ఆజా ఆజా ఎంత హిట్టో.. దాని వెనుక కథ అంతకన్నా ఇంట్రెస్ట్!

సంగీత ధృవతార ఆశాభోంస్లే…. ఆమె మరణానంతరం ఆమె సంగీత ప్రయాణంలోని భిన్నరకాల అనుభవాలను ఇప్పుడు కథలుగా చెప్పుకుంటున్నాం. అలాంటి ఓ చిన్న స్వీయానుభవాన్నే.. ఇండియన్ ఐడల్ షోలో ఓసారి ఆశాభోంస్లే షేర్ చేసుకుంది. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ గా పెళ్లి వేడుకల్లోని సంగీత్ కార్యక్రమాల్లో, బ్యాండ్ బారాత్ లో వినిపించే ఆ పాట విషయంలో ఏం జరిగిందో ఓసారి తెలుసుకుందాం.

ఆర్డీ బర్మన్ ఎందుకు పందెం కాశాడు..?

తీస్రీ మంజిల్ ఈ సినిమా గురించి తెలియని గత తరం ఉండదు. షమ్మీ కపూర్, ఆశాపరేఖ్, ప్రేమ్ నాథ్, హెలెన్, ప్రేమ్ చోప్రా, సలీం ఖాన్ ఇలాంటి కీలక నటులంతా పాత్రధారులుగా ఉన్న ఈ సినిమా.. 1966లో ఓ సూపర్ డూపర్ హిట్. కానీ, ఈ చిత్రానికంటే కూడా షమ్మీకపూర్, ఆశాపరేఖ్ మధ్య సాగే ఆజా ఆజా మైహూ ప్యార్ తేరా పాట ఇంకా బంపర్ హిట్. షమ్మీ చేసిన ఆ డ్యాన్సింగ్ స్టైల్.. ఆ పాట కంపోజిషన్.. రఫీ, ఆశా పాడిన తీరు వెరసి.. వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యాన్స్ సాంగ్ గా ఇప్పటికీ జనాన్ని నృత్యం చేయిస్తోంది ఈ పాట.

ఇవాళ చాలా పెళ్లిళ్లల్లో సంగీత్ కార్యక్రమం తప్పనిసరైపోయింది. అలాంటి సంగీత్ జరిగే చోట పెద్దపెద్ద వాళ్లు, వృద్ధులు కూడా నాటి షమ్మీకపూర్ ఆజా ఆజా పాటకు నాల్గు స్టెప్పులు వేసి ఎంజాయ్ చేయడం పరిపాటి. అంతెందుకు రెట్రో థీమ్ పార్టీల్లోనూ ఈ పాటకు ఇప్పటికీ అదే ఆదరణ కనిపిస్తుంది. 1960ల కాలం నాటి ఐకానిక్ సాంగ్ గా ఆజా ఆజా ఎంత గుర్తుందో… ఈ పాట వెనుక ఒక కథ కూడా అంతే ఆసక్తికరమైంది.

పంచమ్ వర్సెస్ నజీర్ ఖాన్ మధ్య బెట్టుకు ఎందుకు దారి తీసింది..?

ఆజా ఆజా పాటలో ఓ అ అ అ ఆజా అని పాడే వెర్షన్ ఏదైతే ఉందో అది పాడటం అనుకున్నంత సులువేం కాదు. ఆ వెర్షన్ అటు రఫీసాబుకు.. ఇటు ఆశాభోంస్లేకు ఇద్దరికీ ఓ ఛాలెంజింగ్. అందుకే, ఆశాభోంస్లే ముందు పాడటానికి సందేహించారట.

ఆజా ఆజా పాటను మజ్రూ సుల్తాన్ పురి రాశారు. పాట పాడాలని ఆర్డీ బర్మన్ ఆశాను కోరితే.. సుమారు నాల్గైదు రోజుల సమయం తీసుకోవాల్సి వచ్చిందని ఆశాభోంస్లే ఓసారి ఇండియన్ ఐడల్ షోలో పేర్కొన్నారు.

అ అ అ ఆజా అనే వెర్షన్ పాడటం చాలా కష్టమని ఆశా ఆ షోలో వెల్లడించారు. అందుకోసం నాల్గైదు రోజులు ప్రాక్టీస్ చేసే క్రమంలో.. కారులో వెళ్తున్నప్పుడు పాట ప్రాక్టీసులో ఊపిరి బిగపట్టడంతో శ్వాస పీల్చుకోవడం కాస్త కష్టమైందట. దాంతో వెంటనే డ్రైవర్ హాస్పిటల్ కు వెళ్దామని సూచించాడట.

అదే సమయంలో ఆర్డీ బర్మన్ వర్సెస్ నజీర్ ఖాన్ మధ్యలో ఓ పందెం కుదిరింది. ఆజా ఆజా పాటలో అ అ అ ఆజా వెర్షన్ ను రఫీ బాగా పాడతారా.. లేక, ఆశానా అనేది ఆ పందెం. పంచమ్ సహజంగానే ఆశా వైపే మొగ్గాడు. నజీర్ ఖాన్ రఫీ వైపున్నాడు. బెట్టు 500 రూపాయలకు కుదిరింది.

పందెం గెల్చిన పంచమ్!

బెట్టు కుదిరింది ఆర్డీ బర్మన్ వర్సెస్ నజీర్ ఖాన్ మధ్యలోనే అయినా… పరోక్షంగా ఈ బెట్టు రఫీ వర్సెస్ ఆశాభోంస్లే అన్నట్టుగా చర్చకు వచ్చింది. పాట రికార్డింగ్ సమయంలో కూడా ఆశాభోంస్లే చాలా నర్వస్ గా ఉన్నానని చెప్పారు ఇండియన్ ఐడల్ షోలో. ఆ సమయంలో దీదీ లతా మంగేష్కర్ ఇచ్చిన ధైర్యమే ఆ పాట పాడటానికి సాహసించానన్నారు ఆశా.

మొత్తంగా ఆజా ఆజా పాట రికార్డైంది. మహ్మద్ రఫీ పాటను చాలా తేలికగా ఆయన శైలిలో సులభంగా పాడేశారు. కానీ, ఆశాభోంస్లే అంతకుముందు ఐదురోజుల నుంచే చేసిన ప్రాక్టీసో… భయం నుంచి పుట్టుకొచ్చిన బాధ్యతనో తెలీదుగానీ… బాగా ఇంటెన్స్ గా ఫీలై పాడారు. ఇప్పటికీ మీరు ఆజా ఆజా పాట విన్నప్పుడు.. అ అ అ ఆజా పోర్షన్ వినండి… ఆశా పాడినదానికీ, రఫీ పాడినదానికీ ఆ తేడాను గుర్తించొచ్చు. ఆశా పాడిన విధానాన్ని అందరితో పాటు… తన జత పాటగాడైన రఫీ కూడా తెగ మెచ్చుకున్నాడు. దాంతో ఆర్డీ బర్మన్.. నజీర్ ఖాన్ పై పందెం గెల్చాడు. 500 రూపాయలు కొట్టేశాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles