లెఫ్ట్ పనైపోయింది… ఇకంతా రైట్ రైటే అనుకునేవాళ్లను ఆశ్చర్యపర్చే గ్రామమది. బెర్లిన్ గోడ కూలిపోయింది… సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై కమ్యూనిజం ముగిసిపోయిందనుకునేవారిని అబ్బురపరుస్తుంది. ఊరంతా కమ్యూనిస్టులకే ఓటేసే విప్లవం అక్కడ వర్ధిల్లుతోంది. తమిళనాడు ఎన్నికల వేళ మరోసారి వార్తల్లోకెక్కి ఆకట్టుకుంటున్న ఆ గ్రామమేంటి…? అయితే మధురై జిల్లాకు ఓసారి పొయి రావాలె.
ఏంటా గ్రామం ప్రత్యేకత..?
వన్నివేలంపట్టి… కమ్యూనిజానికి కంచుకోట. తమ పనైపోయిందనుకున్న కమ్యూనిస్టులు సైతం ఇక్కడికొస్తే రీఛార్జ్ అయ్యేంత సజీవతతో స్ఫూర్తినిస్తుంది ఈ ఊరు. పేరుకే కమ్యూనిస్టుల కోట అనుకోలేం.. పూర్తిగా ఆచరణాత్మకంగా కమ్యూనిజాన్ని ఒంట పట్టించుకున్న జీవనవిధానం ఈ ఊళ్లో కనిపిస్తుంది.

ఎవ్వరి పేరడిగినా కమ్యూనిస్ట్ యోధుల పేర్లే వినిపిస్తాయి!
పెరయ్యూర్ తాలుకాలో ఈ ఊళ్లో… గత అర శతాబ్ద కాలం నుంచీ కమ్యూనిజం భావజాలాన్ని, సిద్ధాంతాలను పంచాయితీలో వివరిస్తున్నారు. ఇక్కడ ఏ ఇంటికెళ్లి పిల్లవాడి పేరడిగినా.. వ్లాదిమిర్ లెనిన్, కార్ల్ మార్క్స్, జోసెఫ్ స్టాలిన్, ఫ్రెడ్రిక్ ఏంగెల్స్ వంటి ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుల పేర్లు వినిపిస్తాయి.
ఊళ్లోకెళ్లి పది మంది పేర్లడిగితే.. అందులో కనీసం 8 మంది పేర్లు కమ్యూనిస్ట్ నాయకులవే. ఒకవేళ ఎవ్వరైనా ఇతర పేర్లు పిల్లలకు పెట్టుకున్నా.. వారు నిత్యజీవితంలో మాత్రం లెనిన్ అనో.. లేక, మార్క్స్ అనే షార్ట్ కట్స్ ముద్దుపేర్లతో పిలువబడుతారు. ఇదేం నయా ట్రెండ్ కాదు. దీనివెనుక దీర్ఘకాలిక చారిత్రక ప్రభావముంది.
కమ్యూనిస్ట్ గ్రామంగా అవతరించడం వెనుక దీర్ఘకాలిక చరిత్ర!
1960ల వరకూ కూడా వన్నివేలంపట్టిలో ప్రజాస్వామ్య హక్కుల గురించి ఎవ్వరికీ పెద్దగా అవగాహన లేకుండేది. ఎక్కువ మంది ఆధిపత్య కులాలు, భూస్వాముల వద్ద వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు. 1952లో వేంబులు అనే వ్యక్తి ఈ ఊరు నుంచి తంజావూరుకు వలస కూలీగా వెళ్లాడు. అక్కడ అతడికి కమ్యూనిజపు ఆలోచనలు పరిచయమయ్యాయి. మూడేళ్ల తర్వాత వేంబులు సొంతూరు వన్నివేలంపట్టికి తిరిగొచ్చాడు. తనలో వచ్చిన మార్పును ఊళ్లోవాళ్లతో పంచుకున్నాడు. తన స్నేహితులతో కలిసి మధురై జిల్లా సాప్తూరులో సీపీఐ నిర్వహించిన ఆల్ ఇండియా అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. ఆ అనుభవం వేంబులుతో పాటే వచ్చిన ఆయన స్నేహితులకూ గొప్ప ప్రేరణగా నిల్చింది. అదే మార్పుకు శ్రీకారమైంది.
తర్వాత కమ్యూనిస్ట్ నాయకుల మద్దతు.. గ్రామంలో జరిగే సమావేశాల ప్రభావం వెరసి.. వన్ని వేలంపట్టి క్రమంగా కమ్యూనిస్టుల కంచుకోటగా రూపుదిద్దుకుంది. తమకు చట్టబద్ధంగా, తమ హక్కుల కోసం శాంతియుత పోరాటం నేర్పించింది కమ్యూనిజమేనన్నది ఈ ఊరి ప్రజల భావన. నేడు తమ కుటుంబాలన్నీ భూములు సొంతం చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాయి. ఒకనాడు అసాధ్యంగా కనిపించినవాటిని.. కమ్యూనిజం మాకు సుసాధ్యమని చెప్పి చేయించింది. ఈ మార్పుకు కమ్యూనిస్టులకు మేం రుణపడి ఉంటామంటారు ఈ ఊళ్లో ఏ ఇంట్లోవారిని కదిపినా. 1960 కాలం నుంచే ఈ ఊళ్లో పుట్టిన పిల్లలకు కమ్యూనిస్ట్ నాయకుల పేర్లు పెట్టడం ఆరంభమైంది. ఆ ఆనవాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఆడపిల్లలకూ కమ్యూనిస్ట్ నాయకుల పేర్లు!
కేవలం మగవాళ్లకే కాదు.. ఆడపిల్లలు పుట్టినా కూడా కమ్యూనిస్టుల పేర్లు గోచరించే విధంగా నామకరణం చేయడం ఇక్కడ ఆశ్చర్యపర్చే మరో విషయం. కే. నాగజ్యోతి అనే మహిళకు ఇద్దరు ఆడపిల్లలు పుడితే.. మార్క్సియా, లెనినా అనే పేర్లు పెట్టుకుంది ఆ తల్లి. విప్లవానికి ప్రతీకలుగా పేర్లు పెట్టుకున్న తమ బిడ్డలు కూడా సమాజానికి ఉపయోగపడాలన్న తపనతోనే ఆ పేర్లు పెట్టుకున్నానంటోంది నాగజ్యోతి.
కమ్యూనిస్టుల వారసత్వాన్ని కొనసాగించడం బాధ్యతగా భావిస్తున్న గ్రామం!
ఫిడెల్ క్యాస్ట్రో, అలెగ్డాండర్, దిమిత్రోవ్… ఇలా పెద్దల నుంచి పిల్లల వరకూ వన్నివేలంపట్టిలో కనిపిస్తుంటారు. చదువులకు కూడా ఓ క్లబ్ ఏర్పాటు చేసుకుని యువతకు మార్క్సిస్ట్ సాహిత్యం చదివిస్తున్నారిక్కడ. సామాజిక సమస్యలు, రాజకీయ ఆలోచనలను అర్థం చేయించేలా ఈ క్లబ్బులో పెద్దలు పిల్లలకు బోధిస్తారు. తమ పెద్దలు, పూర్వీకులు ఎదుర్కొన్న సవాళ్లు… కమ్యూనిజం సిద్ధాంతాలను ఒంటబట్టించుకున్నాక ఎలా గౌరవంగా జీవించగల్గుతున్నారు అనేటువంటి అనేక అంశాలను పోల్చి చూపుతూ యువతకు కమ్యూనిజాన్ని నూరిపోస్తోంది వన్నివేలంపట్టి. ఇదే వారసత్వాన్ని కొనసాగిస్తూ.. భవిష్యత్ తరాలకు అందించడమే తమ లక్ష్యం, బాధ్యత అంటోంది ఈ కమ్యూనిస్ట్ గ్రామం.



