ఆరు అంకెల్లో చిరునామా! ఎలా తెలిసిపోతుంది?

1972లో మొదలైన పిన్ కోడ్ కథ: ఒక్కో అంకె వెనుక ఒక్కో ప్రాంతం, జిల్లా, పోస్టాఫీసు వివరాలు!

ఆరు అంకెల చిరునామా.. ఇప్పటికీ మనం పోస్టల్ అడ్రస్ కోసం వాడుతూనే ఉన్నాం.. మరి ఆ కోడ్ వెనుక కథేంటో తెలుసా మీకు..?

1972లో మొదలైంది ఈ పిన్ కోడ్ కథ. ఒక్కో అంకె వెనుక ఒక్కో ప్రాంతం, జిల్లా, పోస్ట్ ఆఫీస్ వివరాలుంటాయి.

సాధారణంగా మన అడ్రస్ లో ఇంటి నంబర్, వీధి పేరు, పట్టణమో, నగరమో ఇలా ఇవన్నీ పేర్కొంటాం. ఇవన్నీ కాకుండా… మనం రాసే మరో నంబరే పిన్ కోడ్. ఆ పిన్ కోడ్ ఒక్కటి చాలు పోస్టల్ లో మన ఉత్తరం.. లేదా, డెలివరీ ఐటమ్స్ ఎక్కడికెళ్లాలో డెలివరీ చేసేవారికి తెలిసిపోతుంది.

ఇప్పటికీ ఇంత టెక్నాలజీ వచ్చినా… ఎన్నో మార్పులను ఈ సమాజం చూస్తూనే ఉన్నా… చివరకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్నా… డిమాండున్న ఒకే ఒక్క విషయం పిన్ కోడ్. ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ చేసినా, కొరియర్స్ పంపినా, పోస్టల్ అడ్రస్ ఇచ్చినా ముందు పిన్ కోడ్ కంపల్సరీ.

అసలు ఈ ఆరు అంకెలు ఎందుకు… దాని వెనుక అర్థమేంటి..?

పిన్ కోడ్… అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్. 1972, ఆగస్ట్ 15వ తేదీన ఆరంభమైంది ఈ పోస్టల్ ఇండెక్స్ నంబర్. అప్పటికే దేశవ్యాప్తంగా పోస్టల్ నెట్వర్క్ బాగా విస్తరిస్తోంది. అదే సమయంలో దేశంలో ఒకే పేరుతో ఎన్నో ప్రాంతాలుండేవి. పైగా దేశవ్యాప్తంగా అనేక భాషల్లో చిరునామాలు రాసేవారు. దాంతో పోస్టును సరైన ప్రాంతానికి పంపడమనేది పెద్ద తలబొప్పి కట్టించేది.

ఉదాహరణకు తెలంగాణా రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ఓ ధర్మపురి ఉంది. అలాగే, తమిళనాడులోనూ ఓ ధర్మపురి ఉంది. ఈ రెండింటినీ ఎలా గుర్తించేది. పైగా రెండూ వేర్వేరు రాష్ట్రాలు.. చాలా సుదూరాలు.. వేర్వేరు భాషలు. ఇలా ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి తీసుకొచ్చిందే పోస్టల్ ఇండెక్స్ నంబర్.

మరి ఈ ఆలోచన వెనుక ఉన్నదెవరో కూడా తెలుసుకోవాలి కదా..?

శ్రీరామ్ భికాజీ వెలణ్కర్.. ఈయన అప్పట్లోనే కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. ఈయన చొరవ వల్లే ఈ పిన్ కోడ్ ఐడియాకు రూపకల్పన జరిగింది. ఈయన ఉన్నతాధికారిగా పనిచేయడమే కాదు.. ప్రముఖ సంస్కృత పండితుడిగా, కవిగా కూడా పేరుగాంచిన సుప్రసిద్ధుడు.

అసలు ఆరు అంకెల్లో ఏముంది.. ఆ పిన్ కోడ్ ప్రాంతాలను గుర్తించే సింబల్ గా ఎలా మారింది..?

505001.. ఇది కరీంనగర్ పిన్ కోడ్. ఇందులో మొట్టమొదటి అంకె ప్రాంతాన్ని సూచిస్తుంది. దేశాన్ని ఎనిమిది పోస్టల్ డివిజన్స్ గా విభజించారు. 9వ జోన్ ను ఆర్మీ పోస్టల్ సర్వీసెస్ కోసం ప్రత్యేకంగా కేటాయించారు.

ఇప్పుడు కరీంనగర్ పిన్ కోడ్ లోని 505001లో మొదటి రెండు అంకెలు సబ్ రీజియన్, పోస్టల్ సర్కిల్ ను సూచిస్తాయి. ఇవి మరింత కచ్చితంగా లెటర్ గానీ, కొరియర్ గానీ పంపించే ప్రాంతాన్ని గుర్తిస్తాయి. మొదటి మూడు అంకెలు సార్టింగ్ జిల్లాను సూచిస్తాయి. అంటే కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, గంగాధర, చొప్పదండి ఇలా వివిధ ప్రాంతాలకు వచ్చినవాటిని గుర్తించి.. ఆయా లేఖలను, కొరియర్స్ ను విడదీసి ఆయా ప్రాంతాలకు పంపించాలన్న మాట. మొదటి మూడు అంకెలు ఏ జిల్లాకు, ఏ ప్రాంతానికి పోస్ట్ చేరాలో చెబితే… చివరి మూడు అంకెలు పోస్ట్ డెలివరీ అయ్యే గ్రామాలు, పల్లెలు, పట్టణాలను సూచించేవి.

ఇలా మొత్తం ఆరు అంకెల పిన్ కోడ్ అనేది ఓ ఉత్తరం రాశాక అది ఏ ప్రాంతం, ఏ సబ్ రీజియన్, ఏ సార్టింగ్ డిస్ట్రిక్ట్, ఏ పోస్ట్ ఆఫీస్ పరిధిలోకి వెళ్లాలో చెబుతుంది.

హిమాలయాల నుంచి అంటార్కిటికా వరకు!

పిన్ కోడ్ వ్యవస్థ ఎంత విస్తృతమైందో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఆసక్తి రేకెత్తిస్తాయి. హిమాచల్ ప్రదేశ్ లో సుమారు 4 వేల 4 వందల మీటర్ల ఎత్తులో స్పితి లోయలో ఉన్న హిక్కిమ్ పోస్ట్ ఆఫీస్ దేశంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో ఒకటి. దీని పిన్ కోడ్ 172114. శీతాకాలంలో మంచుతో ఆర్నెల్లపాటు ఈ పోస్ట్ ఆఫీస్ మూతపడుతుంది. శ్రీనగర్‌లోని దాల్ సరస్సుపై తేలియాడే పోస్టాఫీస్ మరో ప్రత్యేకత. 1953లో పోస్టల్ బోటుగా ప్రారంభమైన ఈ సేవ, సరస్సు పరిసరాల్లో నివసించే ప్రజలకు ఉత్తరాల సేవలు అందించేది. నేడు ఇది కూడా దేశవ్యాప్త పోస్టల్ నెట్‌వర్క్‌లో భాగమే.

ఇంకో ఆసక్తికరమైన విశేషమేంటంటే… అంటార్కిటికాలోని భారత పరిశోధనా కేంద్రాలకు వెళ్లే కొన్ని ఉత్తరాలు గోవాలోని పనాజీ పిన్ నంబర్ 403001తో సంబంధం కల్గి ఉండటం. ఎందుకంటే అంటార్కిటికాలోని పోస్టల్ వ్యవహారాలు ఇప్పటికీ గోవాలోని సంబంధిత పోస్టల్ కేంద్రాల ద్వారానే జరుగుతున్నాయి. ధ్రువ ప్రాంతాలకు సంబంధించిన పోస్టల్ వ్యవహారాలు గోవాలోని వాస్కోలో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ద్వారా కొనసాగుతున్నాయి.

ఆర్మీ పోస్టల్ సర్వీస్ మాత్రం ప్రత్యేకమైన తొమ్మిదో జోన్ ద్వారా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా సైన్యం, నౌకాదళం, వాయుసేన సిబ్బందికి పోస్టల్ సేవలు అందించడం దీని బాధ్యత.

అమెరికా నుంచి భారత్ వరకు!

అమెరికా 1963 జూలై 1న జిప్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. పోస్టును క్రమబద్ధీకరించడానికి అనేక దశల్లో వడపోత అవసరమయ్యే పరిస్థితుల్లో ఈ విధానం ఉపయోగపడింది. భారత్ తొమ్మిదేళ్ల తర్వాత తన భౌగోళిక, పోస్టల్ అవసరాలకు అనుగుణంగా ఆరు అంకెల పిన్ కోడ్ వ్యవస్థను తీసుకొచ్చింది

నేడు ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను ఆర్డర్ చేసినప్పుడు కూడా పిన్ కోడ్ కీలకమే. భారత పోస్టల్ శాఖ వెబ్‌సైట్‌లో ఏ ప్రాంతానికి సంబంధించిన పిన్ కోడ్‌ నైనా వెతికి తెలుసుకోవచ్చు. దేశంలోని తొమ్మిది పోస్టల్ జోన్లు 1 నుంచి 9 వరకు ఉండటంతో పిన్ కోడ్స్ సాధారణంగా సున్నాతో ప్రారంభం కావు.

డిజిటల్ పిన్స్ యుగంలోకి వచ్చేశాం!

అవును, ఇప్పుడు డిజిటల్ పిన్స్ కాలంలోకి వచ్చేశాం. కాలంతో పాటే చిరునామాలు కూడా డిజిటల్ అవుతున్నాయి. భారత పోస్టల్ శాఖ ఇప్పుడు డిజిపిన్ అనే నూతన వ్యవస్థను కూడా తీసుకొచ్చింది. దీన్ని ఐఐటీ హైదరాబాద్, ఇస్రో సహకారంతో అభివృద్ధి చేశారు. పది అక్షరాల లేదా అంకెల కోడ్ . అయితే ఇది ప్రస్తుత ఆరు అంకెల పిన్ కోడ్ కు ప్రత్యామ్నాయం మాత్రం కాదు. దానికి అదనపు డిజిటల్ చిరునామా వ్యవస్థగా మాత్రమే పనిచేస్తుంది. అంటే..పిన్ కోడ్ పోస్టును సరైన ప్రాంతానికి తీసుకెళ్తే.. డిజిపిన్ మరింత ఖచ్చితంగా సరైన ప్రదేశాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది.

పిన్ కోడ్ రాకమునుపు ఉత్తరంపై రాసిన చిరునామాను చూసి పోస్టుమ్యాన్ దారి వెతికేవాడు. ఇప్పుడు ఆ చిరునామాలోని ఆరు అంకెలే పోస్టల్ వ్యవస్థకు దారి చూపిస్తున్నాయి. అందుకే పిన్ కోడ్ అంటే కేవలం ఆరు అంకెల నంబర్ కాదు. మన చిరునామాను భాషతో సంబంధం లేకుండా గుర్తించే ఒక సౌకర్యం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles