భారత పార్లమెంట్ నిర్మాణానికి.. ఆ ఆలయ రూపుకు మధ్య ఏంటీ పోలిక…?

భారత పార్లమెంట్ రూపకల్పనలో.. ఆ ఆలయ స్ఫూర్తి..?

మధ్యప్రదేశ్ నడిబొడ్డున ఉన్న ఓ ఆలయం మన ప్రజాస్వామ్య వేదికైన పార్లమెంట్ భవన నమూనాకు ఓ ఇన్సిపిరేషన్ గా నిల్చిందా..? మొరేనా అనే పట్టణాన బీడునేలల్లాంటి ప్రాంతంలో కనిపించే ఓ స్మారకచిహ్నం.. తాంత్రికుల ఆధ్యాత్మిక కేంద్రమొకటి కాలపరీక్షకు అలా నిశబ్దంగా నిల్చి దర్శనమిస్తుంటుంది. దాని పేరే చౌసత్ యోగిణీ ఆలయం. ఆ ఆలయ నమూనానే మొన్నటివరకూ ఢిల్లీలో మన ప్రజాస్వామ్య వేదికగా నిల్చిన పార్లమెంట్ నమూనాకు స్ఫూర్తి అనేది చాలామంది చెప్పే విషయం. ఇతమిద్ధంగా అదే ప్రేరణ అని ఎవ్వరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నా.. మన పార్లమెంట్ నమూనా మాత్రం ఆ తాంత్రిక ఆలయాన్నే పోలి ఉండటమే ఈ చర్చకు కారణం.

అత్యద్భుతమైన వాస్తు నిర్మాణ కౌశల్యంతో.. వృత్తాకారంలో కనిపించే ఈ ఆలయం నాటి బ్రిటీషర్స్ ను విశేషంగా ఆకర్షించిందని.. అందుకే, మన ఢిల్లీ పార్లమెంట్ ను ఈ ఆలయ నమూనాలో తీర్చిదిద్దారని చెబుతుంటారు. 64 మంది యోగిణీలకు ఒక్కో గుడి చొప్పున కనిపించే ఈ ఆలయంలో.. యోగిణీలంతా శక్తిస్వరూపిణైన అమ్మవారిని ఇక్కడే దర్శించుకునేవారనేది ఆధ్యాత్మిక చరిత్ర చెప్పే ఓ పురాణం. సుమారు వెయ్యేళ్ల క్రితమే నిర్మితమైన ఈ పురాతన ఆలయం.. నూతన ప్రజాస్వామ్య వ్యవస్థకు అద్దం పట్టే పార్లమెంట్ భవనానికి ప్రేరణ ఎలా అయిందసలు..? ఈ చౌసత్ యోగిణీ ఆలయానికీ… పార్లమెంట్ కు మధ్య వాస్తు శిల్పంలో కనిపించే పోలికలు, సారుప్యతేంటి.. ?

చౌసత్ యోగిణీ ఆలయ రహస్యం!

సుమారు 9వ శతాబ్దంలో కచ్చపఘట రాజవంశీకులు ఈ చౌసత్ యోగిణీ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. దీన్నే ఏకత్తర్సో మహాదేవ ఆలయంగా కూడా పిలుస్తారు. తాంత్రిక సంప్రదాయాల్లో సిద్ధహస్తులైన 64 మంది యోగిణీలకు అంకితం చేయబడ్డ ఈ ఆలయంలో.. ఒక్కో యోగిణీని ఓ శక్తి స్వరూపంగా, ఓ దేవతగా కొల్చేవారట. ఈ ఆలయం ఆధ్యాత్మిక చింతన, అభ్యాసాలకు చిరునామాగా, తాంత్రిక తత్వాన్ని ప్రతిబింబించేదిగా రూపొందినట్టు చెబుతుంటారు చరిత్రకారులు.

చౌసత్ అంటే అరవై నాల్గు అనే అర్థం. వృత్తాకారంలో ఉండే ఈ ఆలయంలో 64 గుళ్లను చుట్టూ నిర్మించారు. అందులో ఒక్కో యోగిణీ దేవతా రూపంగా కొలువై ఉంటే.. మధ్యలో శివుడికి గుడి ఉంటుంది. దండయాత్రల సమయంలో కొన్ని విగ్రహాలు మాయమైపోయి.. కొంత ఆలయం దెబ్బ తిన్నప్పటికీ.. ఇప్పటికీ ఈ దేవాలయాన్ని ఓ తాంత్రిక, మార్మిక ఆలయంగా కొలుస్తూనే ఉన్నారు.

ఆర్కిటెక్చరల్ బ్రిల్లియన్స్… ఏ సర్క్యులర్ వండర్!

గాలి గోపురాలు, విమాన గోపురాలతో కనిపించే భారతీయ సంప్రదాయ గుళ్ల నిర్మాణానికి పూర్తి భిన్న శైలిలో కనిపిస్తుంది ఈ చౌసత్ యోగిణీ ఆలయం. అరుదుగా మాత్రమే కనిపించే వృత్తాకార రూపకల్పన ఇక్కడి ప్రధాన విశేషం. వంద రాతి మెట్లతో కొండభాగంపై నిర్మితమైన ఈ గుడి.. ప్యానోర్యామిక్ వ్యూలో ఓ విస్తృతమైన కళాదృశ్యంలా ఆకట్టుకుంటుంది. పూర్తిగా ఇసుకరాయితో నిర్మించబడ్డ ఈ ఆలయాన్ని పెద్ద పెద్ద అలంకారాలేవీ చేయకుండా తీర్చిదిద్దిన శిల్ప నిర్మాణమే ఇక్కడి ప్రత్యేకత.

ఎన్నో విశిష్ఠతలతో వృత్తాకారంలో ఆకట్టుకోవడం వల్లే ఈ ఆలయం .. భారత పార్లమెంట్ భవన రూపకల్పనకు ప్రేరణై ఉంటుందన్నది చరిత్రకారులు, వాస్తుశిల్పులు చెప్పే మాట.

పార్లమెంట్ నిర్మాణానికీ, చౌసత్ యోగిణీ ఆలయానికి మధ్య సంబంధముందా..? లేకా యాదృచ్ఛికమా..?

భారత పార్లమెంట్ ను బ్రిటీష్ వాస్తుశిల్పులైన ఎడ్విన్ లూటెన్స్, హెర్బర్ట్ బేకర్ నిర్మించారు. న్యూఢిల్లీలోని భారత పార్లమెంట్ భవనం 1921-27 మధ్య నిర్మించబడింది. పార్లమెంట్ వృత్తాకార రూపకల్పన, స్తంభాలు, మధ్య గోపురం ఇవన్నీ కూడా చౌసత్ యోగిణీ ఆలయాన్నే గుర్తుకు తెస్తాయి. ఈ ఆలయాన్ని లూటెన్స్, బేకర్ చౌసత్ యోగిణీ ఆలయాన్నే ప్రేరణగా తీసుకుని నిర్మించారనేందుకు ఎలాంటి డాక్యుమెంట్ ఆధారాల్లేకపోయినప్పటికీ.. నిర్మాణాలు మాత్రం పోలి ఉండటంతో ఈ చర్చ మొదలైంది.

ప్రధానంగా వృత్తాకార లే ఔట్ పార్లమెంట్ చుట్టూ భాగాన్ని, చౌసత్ యోగిణీ ఆలయంలోని ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా ఉన్న ప్రధాన భాగం.. పార్లమెంట్ సెంట్రల్ హాల్ ను, పార్లమెంట్ బయట కారిడార్స్ సిమెట్రిక్ డిజైనింగ్స్ ఇవన్నీ చౌసత్ యోగిణీ ఆలయ నమూనాలోనే కనిపిస్తాయి.

దీంతో ప్రాశ్చాత్య శైలికి, భారతీయ మూలాలాను కూడా మిళితం చేసి లూటెన్స్ పార్లమెంట్ నిర్మాణం చేపట్టి ఉండొచ్చన్నది ఓ అంచనా. చౌసత్ యోగిణీ వృత్తాకార వాస్తుశిల్పం లూటియన్స్ ను అమితంగా ప్రభావితం చేసి ఉండొచ్చన్నది ఓ చర్చ. అయితే, వృత్తాకార వాస్తుశిల్పమనేది చౌసత్ యోగిణీ ఆలయంలో మాత్రమే కాదు.. ప్రాశ్చాత్య వాస్తుశిల్పంలోనూ ప్రతిబింబిస్తుంటుంది. రోమ్ లోని కొలోస్సియం కూడా ఇటువంటి డిజైన్ నే కల్గి ఉండటం గమనించాల్సిన విషయం. ఒకవేళ పాంథియోన్ లోని కొలోస్సియం ప్రేరణే అయినా.. లూటెన్స్ చేపట్టిన పార్లమెంట్ నిర్మాణం యాదృచ్ఛికంగానైనా ఈ చౌసత్ యోగిణీ ఆలయానికి డూప్లికేట్ లా ఉండొచ్చన్నదీ మరో వాదన.

సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం చౌసత్ యోగిణీ ఆలయం!

శతాబ్దాలుగా ఈ ఆలయానికి రహస్య ఆధ్యాత్మిక కేంద్రంగా పేరున్నట్టు చరిత్రకారులు చెప్పే మాట. నాటి ఆచారాలు, సంప్రదాయాలు ఇప్పుడీ ఆలయంలో కనిపించనప్పటికీ ఓ పూజ్య ప్రదేశంగా మాత్రం ఇది ఇంకా భక్తులను, పర్యాటకులను, చరిత్రకారులను విశేషంగా ఆకర్షిస్తూనే ఉంది.

చౌసత్ యోగిణీ ఆలయం పార్లమెంట్ రూపకల్పనకు ప్రేరణైందా, లేదా అన్నది కాస్సేపు పక్కనబెడితే.. ఒక అద్భుతమైన నిర్మాణంగా ఇక్కడి వాస్తుశిల్పం ఆకట్టుకునేది. మిటావోలి కొండపైకెక్కి ఈ మందిరాన్ని ఏరియల్ వ్యూలో దర్శించినప్పుడు.. నాటి చారిత్రక కట్టడాలు నేటి వర్తమాన నిర్మాణాలకు ఎలా ప్రేరణయ్యాయో గుర్తించగల్గుతాం. నాటి శిల్పకారుల సృజనాత్మకత ఎంత కొనయాడినా తక్కువేనని విస్తుపోతాం.

ఈ చారిత్రక నిశ్శబ్ద దేవాలయం, చుట్టూ వీచే గాలిలో.. ఒక మ్యాజిక్ రియలిజాన్ని ప్రతిబింబించే నాటి పురాతన శ్లోకాల ప్రతిధ్వనులను ఆస్వాదించే పర్యాటకులూ ఇక్కడ కనిపిస్తుంటారట. ఒక తాంత్రిక, మార్మిక చారిత్రక క్షేత్రం… అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలోని పార్లమెంట్ భవనానికీ ఉన్న కనెక్టివిటీతో ఇప్పుడీ ఆలయానికి జనం పెద్దఎత్తున క్యూ కడుతున్నారు. మధ్యప్రదేశ్ పర్యాటకశాఖ కూడా అందుకోసం కావల్సిన ఏర్పాట్లన్నీ చేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles