భారతదేశంలో అత్యంత ఆసక్తికరమైన, భిన్నమైన రాజకీయ పరిణామాలకు కేంద్రం బీహార్. అలాంటి చోట 16వ ముఖ్యమంత్రిగా ఎన్నికైన కార్మిక సంఘ నాయకుడు బిందేశ్వరీ దూబే. బీహార్ రాష్ట్రం అత్యంత కల్లోలంగా ఉన్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టారు. ఆ దూబే రాజకీయ పాలనా ప్రస్థానం ఎలా సాగిందో.. బీహార్ ఎన్నికల వేళ కాస్త చెప్పుకుందాం రండి.
చంద్రశేఖర్ సింగ్ ప్రభుత్వం అధికారంలోకి ఉన్న రోజుల్లో కులవివక్ష చూపిస్తున్నారనే ఆరోపణలు ఆ ప్రభుత్వంపై చుట్టుముట్టాయి. పరిపాలనా వైఫల్యంతో చంద్రశేఖర్ సింగ్ నేతృత్వంలోని నాటి ప్రభుత్వం సతమతమవుతోంది. చంద్రశేఖర్ సింగ్ కంటే ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్నాథ్ మిశ్రా వర్గం ఆయనపై తరచూ దాడులు చేస్తోంది. ఇందిరాగాంధీ హత్యనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ (ఐ) పార్టీకి బలమైన మెజార్టీ లభించింది. 324 సీట్లకుగాను.. ఆ పార్టీ బీహార్ లో 196 సీట్లను గెల్చుకుంది. అయినా, రాష్ట్ర నాయకత్వంపై ఢిల్లీ నాయకత్వానికెందుకో నమ్మకం కల్గడం లేదు. అదిగో సరిగ్గా ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ కొత్త నాయకుడి అన్వేషణలో పడింది.

ఇందిర హత్య అనంతరం జరిగిన 1985 ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఆ ఎన్నికల సమయంలో నల్గురు అభ్యర్థులు కూడా తమ ప్రాణాలు కోల్పోయేంత హింస చెలరేగింది. కొత్త నాయకత్వం కోసం కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచిస్తున్న సమయంలో అప్పటికే చంద్రశేఖర్ సింగ్ ప్రభుత్వంపై అటాక్ చేస్తున్న జగన్నాథ్ మిశ్రా కూడా సీఎం రేసులో ఆశావహుడిగా ఉన్నాడు. కానీ, పార్టీ ఆలోచన మాత్రం వేరే ఉంది. ఆ సమయంలో కొత్త నాయకుడి అన్వేషణలో పడ్డ కాంగ్రెస్… కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి ముందే… ఏఐసీసీ దూతగా, అప్పటి రైల్వే మంత్రి, హర్యానా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన బన్సీలాల్ ను బీహార్ కు పరిశీలకుడిగా పంపించింది.
మెజార్టీ అభిప్రాయం మేరకు బిందేశ్వరీ దూబేకు అనుకూలంగా ఉన్నట్టు బన్సీలాల్ కాంగ్రెస్ హైకమాండ్ కు రిపోర్ట్ చేశారు. ఆ ఎన్నికల్లో బిందేశ్వరీ దూబే.. బోజ్ పూర్ జిల్లా షాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. షాపూర్ కు బీహార్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానముంది. సోషలిస్ట్ నేతగా ఉన్న శివానంద్ తివారీ కుటుంబం అక్కడ మూడు తరాలుగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోంది. శివానంద్ తివారీ రెండుసార్లు.. ఆ తర్వాత ఆయన కుమారుడు రాహూల్ తివారీ మరో రెండుసార్లు.. శివానంద్ కంటే ముందు ఆయన తండ్రి రామానంద్ తివారీ ఐదుసార్లు ఆ నియోజకవర్గం నుంచి గెల్చి దాన్ని వాళ్ల కుటుంబ రాజకీయాలకు కంచుకోటగా మార్చుకున్నారు. ఇప్పుడు తాజాగా జరిగే 2025 ఎన్నికల్లో కూడా రాహూల్ తివారీ మళ్లీ అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు.
బీహార్ లో సుస్థిరమైన పాలన కోసం కాంగ్రెస్ అడుగులు!
అప్పటికే 1980 నుంచి 1985 వరకు.. కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలతో జగన్నాథ్ మిశ్రా, చంద్రశేఖర్ సింగ్ అనే ఇద్దరు ముఖ్యమంత్రులను చూడాల్సి వచ్చింది బీహార్. అలాంటి తరుణంలో సుస్థిరమైన పాలన కోసం కొత్త నాయకుడి అన్వేషణ జరిగింది. అలా 67 ఏళ్ల వస్సులో బిందేశ్వరీ దూబే 1985 మార్చ్ 12న బీహార్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాజకీయాల్లో దూబే ఎదుగుదల!
