బెట్టింగ్‌ ఆపరేటర్‌కు బిష్ణోయ్‌ బెదిరింపు! ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆ ఆడియో ఇప్పుడెందుకు బయటకొచ్చింది?

గూగుల్ ఇంటిపై కాల్పులు!

ఢిల్లీలో ఈరోజు తెల్లవారుజామున ఓ వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు జరిగాయి. నార్త్‌వెస్ట్‌ ఢిల్లీలోని పితంపుర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మోటార్‌సైకిల్‌పై వచ్చిన వ్యక్తులు.. ఆ ఇంటిపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇంటి గోడ, బయట పార్క్‌ చేసిన కారుకు బుల్లెట్లు తగిలాయి. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు.

ముష్కరులు టార్గెట్ చేసిన వ్యక్తి సాహిల్ జైన్. ఇతణ్నే గూగుల్ అని కూడా పిలుస్తుంటారు.

ఈ కాల్పుల ఘటన జరిగిన వెంటనే… 2021లో ఈ గూగుల్ కు వచ్చిన ఓ బెదిరింపు కాల్ కూడా బయటకొచ్చింది. ఆ ఆడియోలో మాట్లాడింది లారెన్స్ బిష్ణోయ్ అని పోలీసులు గుర్తించారు. అయితే, ఇప్పుడు మళ్లీ వైరలవుతున్ ఆ పాత ఆడియో క్లిప్పుకు.. తాజాగా ఈరోజు ఉదయం ఢిల్లీలో జరిగిన కాల్పులకు మధ్య సంబంధమేంటా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. దీనిపై పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది.

మరి ఆ ఫోన్ కాల్ లో ఏముంది..?

గూగల్ 2021లో బెదిరింపులు ఎదుర్కొన్నప్పటికీ… 2023లో సదరు ఫోన్ కాల్ బయటకొచ్చింది. ఢిల్లీ పోలీస్ వర్గాలు ఆ బెదిరింపు కాల్ లో గొంతు లారెన్స్ బిష్ణోయ్ దేనని నిర్ధారించారు.

గూగుల్ గా పిలవబడే సాహిల్ జైన్… తాను ఇప్పటికే ఆ పని మానేశాను.. తాను భారీగా డబ్బు నష్టపోయాను.. మూడు నెలల క్రితమే ఆ వ్యవహారం నుంచి బయటకొచ్చానని ఆడియోలో చెబుతున్న మాటలు వినిపిస్తాయి. అందుకు అవతలి వ్యక్తి.. తాను ఎవరో గుర్తు పెట్టుకోవాలని… తనతో సంబంధమున్నవారిలో ఎవరైనా తన చేతికి చిక్కితే ఎలాంటి తీవ్ర పరిణామాలు ఉంటాయో కూడా ఆలోచించాలనే హెచ్చరికలు జారీ చేస్తాడు. అంతేకాదు, తన ఫోన్ కాల్ రికార్డ్ కూడా చేసుకోవచ్చనే సవాలూ విసురుతున్న సంభాషణ ఆ ఆడియో క్లిప్పులో రికార్డైంది.

పైకి చూస్తే ఎన్నో బెదిరింపు కాల్స్ లాగానే కనిపించినప్పటికీ.. అది ఎదుటివ్యక్తిపైన మానసికంగా తీవ్రమైన ఒత్తిడి తెచ్చే ఎక్స్టార్షన్ అటెంప్ట్ గా దర్యాప్తు సంస్థలు పరిశీలించాయి. మొత్తంగా సినీ ఫక్కీలో సాగుతున్న ఈ హైడ్రామా ఇప్పుడు ఢిల్లీ పోలీసులకు ఓ సవాల్ గా మారింది.

అసలు ఈ గూగుల్ ఎవరు..?

ఇది సంస్థ పేరు కాదు. బెట్టింగ్ వ్యాపారంతో సంబంధముండి వ్యాపారాన్ని దుబాయ్ నుంచి నడిపే ఓ వ్యక్తి మారుపేరు. గతంలో పోలీసుల దర్యాప్తులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగుకు బెట్టింగ్ ఆపరేటర్ల నుంచి ప్రొటెక్షన్ మనీ వసూళ్ల రూపంలో అందుతున్న వ్యవహారం కూడా వెలుగులోకొచ్చింది. బెట్టింగ్ ఆపరేటర్ గూగుల్ నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు గతంలో బిష్ణోయ్ కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్టు అధికారులు పేర్కొన్నారు.

2023లో Google, Glen, KD అనే ముగ్గురు బుకీలు… బిష్ణోయ్ గ్యాంగ్‌కు ప్రొటెక్షన్ మనీ చెల్లించిన బుకీలుగా ఢిల్లీ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఈ సాహిల్ జైన్ అలియా గూగుల్ బెట్టింగ్ గ్యాంగ్ క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తుంటారు.

బెట్టింగ్ ముఠాలకు.. గ్యాంగ్ స్టర్స్ కు మధ్య సంబంధమేంటి..?

బిష్ణోయ్ గ్యాంగ్ వ్యవస్థలో… బెదిరింపులు, వసూళ్లు, హవాలా మార్గాల ద్వారా డబ్బు బదిలీ వంటి అంశాలు కీలకంగా ఉన్నట్టు దర్యాప్తు సంస్థలో విచారణలో తేలింది. బెట్టింగ్ ఆపరేటర్ల నుంచి వసూళ్లు చేసిన డబ్బుల్లో కొంత మొత్తం విదేశాల్లో ఉన్న గ్యాంగ్ స్టర్స్ కు కూడా చేరినట్టుగా దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు, బిష్ణోయ్ ను విచారించినప్పుడు గూగుల్ నుంచి వసూల్ చేసిన 40 లక్షల రూపాయలు విదేశాల్లో ఉన్న గోల్డీ బ్రార్ కు హవాలా మార్గంలో చేరినట్టుగా కూడా గుర్తించారు. ఆ డబ్బును ఆయుదాల కొనుగోలుకు ఉపయోగించినట్టుగా కూడా తేల్చారు.

జైలు నుంచే ఆపరేటింగ్ సిస్టమ్! ఎలా సాధ్యం?

లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉన్న సమయంలోనే ఈ ఆడియో కాల్ కలకలం కూడా వెలుగులోకొచ్చింది. జైలులో ఉన్న నిందితుడు బయట ఉన్నవారితో ఎలా నెట్వర్క్ మెయింటైన్ చేస్తున్నాడు..? ఎవరు అతడికి ఫోన్ సదుపాయం కల్పిస్తున్నారు..? ఆదేశాలు బయటకు ఎలా వెళ్తున్నాయి..? డబ్బు అనుకున్న విధంగా ఎలా హవాలా మార్గంలో దేశం దాటి పోతోంది…? ఇలాంటి ప్రశ్నలే విచారణాధికారులను ఆశ్చర్యపర్చాయి. ఆ తర్వాత అవే దర్యాప్తులో కీలకమయ్యాయి.

ఆ పాత ఆడియో క్లిప్ ఇప్పుడు మళ్లీ ఎందుకు వార్తల్లోకొచ్చింది..?

2026, బుధవారం, అక్టోబర్ 28వ తేదీన.. అంటే ఈరోజు సాహిల్ జైన్ ఇంటిపై ఢిల్లీలో కాల్పులు జరిగాయి. ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్న మాట. కానీ, ఎవరూ గాయపడలేదు. ఈ ఘటన తర్వాత 2021లో జైన్ కు వచ్చిన బిష్ణోయ్ బెదిరింపు ఆడియో మళ్లీ సోషల్ మీడియాలోనూ, వార్తా కథనాల్లోనూ చక్కర్లు కొడుతోంది. ఇదేమన్నా యాదృచ్ఛికంగా జరిగిందా… లేక, ఎవరైనా వ్యూహాత్మకంగా ఒక భయోత్పాతం సృష్టించేందుకు ఈ పాచిక వేశారా అన్నది పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది. లేదా, ఈ కాల్పులకు, గత ఫోన్ సంభాషణకు మధ్య ఏమైనా సంబంధముందా అన్నదీ ఇప్పుడు సందేహాలు రేకెత్తిస్తున్న ప్రశ్నలు.

ఇప్పటివరకైతే పోలీసులు ఇది బిష్ణోయ్ గ్యాంగ్ పని అని నిర్ధారించలేదు. కానీ, కాల్పులు జరిగిన వెంటనే పాత ఆడియో చక్కర్లు కొట్టడంతో ఈ ఊహాగానాలు, అనుమానాలు మొదలయ్యాయి.

బిష్ణోయ్ గ్యాంగ్ కథలో బెట్టింగ్ కోణమేంటి..?

మనం ముందుగానే చెప్పుకున్న మాఫియా డాన్స్ తరహాలోనే… ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న మరో పేరు లారెన్స్ బిష్ణోయ్. సినిమా తారలు, మర్డర్ కేసులు, గ్యాంగ్ వార్ వార్తలతో ఈ పేరు బలంగా ముడి పడి ఉంది. కానీ, లారెన్స్ బిష్ణోయ్ నేరపూరిత నెట్వర్క్ కూడా అంతే బలంగా ఉంది. ఆ నెట్వర్క్ నడపడానికి అతడికి అంత డబ్బెక్కడిది అనే సందేహమూ సాధారణంగా వచ్చేది. 2023లో దర్యాప్తు బృందాలకు బెట్టింగ్ ఆపరేటర్ల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్టు వెల్లడైంది. అందుకే గూగుల్ కు వచ్చిన పాత బెదిరింపు ఆడియో కాల్ ను కేవలం ఓ ఫోన్ బెదిరింపు కాల్ గా చూసి కొట్టిపడేసేందుకు వీల్లేదు. బెట్టింగ్, వసూళ్లు, హవాలా, ఆయుధాల కొనుగోళ్లు, జైలు నుంచే నెట్వర్క్ నిర్వహణ ఇలా ఒకటికొకటి ముడి పడి ఉన్నాయి.

అయితే బిష్ణోయ్ గ్యాంగ్ ఏదైనా నేరానికి పాల్పడ్డప్పుడు అది తామే చేశామని ఒప్పుకుంటుంది. ఇలాంటి ఘటనలూ చూశాం. కాబట్టి ఆ గ్యాంగ్ ఇప్పటివరకైతే గూగుల్ ఇంటి వద్ద కాల్పులు జరిపింది తామేనని ఎక్కడా బయటకు చెప్పలేదు. మరోవైపు, పోలీసులూ నిర్ధారించలేదు. కానీ, కాల్పులు జరిగిన వెంటనే.. ఓల్డ్ ఆడియో క్లిప్ బయటకు రావడం మాత్రం అనుమానాలను బలపర్చేది. దర్యాప్తులో ప్రస్తుత కాల్పుల ఘటన, ఓల్డ్ ఆడియో క్లిప్పుకు ఏమైనా సంబంధముందా, లేదా అన్నది తేలాల్సి ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles