరీక్షలు నిర్వహించేందుకు వీల్లేదనే నిబంధనలు ఏర్పాటు చేసిన క్రమంలో… రాజస్థాన్ లో జరిగిన పేలుడుతో అంతర్జాతీయ సమాజం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ విషయాన్ని ఇండియాస్ న్యూక్లియర్ బాంబ్: ది ఇంపాక్ట్ ఆన్ గ్లోల్ ప్రొలిఫరేషన్ అనే పుస్తకంలో జార్జ్ పెర్కోవిచ్ పేర్కొన్నారు.
సైలెన్స్ బ్రేక్ చేసిన స్మైలింగ్ బుద్ధా!
ఇండియా పోఖ్రాన్ వేదికగా నిర్వహించిన పరీక్షలతో అణుయుగంలోకి ప్రవేశించింది.
పోఖ్రాన్ లో ఉపయోగించిన పేలుడు పదార్థం నాగసాకిపై వదిలిన ఫ్యాట్ మాన్ బాంబుతో పోలిన ఇంప్లోజన్ టైప్ బాంబ్. అధిక శక్తి గల పేలుడు పదార్థం. సైరస్ రియాక్టర్ నుంచి సేకరించిన 6 కిలోల ప్లూటోనియంతో ఫ్లవర్ ట్రిగ్గర్ గా పిల్చే పోలోనియం, బెరిలియం ఇన్షియేటర్ తో ఆ అణువిస్ఫోటన సామర్థ్యాన్ని పరీక్షించారు. అందుకోసం బార్క్ ఇంజనీర్ల కృషి కీలకమైంది. చివరి వరకూ కూడా ఈ ఆపరేషన్ స్మెలింగ్ బుద్ధా బయట ఉన్న ప్రపంచాన్ని చూస్తూ నవ్వుతూనే… లోలోపల ఈ రహస్య ఆపరేషన్ ను పూర్తి చేసింది.
నాటి పోఖ్రాన్ అణుపరీక్షల్లో భాగంగా పేల్చిన బాంబుకు సంబంధించిన బటన్ నొక్కడానికి శాస్త్రవేత్త ప్రణబ్ రెబతిరంజన్ దస్తిదార్ ను నియమించారు సైంటిస్ట్ రాజా రామన్న. పేలుడుకు సంబంధించిన బటన్ ఎవ్వరు నొక్కాలనేదానిపైనా నాడు పెద్ద చర్చే జరిగినట్టు సైంటిస్ట్ రాజా రామన్న తన ఆత్మకథలోనూ రాశారు. ట్రిగ్గర్ ను ఎవరైతే తయారుచేశారో వారే బటన్ కూడా నొక్కాలనేదే తన వాదన అని.. అందుకే సైంటిస్ట్ ప్రణబ్ రెబతిరంజన్ దస్తిదార్ తోనే ఆ పని చేయించామన్నారు.
పేలుడు సక్సెస్ అయింది.. ప్రధాన శాస్త్రవేత్తగా బాధ్యతలు స్వీకరించిన రాజా రామన్న నుంచి ఢిల్లీకి సందేశం వెళ్లింది. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధాలో బుద్ధుడు నవ్వాడన్నది ఆ సందేశం. ఇంకేం దాన్ని డీకోడ్ చేసుకున్న ఢిల్లీ పెద్దల్లోనూ అంతే ఆనందం వెల్లివిరిసింది.
పోఖ్రాన్ కంటే దశాబ్దాల ముందే ప్రారంభమైన భారత అణుప్రయాణం..?
ఏస్.. భారత అణు పరీక్షల ప్రయాణమనేది పోఖ్రాన్ తో మొట్టమొదటిసారి వెలుగులోకి రావచ్చునేమోగానీ… అంతకు దశాబ్దాల క్రితమే 1954లోనే సైంటిస్ట్ డాక్టర్ హోమీ జహంగీర్ బాబా నేతృత్వంలో అణుశక్తి శాఖను ప్రారంభించారు. కానీ, నాటి లక్ష్యం కేవలం శాంతియుత వినియోగం వరకే పరిమితమైంది.
1962, 1965, 1971లో చోటుచేసుకున్న యుద్ధాలు భారత రక్షణ దృక్కోణాన్నే పూర్తిగా మార్చేశాయి. చైనా, పాకిస్థాన్ తో జరిగిన యుద్ధాలతో దేశభద్రత ఎంత అనే ప్రశ్న కేంద్రంలోని ప్రభుత్వాన్ని తీవ్రంగా వేధించింది. అలాంటి దశలో అణు పరీక్షల అవసరం ఎంతో నాటి ప్రభుత్వం గుర్తించింది. ఆ తర్వాత 1972 నాటికే భారత ప్రభుత్వం బార్క్ లో ఆయుధ సంబంధిత ప్రయోగాలకు, పరీక్షలకు అనుమతులనిచ్చింది. డాక్టర్ రాజా రామన్న, పీ.కే. అయ్యంగార్, ఆర్. చిరంజీవం వంటి దాదాపు 75 మంది శాస్త్రవేత్తలు దేశ భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశలో రహస్యంగా ఎన్నో పరీక్షలు నిర్వహించారు.
ప్లూటోనియం నిల్వలలేమితో ఎదురైన సవాళ్లు!
అణుపరీక్షలు సరే.. మరి అందుకు అవసరమైన ప్లూటోనియం నిల్వల సంగతేంటి..? అప్పుడు మొత్తం దేశంలో కేవలం 18 కిలోల ప్లూటోనియం మాత్రమే అందుబాటులో ఉంది. అప్పటికే ఒక్క పేలుడు పదార్థం తయారీకే ఏకంగా 6 కిలోలు పట్టింది. ఆ క్రమంలో కొన్ని రియాక్టర్ల కార్యకలాపాలకు ఉపయోగించాల్సిన ప్లూటోనియంను అణుపరీక్షల కోసం ఉపయోగించుకున్నారు.
అదే సమయంలో న్యూట్రాన్ ఇన్షియేటర్ తో పాటు.. ఇంప్లోజన్ లెన్సెస్ రూపకల్పననూ ఛాలెంజింగ్ గా తీసుకున్న శాస్త్రవేత్తల బృందం మొత్తంగా అనుకున్నది సాధించారు. సాంకేతిక సామర్థ్యాల సరిహద్దులకు చేరుకున్నారు.
భారత్ మొట్టమొదటి అణుపరీక్ష- ప్రపంచ దేశాల స్పందన!
పోఖ్రాన్ లో చేసిన అణుపరీక్షను భారత్ శాంతియుత పరీక్షలుగానే పేర్కొంది. పైగా ఆరోజు జరిగిన అణుపరీక్ష భూమి అడుగు భాగంలో వంద మీటర్ల లోతులో జరిగింది. కాబట్టి భారత్ ఏ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించలేదని మన పాలకులు బల్ల గుద్ది చెప్పారు. 1963లో మాస్కో టెస్ట్ బ్యాన్ ఒప్పందంలో భాగంగా వాయుమండలంలోగానీ, సముద్రంలోగానీ, అంతరిక్షంలోగానీ అణుపరీక్షలపై నిషేధం విధించారు. కానీ, భూమి లోపల పొరల్లో ఆ నిషేధం లేదని అంతర్జాతీయ సమాజానికి నాడు పోఖ్రాన్ అణు పరీక్షలనంతరం భారత్ వివరణ ఇచ్చింది. 1963 ఒప్పందం తర్వాత జరిగిన 1968 అణు నిరోధక ఒప్పందంపైన మాత్రం భారత్ సంతకం చేయలేదు. ఆ ఒప్పందంలో వివక్ష ఉందని పేర్కొంటూ దూరాన్ని పాటించింది.
1974లో అణుపరీక్షలు జరిగే సమయంలో అణుశక్తి కమిషన్ చైర్మన్ హోదాలో ఉన్న సైంటిస్ట్ డాక్టర్ హెచ్. ఎన్. సేత్నా భారత్ జరిపిన పరీక్షలను గర్వంగా చెప్పుకున్నారు. తాము తయారు చేసిన పేలుడు పదార్థం శక్తి పది నుంచి 15 కిలో టన్నుల మధ్య ఉంటుందని.. అది వంద శాతం పూర్తిగా భారతీయ స్వయం పరిజ్ఞానంతో తయారైందన్నారు. ప్లూటోనియంతో సహా, ఇతర టూల్స్ అన్నీ కూడా పూర్తి దేశీయంగా తయారుచేశామన్నారాయన.
అణు పరీక్షలనంతరం నాటి ప్రధాని ఇందిరాగాంధీ శాస్త్రవేత్తలను అభినందించారు. ఇది దేశం కోసం వారు పడ్డ కష్టమని కొనియాడారు. అందుకు తామంతా గర్విస్తున్నామన్నారు. శాస్త్రవేత్తల బృందమంతా స్వచ్ఛందంగా, కచ్చితత్వంతో పనిచేశారని పొగడ్తలు గుప్పించారు.
ఇప్పుడు అణుపరీక్షలవైపు అన్ని దేశాల చూపు!
గతంలో అణు పరీక్షలు జరిపితే ఓ ఆందోళన, ఓ భయం. కానీ, ఇప్పుడు దేశాలన్నీ తమ భద్రతలో భాగంగా అణు పరీక్షలపై ఫోకస్ చేస్తున్నాయి. ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఆ చర్చను ముందుకు తెచ్చాయి. రష్యా ఆధునిక పరీక్షలు నిర్వహిస్తోంది. చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్ వంటి దేశాలన్నీ ఇప్పుడు తమ అణు సామర్థ్యాన్ని పెంచుకుని సై అంటే సై అనేందుకు సంసిద్ధమవుతున్నాయి. ఒకనాడు భారత్ జరిపిన అణు పరీక్షలతో ఇప్పటివరకూ అనవసరంగా వాటి వినియోగం ఏనాడూ జరగలేదు. నాడు ఏ మాటకైతే భారత్ కట్టుబడి ఉందో అదే శాంతియుత విధానంలో నడుస్తోంది. కానీ, అంతర్జాతీయంగా నెలకొన్న వార్ ఫేర్ లో అణుపోటీ తప్పదనే విషయాన్ని నాడెలాగైతే భారత్ గుర్తించిందో.. నేడూ అదే పరిశీలనతో భారత్ తన భద్రత వైపు అడుగులేస్తోంది.



