రాముడు మంచి బాలుడు.. ఈ స్టేట్ మెంట్ వినడానికి బాగుంటుంది. ఎవరైనా రాముడిలాగా ఏకపత్నీవ్రతుడై, పెద్దల మాటకు కట్టబడి, ధర్మంగా బతకాలని దాని అంతర్లీన సందేశం. అంత సానుకూల ధోరణి ఉన్న రాముడి క్యారెక్టర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. రాముడిలా ఉండాలని చెప్పుకోవడమే తప్ప.. జనంలో క్యూరియాసిటీ రేకెత్తించే వ్యక్తిత్వం మాత్రం ముమ్మాటికీ రావణుడే. కొంత వివాదం, మరికొంత పొగరు, ఇంకొంత విలనీ, వాటితో పాటే మంచి పాలకుడి లక్షణాలు, ఆరుశాస్త్రాలు, నాల్గువేదాలు ఔపోశన పట్టిన ఆ విద్వత్తు, అలాగే అపారమైన శివభక్తి.. వెరసి రాముడి క్యారెక్టర్ కంటే కూడా విభిన్నమైన వైవిధ్యం మనకు రావణుడి వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. రావణున్ని మనం విలన్ గానే చూసినా… చాలాచోట్ల మాత్రం ఆ రావణున్నే దేవుడిగా కొల్చే ఆచారమొకటుంది. అలాంటి ఆచారాలెక్కడెక్కడున్నాయో ఓసారి తెలుసుకుందాం రండి.
తమిళనాడులో చాలా ప్రాంతాల్లో రావణుణ్ని దేవుడిగా కొలుస్తుంటారు. మరోవైపు శ్రీలంక వంటి దేశాల్లోనూ రావణున్ని పూజించడం కనిపిస్తుంది.

ఈ క్రమంలో రావణుడు హీరోనా.. విలనా..?
రావణున్ని బేస్ చేసుకుని ఏకంగా సినిమాలే వచ్చాయి. మణిరత్నం వంటి వెర్సటైల్ డైరెక్టర్స్ రావణ్ పేరుతోనే సినిమా తీశారు. ఈ క్రమంలో రావణున్ని ఇంకా ఎక్కడెక్కడ పూజిస్తున్నారో ఓసారి చూద్దాం.
రావణుడి నీడ చాలా ప్రాంతాలపై ఇప్పటికీ కనిపిస్తుంటుంది. అయితే, ఆ నీడ ఏదో అతణ్నో దెయ్యంగానో, భూతంగానో, రాక్షసుడిగానో చిత్రిస్తూ కాదు… అతడి పాండిత్యాన్ని స్మరించుకుంటూ, అతడి విద్వత్తును పొగుడుతూ, ఆయన భక్తిని ఆదర్శంగా తీసుకుంటూ ఆయన్ను పూజించే కొన్ని ప్రదేశాల గురించి మనం ప్రముఖంగా చెప్పుకోబోతున్నాం.
అలాంటి ప్రాంతాల్లో మందసౌర్ ఒకటి. మధ్యప్రదేశ్ నడిబొడ్డున ఉండే ఈ పట్టణంలో రావణుడు దేవుడు. మందసౌర్ కు రావణుడు అల్లుడు. ఎందుకంటే రావణుడి భార్య మండోదరి పుట్టిన ప్రాంతమిది. చాలా చోట్ల చెడుపై మంచి విజయానికి ప్రతీకగా.. దసరా రోజు రావణుడిపై రాముడి విజయాన్ని గుర్తు చేసుకుంటూ.. రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేయడం చూస్తుంటాం. కానీ, మందసౌర్ లో మాత్రం ఆరోజు రావణుడికి సంతాపం తెలుపుతారు.
అందుకోసం పట్టణంలో 35 అడుగుల రావణుడి విగ్రహాన్ని తయారుచేస్తారు. ఆ కటౌట్ ముందు మందసౌర్ ప్రజలు ఆయనకు సంతాపంగా నివాళులర్పిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వారి దృష్టిలో రావణుడు పాలనాదక్షుడైన రాజు. అంతకుమించిన పండితుడు. అందుకే రావణుడి మరణ విషాదాన్ని మందసౌర్ ఇప్పటికీ జీర్ణించుకోలేదు.
ఇక బిస్రాఖ్ గురించి కాస్త చెప్పుకుందాం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓ గ్రామం. కాదు కాదు అంతకన్నా ముఖ్యంగా రావణుడి జన్మస్థలం అని విశ్వాసం. రావణుడి తండ్రి విశ్రవ నుంచే బిస్రాఖ్ పేరు ఏర్పడిందనేతి ప్రతీతి. ప్రపంచమంతా దసరాను ఓ సంబరంగా చేసుకుంటే.. బిస్రాఖ్ లో మాత్రం ఓ గంభీరమైన దినంగా జరుపుకుంటారు.
అలాగని రావణుడి బొమ్మలూ కనిపించవు. అంతా సింబాలిక్. రావణుడి తెలివితేటలు, శివుడి పట్ల ఆయన లోతైన భక్తిని ప్రతిబింబించేలా జనమంతా ఒక్కచోట గుమ్మిగూడతారు. భారతదేశంలో ఇతర ప్రాంతాలకు భిన్నంగా మండుతున్న రావణ దిష్టిబొమ్మలకు పూర్తి కాంట్రాస్ట్ గా ఇక్కడి వాతావరణం కనిపిస్తుంది.
ఇక అలాంటిదే మరో గ్రామం రావణ్ గ్రామ్. ఏస్.. రావణుడి గౌరవార్థంగా ఏర్పాటైన గ్రామమిది. మధ్యప్రదేశ్ లోని విదిష జిల్లాలో ఉందీ గ్రామం. ఇక్కడ రావణుడికి ఏకంగా ఓ ఆలయమే నిర్మించారు. పది అడుగుల ఎత్తైన రావణుడు పడుకున్న భంగిమలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. రావణున్ని ఇక్కడి స్థానికులు తెలివితేటలు, బలానికి చిహ్నాంగా ఆరాధిస్తారు.
రావణున్ని ఓ రాక్షసుడిగా భావించరు. ఆయనలోని రాక్షసత్వానికి కారణమైన శాపం ఆయన్నలా మార్చిందే తప్ప.. రావణుడు ఓ గొప్ప పండితుడంటూ పూజిస్తారు. ఒక సంక్లిష్టమైన వ్యక్తిత్వం కలవాడిగా రావణుడి గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు.
ఇక మన తెలుగు రాష్ట్రంలోని కాకినాడకు వెళ్లొద్దాం. సముద్ర తీరప్రాంతమైన కాకినాడ రావణుడి శివభక్తి పురాణగాథలకు ఓ కేరాఫ్ లా చెప్పుకోవచ్చు. ఇక్కడ కనిపించే ఓ శివాలయాన్ని స్వయానా రావణుడే నిర్మించాడని చెప్పుకుంటుంటారు. రావణుడి అచంచల విశ్వాసం, ఆధ్యాత్మిక బలమే ఆయన్ని శివుడికి అత్యంత సన్నిహత భక్తుణ్ని చేసిందని నమ్ముతారు. శివుడందుకే ఎన్నో వరాలు రావణుడికి ప్రసాదించినట్టు చెప్పుకుంటుంటారు.
అందుకే, కాకినాడలోనూ శివుడితో పాటు, రావణున్ని కొల్చే ఒక ఆచారముంది. దసరా రోజు ప్రత్యేక అర్చనలు కూడా జరుగుతుండటం విశేషం.
ఇక మరో ఊరు మండోర్. ఇది రాజస్థాన్ లో ఉంది. మండోదరి పూర్వీకుల ఊరవ్వడంతో ఈ ఊరికీ రావణాసురుడు గౌరవనీయ అల్లుడే. ప్రత్యేకంగా రావణుడి కోసమే కట్టి ఆయనకు అంకితం చేసిన ఆలయాన్ని మనమిక్కడ చూడొచ్చు. ఇప్పటికీ రావణున్ని కొల్చే ఆచార, వ్యవహారాలకు ఓ కేరాఫ్ అడ్రస్ లా కనిపిస్తుంది మండోర్ గ్రామం.
దసరా రోజు ప్రత్యేక అర్చనలు చేస్తుంటారు. ఈ ఆలయ ఉనికి రావణుడి గొప్పదనాన్ని తెలియపర్చేలా ఉంటుంది. రావణుడంటే కేవలం విలన్ అన్నట్టుగా చిత్రికరించబడే సమాజంలో.. అదే రావణున్ని ఓ గొప్ప దేవుడిలా కొల్చే ఊరు మండోర్.
ఇక మరో ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ లో రావణుడు తపస్సు చేసిన కాంగ్రా. ఈ గ్రామంలోని ప్రశాంతమైన, ఎత్తైన కొండల నడుమే రావణుడు తపస్సు చేసుకునేవాడని ప్రతీతి. శివుడి ఆశీస్సుల కోసం రావణుడు యుగాలపాటు తపస్సు చేసిన ప్రాంతంగా కాంగ్రా గురించి పురాణాల్లోనూ చెబుతుంటారు.
అందుకే రావణుడి తపస్సు చేసిన ప్రాంతంలో తామూ పుట్టడం ఓ గర్వంగా ఫీలవుతుంటారు కాంగ్రావాసులు. ఈ ప్రాంతంలో రావణాసురుడు ఓ పూజ్యనీయమైన, గౌరవనీయమైన దేవుడు.
ఇక ఇలాంటి మరెన్నో ప్రాంతాల్లోనూ రావణున్ని దేవుడిగా కొల్చే సంప్రదాయాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అంతెందుకు కాళేశ్వరం బ్యారేజీ దాటి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఆహేరీ అనే నియోజకవర్గ కేంద్రముంటుంది. ఇక్కడ రావణున్ని దేవుడిగా కొలుస్తుంటారు. దశకంఠుడికి దశమినాడు పూజలు చేస్తారు.అహేరీ తాలుకాలోని కొడిసెలగూడ అనే గ్రామంలో రావణబ్రహ్మను తల్చుకుంటూ ఏకంగా పెద్ద జాతరనే నిర్వహిస్తారు అక్కడి గిరిజనులు.
మొత్తంగా మనం రావణుడి గురించి ఏదైతే మన పెద్దలు చెప్పింది విన్నామో అదే నిజమూ కాకపోవచ్చు, కావచ్చును.. కానీ, రావణుడి వ్యక్తిత్వానికి సంబంధించి మరో కోణం మాత్రం మనకు చాలా ప్రాంతాల్లో ఆయన్ను ఆరాధించే తీరును బట్టి కొంత వైవిధ్యాన్ని చూపిస్తుంది.