దూబే ఎదుగుదల చూసినప్పుడు రాజకీయాల్లో కాస్తా అసాధారణంగానే కనిపిస్తుంది. నేటి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), పాట్నా కాస్తా.. నాడు బీహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గా ఉండేది. అదే కాలేజీలో ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చదువగా.. దూబే కూడా అదే కళాశాలలో ఇంజనీరింగ్ చదివారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి ఆయన చదువు మానేశారు. 1952 తొలి సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఆయన రాజకీయ జీవిత ఆరంగేట్రం జరిగింది.
1952లో జరిగిన మొట్టమొగటి సాధారణ ఎన్నికల్లో రామ్ గఢ్ కు చెందిన రాజా కామాఖ్య నారాయణ సింగ్ సంతాల్ పరగణ జనాతా పార్టీ తరపున.. ఐదు అసెంబ్లీ నియోజవర్గాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాడు. బగోదర్, పాటర్ బార్, గోమియా, బర్కాగావ్, గిరిధ్ కమ్ దుమ్రీ ఈ ఐదు స్థానాల నుంచీ ఆయన బరిలోకి దిగి.. నాల్గింటిలో గెల్చాడు. నాల్గు స్థానాల్లో పాటర్ బార్ సహా.. మరో రెెండు స్థానాలు ఖాళీ అవ్వడంతో.. అప్పటి కాంగ్రెస్ పెద్దలు యువకుడు, ఉత్సాహవంతుడైన బిందేశ్వరీ దూబేను పాటర్ బార్ నుంచి పోటీకి దింపారు. అదే ఆయన బీహార్ అసెంబ్లీ ప్రవేశానికి బీజం వేసింది.
ఆ తర్వాత మూడు దశాబ్దాలపాటు.. దూబే బీహార్ రాజకీయాల్లో స్థిరంగా నిల్చిపోయాడు. 1957లో బర్మో సీటులో ఓటమిపాలైనా.. 1962, 1967, 1969, 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా గెలుస్తూ వచ్చారు. 1977లో ఎమర్జెన్సీ ప్రభావంతో జనతాపార్టీ హవాలో మళ్లీ ఓటమి పాలైన దూబే.. 1980లో గిరిధ్ లోక్ సభ ను విజయం సాధించాడు. దక్షిణ బీహార్ బొగ్గు క్షేత్రాల్లో బలమైన కార్మిక నాయకుడిగా బిందేశ్వరీకి పేరుండేది. ఎందుకంటే అప్పటికే ఆయన ఇటు ప్రత్యక్ష రాజకీయాలతో పాటు.. కార్మికసంఘ రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటూ కార్మిక నాయకుడిగా పేరు సంపాదించాడు. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా.. ఆ తర్వాత జాతీయాధ్యక్షుడిగా కూడా దూబే పనిచేశారు.
అయితే, కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిగా అన్వేషించి తీసుకొచ్చిన బిందేశ్వరీ దూబే ముఖ్యమంత్రిగా ఉన్న కాలమంతా.. బీహార్ నేరాలు ఘోరాలతో అట్టుడికిపోయింది. కులహింస పెరిగిపోయింది. దొంగతనాలు, దొమ్మీలు, మాఫియా నెట్వర్క్, గ్యాంగ్ వార్స్ ఇలా ఒకటేంటి.. మొత్తంగా బీహార్ అంటేనే కల్లోల ప్రాంతంగా ముద్రపడిపోయింది. దూబే సర్కార్ నేరాలను అణిచివేసేందుకు స్పెషల్ ఆపరేషన్స్ ప్రారంభించినప్పటికీ.. అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది.
అప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా అంతర్గత కల్లోలంలో పడింది. ఇందిర మరణం తర్వాత నాయకత్వ బాధ్యతలు చేపట్టిన రాజీవ్ చాలా రాష్ట్రాల్లో తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వచ్చింది. బీహార్ లో కూడా మొదట బిందేశ్వరీ దూబేకు మద్దతునిచ్చిన జగన్నాథ్ మిశ్రా ప్లేట్ ఫిరాయించాడు. దూబే సర్కార్ తీరుపై కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడై ఉండి తానే బహిరంగ విమర్శలకు ఎక్కుపెట్టాడు.
అప్పుడు బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దుమార్ లాల్ బైతా ఆ వర్గ పోరాటాలను నియంత్రించడంలో ఫెయిల్ అవ్వడంతో… ఇక దూబే డూబ్ గయే, ఔర్ బైతాజీ బైత్ గయే అనే నినాదాలు మిన్నంటాయి. మిశ్రా వర్గానికి చెందిన నాయకులను మంత్రులుగా క్యాబినెట్ లో చేర్చుకుంటే కొంత కల్లోలం తగ్గుతుందని భావించి అవకాశం కల్పించినా.. విభేదాలు తగ్గలేదు. ఆ తర్వాత జగన్నాథ్ మిశ్రా దూబేను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ సంతకాల సేకరణ కూడా చేపట్టాడు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. 1987లో రాజీవ్ క్యాబినెట్ లో రక్షణ మంత్రిగా ఉన్న వీపీ సింగ్ తన పదవితో పాటు, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేశారు. బోఫోర్స్ ఒప్పందాల్లో అవినీతిని ప్రశ్నిస్తూ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఓ ఉద్యమానికే శ్రీకారం చుట్టాడు. దాంతో వీపీ సింగ్ లైమ్ లైట్ లోకి రావడం.. కాంగ్రెస్ కు సవాల్ గా మారింది. రాజీవ్ చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కల్లోల పరిస్థితులను నివారించే క్రమంలో.. అప్పటికే ముఖ్యమంత్రులను మారుస్తూ వచ్చాడు.
1987లో వచ్చిన వరదలు బీహార్ ను ఓ కుదుపు కుదిపాయి. ఆ సమయంలో నష్టపరిహారంగా అందించాల్సిన సహాయక నిధుల పంపిణీలో అవినీతిపై దూబే సర్కార్ పలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అవన్నీ కాంగ్రెస్ హై కమాండ్ ను అసంతృప్తికి గురి చేశాయి. అప్పటికే దూబే ఛరిష్మా తగ్గిపోతుందని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. 1989 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో దూబే నాయకత్వం ఇకముందు పార్టీకి నష్టమని భావించింది.
1988 ఫిబ్రవరిలోనే నాయకత్వ మార్పుపై పెద్ద చర్చ జరిగింది. రాజీవ్ పలువురు మంత్రులు, ఏఐసీసీ నేతలతో సంప్రదింపులు జరిపారు. బీహార్ రాజకీయాల్లో ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ గా శివచంద్ర ఝా, భగవత్ ఝా ఆజాద్, జగన్నాథ్ మిశ్రా, కేకే తివారీ వంటివారి పేర్లు చర్చకు వచ్చాయి. కానీ, పార్టీ అధిష్ఠానం బీహార్ లో బ్రాహ్మణ ముఖ్యమంత్రి ఉండాలని భావించింది. ఎందుకంటే, అప్పటికే పక్కనే యూపీలో రాజ్ పుత్ వర్గానికి చెందిన బీర్ బహదూర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
అప్పటికే దూబేకు తన సమీప భవిష్యత్ అర్థమైపోయింది. ఆ క్రమంలో ఆయన బృందావన్ లో దేవరాహా బాబాను దర్శించి.. ఆశీర్వచం కోరి.. తన రాజకీయ భవిష్యత్తుపై ఆరా తీశాడు. కానీ, ఆయనకు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ రాలేదు. రాజీనామా సమర్పించక తప్పలేదు. 1988, ఫిబ్రవరి 13వ తేదీన భగవత్ ఝా ఆజాద్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో మూడేళ్ల దూబే పాలన ముగిసిపోయింది.
అయితే, ముఖ్యమంత్రిగా దూబే దిగిపోయిన తర్వాత బీహర్ రాజకీయాలు అస్థిరతకు మరింత కేరాఫ్ గా మారాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా సంస్థాగతంగా బలహీనపడుతూ వచ్చింది. దూబే కార్మిక నాయకుడిగా ఎదిగినప్పటికీ.. కులవివక్ష, వర్గపోరు, నేరమయ రాజకీయాలు అరికట్టలేకపోయాడనే అపవాదును కట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయన్ను రాజ్యసభకు పంపి.. కేంద్రంలో కార్మిక మంత్రిగా, ఆ తర్వాత న్యాయమంత్రిగా కూడా పట్టం కట్టి ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంది కాంగ్రెస్.
1993, జనవరిలో కన్నుమూసిన బిందేశ్వరీ దూబే… ఒక నిజాయితీ గల నాయకుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, కార్మిక నాయకుడిగా మంచి పేరే తెచ్చుకుని ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి స్థాయికి ఎదిగినప్పటికీ.. తన పాలనాకాలంలో కల్లోలాలను కంట్రోల్ చేయలేని అసమర్థ నాయకుడిగా కూడా పేరు మూటగట్టుకున్నారు.



